సిసింద్రీ

పిల్లలూ! ఎండాకాలంలో మనకు దాదాపు రెండు నెలలు సమ్మర్‌ హాలిడేస్‌ పేరుతో స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడం అన్నిచోట్లా ఉన్నదే కదా... అసలు ఈ సెలవుల ప్రారంభం వెనక ఓ మంచి ఆలోచన ఉందని మీకు తెలుసా...   ఇప్పుడంటే మన అమ్మానాన్నలు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు మన పెద్దవాళ్లందరి జీవనాధారం  వ్యవసాయమే కదా.

Published : 02 Apr 2023 00:08 IST

సిసింద్రీ

వేసవి సెలవులు ఎందుకు పెట్టారంటే...

పిల్లలూ! ఎండాకాలంలో మనకు దాదాపు రెండు నెలలు సమ్మర్‌ హాలిడేస్‌ పేరుతో స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడం అన్నిచోట్లా ఉన్నదే కదా... అసలు ఈ సెలవుల ప్రారంభం వెనక ఓ మంచి ఆలోచన ఉందని మీకు తెలుసా...   ఇప్పుడంటే మన అమ్మానాన్నలు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు కానీ.. ఒకప్పుడు మన పెద్దవాళ్లందరి జీవనాధారం  వ్యవసాయమే కదా. అంటే అప్పట్లో రైతులు ఎక్కువే... వాళ్లు ఏడాదంతా కష్టపడాలంటే మాటలు కాదు కాబట్టి... పెద్దవాళ్లకు సాయంగా పిల్లలూ పొలానికి వెళ్లి ఎంతోకొంత పనిచేసేందుకే ఈ సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వడం వెనక ఉన్న అసలైన ఉద్దేశం. అలా పందొమ్మిదో శతాబ్దంలో విదేశాల్లో ప్రారంభమైన ఈ సమ్మర్‌ హాలిడేస్‌ విధానం క్రమంగా మార్పు చెందడంతో ఇప్పుడు చిన్నారులు కేవలం విశ్రాంతి తీసుకునేందుకో లేదా తమకు నచ్చిన పనులు చేసేందుకో కేటాయిస్తున్నారు.  


తండ్రి నేర్పిన పాఠం

రామాపురానికి జమీందారు సోమయ్య. అతడి ఒక్కగానొక్క కొడుకు కృష్ణకు చిన్నతనం నుంచీ అల్లరి ఎక్కువ. దానికితోడు తాను జమీందారు కొడుకనే ఉద్దేశంతో అందరినీ చిన్నచూపు చూసేవాడు. స్కూల్లోనూ తోటి పిల్లల్ని ఏడిపించడం, కొట్టడం, వాళ్ల వస్తువుల్ని లాక్కోవడం... ఇలా కృష్ణ అల్లరికి అంతు లేకుండా పోయింది. ఊళ్లో మంచిపేరు ఉన్న సోమయ్యకు తన కొడుకు గురించి తరచూ అందరూ ఫిర్యాదు చేయడంతో... ఏం చేయాలో తెలియలేదు. చివరకు ఎలాగైనా తన కొడుకులో మార్పు తేవాలనుకున్న సోమయ్య ఓ రోజు అతడిని తీసుకుని పొలానికి వెళ్లాడు. అక్కడ అప్పుడే పెరుగుతున్న ఓ మొక్కను చూపించి... దాన్ని పీకమన్నాడు. కొడుకు లాగడంతో అది వెంటనే చేతిలోకి వచ్చేసింది. కాస్త ముందుకెళ్లాక దానికన్నా ఇంకాస్త పొడుగ్గా ఉన్న మొక్కనూ పీకమని చెప్పడంతో... తండ్రి చెప్పినట్లుగా చేశాడు కొడుకు. మరికొంత దూరం నడిపించి పొదను పీకమని చెప్పాడు. కాస్త కష్టపడినా దాన్నీ వేళ్లతో సహా తీయగలిగాడు. ఆ తరువాత ఓ మోస్తరుగా పెరిగిన చిన్నచెట్టును పీకమన్నాడు. కృష్ట వల్ల కాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా... విఫలమయ్యాడు. దాంతో తండ్రి ‘చూశావా... చిన్నచిన్న మొక్కలూ, పొదనూ సులువుగా తీసేయగలిగావు. కానీ
ఈ చెట్టును తీయడం నీ వల్ల కాలేదు. నీ ప్రవర్తన, నీ అలవాట్లు కూడా సరిగ్గా ఇలాంటివే. నువ్వు అలాగే ఉంటే... వాటి నుంచి బయటపడటం చాలా కష్టం’ అంటూ అర్థమయ్యేలా చెప్పాడు. తండ్రి మాటను అర్థం చేసుకున్న కృష్ణ నెమ్మదిగా తనని తాను మార్చుకునేందుకు ప్రయత్నించాడు. క్రమంగా ఊరందరి చేతా బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకోవడంతో సోమయ్యా ఆనందించాడు.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు