సిసింద్రీ

మనం మన బుజ్జి బుజ్జి చేతులతో ఎన్నో బొమ్మలు గీస్తుంటాం. ఇంకా చాలా చిత్రాలను కత్తిరిస్తుంటాం.

Updated : 13 Apr 2023 07:21 IST

సిసింద్రీ

రాస్తూ రాస్తూనే... అతికించేద్దామా!

నం మన బుజ్జి బుజ్జి చేతులతో ఎన్నో బొమ్మలు గీస్తుంటాం. ఇంకా చాలా చిత్రాలను కత్తిరిస్తుంటాం. వాటిని ఓ చోట అతికించాలంటే మాత్రం మనకు చాలా చిరాకు. ఎందుకంటే గమ్‌ ఎక్కువ ఒలికిపోతుంది, అందుబాటులో గ్లూ స్టిక్స్‌ ఉన్నా.. వీటితోనూ తప్పదు ఎంతో కొంత చికాకు. మనకు ఎంత అవసరమో, అంతే గమ్‌ వచ్చేలా ఇప్పుడు మార్కెట్లోకి ‘గ్లూ పెన్స్‌’ వచ్చాయి. ఇవి అచ్చం బాల్‌ పాయింట్‌ పెన్నుల్లానే ఉంటాయి. కానీ వీటిలో ఇంక్‌ బదులు గ్లూ ఉంటుంది. మనం ఎక్కడన్నా ఓ చిత్రాన్ని అతికించాలనుకుంటే ఈ గ్లూ పెన్‌తో రాసి దాని మీద ఆ బొమ్మను పెడితే చాలు. చక్కగా అతికిపోతుంది. గమ్‌ కూడా ఎక్కువ వృథా కాదు. పొదుపునకు పొదుపు. సౌకర్యానికి సౌకర్యం. మొత్తానికి ఈ ‘గ్లూ పెన్స్‌’ భలే ఉన్నాయి కదూ!


కోతి తెలివి!

అడవిలో పెద్ద చెరువూ, దాని మధ్యలో ఓ దీవి ఉండేది. దాని నిండా పండ్ల చెట్లే. ఆ చెట్ల పండ్లు రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకొనేవి. ఓసారి ఆ మాటలను విన్న కోతి, ఎలాగైనా వాటి రుచి చూడాలనుకుంది. కోతికి ఈత వచ్చినా, ఆ చెరువు నిండా మొసళ్లే ఉండటంతో భయపడింది. దాంతో తనకు కొన్ని పండ్లు తెచ్చి ఇవ్వమని పక్షులనే అడిగింది. కానీ, అవి ఒప్పుకోలేదు. కోతి మాత్రం ఆ పండ్లను రుచి చూడాల్సిందేనని నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించిన తర్వాత దానికో ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయమే చెరువు దగ్గరకు వెళ్లి, మొసళ్లన్నింటినీ పిలిచింది. అప్పుడు కోతి... ‘నా ప్రియమైన మొసళ్లారా! నేను మృగరాజు కొలువులో ఉంటాను. సింహం పుట్టిన రోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నింటికీ విందు ఏర్పాటు చేశాడు. మీ మొసళ్ల సంఖ్య తెలుసుకుందామని నేనిలా వచ్చాను. మీరంతా ఇక్కడి నుంచి ఆ దీవి వరకు వరసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను’ అని చెప్పింది. ఎంతైనా మృగరాజు, పైగా విందు అంటున్నాడు కాబట్టి మొసళ్లన్నీ కోతి చెప్పినట్లే చేశాయి. ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో మొసలి మీద నుంచి నడుచుకుంటూ దీవిలోకి వెళ్లింది. నచ్చిన పండ్లన్నింటినీ కడుపు నిండా తిని, ఓ కునుకు తీసింది. కాసేపటితర్వాత తిరిగి బయలుదేరింది. ‘ఎప్పుడో దీవిలోకి వెళ్లిన దానివి ఇప్పటి వరకూ ఏం చేస్తున్నావు?’ అని గట్టిగా ప్రశ్నించిందో మొసలి.
‘నేను సరిగా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్యకన్నా కాసిని ఎక్కువ పండ్లను తెంపి చెరువులో వేస్తాను. మీరు వాటిని నాతోపాటు ఒడ్డుకు చేర్చండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడిక ఏ సమస్యా ఉండదు. సరేనా!’ అంది కోతి. దాని మాటలు నమ్మిన మొసళ్లు అలాగే చేశాయి.  దీవిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా మిగల్లేదు. తాను కోసుకొచ్చిన పండ్లన్నింటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. విషయం తెలుసుకున్న పక్షులు... ‘ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు తెచ్చి ఇస్తే సరిపోయేది. ఇకపై అలాగే చేద్దాం’ అని అవి కోతితో ఓ ఒప్పందానికి వచ్చాయి. అప్పటి నుంచి కోతి హాయిగా దీవిలోని పండ్లను తినసాగింది.










గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..