సిసింద్రీ

వినోదానికి వినోదం.. విజ్ఞానానికి విజ్ఞానం... ఒకేసారి రెండూ దొరికితే ఎంతో బాగుంటుంది కదూ! ఈ గ్లోబ్‌ మన దగ్గర ఉంటే ఇక మనకు బోరే కొట్టదు.

Updated : 12 Jan 2024 16:32 IST

గుర్తిస్తుంది... గుట్టూ చెబుతుంది!

వినోదానికి వినోదం.. విజ్ఞానానికి విజ్ఞానం... ఒకేసారి రెండూ దొరికితే ఎంతో బాగుంటుంది కదూ! ఈ గ్లోబ్‌ మన దగ్గర ఉంటే ఇక మనకు బోరే కొట్టదు. అదే సమయంలో ఎన్నో కొత్త విషయాలనూ ఎంచక్కా నేర్చుకోవచ్చు. దీని పేరు ‘టాకింగ్‌ గ్లోబ్‌’. నిజానికి ఈ గ్లోబ్‌ మాట్లాడదు. కానీ దీంతోపాటే వచ్చే పెన్ను మాట్లాడుతుంది! దాన్ని గ్లోబ్‌ మీద ఎంచుకున్న ప్రదేశం మీద పెట్టగానే ఆ దేశం, రాష్ట్రం, ప్రాంతం పేరు ఇట్టే చెప్పేస్తుంది. ఇంకా రాజధానుల పేర్లు, జాతీయ గీతాలు, భాషలు, జనాభా వివరాలు, కరెన్సీ, ఏరియా కోడ్‌లు, వాతావారణం గురించి ఎంచక్కా ఈ పెన్ను పూసగుచ్చినట్లు చెబుతుంది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ గ్లోబ్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.


ఒంటరి జింక తెలివి!

ఒక అడవిలో అయిదు సింహాలు కలిసి, కనపడకుండా పోయిన మరో చిట్టి సింహం గురించి వెతుక్కుంటూ వెళ్లసాగాయి. పనిలో పనిగా ఏదైనా జంతువు దొరికితే చంపి, కలిసి తిందామని అవి అనుకున్నాయి. ఎంత తిరిగినా ఎక్కడా చిట్టి సింహం జాడ తెలియలేదు. వేటాడదామంటే... ఒక్క జంతువూ కనపడలేదు. అలా తిరుగుతూ సాయంత్రం వేళ ఒక చిన్న వాగుకు అటువైపు ఒక జింక ఉండటం ఒకేసారి అయిదు సింహాలూ చూశాయి. దాన్ని ఎలాగైనా సరే చంపి తినాలని నిర్ణయించుకుని వాగులోకి దిగబోయాయి. సరిగ్గా అదే సమయంలో ఆ సింహాలను చూసిన జింకకు ప్రాణం పోయినంత పనైంది. కాలికి గాయమై ఉండటం వల్ల పరిగెత్తలేని పరిస్థితి. కొన్ని క్షణాలు ఆలోచించిన తరువాత... ‘సింహం మిత్రులారా! మీరు నన్ను తినాలని ఆశ పడుతున్నారని తెలుసు. కానీ ఒక్క విషయం, ఈ వాగులో మొసళ్లు ఉన్నాయి’ అంది జింక. ‘లేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు’ అన్నాయి సింహాలు. ‘లేదు... నిజం చెబుతున్నా. లేకపోతే మిమ్మల్ని చూడగానే నేను పారిపోయేదాన్ని కదా!’ అంది జింక తనకున్న గాయాన్ని దాస్తూ. ‘నిజమే, ఇంతకీ ఈ వాగులో ఎన్ని మొసళ్లున్నాయి. మేమైతే ఆరుగురం ఉండేవాళ్లం. కానీ మాలో ఒకటి నిన్నటి నుంచి కనిపించడం లేదు’ అంది ఓ అమాయకపు సింహం. ‘ఓ.. అదన్నమాట సంగతి. పొద్దున్నే ఓ సింహాన్ని ఈ వాగులోని పది మొసళ్లు తినేశాయి’ అంది వెంటనే జింక. ‘అయ్యో మన చిట్టినే ఆ మొసళ్లు పొట్టనపెట్టుకుని ఉంటాయి. ఇక్కడే ఉంటే మనల్నీ చీల్చుకుతింటాయి. వెనక్కి వెళ్దాం పదండి’ అని ఓ సింహం అంది. సరిగ్గా అప్పుడే వాగులోకి కొన్ని పే..ద్ద కప్పలు అవతలి గట్టు మీద నుంచి దూకాయి. కప్పలు దూకడం చూడని సింహాలు నీళ్లలో చప్పుడు రావడంతో ప్రాణభయంతో పరుగు తీశాయి. బతుకు జీవుడా అనుకుంటూ ఒంటరి జింక కూడా కుంటుకుంటూ అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లిపోయింది. 

ఓట్ర ప్రకాష్‌ రావు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు