సిసింద్రీ

ఓ రోజు అక్బర్‌కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతివేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్‌కు అలవాటు.

Updated : 12 Jan 2024 16:30 IST

వయసులో చిన్న... ప్రతిభలో మిన్న!

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని అలీగఢ్‌కు చెందిన చందౌరీ సింగ్‌ చౌదరికి 13 సంవత్సరాలు. ఈ అబ్బాయికి రోలర్‌ స్కేటింగ్‌లో అద్భుతమైన నైపుణ్యం ఉంది. రోలర్‌ స్కేటర్‌గా ఇప్పటి వరకు ఎన్నో పతకాలు సొంతం చేసుకున్నాడు. 96 గంటలు స్కేటింగ్‌ చేసి రికార్డు సాధించాడు. అంతేకాకుండా వరుసగా 48 గంటలు స్కేటింగ్‌ చేసి ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించిన బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. చౌదరీకి కేవలం రోలర్‌ స్కేటింగ్‌లోనే కాకుండా ఈత, తైక్వాండో, షూటింగ్‌లోనూ చక్కటి ప్రావీణ్యం ఉంది. వీటిలోనూ పలు పతకాలు సాధించాడు. తండ్రి గ్యాస్‌ డెలివరీ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తారు. డబ్బులకు ఇబ్బందులున్నప్పటికీ ఆయన తన కుమారుడైన చౌదరికి శిక్షణ ఇప్పిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చినా పలు క్రీడల్లో ప్రతిభ చాటి, ప్రముఖుల నుంచి ప్రశంసలూ ఆర్థిక సాయాలూ పొందాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సైతం చందౌరీ సింగ్‌ చౌదరి అభినందనలు అందుకున్నాడు.


భలే బీర్బల్‌!

రోజు అక్బర్‌కు ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతివేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్‌కు అలవాటు. ఆ రోజు నిద్రలేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు. వెంటనే ‘ఎవరక్కడ’ అని అక్బర్‌ భటులను పిలిచి, రాజభవనం తలుపులు వెంటనే మూయించ మన్నాడు. విషయం చెప్పి, బీర్బల్‌ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తర్వాత బీర్బల్‌ భుజాన ఓ చిలుకను పెట్టుకుని వచ్చాడు. ముందురోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఓ చోట ప్రవేశపెట్టారు. అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్‌, చిలుకతో వచ్చిన బీర్బల్‌ను చూసి కాస్త చిరాకు పడ్డాడు. ‘బీర్బల్‌! చిలుక జోస్యం చెప్పడానికా మిమ్మల్ని పిలిపించింది’ అన్నాడు అక్బర్‌. ‘‘జహాపనా! మీకు ఈ చిలుక గొప్పదనం గురించి తెలియదు. దీనికి దివ్యదృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ల భుజం మీద వాలి ‘దొంగ.. దొంగ..’ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది’’ అన్నాడు బీర్బల్‌. ‘అంత గొప్ప చిలుకను చావనిస్తామా..! చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాల్లోకి తెగిపడతాయి’ అన్నాడు అక్బర్‌. ‘అలాగే జహాపనా!’ అంటూ.. బీర్బల్‌ తన చేతిలోకి చిలుకను తీసుకొని దాని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే ‘దొంగ.. దొంగ.. దొంగ..’ అని అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతణ్ని బంధించారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత అక్బర్‌.. ‘ఆ చిలుకకు దివ్యదృష్టి’ ఎలా వచ్చింది అని అడిగాడు. ‘దివ్యదృష్టా పాడా... దీనికి దొంగ.. అనే పదం తప్ప ఇంకేం రాదు... తల నిమిరినట్లే నిమిరి.. నెమ్మదిగా గిల్లాను.. దాంతో అది దొంగ.. దొంగ.. అంటూ గాల్లోకి ఎగిరింది’ అని చెప్పాడు బీర్బల్‌. అక్బర్‌ ఆనందంతో బీర్బల్‌ను ఆలింగనం చేసుకుని, విలువైన కానుకలు ఇచ్చి పంపాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..