సరైన తీర్పు!

పూర్వం అమరపురం అనే ఊరిలో మంగయ్య అనే వ్యక్తి గాజుల వ్యాపారం చేసేవాడు. ఆయన ఒంటరివాడు. ఓ సారి గాజులు అమ్ముతూ, అమ్ముతూ చాలా దూరం వెళ్లిపోయాడు. దీంతో తన ఇంటికి చేరడానికి చాలా ఆలస్యమైంది.

Published : 15 Jun 2024 23:49 IST

పూర్వం అమరపురం అనే ఊరిలో మంగయ్య అనే వ్యక్తి గాజుల వ్యాపారం చేసేవాడు. ఆయన ఒంటరివాడు. ఓ సారి గాజులు అమ్ముతూ, అమ్ముతూ చాలా దూరం వెళ్లిపోయాడు. దీంతో తన ఇంటికి చేరడానికి చాలా ఆలస్యమైంది. మంగయ్యది అసలే ఊరు చివరి ఇల్లు. జనసంచారం తక్కువగా ఉండేది. చీకటిపడ్డా.. ఇంట్లో దీపం వెలుగు కనిపించకపోవడంతో ఓ దొంగ మంగయ్య ఇంట్లో దూరి నగలూ డబ్బూ దొంగిలించుకుపోయాడు. కాసేపటి తర్వాత మరో దొంగ మంగయ్య ఇంట్లోకి వెళ్లాడు. విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఇంతలోనే మంగయ్య వచ్చాడు. తలుపు తీసి ఉండటంతో చప్పుడు చేయకుండా నెమ్మదిగా కిటికీలోంచి తొంగి చూశాడు. దొంగను గమనించి, తలుపులు వేసి బయట నుంచి గడియపెట్టాడు. కాస్త దూరంలో ఉన్న మిగతా ఇళ్లవాళ్లను తీసుకొచ్చి, దొంగను పట్టుకున్నాడు. దేహశుద్ధి చేసి రాజభటులకు అప్పగించారు. తన ఇంట్లో నగలూ డబ్బూ కనిపించడం లేదని వారికి చెప్పాడు. సైనికులు ఎంత అడిగినా దొంగ తనకేమీ తెలియదన్నాడు. దీంతో అతణ్ని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. సరిగ్గా అప్పుడే మంగయ్య ఇంట్లో నగలూ డబ్బూ దొంగిలించిన మొదటి దొంగను రాజభటులు మరో చోట పట్టుకున్నారు. విచారణకు తీసుకు వచ్చారు. మంగయ్య ఆ నగల్ని గమనించి, అవి తనవే అని గుర్తించాడు. అతడు చెప్పిన వివరాలన్నీ దొరికిన సొత్తుతో సరిపోలడంతో న్యాయాధికారి వాటిని మంగయ్యకు ఇప్పించాడు. దీంతో రెండో దొంగ.. ‘అయ్యా..! దొంగ ఎవరో తెలిసింది కదా! నాకే పాపం తెలియదు అని రుజువైంది కదా! ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టండి’ అని న్యాయాధికారిని వేడుకున్నాడు. ‘నువ్వు ఏ వస్తువూ దొంగిలించలేదు నిజమే. కానీ.. దొంగిలించాలి అనే ఉద్దేశంతోనే మంగయ్య ఇంట్లోకి దూరావు కాబట్టి నీకూ శిక్షపడాల్సిందే’ అన్నాడు న్యాయాధికారి. ఇద్దరినీ చెరసాలకు తరలించమని భటులను ఆజ్ఞాపించాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..