నిజమైన అబద్ధం!

అక్బర్‌కు ఓసారి వింత ఆలోచన వచ్చింది. వెంటనే.. ‘మన దర్బారులోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి, అది అసత్యమని నాతో ఒప్పించాలి.

Published : 23 Jun 2024 00:35 IST

క్బర్‌కు ఓసారి వింత ఆలోచన వచ్చింది. వెంటనే.. ‘మన దర్బారులోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి, అది అసత్యమని నాతో ఒప్పించాలి. అలా చేస్తే గనక నేను వంద బంగారు నాణేలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను. పది రోజులు వ్యవధి’ అని చెప్పాడు. ఇది వినగానే సభలోని వారు ప్రతిరోజూ నోటికొచ్చిన అబద్ధాలను చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలే అని నమ్మించడానికి ప్రయత్నించారు. ‘ప్రభూ.. మా ఊళ్లో గుర్రం ఎగురుతుంది తెలుసా?’ అన్నాడు ఓ కవి. ‘ఇందులో అబద్ధం ఏముంది? పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట. అవి ఎంచక్కా ఎగిరేవట. ఈ విషయం నా చిన్నప్పుడు మా తాత చెబితే విన్నా’ అన్నాడు అక్బర్‌. ‘ప్రభూ.. గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా?’ అన్నాడు మరో సభికుడు. ‘ఎందుకుండదు.. తప్పకుండా ఉంటుంది. కోడిపెట్టకు గాడిద అని పేరు పెడితే.. అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుందిగా’ అన్నాడు చక్రవర్తి. ఇలా ఎవరు ఏం చెప్పినా.. తన వితండవాదంతో అక్బర్‌ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు. చూస్తుండగానే తొమ్మిది రోజులు గడిచిపోయాయి. పదో రోజు సభ ప్రారంభమైంది. ఆఖరి రోజు కూడా ఎవరూ గెలవలేకపోయారు. అక్బర్‌ చివరిగా బీర్బల్‌ను చూస్తూ... ‘ఏం.. బీర్బల్‌.. నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి? పందెంలో ఓడిపోతావని భయమా?’ అన్నాడు. ‘పందెం సంగతి తర్వాత జహాపనా! మీరు ఇంత మంది ముందు మాట తప్పుతారేమో అని..’ మధ్యలోనే ఆగిపోయాడు బీర్బల్‌. ‘నేను మాట తప్పడం ఏంటి?’ అన్నాడు అక్బర్‌. ‘అదే ప్రభూ, నా పాండిత్యానికి మెచ్చి, మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా! దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపద తీసుకుని వెళ్లిపోతా’ అన్నాడు బీర్బల్‌. ‘ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా... మతి ఉండే మాట్లాడుతున్నావా... నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం...’ అన్నాడు అక్బర్‌. ‘అవునా.. అయితే వంద బంగారు నాణేలు ఇప్పించండి. నేను ఇంటికి వెళ్లాలి’ అన్నాడు బీర్బల్‌. ‘ఏ వంద బంగారు నాణేలు?’ అన్నాడు అక్బర్‌ కోపంగా. ‘అదే జహాపనా! పందెంలో గెలిస్తే ఇస్తామన్నారు కదా!’ అన్నాడు బీర్బల్‌. అక్బర్‌ వెంటనే నాలుక కరుచుకొన్నాడు. అప్పటికి కానీ అర్థం కాలేదు తనను బీర్బల్‌ పందెంలో ఓడించాడు అని. అన్నమాట ప్రకారం అక్బర్‌ బీర్బల్‌కు వంద బంగారు నాణేలు బహుమానంగా ఇచ్చి, సత్కరించాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..