మిత్రుని సలహా..!

దేవగిరి పట్టణంలో శేషాచలం దుస్తులు అమ్మేవాడు. క్రమంగా.. తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద భవనం నిర్మించి అందులో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అనుకోకుండా ఒకరోజు మంటలు వ్యాపించడంతో.. దుకాణంలోని దుస్తులు మొత్తం దగ్ధమయ్యాయి.

Published : 06 Jul 2024 23:23 IST

దేవగిరి పట్టణంలో శేషాచలం దుస్తులు అమ్మేవాడు. క్రమంగా.. తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చాడు. కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద భవనం నిర్మించి అందులో దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. అనుకోకుండా ఒకరోజు మంటలు వ్యాపించడంతో.. దుకాణంలోని దుస్తులు మొత్తం దగ్ధమయ్యాయి. లక్షల రూపాయలు నష్టపోయాడు. తనకున్న ఆస్తులన్నీ అమ్మి.. అందులో పని చేసే వారికి జీతాలూ ఇతరులకు బాకీలూ చెల్లించాల్సి వచ్చింది. చివరికి ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితికి చేరుకున్నాడు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సతమతమవ్వసాగాడు. అప్పుడే అతన్ని పలకరించడానికి చిన్ననాటి మిత్రుడు సాంబయ్య వచ్చాడు. తనతో.. ‘కష్టపడి సంపాదించిందంతా... కోల్పోయాను. ఇక నా దగ్గర ఏమీ లేదు. జీవితం ముగిసిపోయిట్లే!’ అని బాధను చెప్పుకున్నాడు శేషాచలం. ఆ మాటలు విన్న సాంబయ్య గుప్పెడు మట్టిని తీసి ఓ చీమ మీద పోశాడు. అది కాసేపటికి బయటికి వచ్చింది. మళ్లీ అలాగే పోశాడు.. ఇంకాసేటికి మళ్లీ అది బయటికి వచ్చింది. ఇదంతా అర్థం కాని శేషాచలం మిత్రుని వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. అప్పుడతను.. ‘అంత చిన్న చీమ మీద ఎంత మట్టి పోసినా.. కాస్త సమయం తీసుకొని బయటికి వచ్చింది. మన జీవితం కూడా అంతే! కష్టం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు. దాని నుంచే పరిష్కారం వెతుక్కోవాలి. ఎదుర్కొని నిలబడాలి. వ్యాపారం మొదలు పెట్టక ముందు నీ దగ్గర ఏమీ లేదు. కష్టపడి పైకొచ్చావు. ఇప్పుడూ అలాగే మొదలుపెట్టు.. కచ్చితంగా మళ్లీ మంచి స్థాయికి వస్తావు’ అని చెప్పాడు. మిత్రుని మాటలతో కాస్త ధైర్యం తెచ్చుకొని మళ్లీ మొదటి నుంచి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు శేషాచలం. అందులోని మెలకువలన్నీ తెలిసి ఉండడంతో.. ఇంతకు ముందు కంటే తొందరగానే.. మంచి స్థాయికి చేరుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..