Updated : 15 May 2022 03:37 IST

నీటి సమస్యలకు ‘స్మార్ట్‌’ పరిష్కారాలు!

ఈ విశాల విశ్వంలో ఒక్క భూమి మీద మాత్రమే జీవం ఉండటానికి కారణం నీరు. ఆ నీరే మానవ నాగరికత వికాసానికి పునాది వేసింది. అలాంటి నీరు- ఇప్పుడు భవిష్యత్తు పట్ల ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులూ అన్నీ కలిసి నీటి భద్రతని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో- నేనున్నానంటూ ముందుకొస్తోంది సాంకేతిక రంగం. సాఫ్ట్‌వేర్‌తో ప్రపంచమే స్మార్ట్‌గా మారుతున్నప్పుడు నీటి సంరక్షణకి మాత్రం దాన్ని ఎందుకు వాడుకోకూడదూ అనుకున్న నిపుణులు కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డేటా ఎనలిటిక్స్‌ లాంటి అత్యాధునిక సాంకేతికతల సాయంతో నీటి సమస్యకి పరిష్కారాల్ని కనిపెడుతున్నారు.

ఎండాకాలం... ఎన్ని నీళ్లున్నా సరిపోవు.

వానాకాలం... వద్దన్నా కురిసే నీటిని ఏం చేయాలో తెలియదు.

వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న అతివృష్టీ అనావృష్టులు రెండిటి పర్యవసానమూ నీటి కరవే.

నీరు లేకపోవడం ఒక సమస్య అయితే ఉన్న నీరు రకరకాల కాలుష్యాలతో నిండి ఉండడం మరో సమస్య. రెండూ ప్రాణాంతకాలే. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించే బాధ్యతను యువభారతం భుజాలకెత్తుకుంటోంది. రకరకాల అంకుర సంస్థలతో భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తిస్తోంది.

నీటి వృథాని నివారించడం, కాలుష్యాలను వడపోయడం, అసలు నీటితో అవసరం లేని వస్తువుల్ని తయారుచేయడం లాంటివి కొన్ని సంస్థలు చేస్తుంటే, కొన్ని వ్యవసాయానికి నీటి అవసరాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరికొన్ని ఏకంగా నీటినే తయారుచేసి చూపిస్తున్నాయి. వివిధ కోణాల్లో నీటి సంరక్షణకి తోడ్పడుతున్న ఈ సంస్థలన్నీ దేశీయంగానూ అంతర్జాతీయంగానూ పలు అవార్డుల్నీ అందుకోవడం విశేషం.

అంతా ఆటోమేటిక్‌..!

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లో నీరు నింపడానికి మోటర్‌ వేసి మర్చిపోవడం, ట్యాంకు నిండిపోయి నీళ్లు పొంగిపోతుంటే అప్పుడు పరిగెత్తుకు వెళ్లి మోటర్‌ ఆఫ్‌ చేయడం చాలామందికి అనుభవమే. దానివల్ల అటు నీళ్లూ ఇటు కరెంటూ రెండూ నష్టమే. బెంగళూరు నగరంలో ఏ వీధిలోకి వెళ్లినా తరచూ కన్పించే ఇలాంటి దృశ్యాలు చిన్నయ్యని ఆలోచింపజేసేవి. తామేమో నెలకు మూడువేలు పెట్టి ట్యాంకర్లతో నీరు కొనుక్కుంటుంటే నీటి వసతి ఉన్నవాళ్లు అలా వృథా చేయడం చూస్తే బాధగా ఉండేది. ట్యాంకు నిండగానే మోటర్‌ ఆటోమేటిగ్గా ఆగిపోతే బాగుంటుందనుకున్నాడు. గతంలో టెక్నికల్‌ ఫీల్డులో కొంతకాలం పనిచేసి ఉండడంతో అలాంటి పరికరం ఒకటి తానే తయారుచేద్దామని చిన్నయ్య డాబాపైన ఒక గదిలో ప్రయోగాలు మొదలెట్టాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన స్నేహితుడితో కలిసి ఐఓటీ సాంకేతికతతో వైఫై సహాయంతో పనిచేసే మీటర్‌ని తయారుచేశాడు. ఆ మీటర్‌ని ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌కి బిగిస్తే చాలు, ఎంత నీరు వాడిందీ లెక్కవేయడమే కాదు, నీళ్లు అయిపోతే మోటర్ని ఆన్‌ చేయడం, ట్యాంక్‌ నిండగానే ఆఫ్‌ చేయడం కూడా ఆటోమేటిగ్గా చేసేస్తుంది. దానికి అనుసంధానించిన మొబైల్‌ ఆప్‌ ద్వారా వినియోగదారులు ఎక్కడ ఉన్నా ఇంటి దగ్గర ట్యాంకులో నీరుందీ లేనిదీ తెలుసుకోవచ్చు. రోజువారీ నీటి వినియోగాన్ని లెక్కపెట్టడం, కింద సంప్‌లో నీరు లేకపోతే ట్యాంకర్‌కి ఆర్డర్‌ పెట్టడం... అన్నీ అదే చేస్తుంది. ఆ పరికరం బాగా పనిచేయడంతో భార్యతో కలిసి ‘నింబుల్‌ విజన్‌’ పేరుతో కంపెనీ ప్రారంభించాడు చిన్నయ్య. డాబా ఎక్కి చూసే అవసరం లేకుండా చుక్క నీరు వృథా కాకుండా చూసే ఈ పరికరాన్ని చాలామంది కొనుగోలు చేశారు. దాంతో- ఇళ్లలో వాడే వాటర్‌ ప్యూరిఫయర్లలో నీటి నాణ్యతని చెప్పేదీ, స్విమింగ్‌ పూల్‌ నిర్వహణకు ఉపయోగపడేదీ... ఇలా మరికొన్ని పరికరాలను డిజైన్‌ చేశాడు. ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సుల్లో వీటిని వాడుతున్నారు. ఇంకా...

* నీటి సరఫరా వ్యవస్థలో పైపులు లీకవడం వల్ల మన దేశంలో రోజుకు ఆరుకోట్ల  లీటర్ల నీరు వృథా అవుతోందని అంచనా. చెన్నైకి చెందిన ‘వియ్‌గాట్‌’ సంస్థ తయారుచేస్తున్న మీటర్లు- క్లౌడ్‌ ఆధారిత ట్రాకింగ్‌ సిస్టమ్‌, అల్ట్రాసోనిక్‌ సెన్సార్ల సాయంతో పైప్‌లైన్‌లో నీరు లీకయ్యే చోట్లని ఇట్టే కనిపెట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. ఇలా లీకేజీలను కనిపెట్టి నీటి వృథాని అరికట్టే పరికరాల మార్కెట్‌ విలువే 2026 నాటికి లక్షన్నర కోట్లు దాటుతుందనీ ఈ రంగంలో మరెన్నో స్టార్టప్స్‌ రావాల్సిన అవసరముందనీ అంటున్నారు నిపుణులు.

* ‘ఎర్త్‌ఫోకస్‌’ అనే సంస్థ తయారుచేస్తున్న నాజిల్‌ని వాష్‌బేసిన్లలో, షవర్‌ బాత్‌లలో వాడే పంపులకు ఫిట్‌ చేసుకుంటే 90శాతం నీరు ఆదా అవుతుంది. పంపులో వచ్చే నీటిలో చాలా భాగాన్ని నీటిఆవిరిగా మార్చేసి వేగంగా వచ్చేలా చేయడం వల్ల తక్కువ నీటితో ఎక్కువ పని జరుగుతుంది.

* ‘వసార్‌ ల్యాబ్స్‌’ అనే సంస్థ ఉపగ్రహ సమాచారాన్నీ భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్నీ ఎప్పటికప్పుడు సేకరిస్తూ స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం జల వనరుల స్థితిగతులపై కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. పల్లెల్లో నీటి సరఫరాకీ, కాలువలూ రిజర్వాయర్లూ వాటర్‌షెడ్ల నిర్వహణకీ ఇది ప్రభుత్వాలకు తోడ్పడుతోంది. ఉదాహరణకు ఊళ్లో ఒక చెరువు ఉంటే దాని నీళ్లు ఎంత కాలం సాగుకు సరిపోతాయి, ఏ మోతాదులో సరఫరా చేయొచ్చు లాంటి సమాచారాన్ని అందజేస్తుంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికతని కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగించారు.

నీటి శుద్ధికి నానో టెక్నాలజీ

దాహం తీర్చుకుంటే రోగాల బారినపడే పరిస్థితి మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఉంది. భూగర్భ జలాల్లోకి చేరుతున్న రకరకాల కాలుష్యాలే దానికి కారణం. ఏటా దాదాపు నాలుగు లక్షల మంది కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే అనారోగ్యాలతో ప్రాణాలను కోల్పోతున్నారు. అందుకే కృత్రిమ మేధ, డీప్‌ లెర్నింగ్‌ లాంటివి ఉపయోగించి నీటిని శుద్ధిచేయడంపై దృష్టి పెడుతున్నారు ఐఐటీలకు చెందిన పలువురు నిపుణులు. నీటిని లోతుగా విశ్లేషించి అందులో అవసరమైన ఖనిజాలకు హాని కలగకుండా అనవసరం అనుకున్న వాటిని మాత్రమే తొలగించడానికి అత్యంత ఆధునికమైన నానో ఫిల్ట్రేషన్‌, మెంబ్రేన్‌ కెమిస్ట్రీ లాంటి విధానాలను ఉపయోగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లలో ఫ్లోరైడ్‌లాంటివి అతిగా ఉండటం వల్ల ఎముకల సమస్యలూ కిడ్నీ సమస్యలూ రావడం మనకు తెలుసు. అలాగే అసోంలోని గువాహటి పరిసర ప్రాంతాల్ల్లోని నీటిలో ఇనుము, సీఓడీ(కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని తాగి పిల్లలు అనారోగ్యం బారిన పడుతుండడంతో ఐఐటీ గువాహటికి చెందిన పరిశోధకులు నీటి నుంచి వాటిని వేరుచేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు అక్కడి పాఠశాలల్లో, గ్రామాల్లో అలా శుద్ధిచేసిన నీటినే సరఫరా చేస్తున్నారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆధ్వర్యంలో పనిచేసే ‘ద సెంటర్‌ ఫర్‌ టెక్నలాజికల్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ వాటర్‌ ప్యూరిఫికేషన్‌’ సంస్థ నానో ఫిల్ట్రేషన్‌ సాంకేతికతతో చౌకగా నీటిని శుద్ధిచేసే విధానాన్ని అభివృద్ధి చేసింది. భూగర్భ జలాల్లో ఉండే ప్రమాదకరమైన లోహాల అవశేషాలన్నిటినీ ఇది వడపోసి శుభ్రంచేస్తుంది. దీన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని సమస్యాత్మక ప్రాంతాల్లో వాడుతున్నారు.

పశ్చిమబెంగాల్‌లో పలుచోట్ల నీటిలో ఆర్సెనిక్‌లాంటి విషతుల్యమైన పదార్థాలున్నాయి. మద్రాస్‌ ఐఐటీ అభివృద్ధి చేసిన ‘అమృత్‌’ (ఆర్సెనిక్‌ అండ్‌ మెటల్‌ రిమూవల్‌ త్రూ ఇండియన్‌ టెక్నాలజీ) విధానాన్ని ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో వినియోగిస్తోంది. వరదల్లాంటివి వచ్చినప్పుడు కూడా నీళ్లు బాగా కలుషితమవుతాయి. ఈ సంస్థలు తయారుచేసిన పోర్టబుల్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లతో వరద ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందిస్తున్నారు.

వాడిన నీటిని రీసైక్లింగ్‌ చేయాల్సిన అవసరమూ ఉందంటున్న ‘ఎకోస్టెప్‌’ సంస్థ ఇళ్లవద్దే అలాంటి యూనిట్‌ని ఏర్పాటు చేస్తోంది. రసాయనాలూ కరెంటూ ఏమీ అవసరం లేకుండా భూగర్భంలో ఏర్పాటుచేసే ఈ యూనిట్‌ సహజమైన పద్ధతిలో కలుషితాలన్నిటినీ తొలగించి నీటిని శుభ్రం చేస్తుంది.

నీటితో పనేలేదు..!

తెల్లారి లేస్తే పళ్లు తోముకోవడంతో మొదలెట్టి ప్రతి పనికీ నీరు కావాలి. వంటపాత్రల నుంచీ వాహనాలవరకూ ఏది శుభ్రం చేయాలన్నా నీళ్లే వాడతాం. అందుకే ఆయా పనులకు అసలు నీరే అక్కర్లేని ఉత్పత్తులు తయారుచేస్తే బోలెడు నీరు ఆదా అవుతుందని భావించారు కొందరు సృజనశీలురు. దాంతో ‘వాటర్‌ లెస్‌ క్లీనింగ్‌ టెక్నాలజీ’ ఇప్పుడు వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ట్రెండింగ్‌ సబ్జెక్టు అయింది. నీరు అక్కర్లేకుండా కార్లను శుభ్రంచేసే ఉత్పత్తులు చాలాకాలంగా మార్కెట్లో ఉన్నాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఇప్పుడు బూట్లు శుభ్రం చేయడానికీ అలాంటి ఉత్పత్తిని తెచ్చారు. దిల్లీకి చెందిన క్లీన్‌స్టా ఇంటర్నేషనల్‌ సంస్థ మరొకడుగు ముందుకేసి అసలు స్నానానికి కూడా నీరు అవసరం లేదంటోంది. ఈ సంస్థ తయారుచేసిన సబ్బూ, షాంపూలతో నీరు లేకుండానే ఒంటిని శుభ్రం చేసుకోవచ్చట. కేవలం నీటితో స్నానం చేస్తే మురికి పోదని ఒంటికి సబ్బూ, శిరోజాలకు షాంపూ వాడటం వల్ల వాటిని వదిలించుకోవడానికి మరిన్ని ఎక్కువ నీళ్లు అవసరమవుతున్నాయి. ఒక పక్కన పల్లెలేమో నీటి కరవుతో అల్లాడుతుంటే నగరాల్లో మనం నీటిని వృథా చేస్తున్నాం అంటాడు క్లీన్‌స్టాని ప్రారంభించిన పునీత్‌ గుప్తా. పునీత్‌ వాళ్లమ్మకి శస్త్రచికిత్స జరిగినప్పుడు నీరు తగలకుండా ఒళ్లు శుభ్రం చేయడం ఎలా అన్న ప్రశ్న తలెత్తింది. మెడికల్‌ షాపుకి వెళ్తే అలాంటి ఉత్పత్తులేవీ లేవన్నారట. నీరు పుష్కలంగా లభిస్తుండడంతో దానికి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించే అవసరం ఇప్పటివరకూ రాలేదని అర్థమైన ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్‌ ఇప్పుడు పరిస్థితి మారిందనీ, అలాంటి ఉత్పత్తి అవసరమనీ భావించి తానే రంగంలోకి దిగాడు. ఇప్పుడీ సంస్థ నీరు అవసరం లేకుండా పనిచేసే పర్సనల్‌, హోమ్‌కేర్‌ ఉత్పత్తుల్ని తయారుచేస్తోంది. ఎర్రటి కలబందని ప్రధాన ముడిసరకుగా తీసుకుని తయారుచేసిన ఈ ఉత్పత్తులతో చర్మాన్ని తుడిస్తే చాలు అందులోని నానోపార్టికిల్స్‌- పైన ఉన్న దుమ్మూధూళీ కణాల్ని శుభ్రం చేయడమే కాక, చర్మకణాల్లోపలికి వెళ్లి పోషణనీ ఇస్తాయట. తమ ఉత్పత్తుల ద్వారా నీటినే కాదు, ప్లాస్టిక్‌ వాడకాన్నీ తగ్గిస్తున్నాడు పునీత్‌ గుప్తా.

గతేడాది దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన సందర్భంగా వందలాది రైతులు రోడ్డు పక్కనే టెంట్లు వేసుకుని నెలల తరబడి బస చేశారు. అప్పుడు వాళ్లకోసం నీటితో పనిలేని మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఒక కిట్‌ లాగా అమ్ముతున్న ఈ మరుగుదొడ్లను చిన్న బ్యాగులో తీసుకెళ్లి ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటుచేసుకోవచ్చు. ఐఐటీ ఢిల్లీ నిపుణులు శానిటేషన్‌ రంగంలో చేసిన పరిశోధన ఫలితంగా రూపొందిన వాటర్‌లెస్‌, పోర్టబుల్‌ టాయ్‌లెట్ల సాంకేతికత ‘ఏకం ఎకో సొల్యూషన్స్‌’ అనే సంస్థ ఏర్పాటుకి దారితీసింది. ఈ సంస్థ తయారుచేస్తున్న టాయ్‌లెట్లను మన దేశంలోనూ, ఆఫ్రికాలోనూ పలు కార్పొరేట్‌ సంస్థలు వినియోగిస్తున్నాయి.

నీరూ... తయారు!

ప్రపంచంలోని నదులన్నిటిలో కలిసి ఎంత నీరుంటుందో దానికి ఆరు రెట్ల నీరు మనచుట్టూ ఉన్న గాలిలో ఉంటుందట. వర్షాల్లేకపోతే నది అయినా ఎండిపోతుంది కానీ వాతావరణం అలా కాదు, మనం ఎంత గాలిని వాడుకున్నా 8-10 రోజులకోసారి అది సహజంగా భర్తీ అయిపోతుంటుంది. అందుకే ఆ గాలినే ముడిసరకుగా ఉపయోగించుకుంటూ నీటిని తయారుచేసే స్టార్టప్‌లు చాలానే వచ్చాయి. వాటర్‌ కూలర్‌ సైజులో ఉండే ఈ పరికరాలు వాతావరణంలోని గాలిని గ్రహించి అందులోని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌లను కలిపి నీటిని తయారుచేస్తాయి. గురుగ్రామ్‌కి చెందిన ‘స్వజల్‌’ అనే కంపెనీ తయారుచేసిన సౌరశక్తితో పనిచేసే వాటర్‌ ఏటీఎంలు రైల్వే స్టేషన్లలో నిత్యం ఐదు కోట్లమంది ప్రయాణికుల దాహం తీరుస్తున్నాయి. పాఠశాలల్లోనూ ఆస్పత్రుల్లోనూ వీటిని వాడుతున్నారు. సాధారణంగా ఇవి పనిచేయడానికి కరెంటును ఉపయోగించాలి. అయితే స్వజల్‌, బెంగళూరుకి చెందిన ఉరవు ల్యాబ్స్‌- నూటికి నూరు శాతం పునరుత్పాదక ఇంధన వనరు అయిన సౌరశక్తినీ, బయోగ్యాస్‌ లాంటివాటినీ ఉపయోగిస్తున్నాయి. దాంతో ఎలాంటి కాలుష్యాలూ వెలువడవు. పరిశ్రమల్లో అయితే అక్కడ జరిగే వివిధ పనుల్లో పుట్టే ఉష్ణాన్ని ఉపయోగించుకుని కూడా ఈ పరికరాలు నీటిని తయారుచేస్తాయి. నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొనే పల్లెల్లో, నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో, ఇళ్లలో, స్కూళ్లూ కాలేజీల్లో, ఆఫీసుల్లో పరిశ్రమల్లో... ఎక్కడైనా వీటిని వాడవచ్చు. సీసాల్లో కొనుక్కునే నీటి కన్నా ఇవి 75 శాతం చౌక. మొబైల్‌ వాలెట్‌ లేదా ఆప్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకుంటూ ఈ ఏటీయంలనుంచి కావలసినంత నీటిని తీసుకోవచ్చు.

కొనుక్కునే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లలో 91శాతం నీటిలో మైక్రోప్లాస్టిక్స్‌ ఉంటున్నాయనీ ఆ నీటిని వాడితే వారానికి ఐదుగ్రాముల వరకూ ప్లాస్టిక్‌ కడుపులోకి చేరుతుందనీ న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అందుకని స్వజల్‌ సంస్థకి చెందిన వాటర్‌ క్యూబ్‌ విభాగం హోటళ్లకి గాజు సీసాల్లో నీటిని సరఫరా చేస్తోంది.

సాగులోనూ...

నీరు ఎక్కువగా వినియోగించేది వ్యవసాయ రంగం కనుక దానిమీదా దృష్టి పెడుతున్నారు పలువురు నిపుణులు. వ్యవసాయరంగంలో కృత్రిమ మేధకి డిమాండ్‌ ఎంతగా ఉందంటే- ఒక మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ అధ్యయనం ప్రకారం 2019- 2024 మధ్య ఇది ఏటా 30శాతం చొప్పున అభివృద్ధి చెందుతోందట. అంటే- స్మార్ట్‌ వ్యవసాయానికి వేగంగా రంగం సిద్ధమవుతోందన్నమాట. చైనా కంపెనీ ‘టాలెంట్‌ క్లౌడ్‌’ మొట్టమొదటి స్మార్ట్‌ సాగు ప్రయోగం చేసింది. మైక్రోసాఫ్ట్‌ సహాయంతో తయారుచేసిన ఈ విధానానికి ‘ఆగ్రో బ్రెయిన్‌’ అని పేరు పెట్టారు. పొలంలో అడుగడుగునా ఏర్పాటుచేసిన సెన్సార్లు ప్రతి మొక్కనీ ప్రతిచెట్టునీ గమనించి వాటి పరిస్థితిని తెలియజేస్తాయి. ఏ చివరో ఒక మడి నీరు లేక ఎండిపోతే ఈ చివరి నుంచి ఆ చివరివరకూ మొత్తం పొలానికి నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. సెన్సార్లు అనుసంధానమైన డ్రిప్‌ విధానం నీరైనా పోషకాలైనా ఆ ఒక్క మడికే అందేలా చూస్తుంది. దాంతో నీరు వేస్టవడం అనేది ఉండదు. ఇప్పుడు చైనాలో చాలాచోట్ల ఈ విధానం అమల్లో ఉంది. మనదేశంలోనూ స్టార్టప్‌లు ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఎక్కువ పొలాలున్న పెద్ద రైతులకే అందుబాటులో ఉన్న గ్రీన్‌హౌస్‌ విధానాన్ని చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులోకి తెచ్చింది ‘ఖేతీ’ అనే సంస్థ. ‘గ్రీన్‌హౌస్‌ ఇన్‌ ఎ బాక్స్‌’ అని పిలుస్తున్న ఈ విధానంలో 90శాతం నీరు ఆదా అవుతుంది. రెండెకరాల పొలానికి ఒకరోజు పెట్టే నీటితో ఏడాది పొడుగునా పంటలు పండించొచ్చు. ఎరువులూ క్రిమిసంహారకాల అవసరమూ ఆమేరకు తగ్గిపోతుంది. ఉత్పత్తి మాత్రం ఏడు రెట్లు ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కర్బనవాయువుల విడుదల కూడా తగ్గుతుంది కాబట్టి పర్యావరణానికీ మంచిదే. తెలంగాణలో రైతులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చి మరీ గ్రీన్‌హౌస్‌లో కూరగాయల సాగు ద్వారా లబ్ధిపొందేలా ప్రోత్సహిస్తోంది ఈ సంస్థ.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నీటి సంరక్షణ రంగం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌కి ఉపకరించే పరికరాలు తయారుచేస్తున్న సంస్థలకు బహుమతులూ పెట్టుబడులూ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి పలు అంతర్జాతీయ సంస్థలు.

ఇన్నాళ్లూ ప్రకృతి ప్రసాదించిన నీటిని చేతనైన పద్ధతుల్లో దాచుకుని వాడుకోవడమే తెలిసిన మనిషి ఇప్పుడిప్పుడే ఆ ప్రకృతికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతా తనదేనని తెలుసుకుంటున్నాడు. అందుకు సాంకేతికతను సాయం తీసుకుని స్మార్ట్‌గా చేస్తున్న ఈ పనులు నీటి సంరక్షణకే కాదు, పర్యావరణ పరిరక్షణకీ ఉపయోగపడడం బోనస్‌..!


చరిత్ర సృష్టించిన కోయంబత్తూరు

మిళనాడులోని కోయంబత్తూరు నగర పురపాలక సంస్థ ఇటీవల నీటి సరఫరాలో స్మార్ట్‌ విధానాన్ని ఆచరణలో పెట్టి చరిత్ర సృష్టించింది. నగరంలోని చేరన్‌ నగర్‌ ప్రాంతంలో 24 గంటలూ నీళ్లు సరఫరా అవుతాయి. అయితే ప్రతి ఇంటికీ 675 లీటర్ల చొప్పున పరిమితి విధించారు. ఆ మొత్తాన్ని రోజు మొత్తంలో ఎన్ని విడతలుగానైనా పట్టుకోవచ్చు. ఒకసారి లిమిట్‌కి చేరుకోగానే ఆటోమేటిగ్గా నీళ్లు ఆగిపోయేలా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాంకేతికతతో ఈ పథకాన్ని రూపొందించారు. ఎక్కువ నీరు అవసరమైన ప్రత్యేక సందర్భాల్లో సదరు వినియోగదారులు రెండు రోజుల ముందు అధికారులకు చెబితే మరో 300 లీటర్లు వచ్చేలా చేస్తారు. దానికి అదనంగా డబ్బు చెల్లించాలి. ఇలా అయితే నీరు అందరికీ సమానంగా అందుతుంది, నీరు వృథా కాకుండానూ ఉంటుంది, ఒకేసారి పట్టుకుని ట్యాంకుల్లో నిల్వ ఉంచుకునే బదులు అవసరమైనప్పుడు మాత్రమే పట్టుకునే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన వాటర్‌ టెక్నాలజీ ఇనిషియేటివ్‌ విభాగం పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ పథకానికి రెండున్నర కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని