దేవికి... నివేదన!

నవరాత్రులు అనగానే పులిహోర, పరమాన్నం, గారెలు, పాయసం లాంటివే నివేదించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి వాటినే కొద్దిగా మార్చి... ఇలా చేసి చూస్తే ఎలా ఉంటుందంటారూ!

Updated : 25 Sep 2022 12:03 IST

దేవికి... నివేదన!

నవరాత్రులు అనగానే పులిహోర, పరమాన్నం, గారెలు, పాయసం లాంటివే నివేదించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి వాటినే కొద్దిగా మార్చి... ఇలా చేసి చూస్తే ఎలా ఉంటుందంటారూ!


రవ్వ పొంగలి

కావలసినవి: గోధుమరవ్వ: అరకప్పు, పెసరపప్పు: పావుకప్పు, బెల్లం తరుగు: అరకప్పు, యాలకులపొడి: పావుచెంచా, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు: పది, కిస్‌మిస్‌ పలుకులు: పది.

తయారీ విధానం: కుక్కర్‌ను స్టౌమీద పెట్టి చెంచా నెయ్యి వేసి గోధుమ రవ్వను మాడకుండా దోరగా వేయించుకోవాలి. తరువాత అందులో కడిగిన పెసరపప్పు, రెండుకప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మూడు నుంచి నాలుగు కూతలు వచ్చాక స్టౌని కట్టేయాలి. ఓ గిన్నెలో బెల్లంతరుగు, పావుకప్పు నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టాలి. బెల్లం కరిగాక ఆ పాకాన్ని గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలిపి ఆ పాత్రను మళ్లీ స్టౌమీద పెట్టాలి. ఇది దగ్గరకు అవుతున్నప్పుడు యాలకులపొడి కలిపి దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి మిగిలిన నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించి... పొంగలిలో వేసి ఓసారి కలిపితే చాలు.


క్యాబేజీ వడ

కావలసినవి: సెనగపప్పు: కప్పు, క్యాబేజీ తరుగు: రెండు కప్పులు, అల్లంపేస్టు: చెంచా, కారం: పావుచెంచా, పుదీనా ఆకుల తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: సెనగపప్పును రెండుగంటలపాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీటిని పూర్తిగా వంపేసి ముప్పావువంతు పప్పును మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్‌చేసుకుని తీసుకోవాలి. క్యాబేజీ తరుగును వేడినీటిలో వేయాలి. పావుగంటయ్యాక నీటిని పూర్తిగా పిండేసి తరుగు మాత్రం ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చివరగా రుబ్బిన పప్పు, నానబెట్టుకున్న పప్పును కూడా వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని కాగుతున్న నూనెలో వడల్లా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


కొబ్బరిపాల అన్నం

కావలసినవి: బియ్యం: ఒకటిన్నర కప్పు, కొబ్బరిపాలు: ఒకటిన్నర కప్పు, నీళ్లు: ఒకటిన్నర కప్పు, అల్లంతురుము: చెంచా, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: మూడు, నెయ్యి: మూడు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: చెంచా, జీలకర్ర: చెంచా, మిరియాలు: చెంచా.

తయారీ విధానం: స్టౌమీద కుక్కర్‌ను పెట్టి ముప్పావువంతు నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, సెనగపప్పు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు పలుకులు వేయించుకుని తరువాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము వేయాలి. నిమిషమయ్యాక కొబ్బరిపాలు, నీళ్లు, తగినంత ఉప్పు, కడిగిన బియ్యం, మిగిలిన నెయ్యి వేసి ఓసారి కలిపి మూతపెట్టాలి. రెండుకూతలు వచ్చాక స్టౌని కట్టేయాలి.  


కదంబం

కావలసినవి: బియ్యం: కప్పు, కందిపప్పు: అరకప్పు, పెసరపప్పు: పావుకప్పు, టొమాటోలు: రెండు, వంకాయలు: రెండు, బెండకాయలు: మూడు, సొరకాయ ముక్కలు: అరకప్పు, బీన్స్‌: అయిదు, చిక్కుడుకాయలు: నాలుగు, క్యారెట్‌: రెండు, బంగాళాదుంప: ఒకటి, చింతపండురసం: అరకప్పు, ఉప్పు: తగినంత, పసుపు: అరచెంచా, కారం: అరచెంచా, నెయ్యి: పావుకప్పు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, ఎండుమిర్చి: నాలుగు, కరివేపాకు రెబ్బలు: రెండు, అల్లంతరుగు: ఒకటిన్నర చెంచా.

తయారీ విధానం: బియ్యం, కందిపప్పు, పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. అన్నం పావు వంతు ఉడికాక... కూరగాయముక్కలు, అల్లంతరుగు, చింతపండు రసం, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి మూడు కూతలు వచ్చాక దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుని ఉడికిన అన్నంలో వేసి బాగా కలపాలి. ఈ గిన్నెను మళ్లీ స్టౌమీద పెట్టి పావుకప్పు నీళ్లు పోసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి. ఒకవేళ గరిటెజారుగా కావాలనుకుంటే... మరో పావుకప్పు నీళ్లు పోస్తే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..