ఈ ఫోన్లూ ట్యాబ్లూ పిల్లలకోసం..!
పిల్లలకు స్మార్ట్ఫోనో, ట్యాబో ఇవ్వడం ఆలస్యం... రకరకాల ఆప్‌లను డౌన్లోడ్ చేసి, యూట్యూబ్ చూసి... ఛార్జింగ్ మొత్తం అవ్వగొట్టేవరకూ వదలరు. అలాగని వద్దని చెప్పలేని పరిస్థితి. దీనికి ఏదయినా పరిష్కారం దొరికితే బాగుండని ఆలోచించే తల్లిదండ్రులకోసమే ఇప్పుడు ‘కిడ్స్ ఫ్రెండ్లీ ఫోన్లూ, ట్యాబ్లూ’ వచ్చేస్తున్నాయి. ఈ స్మార్ట్గ్యాడ్జెట్లు నేర్చుకోవడానికీ, ఆడుకోవడానికీ తప్ప వేరే రకంగా ఉపయోగపడవు మరి.
సాయంత్రం కాగానే బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌తో సరదాగా ఆడుకునే అవకాశం లేకపోవడం, కరోనా పేరుతో అమ్మానాన్నలు ఎక్కడికీ తీసుకెళ్లకపోవడం, ఆన్లైన్ క్లాసులూ... ఇలా కారణాలు ఏవైనా ఈ రోజుల్లో ఫోన్లూ, ట్యాబ్లూ పెద్దవాళ్ల దగ్గర కన్నా పిల్లల చేతుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో చదువు మాట ఎలా ఉన్నా అనవసరమైన ఆప్‌లను డౌన్లోడ్ చేస్తూ, యూట్యూబ్ చూస్తూ ఫోన్లే ప్రపంచంగా గడిపేస్తున్నారు చిన్నారులు. ఆ సమస్య తీరాలంటే పిల్లలకు ఈ ‘కిడ్స్ ఫ్రెండ్లీ’ స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌ని ఇస్తే సరి. అసలు ఇప్పుడున్న ఫోన్ల వాడకాన్నే ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తుంటే మళ్లీ కొత్తగా వీటిని వాళ్ల చేతికిస్తే ఇంకేమైనా ఉందా అని వెంటనే అనేయకండి.
ఎందుకంటే... ఇవి వాళ్లకోసమే ప్రత్యేకంగా తయారుచేసిన ఫోన్లూ, ట్యాబ్లూ కాబట్టి వీటితో లాభాలే ఎక్కువ. ప్రస్తుత పరిస్థితులూ, పిల్లల అవసరాలూ గుర్తించిన శాంసంగ్, కిడీబజ్, వీటెక్ వంటి సంస్థలు కొత్తకొత్త ఫీచర్లతో వీటిని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇవన్నీ అసలైన స్మార్ట్ఫోన్లూ, ట్యాబ్లూ, వాచీలే కానీ వీటిని కేవలం కొత్త విషయాలు నేర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించుకోచ్చు.
ఎన్నో ఆప్‌లూ, ఫీచర్లూ...
పెద్దవాళ్లు వాడే స్మార్ట్ఫోన్లూ, ట్యాబ్లూ కిడ్స్ ఫ్రెండ్లీ రకాలూ ఒకేలా ఉన్నప్పుడు పిల్లలకు ఏది ఇస్తే ఏంటనే సందేహం రావచ్చు కానీ రెండింటికీ చాలా తేడా ఉంటుంది. ఒక సాధారణ మొబైల్ ఫోన్ తరహాలోనే ఇవీ పనిచేస్తాయి కానీ వీటిల్లో ఎక్కువశాతం యూట్యూబ్ ఉండదు. అనవసరం అనుకున్న ఆప్‌లను బ్లాక్ చేసేయొచ్చు. అన్నింటికీ మించి పిల్లలు వీటిని ఎలా ఉపయోగించుకుంటున్నారూ, ఎంతసేపు చూస్తున్నారూ అనేది పెద్దవాళ్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పేరెంట్ కంట్రోల్ సదుపాయం ఉంటుంది. పైగా వాళ్లు ఓ గంటకు మించి చూడకుండా అలారం కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలతోపాటు పిల్లలకు నచ్చే ఫీచర్లు ఉండటమే వీటి ప్రత్యేకత అంటారు తయారీదారులు. ఉదాహరణకు ‘అమెజాన్ హెచ్డీ ఫైర్ కిడ్స్ 10 ప్రో’ ట్యాబ్ ఆరు నుంచి పన్నెండేళ్లలోపు చిన్నారులకు ఉపయోగపడుతుంది. కొన్ని వందల ఆప్లతోపాటూ రకరకాల ఆటలూ, పుస్తకాలూ వీడియోలూ, పాటలూ, ఆడియో పుస్తకాలూ... ఇలా ఎన్నో ఫీచర్లతో వచ్చే ఈ ట్యాబ్‌కి వైఫై సదుపాయం కూడా ఉంటుంది. ఇందులోని కెమెరాతో పిల్లలు ఫొటోలు తీసుకుని సేవ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎప్పటికప్పుడు సబ్‌స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే... పిల్లలకు ఉపయోగపడే ఆప్‌లను హాయిగా చూసుకుంటూ కాలక్షేపం చేసుకోవచ్చు. అదేవిధంగా కురియో స్మార్ట్ 2 - 1, వీటెక్ తయారుచేసిన లీప్‌ఫ్రాగ్ ట్యాబ్లెట్లలోనూ ముందే పొందుపరిచిన ఆప్‌లూ, ఆటలూ ఉండటంతోపాటూ లెక్కలూ, ఇంగ్లిష్ పాఠాలూ ఉంటాయి. పిల్లలకోసం వచ్చే ఫోన్లలో అయితే మరీ ముఖ్యం అనుకున్న ఫోన్నెంబర్లను మాత్రమే సేవ్చేసుకుని వాటికి మెసేజ్‌లూ, వీడియోకాల్స్ చేసుకోవచ్చు. చిన్నారుల సృజనను పెంచే ఆటలూ, బొమ్మలు వేసుకునేందుకు ప్రత్యేక ఆప్‌లూ వీటిల్లోనే అదనంగా ఉంటాయి. కిడీబజ్, శామ్సంగ్ కిడ్స్ స్మార్ట్ఫోన్లు అలాంటివే. ఇవనే కాకుండా పిల్లలు బయటకు వెళ్లినప్పుడు సరదాగా ఆడుకునేందుకు, ఫొటోలు తీసుకునేందుకు స్మార్ట్‌వాచ్‌లు కూడా వస్తున్నాయిప్పుడు. మరి... వీటిల్లో మీ పిల్లలకు ఏది కొనివ్వాలనుకుంటున్నారూ!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్