Published : 01 Oct 2022 23:43 IST

పండక్కి... పంచరుచుల విందు!

దసరా పండక్కి... ఇంటికి వచ్చీపోయే అతిథులకూ, బంధువులకూ స్వీటూహాటూ వడ్డించడం పరిపాటే. మరి ఈసారి ఏం చేద్దామనుకుంటున్నారూ...


మసాలా కారప్పూస

కావలసినవి: సెనగపిండి: కప్పు, వంటసోడా: చిటికెడు, కారం: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, వేయించిన వాముపొడి: పావుచెంచా, వేయించిన జీలకర్రపొడి: అరచెంచా, సోంపుపొడి: పావుచెంచా, లవంగాలపొడి: పావుచెంచా, అల్లంపేస్టు: అరచెంచా, నల్ల ఉప్పు: పావుచెంచా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో మూడు చెంచాల నూనె వేసి మళ్లీ కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ జంతికల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని నూనె రాసిన జంతికల గొట్టంలోకి తీసుకుని.. కాగుతున్న నూనెలో కారప్పూసలా ఒత్తుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


డ్రైఫ్రూట్స్‌ చిక్కీ

కావలసినవి: బాదం పలుకులు: ముప్పావుకప్పు, జీడిపప్పు: ముప్పావుకప్పు, పిస్తా పలుకులు: రెండు టేబుల్‌స్పూన్లు, గుమ్మడిగింజలు: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: టేబుల్‌స్పూను, బెల్లం తరుగు: కప్పు, నీళ్లు: పావుకప్పు, యాలకులపొడి: పావుచెంచా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి... బాదం పలుకులు, జీడిపప్పు, పిస్తా, గుమ్మడి గింజలు వేసి అన్నింటినీ కనీసం అయిదారు నిమిషాల పాటు వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో ముప్పావువంతు నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బెల్లం తరుగు, నీళ్లు పోసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి ముదురుపాకం వస్తున్నప్పుడు... యాలకులపొడి, వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌, గుమ్మడి గింజల్ని వేసి బాగా కలిపి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో వేసుకుని చాకుతో ముక్కల్లా కోసి... గట్టిపడ్డాక వేరు చేసుకుంటే సరిపోతుంది.


సగ్గుబియ్యం మిక్స్చర్‌

కావలసినవి: నైలాన్‌ సగ్గుబియ్యం: కప్పు, పల్లీలు: పావుకప్పు,  ఎండుకొబ్బరిముక్కలు: పావుకప్పు, జీడిపప్పు: పదిహేను, గుమ్మడి గింజలు: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: మూడు, పసుపు: కొద్దిగా, కారం: చెంచా, ఉప్పు: సరిపడా, నూనె: వేయించేందుకు, చాట్‌మసాలా: పావుచెంచా.  

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి... వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడెక్కాక  సగ్గుబియ్యాన్ని విడతలవారీగా వేయిస్తూ... బాగా పొంగాక తీసి ఓ గిన్నెలో వేయాలి. అదే నూనెలో పల్లీలను కూడా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి రెండు చెంచాల నూనె వేసి.. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకును విడివిడిగా వేయించుకుని తీసుకోవాలి. ఓ గిన్నెలో వేయించిపెట్టుకున్న పదార్థాలను వేసుకోవాలి. తరువాత మిగిలినవీ వేసుకుని అన్నింటినీ కలిపితే సగ్గుబియ్యం మిక్స్చర్‌ సిద్ధం.


దాల్‌పాపడీ

కావలసినవి: పెసరపప్పు: పావుకప్పు, మినప్పప్పు: పావుకప్పు, బియ్యప్పిండి: రెండు కప్పులు, జీలకర్ర: ఒకటిన్నర చెంచా, మిరియాలపొడి: అరచెంచా, నువ్వులు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: మూడు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు తరుగు: రెండు చెంచాలు, కసూరీమేథీ: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.  

తయారీ విధానం: ముందుగా పెసరపప్పు, మినప్పప్పును వేడినీటిలో పావుగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నీళ్లు చల్లుకుని బరకగా గ్రైండ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని బాగా కలపాలి. తరువాత రుబ్బిపెట్టుకున్న పప్పును కూడా వేసుకుని కలపాలి. ఇందులో రెండుటేబుల్‌స్పూన్ల వేడి నూనె కలిపాక... ఐదు నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుంటూ... కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ వెడల్పాటి చెక్కల్లా చేసుకుని.. కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి పది రోజుల వరకూ నిల్వ ఉంటాయి.


బేసన్‌ కోవా స్వీట్‌

కావలసినవి: సెనగపిండి: మూడుకప్పులు, నెయ్యి: ఒకటింబావు కప్పు, పాలు: ముప్పావుకప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పు, నీళ్లు: అరకప్పు, కోవా: అరకప్పు, యాలకులపొడి: పావుచెంచా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి పావుకప్పు నెయ్యి వేయాలి. అది వేడెక్కాక సెనగపిండి, పావుకప్పు పాలు పోసి బాగా కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. మరో కడాయిని స్టౌమీద పెట్టి మిగిలిన నెయ్యి వేయాలి. అది వేడెక్కాక సెనగపిండి మిశ్రమం, మిగిలిన పాలు పోసి.. సిమ్‌లో పెట్టి కలుపుతూ.. పావుగంట నుంచి ఇరవైనిమిషాలయ్యాక దింపేయాలి. మరో గిన్నెలో చక్కెర, నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టాలి. చక్కెర తీగపాకం వచ్చాక కోవా, సెనగపిండి మిశ్రమం, యాలకులపొడి వేసి అన్నీ కలిసేలా కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిరాసిన ప్లేటులోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టి... నాలుగు గంటలయ్యాక ఇవతలకు తీసి ముక్కల్లా కోయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts