విందు... అదిరిపోయేలా!

కొత్త ఏడాది రోజున చేసుకునే వంటకాల్లో... స్టార్టర్‌ నుంచీ స్వీటు వరకూ అన్నీ ఉంటే... ఆ మజానే వేరు కదూ. అలాంటి రుచుల మేళానే ఇది.

Published : 31 Dec 2022 23:24 IST

విందు... అదిరిపోయేలా!

కొత్త ఏడాది రోజున చేసుకునే వంటకాల్లో... స్టార్టర్‌ నుంచీ స్వీటు వరకూ అన్నీ ఉంటే... ఆ మజానే వేరు కదూ. అలాంటి రుచుల మేళానే ఇది. ఆలస్యమెందుకు, ఓ పట్టు పట్టేయండి మరి.  


క్రీమీ ఫ్రూట్‌ సలాడ్‌

కావలసినవి: గడ్డ పెరుగు: రెండు కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: పావుకప్పు, దానిమ్మగింజలు: పావుకప్పు, కమలాఫలం ముక్కలు: పావుకప్పు, ద్రాక్ష తరుగు: పావుకప్పు, ఆపిల్‌ ముక్కలు: అరకప్పు, అరటిపండు: ఒకటి, ఎండు అంజీరా తరుగు: పావుకప్పు, ఖర్జూర ముక్కలు: పావుకప్పు, జీడిపప్పు-బాదం పలుకులు: రెండూ కలిపి అరకప్పు.

తయారీ విధానం: పెరుగులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి బాగా కలపాలి.తరువాత మిగిలిన పదార్థాలనూ కలిపి... కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.


స్పైసీ గార్లిక్‌ పనీర్‌

కావలసినవి: పనీర్‌ ముక్కలు: ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, నూనె: పావుకప్పు, ఎండుమిర్చి: ఎనిమిది, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, జీలకర్ర: అరచెంచా, సోయాసాస్‌: చెంచా, చక్కెర: చెంచా, అల్లం తరుగు: అర టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం: పనీర్‌, నూనె, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యాప్సికం, సోయాసాస్‌ తప్ప మిగిలిన పదార్థాలను మిక్సీలో వేసుకుని పావుకప్పు నీళ్లతో పేస్టులా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి.. క్యాప్సికం, ఉల్లిపాయముక్కలు వేయించాలి. తరవాత చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌, పనీర్‌, సోయాసాస్‌, కొత్తిమీర వేసి బాగా కలపాలి. పనీర్‌ ముక్కలకు మసాలా పట్టాక దింపేయాలి.


మసాలా మాకరోనీ

కావలసినవి: ఉడికించిన మాకరోనీ: రెండు కప్పులు, నూనె: పావుకప్పు, ఉల్లిపాయ: ఒకటి, వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను, టొమాటో ముక్కలు: కప్పు, క్యారెట్‌ తరుగు: అరకప్పు, ఎరుపు-ఆకుపచ్చ రంగు క్యాప్సికం తరుగు:పావుకప్పు చొప్పున, ఉప్పు: తగినంత, కారం: చెంచా, దనియాలపొడి-గరంమసాలా- కసూరీమేథీ- ఒరెగానో: చెంచా చొప్పున, టొమాటో కెచప్‌: టేబుల్‌స్పూను, కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి తరుగు వేయించాలి. తరువాత కూరగాయల ముక్కలు, తగినంత ఉప్పు, కారం, దనియాలపొడి, గరంమసాలా కసూరీమేథీ, ఒరెగానో వేసి బాగా కలిపి పావుకప్పు నీళ్లుపోయాలి. టొమాటో మగ్గాక టొమాటో కెచప్‌ కలపాలి. ఇందులో మాకరోనీ, కొత్తిమీర తరుగు వేసి కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.  


కాజు మటర్‌ పులావ్‌

కావలసినవి: బాస్మతీ బియ్యం: కప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), వేయించిన ఉల్లిపాయముక్కలు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిబఠాణీ: కప్పు, కిస్‌మిస్‌: పావుకప్పు, జీడిపప్పు: అరకప్పు, అల్లం- వెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను చొప్పున, పచ్చిమిర్చి: రెండు, జీలకర్ర: చెంచా, యాలకులు: మూడు, లవంగాలు: మూడు, బిర్యానీ ఆకు: ఒకటి, దాల్చినచెక్క: చిన్నముక్క, గరంమసాలా: చెంచా, నెయ్యి: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టౌమీద కుక్కర్‌ను పెట్టి నెయ్యి వేయాలి. ఇందులో జీలకర్ర, యాలకులు, లవంగాలు, బిర్యానీఆకు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి తరుగు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి బఠాణీ కలపాలి. ఇప్పుడు బియ్యం, తగినంత ఉప్పు, గరంమసాలా, రెండు కప్పుల నీళ్లు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి మూడు కూతలు వచ్చాక దింపేయాలి.  


చాక్లెట్‌ క్యారెట్‌ కేక్‌

కావలసినవి: మైదా: రెండు కప్పులు, చాక్లెట్‌పొడి: ముప్పావుకప్పు, వంటసోడా: అర చెంచా, బేకింగ్‌పౌడర్‌: అరచెంచా, ఉప్పు: పావు చెంచా, వెన్న: అరకప్పు, చక్కెర: కప్పు, బ్రౌన్‌షుగర్‌: కప్పు, గుడ్లు: నాలుగు, నూనె: అరకప్పు, క్రీమ్‌: పావుకప్పు, వెనిల్లా ఎసెన్స్‌:  చెంచా, క్యారెట్‌ తురుము: మూడు కప్పులు, చాక్లెట్‌ చిప్స్‌: కప్పు. టాపింగ్‌కోసం: చాక్లెట్‌పొడి: కప్పు, చక్కెర: ఒకటింబావు కప్పు, క్రీమ్‌: అరకప్పు, నీళ్లు: అరకప్పు, జెలాటిన్‌: ఒకటిన్నర చెంచా (కాసిని నీటిలో నానబెట్టుకోవాలి).

తయారీ విధానం: ముందుగా టాపింగ్‌ను చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి అందులో చాక్లెట్‌పొడి, చక్కెర వేసి కలపాలి. తరువాత క్రీమ్‌, నీళ్లు వేసి.. కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు జెలాటిన్‌ను కలిపి దింపేసి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు ఓ గిన్నెలో మైదా, చాక్లెట్‌పొడి, వంటసోడా, బేకింగ్‌పౌడర్‌, ఉప్పు వేసి కలుపుకోవాలి. మరో గిన్నెలో వెన్న, చక్కెర, బ్రౌన్‌షుగర్‌ , సొన, నూనె, క్రీమ్‌, వెనిల్లా ఎసెన్స్‌ తీసుకుని గిలకొట్టుకోవాలి. ఇందులో క్యారెట్‌ తురుము, మైదా మిశ్రమం, చాక్లెట్‌ చిప్స్‌ కలిపి వెన్న రాసిన పాన్‌లో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసుకున్న అవెన్‌లో ఉంచి ముప్ఫై అయిదు నిమిషాలు బేక్‌ చేసుకోవాలి. దీనిపైన చేసిపెట్టుకున్న టాపింగ్‌ రాయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..