స్వచ్ఛ ఇందౌర్‌... సిక్సర్‌ కొట్టింది!

ఆ ఊళ్లో పిల్లలకు ఎవరైనా చాక్లెట్‌ ఇస్తే దాన్ని నోట్లో వేసుకుని కాగితాన్ని జేబులో పెట్టుకుంటారు. డస్ట్‌బిన్‌ కన్పించేవరకూ అది జేబులోనే భద్రంగా ఉంటుంది.

Updated : 16 Oct 2022 09:21 IST

స్వచ్ఛ ఇందౌర్‌... సిక్సర్‌ కొట్టింది!

ఆ ఊళ్లో పిల్లలకు ఎవరైనా చాక్లెట్‌ ఇస్తే దాన్ని నోట్లో వేసుకుని కాగితాన్ని జేబులో పెట్టుకుంటారు. డస్ట్‌బిన్‌ కన్పించేవరకూ అది జేబులోనే భద్రంగా ఉంటుంది. బయటకు వెళ్లే పెద్దవారు కారులో పెట్రోలు చాలినంత ఉందో లేదో చూసుకున్నట్లే లోపల చిన్న చెత్తబుట్ట ఉందో లేదో కూడా చూసుకుంటారు. పరిశుభ్రత అవసరాన్ని గుర్తించి, దాన్ని అలవాటుగా మార్చుకున్నారు అక్కడి ప్రజలంతా. ఫలితమే... మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరం దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా సిక్సర్‌ కొట్టింది. వరుసగా ఆరోసారి స్వచ్ఛ అవార్డు గెలుచుకుని ‘సరిలేరు నాకెవ్వరూ’ అని సవాలు విసురుతోంది. మహా మహా నగరాలని తోసిరాజని ఇందౌర్‌ ఆ ఘనత ఎలా సాధించిందీ అంటే...

ఏదైనా ఒక బహుమతి ఒకసారీ రెండుసార్లూ అందుకుంటేనే గొప్ప. అలాంటిది ఏకంగా ఆరుసార్లు అందుకుంటే... అది అత్యంత ప్రతిష్ఠాత్మక విజయమే కదా. పైగా ఒక వ్యక్తిగానో ఒక బృందంగానో కాక ఒక నగరంగా బహుమతి అందుకోవడమంటే- దాని వెనక ప్రజలూ వారి ప్రతినిధులూ ప్రభుత్వ అధికారులూ పారిశుద్ధ్య కార్మికులూ... అందరూ కలసికట్టుగా ఒకే ఆశయం కోసం నూటికి నూరుపాళ్లూ అంకితభావంతో పనిచేయాలి. అలా చేశారు కాబట్టే వరుసగా ఆరోసారి స్వచ్ఛ నగరాల్లో తొలి స్థానాన్ని నిలబెట్టుకుని చరిత్ర సృష్టించింది ఇందౌర్‌ నగరం. అంతేకాదు, వివిధ అంశాల ఆధారంగా చేపట్టిన సర్వేలో తొలిసారి 7,146 పాయింట్ల స్కోరు సాధించి సెవెన్‌ స్టార్‌ రేటింగ్‌ సంపాదించింది. దేశంలో ఈ రేటింగ్‌ పొందిన ఏకైక నగరం- ఇందౌర్‌.

ఓ ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్తే...

దేశంలోని అన్ని నగరాల్లాగే ఇందౌర్‌ కూడా మురికిగా అస్తవ్యస్తంగా ఉండేది. వీధి చివర దుర్గంధం వెదజల్లుతూ చెత్తకుండీ, దానిచుట్టూ ఓ వందమీటర్ల వరకూ వ్యాపించిన చెత్తా, దాన్ని కెలుకుతూ ప్లాస్టిక్‌ కాగితాలు ఏరుకునే బీదాబిక్కీ... అక్కడా సర్వ సాధారణ దృశ్యమే.

మరి ఇప్పుడో... ఆ నగరంలో వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి. ఎంత వెతికినా రోడ్డు మీద ఒక కాగితం ముక్క కూడా కన్పించదు. చెత్తకుప్పలనేవి అసలు లేనే లేవు. కూడళ్లన్నీ కళారూపాలతో గోడలన్నీ చక్కని పెయింటింగులతో అందంగా కన్పిస్తాయి. హోటళ్లూ, కూరగాయల మార్కెట్లూ... ఎక్కడికెళ్లినా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఆహ్లాదంగా కన్పిస్తాయి.

అంతలా ఎలా మారింది?

సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదనడానికి నిదర్శనం ఇందౌర్‌. మధ్యప్రదేశ్‌కి ఆర్థిక రాజధానిగా పరిగణించే ఈ నగర జనాభా దాదాపు 35 లక్షలు. 2015లో మనీష్‌ సింగ్‌ ఈ నగరానికి మున్సిపల్‌ కమిషనర్‌గా వచ్చారు. నగర పరిశుభ్రతను పెంపొందించాలని భావించిన ఆయన ఇళ్ల నుంచి చెత్తను సేకరించే ప్రాజెకున్టు ప్రారంభించారు. మొదట పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని వార్డుల్లోనే చేపడదామనుకున్నప్పటికీ జిల్లా కలెక్టరూ ప్రజాప్రతినిధులూ సహకరించడంతో మొత్తం నగరానికి దాన్ని వర్తింపజేశారు. నగరంలోని అన్ని ఇళ్లనుంచి చెత్త సేకరించాలంటే చాలా వాహనాలు కావాలి. చెత్త ఒక్కటీ లేకుండా చూస్తే సరిపోదు. వీధుల్ని శుభ్రంగా ఉంచాలి, బహిరంగ మూత్రవిసర్జనని అరికట్టాలి, మురుగు కాల్వల్ని సరిగ్గా నిర్వహించాలి... ఇవన్నీ ఎలా అన్న ప్రశ్నలతో పాటు సేకరించిన చెత్తను ఏం చేయాలన్నదీ అధికారుల ముందు నిలిచిన మరో పెద్ద ప్రశ్న.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వివిధ దేశాల్లో విధానాలను అధ్యయనం చేశారు. బృహత్‌ ప్రణాళికని రూపొందించుకున్నారు. తక్షణం ఆచరణలోనూ పెట్టారు. ఫలితమూ అంతే త్వరగా కన్పించింది. 2017లో మొట్టమొదటిసారి ఇందౌర్‌ స్వచ్ఛ నగరంగా అవార్డు గెలుచుకుంది. ఆ గెలుపు అధికారుల్లో, కార్మికుల్లో అందరికన్నా ఎక్కువగా ప్రజల్లో... ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. వచ్చిన పేరును నిలబెట్టుకోవాలన్న పట్టుదలను పెంచింది. ఆ పట్టుదల ఆరేళ్లైనా సడలలేదు.

ఎలా సాధ్యమైంది?

మొదట్లో ఇళ్ల నుంచి చెత్తసేకరణకీ, తడీ పొడీ చెత్త విడివిడిగా వేయడానికీ ప్రజల్లో 80 శాతం సహకరించలేదు. వారిలో అవగాహన పెంచడానికి ప్రసార మాధ్యమాల ద్వారా రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించారు. పరిశుభ్రత ప్రాధాన్యాన్ని చెబుతూ ఒక పాట రాయించి ఆ థీమ్‌ సాంగ్‌ని ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. అప్పటికీ సహకరించని వారిపై జరిమానాలు విధించడం మొదలెట్టారు. చెత్తని వేరు చేసి వాహనంలో వేయకపోయినా, రోడ్డుమీద వేసినా, బహిరంగ మూత్ర విసర్జన చేసినా- నగరంలో దుర్గంధం వ్యాప్తికి కారణమవుతున్నారన్న అభియోగంతో పెద్ద మొత్తంలో ఫైన్‌ వేసి అక్కడికక్కడే ముక్కుపిండి వసూలు చేసేవారు. హోటళ్లూ వ్యాపార సంస్థల్లాంటి వాటికైతే ఈ జరిమానా ఒకోసారి లక్ష రూపాయల దాకా ఉండేది. 2017-18లో నగర పాలక సంస్థ జరిమానాల రూపంలోనే రూ.27 కోట్లు వసూలు చేసిందంటే నియమాలకు కట్టుబడని వారిపై ఎంత కఠినంగా వ్యవహరించిందో అర్థమవుతుంది.

ఆ పద్ధతి బాగా పనిచేసింది. అందరూ దారిలోకి వచ్చారు. ‘స్వచ్ఛ ఇందౌర్‌’ విజయప్రస్థానం మొదలైంది.

ఇప్పుడు సూర్యోదయంతో పాటే స్వచ్ఛ ఇందౌర్‌ థీమ్‌ సాంగ్‌ని వినిపిస్తూ చెత్త సేకరించే వాహనం ప్రతి ఇంటి ముందుకూ వస్తుంది. ఆ వాహనంలో ఆరు విభాగాలు ఉంటాయి. గృహిణులు తడి, పొడి చెత్తను విడివిడిగా వాటికి కేటాయించిన డబ్బాల్లో వేస్తారు. అవే కాకుండా శానిటరీ నాప్కిన్లు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు, ప్లాస్టిక్, లోహాల్లాంటివీ... మిగిలిన నాలుగు డబ్బాల్లో విడివిడిగా వేస్తారు. ఇలా ఇళ్ల దగ్గరే దాదాపుగా 97 శాతం చెత్త వేరవుతుంది. 85 వార్డుల్లో ఆరు లక్షల ఇళ్లూ వ్యాపార సంస్థలనుంచి 575 వాహనాలు ఇలా ఆరు రకాల చెత్తతో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పది గార్బేజ్‌ ట్రాన్సఫర్‌ కేంద్రాలకు చేరుకుంటాయి. ఎందులో వేయాలో తెలియకో, పొరపాటునో సరిగ్గా వేరుచేయడం జరగని వస్తువులేమైనా ఉంటే వాటిని ఇక్కడ వేరుచేస్తారు. అంటే- నూటికి నూరు శాతం చెత్త వేరుచేయడం జరుగుతుంది.

విడదీసిన చెత్తని ఏంచేస్తారు?

ఇలా సేకరించిన చెత్త అంతా వందశాతం అదే రోజు శుద్ధి అయిపోతుంది. నగరంలో రోజూ 1900 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా అందులో 1200 టన్నులు పొడి చెత్త కాగా తడి చెత్త 700 టన్నులు ఉంటుంది. ఈ తడి చెత్త అంతా బయోగ్యాస్‌ ప్లాంట్‌కి వెళ్తుంది. ఇందౌర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి ఆసియాలోనే అతి పెద్ద బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఉంది. చెత్త నుంచి ఇక్కడ రోజుకు 18 వేల కిలోల బయో మీథేన్, 10 టన్నుల సేంద్రియ ఎరువులు తయారవుతున్నాయి.

పొడి చెత్త అంతా ట్రెంచింగ్‌ గ్రౌండ్‌కి వెళ్తుంది. అక్కడ ... ప్రజాభాగస్వామ్యంతో ఏర్పాటైన అతి పెద్ద పొడి వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఉంది. ప్లాస్టిక్, శానిటరీ, ఎలక్ట్రానిక్, మెటల్స్‌... అన్నిటినీ వేటికవే వేర్వేరు విధానాల ద్వారా శుభ్రం చేసి ఆయా రీసైక్లింగ్‌ సంస్థలకు పంపుతారు.

ఇవే కాక...

* బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టడానికి మరుగుదొడ్లు నిర్మించి పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారు. నగరవ్యాప్తంగా పబ్లిక్‌ టాయ్‌లెట్లు 200, కమ్యూనిటీ మరుగుదొడ్లు 120, రోడ్‌సైడ్‌ టాయ్‌లెట్స్‌ మరో 700... నిర్మించారు.

* ఒకప్పుడు చెత్త డంపింగ్‌ యార్డుగా ఉన్న దేవ్‌గురాడియా ప్రాంతాన్ని ఇందౌర్‌ నగరపాలక సంస్థే బయో రెమిడియేషన్‌ ప్రక్రియతో శుభ్రపరిచింది. దాంతో వంద ఎకరాల ఖాళీ భూమి లభించినట్లయింది. అందులో 80 ఎకరాల్లో పచ్చని అడవిని అభివృద్ధి చేస్తోంది.

* మురుగు నీటి శుద్ధికి పది ప్రత్యేక ప్లాంట్లు ఉన్నాయి. మురుగు కాలవలన్నిటినీ వీటికి అనుసంధానించి శుభ్రమైన నీటిని మాత్రమే నదుల్లోకి వదులుతున్నారు. దాంతో నగరంలోని సరస్వతి, కాన్హా నదుల్లో కాలుష్యం తగ్గింది. నీటిని శుభ్రం చేశాకే నదుల్లోకి వదులుతున్న నగరాలకు లభించే ‘వాటర్‌ ప్లస్‌ సిటీ’ అన్న గుర్తింపు ఇందౌర్‌కు లభించింది. 200 పబ్లిక్‌ గార్డెన్లకూ నగరం చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకూ నగరంలో చేపట్టే నిర్మాణాలకూ శుద్ధిచేసిన నీటినే ఉపయోగిస్తున్నారు.

* వాననీటి సంరక్షణకీ ప్రాధాన్యమిస్తున్నారు. ఆ సౌకర్యం ఏర్పాటుచేయకపోతే కొత్త భవనాలకు అనుమతించడం లేదు.

* నిర్మాణాలు జరిగేటప్పుడూ పాత భవనాలను కూల్చినప్పుడూ వచ్చే వ్యర్థాలను పూర్తిగా సేకరించి రీసైకిల్‌ చేస్తున్నారు.

* జీరో వేస్ట్‌ వెడ్డింగ్‌ కాన్సెప్ట్‌పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాంతో పెళ్లిళ్లలో పర్యావరణ హిత ఉత్పత్తులతోనే అలంకరణచేస్తూ వడ్డనకు స్టీలు పాత్రలే వాడుతున్నారు. ‘బర్తన్‌ బ్యాంకులు’ ఈ పాత్రల్ని ఉచితంగా సరఫరాచేస్తున్నాయి. తడి చెత్తను అక్కడికక్కడే కంపోస్ట్‌ ఎరువుగా తయారుచేసి అతిథులకు కానుకగా అందజేస్తున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న జంటలకు ‘హోమ్‌ కంపోస్టింగ్‌ కిట్‌’ని బహుమతిగా ఇస్తున్నారు.

* ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని తగ్గించడానికి ‘థైలా బ్యాంక్‌’ పేరుతో తోపుడుబళ్లమీద నామమాత్రపు రుసుముతోనే నూలు సంచీలను విక్రయిస్తున్నారు.

* శుభ్రతతో అయిపోయిందనుకోకుండా సుందరీకరణకీ ప్రాధాన్యమిచ్చారు. రోడ్డువైపు ఉన్న గోడలన్నిటినీ చక్కని దృశ్యాలతో చిత్రించి, వీధులన్నీ సిమెంట్‌ చేసి, కూడళ్లను ఫౌంటెన్లతో, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్‌ విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒక చక్కని పార్కుని ఏర్పాటుచేశారు.

సీఎన్‌జీతో ఏం చేస్తారు?

తడి చెత్తనుంచి తయారుచేసిన బయోగ్యాస్‌నే సీఎన్‌జీగా మార్చి వాహనాల్లో ఇంధనంగా వాడుతున్నారు. 150 సిటీ బస్సులు ఈ గ్యాస్‌తోనే నడుస్తున్నాయి. ఇదే కాక ప్లాస్టిక్‌ వ్యర్థాలనుంచి డీజిల్‌ కూడా తయారుచేసుకుంటున్నారు. రోజూ వాహనంలో వేసే ప్లాస్టిక్కే కాకుండా ఇతరత్రా ప్లాస్టిక్‌ వ్యర్థాలను విడిగా నిల్వ చేయడానికి నగర పాలక సంస్థ ఇంటింటికీ రెండు పెద్ద సంచులు ఇస్తుంది. ఒక సంచి నిండగానే ప్రజలు రీసైక్లింగ్‌ ఏజెన్సీకి సమాచారం ఇస్తారు. సిబ్బంది ఇంటికే వచ్చి ఆ ప్లాస్టిక్‌కి మూడు కిలోలకు పది రూపాయల చొప్పున డబ్బులిచ్చి తీసుకెళ్తారు. దాన్ని రీసైకిల్‌ చేసి డీజిల్‌ తయారుచేస్తారు. ఈ ప్లాంట్‌లో రోజూ 8 టన్నుల ప్లాస్టిక్‌ని ప్రాసెస్‌ చేసి 3,500 లీటర్ల డీజిల్‌ ఉత్పత్తి చేస్తారు. ఘన వ్యర్థాలను ఇటుకలుగా మార్చి రోడ్ల నిర్మాణంలో వాడుతున్నారు.

వీధుల శుభ్రత, నీటి శుభ్రత ఒక గాడిలో పడడంతో అధికారులు ఇప్పుడు గాలి మీద దృష్టి పెట్టారు. వాయుకాలుష్యాన్ని నివారించే చర్యలూ చేపడుతున్నారు.

ఏంచేస్తున్నారు?

పెట్రోలు, డీజిల్‌ వాడకాన్ని తగ్గించడానికి సీఎన్‌జీ, విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. 50 వేలకు పైగా కుటుంబాలు వంటింటి వ్యర్థాలతో ఇంటివద్దే గ్యాస్, ఎరువు తయారుచేసుకుంటున్నాయి. అలాంటివాళ్లు మున్సిపాలిటీకి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకపోగా ఎరువు అమ్ముకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. దీనివల్ల చెత్త సేకరణ వాహనాలు ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. క్రమంగా ఇలాంటి జీరోవేస్ట్‌ వార్డులను పెంచుతున్నారు. దీపావళికి హరిత బాణసంచానే కాల్చాలని నిబంధన విధించారు. అది కూడా రాత్రి 8-10 గంటల మధ్య మాత్రమే. ఈ నిబంధనల వల్ల గతంతో పోలిస్తే బాణసంచా విక్రయాలు 60 శాతం తగ్గాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

ఇవన్నీ చేయడానికి ఖర్చూ ఎక్కువే అవుతుందిగా?

ఇవన్నీ ఖర్చుతో కూడిన పనులే. పారిశుద్ధ్య కార్మికులే దాదాపు 8,500 మంది 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. వారి జీతభత్యాలే కాక భద్రతకీ ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఈ చెత్త నుంచీ నగరపాలిక సంస్థ చెప్పుకోదగ్గ మొత్తంలో ఆదాయాన్ని పొందడం విశేషం. చెత్తని ఇంటి దగ్గరే సేకరిస్తున్నందుకు ప్రజల నుంచి వారు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి నెలనెలా 50 నుంచి 150 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఏటా చెత్తశుద్ధి ద్వారా రూ.12 కోట్లు, కార్బన్‌ ట్రేడింగ్‌ ద్వారా మరో 9 కోట్లు, ప్రైవేటు గ్యాస్‌ కంపెనీ వార్షిక ప్రీమియంగా 4.30 కోట్లు... నగరపాలక సంస్థకు ఆదాయం వస్తోంది.

సాధారణంగా నగరపాలక సంస్థలకు చెత్త శుద్ధి చాలా పెద్ద సమస్య. ఆ పనికోసం అవి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తాయి. ఇందౌర్‌ మాత్రం ఆ ఖర్చుని తగ్గించుకోవడమే కాక ఎదురు ఆదాయమూ పొందుతోంది.

ఇతర నగరాలూ నేర్చుకోవాలి...

అలా నేర్పడానికి కూడా ఇందౌర్‌ సిద్ధంగా ఉంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, ఇందౌర్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్, నగరపాలక సంస్థ... ఈ మూడూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఇందౌర్‌ నగరాన్ని కేస్‌ స్టడీగా చూపిస్తూ ‘స్వచ్ఛ నగరాన్ని తీర్చిదిద్దడం ఎలా’ అన్న విషయంలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి ఒక విధానాన్ని రూపొందించాయి. కాబట్టి ఆసక్తి ఉన్న పురపాలక సంస్థల వారు ఎవరైనా వారిని సంప్రదించి శిక్షణ పొందవచ్చు.

కేవలం శిక్షణ పొందడమే కాదు... ఒక క్రమపద్ధతిలో జరుగుతున్న పనుల్నీ, క్రమశిక్షణతో పనిచేసే సిబ్బందినీ, నియమాలను తు.చ. తప్పక ఆచరిస్తున్న ప్రజల్నీ చూసి... అందరూ చేయీ చేయీ కలిపితే సాధ్యం కానిది ఏదీ లేదన్న స్ఫూర్తినీ పొందవచ్చు!


స్వచ్ఛ అవార్డుకి ఎంపిక ఇలా..!

నగరాల్లో పరిసరాల పరిశుభ్రతపై పౌరుల్లో అవగాహన పెంచడానికీ, వారినీ అందులో భాగస్వాములను చేయడానికీ 2016లో ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌- అర్బన్‌ 2.0’ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. మొదటి ఏడాది 73 నగరాల్లో సర్వే చేశారు. ఈసారి 4,355 నగరాల్లో 9 కోట్లకు పైగా పౌరులు స్వచ్ఛతా ఆప్‌ల ద్వారా సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. 18 లక్షలకు పైగా ప్రజలతో ప్రత్యక్షంగా కూడా మాట్లాడారు. మొత్తం 3,600 నగరాలు పోటీపడ్డాయి. వాటిల్లో 412 నగరాలకు రేటింగ్‌ ఇవ్వగా ఇందౌర్‌ ఒక్కటే మొదటిసారి 7,146 స్కోరుతో సెవెన్‌ స్టార్‌ రేటింగ్‌ సంపాదించింది. 5 స్టార్‌ రేటింగ్‌ వచ్చిన 11 నగరాల్లో విశాఖ, తిరుపతి ఉన్నాయి. స్వచ్ఛతా ఆప్‌లలో ఈ ఏడాది ప్రత్యేకంగా సిటిజెన్స్‌ రిపోర్ట్‌ కార్డ్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌నీ జతచేశారు. దీని ద్వారా పౌరులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించే కాదు, తమకు నచ్చిన విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు చెప్పవచ్చు. వివిధ విభాగాలలో ఈ అవార్డులను ఇస్తారు. 22 రాష్ట్రాలూ 5 కేంద్రపాలిత ప్రాంతాలూ ఏదో ఒక కేటగిరిలో అవార్డులు పొందగా, 16 అవార్డులతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ సర్వే ప్రధాన లక్ష్యం- 2026 కల్లా దేశంలోని నగరాలన్నిటినీ చెత్త లేని నగరాలుగా తయారుచేయడం.


పుస్తకమే రాశారు!

తెలుగు వాడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పి.నరహరి ‘స్వచ్ఛ ఇందౌర్‌’ పేరుతో ఇటీవల ఓ పుస్తకమే రాశారు. ఇందౌర్‌ మొదటిసారి స్వచ్ఛ అవార్డు గెలుచుకున్నప్పుడు ఆ జిల్లా కలెక్టరుగా ఉన్నారు నరహరి. పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి హక్కు అనీ, ఆరోగ్యకరమైన సమాజానికి అది ఎంతో అవసరమనీ నమ్మిన ఆయన జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చడంలో విజయం సాధించారు. దాంతో నగరంపైనా దృష్టి పెట్టి నాటి కమిషనర్‌తో కలిసి ప్రణాళిక రూపొందించడంలోనూ, థీమ్‌ సాంగ్‌తో ప్రజల్లో ప్రేరణ కలిగించడంలోనూ కీలక పాత్ర వహించారు. మొదటిసారి అవార్డు గెలుచుకోవడానికీ, ఆ తర్వాత వరసగా దాన్ని నిలబెట్టుకోవడానికీ ఆ నగరంలోని ప్రజలూ, పారిశుద్ధ్య కార్మికులూ, అధికారులూ, ప్రజా ప్రతినిధులూ, సంస్థలూ ఎలా కష్టపడుతున్నదీ ఆయన ఈ పుస్తకంలో వివరించారు. దాంతో ఇప్పుడది పాలన రంగంలో పలువురికి రిఫరెన్స్‌ బుక్‌గా మారిపోయింది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..