ఈ టీచర్లు విద్యార్థుల నేస్తాలు!

టీచర్లంతా చదువు చెబుతారు. వాళ్లలో కొందరు మాత్రం ఆ చదువు పట్ల విద్యార్థులకు ఇష్టాన్ని పెంచుతారు. బడి మానకూడదనే బాధ్యతను అలవరుస్తారు. ఇదిగో ఈ టీచర్లు కూడా ఆ కోవకు చెందినవారే.

Published : 15 Oct 2022 23:17 IST

ఈ టీచర్లు విద్యార్థుల నేస్తాలు!

టీచర్లంతా చదువు చెబుతారు. వాళ్లలో కొందరు మాత్రం ఆ చదువు పట్ల విద్యార్థులకు ఇష్టాన్ని పెంచుతారు. బడి మానకూడదనే బాధ్యతను అలవరుస్తారు. ఇదిగో ఈ టీచర్లు కూడా ఆ కోవకు చెందినవారే.


పిల్లలతో సమానంగా...

ఎక్కడైనా పిల్లలే స్కూలుకి యూనిఫామ్‌ వేసుకుని వెళుతుంటారు. తమిళనాడులోని కీలాంబల్‌ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న రామచంద్రన్‌ కూడా పిల్లల్లా యూనిఫామ్‌ వేసుకుని స్కూలుకి వెళుతుంటాడు. అంతేకాదు, క్లాస్‌ రూమ్‌లోనూ వాళ్ల మధ్యనే ఒకడిగా కలిసి కూర్చుంటాడు. విద్యార్థులతో మమేకమై... స్నేహపూర్వక వాతావరణంలో పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతో రామచంద్రన్‌ అలా చేస్తున్నాడు. తనకొచ్చే జీతంలో 80 శాతం వరకూ స్కూలు అవసరాలకే ఖర్చు పెడుతుంటాడు. కనీస అవసరాలకి కూడా నోచుకోని ఆ బడి రామచంద్రన్‌ రాకతో స్మార్ట్‌గా మారిపోయింది. అక్కడ చదివే ముప్ఫై మంది విద్యార్థులకు తన సొంత ఖర్చులతో స్మార్ట్‌ ఫోన్లు అందించిన రామచంద్రన్‌- వైఫై సదుపాయం కూడా కల్పించి పిల్లలకు ఆధునిక పద్ధతుల్లో పాఠాలు చెబుతున్నాడు. అందుకే ఈ మధ్య జాతీయ ఉత్తమ టీచర్‌గానూ అవార్డును అందుకున్నాడు రామచంద్రన్‌.


రోటీ చేయడం నేర్పిస్తారు!

ఏ స్కూల్లో అయినా చదువులు నేర్పిస్తారు. దాంతోపాటు ఆటలూ, మంచి అలవాట్లూ, మొక్కలు పెంచడం వంటివీ నేర్పుతుంటారు కొందరు టీచర్లు. మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని కులాల్‌వాడీలోని ప్రభుత్వ పాఠశాలలో మాత్రం మగ పిల్లలకు రోటీ చేయడం నేర్పుతారు. అంతేనా, ఆ రోటీని గుండ్రంగా, మెత్తగా ఉండేలా తయారుచేయమని పోటీ కూడా పెడుతుంటారు. గెలిచినవారికి మంచి బహుమతులూ ఇస్తుంటారు. ఇదేదో ఆటవిడుపు అనుకుంటే పొరబాటు. దీని వెనక సామాజిక స్పృహ దాగుంది. భక్తరాజ్‌ గార్గే ఆ స్కూల్లో టీచర్‌గా చేరేటప్పటికి విద్యార్థుల హాజరు- ముఖ్యంగా మగపిల్లలది తక్కువగా ఉంది. విషయం ఆరా తీస్తే ఆ కరవు ప్రాంతంలో సరిగా పంటలు పండకా, పనులు దొరక్కా చాలామంది వలసలు వెళుతుంటారనీ, ఆ సమయంలో పిల్లల్ని చూసుకునేవారూ, వండి పెట్టేవారూ లేక వాళ్లనీ వెంట తీసుకెళుతున్నారనీ తెలిసింది. అదే ఆ పిల్లలకి వాళ్లు తినేది వండుకోవడం తెలిస్తే చదువు మానేసి వెళ్లాల్సిన పనిలేదని అనుకున్న భక్తరాజ్‌ స్కూల్‌లో మగ పిల్లలకు చపాతీలూ, రోటీలూ చేయడం నేర్పించడం మొదలుపెట్టాడు. నెలకోసారి వాటిని చేయడంలో పోటీలు నిర్వహిస్తుంటాడు. బాగా చేసిన వారికి బహుమతులూ ఇస్తుంటాడు. అలా మగ పిల్లలు చపాతీ, రోటీ, పప్పు కూర వంటివి చేయడం నేర్చుకుని ఇంట్లోని వృద్ధులకు వండిపెట్టి.. తామూ తిని స్కూలుకు వెళుతున్నారు. దాంతో క్రమంగా డ్రాపవుట్ల సంఖ్య తగ్గిపోవడంతో రోటీల తయారీ ప్రయోగాన్ని ఆ జిల్లాలోని మిగతా స్కూళ్లూ ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయి.


బడిలో కేకు కోయిస్తారు

పిల్లలకు పుట్టినరోజు నాడు కేకు కోయించడం, దాన్ని అందరికీ పంచి పెట్టడం ఎంతో సరదాగా ఉంటుంది. కానీ చాలామంది పేదలకు కేకు ఖర్చు కూడా భారమే. అందుకే అలాంటి చిన్నారులకు తన ఖర్చులతో పుట్టిన రోజు చేస్తూ వారి చేత కేకు కోయిస్తుందో టీచరమ్మ. రాజస్థాన్‌లోని కనౌజ్‌కి చెందిన స్వాతి బిర్లా ఝదోలీలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తోంది. ఓ ఆరేడు గిరిజన గ్రామాల్ని దాటుకుంటూ ఇంటి నుంచి స్కూలుకు వెళుతుంటుంది స్వాతి. ఆ సమయంలో గ్రామాల్లోని చాలామంది చిన్నారులు రోడ్ల వెంట తిరగడం, చెట్ల కింద ఆడుకోవడం, పనులకు వెళ్లడం చూసి బాధపడింది. వాళ్లని ఎలాగైనా బడి బాట పట్టించాలనుకుంది. అందుకు కేకును తాయిలంగా ఎంచుకుంది. మొదట ఆ గ్రామాల్లోని పిల్లల వివరాల్నీ, పుట్టిన తేదీల్నీ సేకరించింది. తనెవరో వాళ్లకి తెలియకపోయినా పిల్లల పుట్టినరోజు నాడు ఇంటింటికీ వెళ్లి మరీ వారి చేత కేకు కోయించడం మొదలుపెట్టింది. క్రమంగా వారికి దగ్గరై దాదాపు వంద మంది పిల్లల్ని బడి బాట పట్టించింది. అప్పట్నుంచీ వారితోపాటు వాళ్లు చదువుతున్న స్కూల్లోని మిగతా పిల్లల పుట్టినరోజుల్ని కూడా జరుపుతూ కేకు కోయించి అందరికీ పంచుతోంది స్వాతి. ఇప్పుడు ఆ గిరిజన గ్రామాల్లో పిల్లలు మానకుండా బడికెళుతున్నారు. అంతేకాదు, నెలకి ఇద్దరుముగ్గురి పుట్టినరోజులతో నోరు తీపి చేసుకుంటూ చదువు మీదా శ్రద్ధ పెడుతున్నారు. పిల్లల కోసమని కేకు తయారీ నేర్చుకుని ఇంట్లోనే తయారు చేసే స్వాతి చిన్నారులకు బట్టలూ, బహుమతులూ కూడా ఇచ్చి ఆదరిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..