శుభాకాంక్షలు చెబుదామిలా..!

కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందమైన పూలబొకేలతోపాటు చిన్నపాటి కానుకల్నీ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటాం.

Updated : 01 Jan 2023 05:12 IST

శుభాకాంక్షలు చెబుదామిలా..!

కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ వేడుకలు జరుపుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందమైన పూలబొకేలతోపాటు చిన్నపాటి కానుకల్నీ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటాం. అయితే ఆ పూలబొకేల్లోనే చాక్లెట్లనీ కేకుల్నీ పండ్లనీ అమరిస్తే వేరే కానుకలతో పనేముంటుందీ... అందుకే దాన్ని వినూత్నంగా ప్యాక్‌ చేయించి మరీ అందిస్తున్నారిప్పుడు!

కొత్త సంవత్సరం, పెళ్లిరోజు, పుట్టినరోజు... వేడుక ఏదయినా పూలబొకే ఇవ్వడం ఓ సంప్రదాయం. అయితే ఆ బొకేలో ఎంతో ఖరీదైన పూలను మరెంతో అందంగా అమర్చినా కొన్ని రోజులకు వాడిపోవాల్సిందే. అదే ఆ పూలకి తోడుగా చాక్లెట్లూ కుకీలూ కేకులూ లేదా మిఠాయిలూ పండ్లూ బొమ్మలూ ఇలా వాళ్లకిష్టమైనవి కూడా చేర్చిమరీ బొకే చేయిస్తే చూడ్డానికీ అందంగా ఉంటుంది... తీసుకునేవాళ్లకీ ఉపయోగం... అని ఆలోచిస్తోందీ తరం. అందుకే ఒకప్పటిలా అచ్చంగా పూలతోనే కాకుండా రకరకాల తినుబండారాలూ వస్తువులతో వాటిని అందంగా రూపొందిస్తున్నారు ఫ్లోరిస్టులు. వీటి తయారీకోసం సిగ్నేచర్‌ మార్క్‌తో రకరకాల బొటిక్‌లూ ప్రత్యేకంగా వెలుస్తున్నాయి.

కేవలం బొకేలో పెట్టేవాటిల్లోనే కాదు... దాని ప్యాకింగులోనూ వైవిధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకప్పటిలా బొకేను రెండు చేతులతో పట్టుకునే తీసుకెళ్లాలంటే నేటి తరానికి కాస్త కష్టమే. ఏది ఉన్నా లేకున్నా ఒక చేతిలో సెల్‌ఫోన్‌ తప్పనిసరి. అందుకే క్యారీబ్యాగు మాదిరిగా ఒకచేత్తో పట్టుకునేందుకు వీలుగా బాక్స్‌ ప్యాకింగ్‌ ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు. ఇది షాపు నుంచి కొని తీసుకెళ్లడానికీ సౌకర్యంగా ఉంటుంది. పైగా వీటిని మందపాటి కార్డుబోర్డు బాక్సుల్లోనూ పేపర్‌ బాక్సుల్లోనూ ప్యాక్‌ చేయడం వల్ల పువ్వులూ తాజాగా ఉంటాయి.

మిగిలినవీ చెక్కుచెదరకుండానూ ఉంటాయి. అంతేకాదు, బాక్సుల్లో అరలు కూడా అమర్చడంతో పైన పూలు పెట్టినప్పటికీ అడుగున చాక్లెట్లో బిస్కట్లో కుకీల్లాంటివీ చక్కగా అమర్చుకోవచ్చన్నమాట. కొందరైతే పిల్లలూ పెద్దలూ ఇష్టంగా తినే కప్‌ కేకుల్నే నిజమైన పువ్వుల్నీ పూలబొకేల్నీ తలపించేలా ఐసింగ్‌ చేస్తున్నారు. దాంతో విడిగా పూలతో పనిలేకుండా అవే ఓ అందమైన పుష్పగుచ్ఛంలా కనిపిస్తున్నాయి. ఇక, వేడుక ఏదయినా కేకు కోయడం ఓ సంప్రదాయంగా మారింది. అందుకే పూలతోపాటు కేకు సైతం అందులోనే ఉండేలానూ బొకే బాక్సుల్ని రూపొందిస్తున్నారు. 

అదీగాక, బొకేని ఇంట్లో అలంకరించుకోవడం కాస్త కష్టం. అదే ఈ బాక్సు లేదా పూల సజ్జ రూపంలో ఇవ్వడంవల్ల దీన్ని నేరుగా ఏ టీవీ బోర్డు దగ్గరో టీపాయ్‌మీదో పెట్టుకోవడానికి వీలుగానూ ఉంటుంది. ఆర్కిడ్లు, ఆంథూరియాలు, పియోనీలు, జినియాలు, గులాబీలు, లిల్లీలు, చామంతులు, గార్డీనియాలు, బర్డ్‌ ఆఫ్‌ పారడైజ్‌... వంటి పూలతోపాటు కొన్ని గడ్డి జాతి మొక్కలనూ వెదురు ఆకులనూ జోడించి మరీ ఈ పూలబొకేలను రూపొందిస్తుంటారు. బొకేల్లోని పూలకీ భాష ఉందట. గులాబీ పూల గుచ్ఛాలు ప్రేమకు నిదర్శనమయితే, స్నేహానికీ ఆనందానికీ తీపిగుర్తులే చామంతులు. లిల్లీలు స్వచ్ఛతకీ సంపదకీ కీర్తికీ సంకేతాలయితే, మంచితనానికి నిదర్శనమే జినియా పూలు. ఈత, ఖర్జూర చెట్ల ఆకులు ఉంటే అవి విజయానికి సంకేతమట. కాబట్టి మీకు నచ్చిన పూలూ పండ్లూ చాక్లెట్లూ కేకులతో శుభాకాంక్షల బొకే బాక్సుని సిద్ధం చేసేయండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..