ఈ డాక్టరమ్మ.. చిన్నారులకు దేవత!

క్యాన్సర్‌ సోకిన చిన్నారులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు డాక్టర్‌ సుధాసిన్హా. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఆసుపత్రినీ నెలకొల్పారామె. తన కార్పొరేట్‌ కొలువు వదిలి మరీ ప్రభుత్వాసుపత్రిలో చేరిన సుధకు..

Updated : 02 Jan 2022 01:45 IST

ఈ డాక్టరమ్మ.. చిన్నారులకు దేవత!

క్యాన్సర్‌ సోకిన చిన్నారులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు డాక్టర్‌ సుధాసిన్హా. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఆసుపత్రినీ నెలకొల్పారామె. తన కార్పొరేట్‌ కొలువు వదిలి మరీ ప్రభుత్వాసుపత్రిలో చేరిన సుధకు.. అక్కడ ఎదురైన సంఘటనలే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుకు బాటలు వేశాయి. ఎంతోమంది పిల్లల ప్రాణాలనూ నిలబెడుతున్నాయి.

హైదరాబాద్‌కు చెందిన సుధాసిన్హా అమెరికాలో వైద్యవిద్యను అభ్యసించారు. కొన్నాళ్లు అక్కడే ప్రాక్టీస్‌ చేసి 2005లో తిరిగొచ్చారు. అపోలో ఆసుపత్రిలోని ఆంకాలజీ విభాగంలో కొంతకాలం పనిచేశాక, పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2006లో ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేరారు. అది పెద్దవాళ్ల ఆసుపత్రి కావడంతో క్యాన్సర్‌తో బాధపడుతూ వచ్చే పిల్లలను అక్కడి సిబ్బంది నిలోఫర్‌కు పంపేవారు. అలా ప్రతి రోజూ ఎంతోమంది రావడం.. తిరిగి వెళ్లిపోవడాన్ని ఆమె గమనిస్తుండేవారు. ఒకరోజు తానే చొరవ తీసుకొని పెద్దలతోపాటే క్యాన్సర్‌ సోకిన పిల్లలనూ చూడటం ప్రారంభించారు. మందులతో ఒక్కరోజులో పోయే జబ్బు కాదది. కొన్ని నెలలపాటు చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకు పడకలూ తప్పనిసరి. దాంతో ఆసుపత్రి డైరెక్టర్‌తో మాట్లాడి 13 పడకలనూ ఏర్పాటు చేయించారామె.

ఆలోచన ఆచరణగా మారి..  

క్యాన్సర్‌ను తొలి దశలో చాలామంది గుర్తించడం లేదని గ్రహించారు సుధాసిన్హా. మందులు కొనేందుకూ డబ్బులు లేక చాలామంది దేవుడి మీద భారం వేసి బిడ్డలను ఇళ్ళకు తీసుకెళ్లిపోవడం చూసి చలించిపోయిన ఆమె, అటువంటి వారికి అండగా ఉండాలనుకున్నారు. తన స్నేహితులైన లుసిడ్‌ డయాగ్నస్టిక్స్‌ నిర్వాహకురాలు డాక్టర్‌ సునీత, డాక్టర్‌ ఫణి, ఇన్ఫోమైల్‌ ఐటీ కంపెనీ బాధ్యుడు రవీంద్ర, తత్వసెట్‌ సంస్థ సీఈవో అజిత్‌లతో తన ఆలోచనను పంచుకున్నారు. వారు సానుకూలంగా స్పందించడంతో 2008లో ‘ఇంపాక్ట్‌’ (ఇంప్రూవింగ్‌ యాక్సెస్‌ టు కేర్‌ అండ్‌ ట్రీట్‌) పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించారామె. సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్‌ సోకిన పిల్లలకు వైద్యం అందించడంతో పాటు మందులూ సమకూర్చేవారు. వారి ఆలనాపాలనకు నర్సులనూ నియమించారు. ఒక్క పడకా లేని స్థితి నుంచి 100 పడకల స్థాయికి తీసుకొచ్చిన సుధ.. పిల్లలకు క్యాన్సర్‌ వైద్యం అందించే అతి తక్కువ ఆసుపత్రుల్లో ఎంఎన్‌జేనూ ఒకటిగా నిలపడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందంటారు.  

రెండు నెలల క్రితమే..

2019లో కేర్‌ ఆసుపత్రిలో చేరిన సుధ ప్రస్తుతం అక్కడి ఆంకాలజీ విభాగం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. విదేశాల్లో 90 శాతం చిన్నారులు క్యాన్సర్‌ నుంచి బయటపడుతుండగా, మన దేశంలో 45 శాతం మాత్రమే బతికి బట్టకడుతుండటం చూశాక.. తాను చేయాల్సింది ఇంకా చాలా ఉందనిపించిందామెకు. ఎలాగైనా సరే చిన్నారులకు ఉచితంగా క్యాన్సర్‌ చికిత్స అందించాలనే ఆలోచనతో ‘ఇంపాక్ట్‌’ ఆధ్వర్యంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనుకున్నారు. కూకట్‌పల్లిలోని శివానంద పునరావాస కేంద్రం నిర్వాహకులు స్థలం ఇచ్చేందుకు ముందుకు రావడంతో గత అక్టోబర్‌ 2న ‘ఇంపాక్ట్‌ శివానంద క్యాన్సర్‌ ఆసుపత్రి’ని ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షలతో అందులో అన్ని సౌకర్యాలూ కల్పించారు.

ఇంటి వాతావరణం ఉండేలా..

పదిహేను పడకలతో ప్రారంభించిన ఆ ఆసుపత్రిలో బ్లడ్‌, బోన్‌, కిడ్నీ క్యాన్సర్లతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఇంటి వాతావరణం కల్పించారు. ఐసీయూ, మూడు వార్డులు, ఫార్మసీ, ల్యాబ్‌తోపాటు లాన్‌, ఆట వస్తువులతో తీర్చిదిద్దారు. ఆసుపత్రి సామర్థ్యాన్ని 50 పడకలకు పెంచాలన్నది సుధాసిన్హా ప్రయత్నం. చుట్టుపక్కల ప్రాంతాల్లో క్యాన్సర్‌ బారిన పడిన చిన్నారులను గుర్తించేందుకూ ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించారామె.  

స్నేహితులూ దాతల సహకారంతో..  

‘క్యాన్సర్‌ వైద్యం చాలా ఖరీదైంది. అందుకే, పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించాలనుకున్నాం. రక్తం, మందులూ, భోజనం, సహాయకులు ఉండేందుకు ఏర్పాట్లు.. ఇలా ప్రతి ఖర్చూ ఆసుపత్రే భరిస్తుంది. శస్త్రచికిత్సలూ, మెరుగైన వైద్య సేవలకు కేర్‌ ఆసుపత్రి డాక్టర్ల సహకారమూ తీసుకుంటున్నాం. 50 పడకలతో సేవలు అందించాలంటే ఏడాదికి రూ.4 కోట్లు ఖర్చవుతుంది. స్నేహితులూ దాతల సాయంతోనే ఇదంతా సాధ్యపడుతోంది’ అని చెబుతున్నారీ డాక్టరమ్మ.

- పిన్నెబోయిన అక్కేశ్వరరావు, న్యూస్‌టుడే, కూకట్‌పల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..