కోరుకున్న భోజనం వండిపెట్టే హోటల్‌!

సాధారణంగా ఏ హోటల్‌కైనా వెళ్తే...మెనూ చూసి నచ్చిన పదార్థాలు ఆర్డరిస్తాం. కానీ ఈ కలినరీ లాంజ్‌లో మాత్రం మనం కోరుకున్న ఏ వంటకాన్నైనా వండి వడ్డిస్తారు.

Updated : 06 Feb 2022 00:53 IST

కోరుకున్న భోజనం వండిపెట్టే హోటల్‌!

సాధారణంగా ఏ హోటల్‌కైనా వెళ్తే...మెనూ చూసి నచ్చిన పదార్థాలు ఆర్డరిస్తాం. కానీ ఈ కలినరీ లాంజ్‌లో మాత్రం మనం కోరుకున్న ఏ వంటకాన్నైనా వండి వడ్డిస్తారు. అంతేనా, దేశ విదేశాల్లో ఉన్న ఏ షెఫ్‌నైనా పిలిపించుకుని మరీ వండించు కోవచ్చు. మెచ్చింది తయారు చేయడం నేర్చుకోవాలనుకుంటే... వాళ్లు తరగతులూ తీసుకుంటారు. పిల్లలకోసం ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌ కోర్సులూ, డీఐవై కిట్‌లూ అందిస్తారు... మరెన్నో ప్రత్యేకతలున్న ఈ హోటల్‌ హైదరాబాద్‌లో ఉంది..

వినియోగదారుల్ని మెప్పించాలంటే... మెనూలోని వంటకాలు రుచిగా ఉంటే మాత్రమే చాలదు. దాన్ని ఆస్వాదించే వాతావరణం, వైవిధ్యమైన ఆకర్షణలు కూడా ఉండాలి. వీటితో పాటు ఆహార ప్రియుల్ని మెప్పించేలా కస్టమైజేషన్‌ చేయడమే మా ప్రత్యేకత అంటున్నారు ‘ది కలినరీ లాంజ్‌’ నిర్వాహకుడు గోపీ కిశోర్‌ బైలుప్పుల. దీన్ని 2018లో ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌, బిజినెస్‌ సమావేశాలూ, వ్యక్తిగత, కుటుంబ వేడుకలూ... ఏవైనా ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకోవచ్చు. అంతా కలిసి నచ్చినవి వండి వడ్డించుకోవచ్చు. ఖండాంతర రుచులు మొదలుకుని స్థానిక వంటకాల వరకూ ఏవైనా కోరుకోవచ్చు. ఇక్కడ ఏ ఒకరో ఇద్దరో మాత్రమే షెఫ్‌లు ఉంటారనుకుంటే పొరపాటు. ప్రపంచ వ్యాప్తంగా 500కుపైగా షెఫ్‌లతో ఒప్పందం చేసుకుందీ సంస్థ. వారిలో జాతీయ, అంతర్జాతీయ స్టార్‌షెఫ్‌లు గరిమా అరోరా, మిషెల్లిన్‌, జాన్సన్‌, మందర్‌ వంటి వారెందరో ఉన్నారు. వారినే ఇక్కడకు రప్పించుకునీ వండించుకోవచ్చు కూడా.

బడ్జెట్‌ చెబితే చాలు...

వైవిధ్యాన్ని కోరుకునే అతిథుల బడ్జెట్‌ ఆధారంగా కస్టమైజ్డ్‌, లగ్జరీ, ప్రీమియర్‌ ఏర్పాట్లు చేస్తారు. అవసరమైతే గంటల చొప్పున ఆ ప్రదేశాన్నీ అద్దెకు తీసుకోవచ్చు. కొవిడ్‌ తర్వాత ప్రైవేట్‌ డైనింగ్‌కి ఆదరణ పెరగడంతో రాజకీయనాయకులూ, సినీతారలూ, వ్యాపార వేత్తలెందరో ఈ సంస్థకు ఖాతాదారులుగా మారారు. ఇందుకోసం ప్రత్యేకంగా కాంట్రాక్ట్‌లూ చేసుకుంటున్నారు. కార్పొరేట్‌ సమావేశాల కోసం సంస్థ సుమారు వందకు పైగా థీమ్‌లను సిద్ధం చేసింది. డెలాయిట్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్‌ 500 కంపెనీలకు చెందిన టాప్‌ సీఎక్స్‌వోల సమావేశానికీ, సింగపూర్‌కి చెందిన గూగుల్‌ గ్లోబల్‌ టీమ్‌కూ, ఈవో గ్రూప్‌- సీఈవో క్లబ్‌ వంటివి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలకూ ఆతిథ్యం ఇచ్చింది.

పిల్లలకోసం ప్రత్యేకంగా...

షెఫ్‌ల ఆధ్వర్యంలో ఇంటిల్లిపాదీ వంటల తయారీలో పాలు పంచుకుంటూ...రుచులను ఆస్వాదించే భిన్నమైన అనుభూతి పిల్లలను మెప్పిస్తుంది. అందుకే చిన్నారులకోసం కుకింగ్‌, బేకింగ్‌ క్లాసులూ నిర్వహిస్తోందీ కలినరీ లాంజ్‌. ఇలా ఐదు వేలమంది చిన్నారులకు పాకశాస్త్ర పాఠాలు చెప్పారు షెఫ్‌లు. విభిన్న వంటకాల తయారీ వర్క్‌ షాప్‌లెన్నో నిర్వహించారు. స్టార్‌ హోటళ్లతో ఒప్పందం చేసుకుని యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాల్నీ కల్పిస్తోందీ సంస్థ. ఇక, కొవిడ్‌ తర్వాత ఇంటికే పరిమితమైన చిన్నారుల కోసం ప్రత్యేకంగా డీఐవై కిట్లూ రూపొందించి ‘ఆరెంజ్‌ ఫిగ్‌’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చారు. చందా విధానంలో నెలకు నాలుగు రకాల కిట్లు ఇంటికే వచ్చేలా డిజైన్‌ చేశారు. అమెజాన్‌, ఫ్లిఫ్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌ వంటి ఈ కామర్స్‌ సైట్లలోనూ అందుబాటులో ఉన్న వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబయి, దిల్లీ, దుబాయ్‌, ఆస్ట్రేలియా, అమెరికా వంటి చోట్లకూ పంపిస్తున్నారు. అలానే కొత్తగా హోటల్‌ రంగంలోకి రావాలనుకునేవారికి డిజైనింగ్‌, మెనూలాంటివీ తయారు చేసి ఇస్తారు.

ఈ ఆలోచనకు పునాది...

గోపీ కిశోర్‌ది కాకినాడ. షెఫ్‌ కావాలనుకున్న అతడు కొన్ని పరిస్థితుల వల్ల ఇంజినీర్‌ అయ్యాడు. పదేళ్ల పాటు కార్పొరేట్‌ కొలువు చేసినా సంతృప్తి ఇవ్వకపోవడంతో దాన్ని వదిలేశాడు. 2014లో మొదట పర్యటకులకు ఇంటి భోజనం అందించేలా ‘ఫీస్ట్‌’ పేరుతో స్టార్టప్‌ని ప్రారంభించాడు. డిన్నర్‌ టేబుల్‌ టికెట్స్‌ విధానంలో ఓ వంద కార్యక్రమాలు చేశాక... దానికి కొనసాగింపుగా ఈ కలినరీ లాంజ్‌ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్రస్తుతం యాభై మందికి ఉపాధి కల్పిస్తోందీ సంస్థ.


పండ్లతోనూ వేడివేడి టీ..!

కొవిడ్‌... ప్రపంచాన్ని చుట్టేసింది. జీవనశైలిలో ఎన్నో మార్పుల్నీ తీసుకొచ్చింది. ఆహారపుటలవాట్లయితే చెప్పే పనే లేదు. ఆరోగ్యసూత్రాలంటే గిట్టనివాళ్లను సైతం తు.చ. తప్పక పాటించేలా చేసింది. అదీ ఎంతగా అంటే- అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు.... వంటి మసాలా దినుసుల్నీ సుగంధద్రవ్యాలనే కాదు, చల్లచల్లగా తాగే పండ్ల రసాలను సైతం వేడివేడి టీ రూపంలో  చప్పరించేంతగా..!

గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, పూల టీలు సాచెట్లూ బ్యాగ్‌ల రూపంలో రావడం తెలిసిందే. వాటికే పండ్లూ ఔషధమొక్కల ఫ్లేవర్లు జోడించినవీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు అచ్చంగా పండ్లతో చేసిన పొడులూ టీ బ్యాగ్స్‌ రూపంలో వస్తున్నాయి. వాటిని కూడా ఎంతో ఇష్టంగా వేడి వేడిగా తాగేస్తున్నారు.

పండ్లేమిటీ... టీ ఏమిటీ అనిపిస్తోంది కదూ. నిజమే, ఏదయినా తేయాకుతో తయారైనదయితేనే అది టీ. కానీ ఇప్పుడు దాని అర్థమే మారిపోయింది. మసాలా దినుసులయినా సుగంధ ద్రవ్యాలయినా పూలరేకులయినా వేటినైనా నీళ్లలో వేసి మరిగించి తాగే ప్రతీదీ టీనే. ఒకప్పుడు దీన్నే మనవాళ్లు కషాయం అనేవారు. కానీ యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌... వంటి ఔషధగుణాలున్న ప్రతీ మొక్కనీ మొక్క భాగాలనీ కూడా నీళ్లలో వేసి మరిగించి తాగడం అలవాటుగా చేసుకున్నారీమధ్య. అందులో భాగంగా ఇప్పుడు పండ్లనీ వేడివేడిగా తాగేస్తున్నారన్నమాట. అదెలా అంటే...

సీజన్‌లో దొరికే పండ్లను మిగిలిన అన్నికాలాల్లోనూ తినగలిగేలా ఎండబెట్టి లేదా పొడి రూపంలో నిల్వ చేయగలిగే టెక్నాలజీ అంతటా వాడుకలోకి వచ్చింది. దాంతో ఆయా పండ్లను డ్రై ఫ్రూట్స్‌గాగానీ పొడి రూపంలోగానీ తీసుకోవడం పెరిగింది. అయితే ఇంతకాలం ఆ పొడిని మిల్క్‌షేక్‌లూ ఐస్‌క్రీమ్‌లూ పుడ్డింగులతోబాటు జ్యూస్‌గా చేసుకుని చల్లచల్లగా తాగుతూ వచ్చారు. కొవిడ్‌ రాకతో వాటిని వాడుకునే విధానం మారిపోవడంతో అనేక కంపెనీలు ఫ్రూట్‌ టీలను తయారుచేస్తున్నాయి. వీటినే టై(టీ)సేన్స్‌ అనీ అంటున్నారు. అంటే- తేయాకు లేని టీలని అర్థమట. దాంతో ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ టీ వినియోగం తగ్గి టైసేన్స్‌ వాడకం పెరిగిందట. వీటివల్ల ఆరోగ్యానికి హాని లేకపోవడమే ఇందుకు కారణం.

కెఫీన్‌ ఉండదు..!

పండ్లను వేడి చేయడం వల్ల వాటిల్లోని ఆరోగ్య గుణాలు తగ్గిపోతాయన్న సందేహం సహజమే. అయితే గ్రీన్‌ టీ తయారీ మాదిరిగానే నీళ్లను మరిగించాకే పండ్లతో చేసిన పొడినీ కలుపుతారు. కాబట్టి వాటిల్లోని విటమిన్లకీ యాంటీఆక్సిడెంట్లకి నష్టం కలగదు సరికదా, పండ్లలో అధిక శాతంలో ఉండే ఆంథోసైనిన్ల వల్ల జలుబూ దగ్గూ వంటి వాటికి ఉపశమనంగానూ ఉంటుందట. గ్రీన్‌ టీలో మాదిరిగానే టైసేన్స్‌లోని పదార్థాలు రోగనిరోధక శక్తి పెంచేందుకూ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకూ తోడ్పడతాయి. క్యాన్సర్లూ, మతిమరుపూ, హృద్రోగాలు వంటి వాటినీ అడ్డుకుంటాయి. ఒత్తిడినీ తగ్గిస్తాయి. కెఫీన్‌ ఉండదు కాబట్టి గర్భిణీలూ వీటిని నిశ్చింతగా తాగొచ్చట.

కొన్ని కంపెనీలు ఆయా పండ్లతోపాటు ఇతరత్రా ఔషధమొక్కల్నీ ఆకుల్నీ పువ్వుల్నీ రేకుల్నీ... కూడా కలిపి టైసేన్స్‌ని తయారుచేస్తున్నారు. వీటిని వేడిగా తాగడం ఇష్టంలేనివాళ్లు ముందు వేడినీళ్లలో పొడి లేదా టీబ్యాగ్‌ని వేసి, ఆరాక ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తాగొచ్చు. వేసవిలో ఇలా తాగడం వల్ల దాహమూ తీరుతుంది. ఎండవేడి నుంచి ఉపశమనమూ కలుగుతుంది. కొన్ని కంపెనీలు అరటిపండు, మామిడి, పుచ్చ, జామ... వంటి పండ్లకి పేషన్‌, గులాబీ, మందార... వంటి పువ్వుల్నీ గ్రీన్‌ టీనీ కూడా జోడిస్తున్నాయి. మాక్‌టెయిల్స్‌ మాదిరిగా క్రాన్‌బెర్రీ-ఆపిల్‌, దానిమ్మ-పీచ్‌, బ్లూబెర్రీ- గోజి- స్ట్రాబెర్రీ...

ఇలా రెండుమూడు రకాల పండ్లను కలిపీ తీసుకొస్తున్నాయి. చివరికి కీరా, గుమ్మడికాయ పొడుల్నీ కూడా కలిపేస్తున్నారంటే- టైసేన్స్‌ ఏ స్థాయిలో మార్కెట్లోకి వస్తున్నాయో మరెంతగా తాగేస్తున్నారో అర్థం కావడం లేదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..