కడుపునిండా భోజనం, ఖరీదైన వైద్యం... ఒక్క రూపాయికే..!

గంగయ్య గారి (జీజీ) ఆసుపత్రి... పేదలకు రూపాయికే అన్ని చికిత్సలూ చేయడానికి వైద్యనారాయణులు కొలువు తీరిన గుడి!  మానవత్వమంటే ఏమిటో బోధించే బడి! దాని వెనక సొంత లాభం చూసుకోని ఒక సామాన్యుడి సంకల్పముంది. అభాగ్యులకు ఆకలి తీర్చి, మంచి ఆరోగ్యం అందించాలన్న స్ఫూర్తిదాయక లక్ష్యముంది!

Updated : 15 Nov 2022 16:11 IST

కడుపునిండా భోజనం, ఖరీదైన వైద్యం... ఒక్క రూపాయికే..!

గంగయ్య గారి (జీజీ) ఆసుపత్రి... పేదలకు రూపాయికే అన్ని చికిత్సలూ చేయడానికి వైద్యనారాయణులు కొలువు తీరిన గుడి!  మానవత్వమంటే ఏమిటో బోధించే బడి! దాని వెనక సొంత లాభం చూసుకోని ఒక సామాన్యుడి సంకల్పముంది. అభాగ్యులకు ఆకలి తీర్చి, మంచి ఆరోగ్యం అందించాలన్న స్ఫూర్తిదాయక లక్ష్యముంది!

అది 2020... కరోనా విలయతాండవం చేస్తున్న రోజులు... హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి నిండా శవాలు... వాటిని అంత్యక్రియలకు తరలించడమూ కష్టమైపోతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో గ్యాస్‌ యంత్రాల ద్వారా దహనం చేయడం మొదలుపెట్టారు. గ్యాస్‌ డెలివరీ చేయడానికి వాహనాల డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. అలాగని గ్యాస్‌ సిలిండర్లు వెళ్లకపోతే దహనాలు ఆగిపోయి శవాలు గుట్టలుగా పేరుకుంటాయి. తన గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా హాస్పిటల్‌కి సిలిండర్లను సరఫరా చేసే గంగాధర్‌ గుప్తాకి ఆ పరిస్థితి తెలిసి ఎంతో బాధపడ్డాడు. తానే డ్రైవర్‌గా మారి రోజూ అక్కడికి సిలిండర్లను డెలివరీ చేయసాగాడు. అక్కడ గుట్టలుగా పడి ఉన్న శవాల్నీ, రోగుల్నీ చూసినప్పుడు ఏడుపొచ్చేది. అనారోగ్యమూ, ఆర్థిక సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన తన తల్లిదండ్రులూ, తోబుట్టువులూ గుర్తుకొచ్చేవారు. అలా కొంతకాలం హాస్పిటల్‌కి వెళ్లిన గంగాధర్‌కి పేదలకు ఒక్క రూపాయితోనే మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనొచ్చింది. గ్యాస్‌ ఏజెన్సీ నడుపుతూ రామ్‌నగర్‌లో కొనుక్కున్న స్థలంలో హాస్పిటల్‌ కట్టాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ కమర్షియల్‌ కాంప్లెక్సు కట్టి అద్దెకు ఇవ్వాలన్నది అంతకు ముందు వరకూ వారి కుటుంబం ఆలోచన! ‘రూపాయికి వైౖద్యం’ చేయాలనే ఆలోచన రావడంతో ఆ స్థలంలో వ్యాపారం చేయకూడదనీ, దాన్ని పేదలకోసమే వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. ‘ఒక్క రూపాయితో వైద్యం సాధ్యమయ్యే పనేనా?’ అంటూ తెలిసినవాళ్లు రకరకాలుగా వ్యాఖ్యానించినా పట్టించుకోకుండా- ఆసుపత్రి ఎలా కట్టాలో, అందుకు సంబంధించి ఏయే ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకోవాలో తెలుసుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పట్నుంచీ భవనం నిర్మాణం పూర్తయ్యి, ఓపీకి అనుమతి వచ్చే వరకూ ఎన్నో సవాళ్లనీ, ఆర్థిక సమస్యల్నీ ఎదుర్కొన్న గంగాధర్‌ ఆసుపత్రి నిర్మాణానికి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించాడు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని బాలయోగీశ్వర స్వామీజీలను విశ్వసించే గంగాధర్‌ వారి తండ్రి గంగయ్య పేరునే ఆసుపత్రికి పెట్టుకున్నాడు. అలా ‘గంగయ్యగారి(జీజీ) ఛారిటబుల్‌ ఆసుపత్రి’కి శ్రీకారం చుట్టిన గంగాధర్‌ వైద్యసేవలతో పాటు రాయితీతో రక్తపరీక్షలూ, ఎక్స్‌రేలూ, ఈసీజీ సేవలందించడానికి డయాగ్నస్టిక్‌ సెంటర్‌నూ నిర్మించాడు. ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌రూమ్‌లతోపాటు 50 పడకలతో ఇన్‌పేషంట్‌ బ్లాక్‌నూ ఏర్పాటు చేశాడు. ఇన్‌పేషంట్‌ అనుమతుల కోసం ఎదురు చూస్తున్న గంగాధర్‌ ఐదు నెలల క్రితమే జీజీ హాస్పిటల్‌ (ఫోన్‌.నం- 8977917200, 8977917300)సేవల్ని పేదలకోసం అందుబాటులోకి తీసుకొచ్చాడు.

ఆకలీ తీర్చుతారు..
ఈ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జనరల్‌మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్‌, గైనిక్‌ తదితర సేవలు అందించేందుకు 18 మంది వైద్యులున్నారు. మూడు షిఫ్టుల్లో ఆరుగురు చొప్పున వైద్యులూ- ఫార్మసీ, డయాగ్నస్టిక్‌ సేవలూ 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. రోగుల సమయం వృథా చేయకుండా సాధ్యమైనంత త్వరగా చూసి పంపేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక, అక్కడ మందులూ, టెస్ట్‌లపై యాభై శాతం రాయితీ ఇస్తున్న గంగాధర్‌ ఎవరైనా వాటికీ డబ్బు చెల్లించలేమంటే ఉచితంగానే ఆ సేవల్ని అందిస్తారు. తెలంగాణ, ఆంధ్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్‌, ఒడిశా రాష్ట్రాల నుంచీ రోజుకు 1800-2000 మంది రోగులు వస్తుంటారు. ఫీజుగా వసూలు చేసే రూపాయిని హుండీలో వేయమంటారు.
ఆ తరవాత రోగి ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుని ఉచితంగా భోజనం లేదా టిఫిన్‌ పెడుతుంటారు. కాఫీ, టీలూ అందిస్తారు. అన్నంలో కూరా, రోటిపచ్చడీ…, సాంబారూ, మజ్జిగా ఇస్తారు. టిఫిన్‌కి ఇడ్లీ, దోసె, వడ, పూరీ, చపాతీ, పరోటా, ఉప్మా వంటివన్నీ ఉంటాయి. గంగాధర్‌ భార్య ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. అక్కడికి వచ్చిన వారిని ఆ దంపతులు అతిథులుగా చూసుకుంటారు. దూర ప్రాంతాల వారు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికీ, రాత్రిపూట బస్సులకు వెళ్లలేనివారు ఉండటానికీ వెసులుబాటూ కల్పిస్తున్నారు. ఆసుపత్రి నిర్వహణకు నెలకు దాదాపు ముప్పైలక్షల రూపాయలదాకా ఖర్చు చేస్తున్న గంగాధర్‌ తమకంటూ సొంతంగా ఆస్తి అక్కర్లేదని, సొంత ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ల ఇద్దరబ్బాయిలూ కుటుంబ వ్యాపారం మీద వచ్చే ఆదాయాన్ని ఆసుపత్రి కోసమే వెచ్చిస్తున్నారు. తాను సేవా కార్యక్రమాలు చేస్తూ, తన పిల్లల్నీ అదే బాటలో నడిపిస్తున్న ఈ మానవతామూర్తి- రోగులు హుండీలో వేసిన డబ్బును సైతం  ముమ్మిడివరంలోని బాలయోగీశ్వర ఆశ్రమానికి అందజేయడం చెప్పుకోవలసిన విశేషం.

ఫొటోలు: వసంత్‌ ఘంటసాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..