Published : 27 Feb 2022 00:31 IST

‘మానవ సేవ’.. వీరి తోవ!

ఆకలితో ఉన్న వారి కడుపు నింపడం మానవీయత. నిత్యం ఎంతోమంది అభాగ్యుల ఆకలి తీరుస్తూ ఆ మానవీయతను చేతల్లో చూపుతోంది హైదరాబాద్‌కు చెందిన మానవ సేవా సమితి ట్రస్టు. చేయీ చేయీ కలిపి, సొమ్ము జమ చేసి నిరుపేదలకూ, అనాథ చిన్నారులకూ కొండంత అండగా నిలుస్తున్నారీ ట్రస్టు సభ్యులు.

వికారాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయిన తన భార్యను ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి తీసుకొచ్చాడు. పరీక్షల నిమిత్తం రెండ్రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. నగరంలో తెలిసిన వారు కానీ చేతిలో చిల్లిగవ్వ కానీ లేకపోవడంతో ఆ రెండ్రోజులూ అర్ధాకలితోనే వెళ్లదీశారా దంపతులు.

‘ఎవరైనా వస్తారా... ఈరోజైనా ఆకలి తీరుస్తారా?’ అని కాలే కడుపులతో నిత్యం ఎదురుచూసే దయనీయ స్థితి బేగంపేటలోని ఓ అనాథాశ్రమ చిన్నారులది.

...ఇలా వైద్యం కోసం సర్కారు ఆసుపత్రులకు వచ్చే రోగులూ, వారి సహాయకులూ, కూలీలూ, ఆటో డ్రైవర్లూ, అనాథ పిల్లల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఏడేళ్ల క్రితం మానవ సేవా సమితి ట్రస్టు ఏర్పాటైంది. సనత్‌నగర్‌లోని మోడల్‌కాలనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ట్రస్టు ఇప్పటివరకూ కొన్ని లక్షల మంది క్షుద్బాధను తీర్చింది. కాలనీ వాసులతోపాటు విదేశాల్లో స్థిరపడిన పలువురు వారి పుట్టిన రోజులూ, వివాహ వార్షికోత్సవాలూ, ఇతర శుభకార్యాల సందర్భంగా అన్నదానానికి ఆర్థిక సాయం అందిస్తుంటారు.

ఆహారంతో పాటు సామగ్రి

దూరప్రాంతాల నుంచి నిత్యం వందల మంది నగరంలోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, ఛాతీ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తుంటారు. వివిధ పరీక్షలూ, చికిత్స నిమిత్తం వారిలో చాలామంది రోజుల తరబడి అక్కడే ఉండాల్సి ఉంటుంది. రోగుల బాగోగులను ఆసుపత్రి సిబ్బంది చూసుకున్నా... వారి వెంట వచ్చే సహాయకులు అర్ధాకలితోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి. ట్రస్టు ఆధ్వర్యంలో - ప్రతి రోజూ ఇటువంటి దాదాపు 300 మందికి కడుపునిండా భోజనం పెడుతున్నారు. రోగులకు అవసరమైన దుస్తులూ, దుప్పట్లూ, గ్లాసులూ, పళ్లాలూ, కుర్చీలనూ సమకూరుస్తుంటారు. నగరంలోని పలు అనాథ శరణాలయాలూ, అంధుల పాఠశాలల్లోనూ ప్రత్యేక రోజుల్లో అన్నదానం చేస్తుంటారు. ఏటా సనత్‌నగర్‌ చుట్టుపక్కల ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పెన్నులూ, పుస్తకాలూ, బ్యాగులూ పంపిణీ చేస్తుంటారు. వరదల సమయంలో నిరాశ్రయులకు సామగ్రితోపాటు ఆహార పొట్లాలూ అందించి మేమున్నామంటూ వారికి భరోసా కల్పించిందీ ట్రస్టు. 

వేసవిలో ప్రత్యేక శిబిరం

ఏటా వేసవిలో ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలో ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తుంటారు. ఆసుపత్రుల్లో అన్నదానం నిర్వహిస్తూనే ఈ శిబిరం ద్వారా ఎండలతో విలవిల్లాడే వృద్ధులకూ, నగరానికి రాకపోకలు సాగించే వారికీ పెరుగన్నం, మజ్జిగ, అరటిపండ్లతో కూడిన ఆహార పొట్లాలు అందజేస్తుంటారు. ఇలా మార్చి నుంచి జూన్‌ వరకూ నిత్యం 500 మంది ఆకలి తీరుస్తుంటారు. 

లాక్‌డౌన్‌లోనూ కార్యక్రమాలు

లాక్‌డౌన్‌ సమయంలో పని లేక, పూట గడవక ఎంతోమంది అలమటించారు. ఆ కష్ట సమయంలోనూ మానవ సేవా సమితి ఛారిటబుల్‌ ట్రస్టు ముందుకొచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా 60 రోజుల్లో సుమారు 50వేల మందికి ఆహారంతో పాటు పేదలకు నిత్యావసరాలనూ అందించిందీ ట్రస్టు.

తయారీ బాధ్యత ‘వాసిరెడ్డి’ది... 

ట్రస్టు సభ్యులు నిత్యం పంపిణీ చేసే పదార్థాల తయారీ బాధ్యతను ‘వాసిరెడ్డి స్వీట్స్‌’ యాజమాన్యం స్వీకరించింది. దాతలు ఎవరైనా రూ.7 వేలు అందిస్తే.. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆ రోజుకి 300 నుంచి 500 మందికి సరిపడా ఆహారం సిద్ధం చేస్తుంటారు. ఏరోజైనా దాతలు లేకపోతే, ట్రస్టు నిర్వాహకులే విరాళాల నుంచి ఆ మొత్తం చెల్లించి అన్నదానం కొనసాగిస్తుంటారు. విరాళాలూ, శిబిరాల నిర్వహణా, అన్నదాన సేవలనూ సభ్యులు దండ బుచ్చిబాబు, జె.ఎస్‌.టి.శాయి, మాచారావు, శశికాంత్‌, రవీంద్రబాబు, శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. రోజులో అధిక సమయాన్ని ట్రస్టు కార్యకలాపాలకే కేటాయిస్తూ.. ‘మానవ సేవే మాధవసేవ’ అని చాటుతున్నారు వీరంతా. 

- గాదిరాజు వెంకటేష్‌, న్యూస్‌టుడే, సనత్‌నగర్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని