కష్టం వస్తే విందు ఇస్తారు!

మన దగ్గర పెళ్లికో, మరేదైనా వేడుకకో చదివింపులు చదివిస్తారు... కానీ అక్కడ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం మొదలుపెట్టాలన్నా చదివింపుల కార్యక్రమం ఉంటుంది... మనం ఏదైనా ఆర్థికసాయం కావాలంటే అప్పు చేస్తాం. లేదంటే బ్యాంకు లోన్‌ తీసుకుంటాం...

Published : 03 Apr 2022 01:13 IST

కష్టం వస్తే విందు ఇస్తారు!

మన దగ్గర పెళ్లికో, మరేదైనా వేడుకకో చదివింపులు చదివిస్తారు... కానీ అక్కడ పెళ్లి చేయాలన్నా, వ్యాపారం మొదలుపెట్టాలన్నా చదివింపుల కార్యక్రమం ఉంటుంది... మనం ఏదైనా ఆర్థికసాయం కావాలంటే అప్పు చేస్తాం. లేదంటే బ్యాంకు లోన్‌ తీసుకుంటాం... కానీ వాళ్లు డబ్బు అవసరమైతే విందు ఇస్తుంటారు... అసలేంటా చదివింపులూ? ఎందుకా విందూ?

రోనా కాస్త తగ్గడంతో తమిళనాడులోని తంజావూరు, పుదుక్కోట్టై జిల్లాల్లోని ఊళ్లలో ఇప్పుడు పండగ వాతావరణం మొదలైపోయింది. ఆహ్వాన పత్రికలు ప్రచురించడం దగ్గర్నుంచీ భోజన ఏర్పాట్ల వరకూ అన్నీ హడావుడిగా జరుగుతున్నాయి. అయితే ఇవేమీ కరోనా కారణంగా ఆలస్యమైన వేడుకలు కావండోయ్‌. కరోనా వల్ల దివాలా తీసిన వ్యాపారులూ... పంట దిగుబడి రాక డీలా పడిన రైతులూ ఇస్తున్న విందులు. ‘మొయ్‌ విరుందు’ పేరుతో తమిళనాడులోని రెండు జిల్లాల్లో ప్రజలు పాటించే ప్రత్యేకమైన సంప్రదాయం ఇది. ఈ పద్ధతితో ఇక్కడ ప్రజలెందరో తమ కష్టాల్ని తీర్చుకుంటు న్నారు. ఇదివరకు ప్రతి సంవత్సరం జులై, ఆగస్టు నెలల్లో ఈ చదివింపుల విందులు జరిగేవి. రెండేళ్లపాటు కరోనా వల్ల వీటిని ఆపేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆ సందడి మొదలైంది.

అసలేంటీ సంప్రదాయం...

మామూలుగా పెళ్లిలాంటి శుభకార్యాలకు బంధుమిత్రులు వచ్చి తోచినంత డబ్బు చదివించడం చేస్తుంటారు. వాటన్నింటినీ ఓ పుస్తకంలో రాసుకుని మళ్లీ వాళ్లింట్లో వేడుకలు జరిగినప్పుడు మనమూ తిరిగి చదివించేస్తాం కదా! ఈ మొయ్‌ విరుందు సంప్రదాయం కూడా అలాంటిదే. కానీ వీళ్లు ఆనందాన్ని పంచుకోవడానికి మాత్రమే కాదు... బాధను తీర్చుకోవడానికీ విందు ఇస్తుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, పిల్లల్ని పైచదువులు చదివించాలన్నా... ఇలా ఏ రకంగా ఆర్థిక సాయం అవసరమైనా ఈ విందును ఇస్తుంటారు. పెళ్లి పిలుపుల్లాగే తమ పేరూ, అవసరమూ, విందు వేదికా, తేదీ వివరాలతో పత్రికలు కూడా ముద్రిస్తారు. అతిథుల్ని ఆహ్వానించడానికి బ్యానర్ల నుంచీ విందుకోసం మండపాలూ, రకరకాల రుచులతో ఆహారపదార్థాల్నీ సిద్ధం చేస్తారు. ఎవరైనా సరే, వచ్చి భోజనం చేయొచ్చు. తోచినంత డబ్బు ఇవ్వొచ్చు. ఆ డబ్బు లెక్కల్ని చూడ్డానికి ప్రత్యేక సిబ్బందీ ఉంటారు. ఎవరు ఎంత ఇచ్చారో రాస్తూ మైక్‌లో ఆనౌన్స్‌మెంటూ ఇస్తుంటారు. ఈ డబ్బును తిరిగి వాళ్లు పెట్టిన ఇలాంటి చదివింపుల విందుల్లో కచ్చితంగా ముట్టచెబుతారు. ఇదంతా నమ్మకం మీదనే జరిగినా దీనికీ ఓ కచ్చితమైన పద్ధతి ఉంది. ఒకేసారి ఎక్కువ విందులు లేకుండా... ఒకరు అయిదేళ్లకోసారి మాత్రమే ఈ విందును ఏర్పాటు చేసేలా ఊరంతా కలిసి నిర్ణయాలు తీసుకుంటారు.

రూ. 500 కోట్లు!

బాలచంద్ర 2009లో ఓ మెస్‌ను పెట్టాలనుకున్నాడు. ఇరవై వేలు పెట్టి చుట్టుపక్కలవారిని ఆహ్వానిస్తూ మొయ్‌ విరుందు ఏర్పాటుచేశాడు. దాదాపు లక్షన్నర రూపాయలు వచ్చాయి. దాంతో వ్యాపారం మొదలుపెట్టాడు. మళ్లీ 2014లో వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుని చదివింపుల విందు ఇచ్చాడు. మొన్నీమధ్య తన కూతురి పెళ్లికోసమని మళ్లీ మొయ్‌ విరుందు ఏర్పాటు చేస్తే దాదాపు 36 లక్షల రూపాయలు వచ్చాయి. ఇలా ఏడాదికి వందలాది మంది ఏదో రకంగా లబ్ధి పొందుతుంటారు. మొత్తం తంజావూరు, పుదుక్కోట్టై జిల్లాల్లోని ఊళ్లలో ఏడాది పొడవునా జరిగే ఈ విందులన్నింటిలో కలిపి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకూ డబ్బు సమకూరుతుందట. ఒక్కో విందుకు కనీసం మూడు లక్షల నుంచి ఐదు కోట్ల రూపాయల వరకూ వస్తుంటాయట. ఒకవేళ విందు ఇవ్వడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఆ ఖర్చులకు ఇక్కడి బ్యాంకులు రుణాలూ ఇస్తాయి.

ఎలా మొదలైంది...

ఇంట్లో వేడుకలున్నప్పుడు మాత్రమే ఉండే చదివింపులు... డబ్బు అవసరమున్న సందర్భంలోనూ అందిస్తే ఎంతో సాయంగా ఉంటుందన్న ఉద్దేశంతో తంజావూరులోని పేరావూరణిలో 1985లో మొదలైందీ సంప్రదాయం. కష్టకాలంలో ఆదుకుంటున్న ఈ విందుకు ఆదరణ పెరిగిపోయి చుట్టుపక్కల ప్రాంతాలకూ పాకిపోయింది. మిగతా రుణాల మీద ఆధారపడకుండా ఇక్కడి ప్రజలు ఈ విందులతోనే తమ ఆర్థిక అవసరాల్ని తీర్చుకుంటున్నారు. విడివిడిగా మాత్రమే కాదు... ఖర్చులు తగ్గించుకోవడానికి పది నుంచి పదిహేను మంది కలిసి ఘనంగా చదివింపుల విందు అందించీ అతిథుల నుంచి అవసరమైన ఆర్థిక సాయాన్ని పొందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..