మసాలా కూరేద్దామా!

గుత్తొంకాయ కూర ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిందే. అలాగని దాన్ని ఎప్పుడూ ఒకేలా చేసుకోలేం కదా..

Published : 23 Jun 2024 00:01 IST

గుత్తొంకాయ కూర ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిందే. అలాగని దాన్ని ఎప్పుడూ ఒకేలా చేసుకోలేం కదా.. అందుకే ఆ గుత్తొంకాయతోపాటు మరికొన్ని కూరగాయల్లో మసాలాల్ని స్టఫ్‌ చేసి ఇలా కాస్త వెరైటీగా వండేద్దామా...


వంకాయతో...

కావలసినవి: చిన్న వంకాయలు: అరకేజీ (గుత్తి వంకాయ తరహాలో నాలుగు గాట్లు పెట్టుకుని నీళ్లల్లో వేసుకోవాలి), పల్లీలు: పావుకప్పు, ఉల్లిపాయ: ఒకటి, కారం: రెండు చెంచాలు,
దనియాలపొడి: చెంచా, గరంమసాలా:అరచెంచా, వెల్లుల్లి రెబ్బలు: ఏడు, నూనె:పావుకప్పు, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి పల్లీలను వేయించుకుని తీసుకోవాలి. వాటి వేడి చల్లారాక పొట్టుతీసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, దనియాలపొడి, కారం, గరంమసాలా, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మసాలాలో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు కూడా కలిపి కొద్దికొద్దిగా వంకాయల్లో కూరాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి వంకాయల్ని ఉంచి మూత పెట్టాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టి... మధ్యమధ్య కలుపుతూ ఉండి వంకాయలు బాగా మగ్గాక దింపేయాలి.


కాకరకాయతో...

కావలసినవి: చిన్నగా ఉండే కాకరకాయలు: పావుకేజీ, ఎండుకొబ్బరిపొడి: పావుకప్పు, ఉల్లిపాయ: ఒకటి, ఎండుమిర్చి: అయిదు, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, పుట్నాలపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, నూనె: అరకప్పు.
తయారీ విధానం: కాకరకాయల్ని కడిగి చెక్కు తీసి మధ్యకు గాట్లు పెట్టుకుని లోపలున్న గింజల్ని తీసేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి ఎండుమిర్చి, పుట్నాలపప్పు, ఎండుకొబ్బరి, వెల్లుల్లి వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద మళ్లీ కడాయిని  పెట్టి రెండు చెంచాల నూనె వేసి ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించుకుని అందులో చేసిపెట్టుకున్న పొడి, తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూరి.. వీటిని మిగిలిన నూనెలో ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.  


భర్వా భిండీ

కావలసినవి: బెండకాయలు: పాతిక, పల్లీలు: రెండు టేబుల్‌స్పూన్లు, సోంపు: చెంచా, జీలకర్ర: చెంచా, దనియాలు: రెండు చెంచాలు, నువ్వులు: రెండు టేబుల్‌స్పూన్లు, కారం: టేబుల్‌స్పూను, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, వెల్లుల్లి రెబ్బలు: మూడు, సెనగపిండి: మూడు టేబుల్‌స్పూన్లు (రెండు నిమిషాలు వేయించుకోవాలి), నూనె: పావుకప్పు.
తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి పల్లీల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో నువ్వులు, అరచెంచా జీలకర్ర, దనియాలు వేయించుకుని విడిగా పెట్టుకోవాలి. పది నిమిషాలయ్యాక పల్లీలు, నువ్వుల మిశ్రమం, సోంపు, కారం, పసుపు, తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, సెనగపిండి మిక్సీలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయల అంచుల్ని తీసేసి.. మధ్యకు గాట్లు పెట్టుకోవాలి. వీటిల్లో మసాలాను చెంచా చొప్పున కూరాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి మిగిలిన జీలకర్రను వేయించి బెండకాయల్ని ఉంచి మూత పెట్టాలి. బెండకాయలు బాగా మగ్గి ఎర్రగా వేగుతున్నప్పుడు స్టవ్‌ని కట్టేస్తే సరి.


పొట్లకాయతో...

కావలసినవి:  స్టఫింగ్‌కు వీలుగా పెద్దగా కోసిన పొట్లకాయ ముక్కలు: ఎనిమిది, ఉల్లిపాయలు: రెండు, అల్లం: చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు: పది, దనియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, మిరియాలు: అరచెంచా, పసుపు: అరచెంచా, కారం: చెంచా, గరంమసాలా: పావుచెంచా, ఉప్పు: తగినంత, ఆమ్‌చూర్‌పొడి: పావుచెంచా, నూనె: పావుకప్పు.
తయారీ విధానం: ముందుగా మిక్సీలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, దనియాలు, మిరియాలు, ఒక ఉల్లిపాయ తరుగు, పసుపు, కారం, సరిపడా ఉప్పు, గరంమసాలా, ఆమ్‌చూర్‌ పొడి వేసుకుని మెత్తగా చేసుకుని ఈ మిశ్రమాన్ని పొట్లకాయల్లో కూరాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి మరో ఉల్లిపాయని సన్నగా కోసి వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగాక పొట్లకాయముక్కల్ని ఉంచి స్టవ్‌ని సిమ్‌లో పెట్టాలి. మధ్యమధ్య వేయిస్తూ... పొట్లకాయ ముక్కలు మెత్తగా అయ్యాక దింపేయాలి. ఈ కూర అన్నంలోకే కాదు, చపాతీల్లోకీ బాగుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..