Updated : 20 Jun 2021 08:23 IST

Organic Acer: సేంద్రియ పంటలతో... ఏటా మూడున్నర కోట్లు!

వ్యవసాయం అంటే అప్పులూ నష్టాలూ అనుకునే రోజులివి. గట్టిగా వర్షం వచ్చినా అసలు రాకున్నా కూడా రైతుకి మిగిలేవి కన్నీళ్లే. ఒకవేళ సకాలంలో వర్షాలు కురిసి, పంట బాగా పండి, ధర బాగా పలికినప్పుడూ లాభం లక్షల రూపాయలు దాటదు. కానీ దిల్లీకి చెందిన ఇద్దరు యువకులు తమదైన పద్ధతిలో సాగు చేస్తూ ఏటా మూడున్నర కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అదెలానో చూద్దామా..!

మృణాల్‌, లక్షయ్‌ డబాస్‌... ఇద్దరూ అన్నదమ్ములు. ఒకరు ఇంజినీరయితే, మరొకరు పర్యావరణ శాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. దిల్లీలోని జై ఖర్‌ వాసులైన వీళ్లకి 28 ఎకరాల పొలం ఉంది. దాన్నే తమ ప్రయోగాలకు వేదికగా మలచుకున్నారు. నిజానికి వీళ్ల కుటుంబానికి తమ ఆహారాన్ని తామే పండించుకునే అలవాటు ఉంది. అయితే ఇరవయ్యేళ క్రితం మృణాల్‌ నాయనమ్మకు వచ్చిన క్యాన్సర్‌, వాళ్లను సేంద్రియ బాట పట్టించింది. దానివల్ల క్యాన్సర్‌ ఉన్నప్పటికీ కీమోథెరపీ అవసరం లేకుండా హాయిగా జీవించిందామె. ఆ విషయాన్ని గ్రహించిన మృణాల్‌, లక్షయ్‌... ఇద్దరూ కుటుంబ అవసరాలకే కాకుండా వాణిజ్యపరంగానూ పండించాలనుకున్నారు. కూరగాయలూపండ్లతోపాటు తృణ, చిరు, పప్పుధాన్యాలూ... ఇలా అన్నింటినీ సాగుచేసి, ‘ఆర్గానిక్‌ ఎకరా’ పేరుతో అమ్మడం ప్రారంభించారు. 

ఎలా చేస్తున్నారు?
సాధారణంగా రైతులు కూరగాయలైనా ధాన్యమైనా ఒకేసారి కోతకు వచ్చేలా పంటలు వేస్తారు. దాంతో మార్కెట్లో సరైన ధర లేకపోతే నష్టం వస్తుంది. పైగా ఒకే పంట వేస్తుంటారు. కానీ ఈ అన్నదమ్ములు అలా చేయలేదు. ఏ కాలంలో పండే కూరగాయల్ని ఆ కాలంలో వేసేలా ఓ చక్కని ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. పంట వేసేటప్పుడు కూడా బ్యాచ్‌లవారీగా పదిహేను రోజుల వ్యవధి ఉండేలా వేస్తారట. దాంతో పంట అంతా ఒకేసారి రాకుండా దశలవారీగా వస్తుంటుంది. ఇలా ఏడాది పొడవునా రకరకాల పంటలు పండిస్తారు. అదేసమయంలో నేల సారం తగ్గకుండా పంటల్ని మారుస్తుంటారు. బఠాణీ, అలసందల్లాంటివి నేలలో నైట్రోజన్‌ని విడుదల చేస్తే, మొక్కజొన్న దాన్ని ఎక్కువగా గ్రహిస్తుంది. కాబట్టి ఆ రెండింటినీ ఒకే పొలంలో ఒకదాని తరవాత ఒకటి వేస్తారన్నమాట. దిగుబడికోసం వాడే ఎరువులూ పురుగుమందులూ అన్నీ సేంద్రియ పద్ధతిలో తయారైనవే.

నువ్వులు, గోధుమలు, వరి... ఇలా తాము సాగుచేసిన వాటికోసం పొలంలోనే మిల్లునీ ఏర్పాటుచేసుకోవడంతో వాటిని అక్కడే పట్టించి మార్కెట్‌కి వేస్తుంటారు. దానివల్ల ఆ పొట్టూ, తెలగపిండీ... వంటివన్నీ ఆవులకీ గేదెలకీ మేతలా ఉపయోగపడుతున్నాయి. అక్కడే తేనెటీగల పెంపకాన్నీ చేపట్టారు. కాబట్టి పాలు, నెయ్యి, తేనె... వంటివన్నీ సేంద్రియ జాబితాలోకి చేరిపోయాయి. దళారీలూ షాపులతో పనిలేకుండా తమ ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌ ద్వారా ఇళ్లకే పంపిస్తున్నారు. ఆ విధంగా కోసిన పన్నెండు గంటల్లోనే దిల్లీలోని ఐదు వేల కుటుంబాలకు ఆర్గానిక్‌ కూరగాయలు చేరుతున్నాయట. దాంతో ఒక్క కూరగాయల నుంచే నెలకు నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తుందట.
అక్కడితో సంతృప్తి చెందలేదు ఈ సోదర ద్వయం. నగర జీవితంతో విసిగిపోయిన వాళ్లకోసం అగ్రో టూరిజం పేరుతో పొలంలోకి ఆహ్వానించి తమ పంటల్ని చూపించడంతోపాటు వాటిని అక్కడే వండిపెడుతుంటారు. ఆ విధంగానూ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దాంతోపాటు వర్క్‌షాపుల్నీ నిర్వహిస్తూ సంప్రదాయ రైతులకీ తమ వ్యవసాయ పద్ధతుల్ని నేర్పించడంతో ఇప్పటికి 450 మంది రైతులు వీళ్ల దగ్గర శిక్షణ పొంది ఆర్గానిక్‌ బాట పట్టారట. వ్యవసాయ విద్యార్థులకి తమ పొలంలో ఇంటర్న్‌షిప్‌ చేసుకునే వీలునీ కల్పించారు. కొందరు రైతులు సేంద్రియసాగులో పండించినా వాటిని ఎలా అమ్మాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వాళ్లకి అమ్ముకునేందుకు సహకరించడం, లేదంటే వాళ్ల దగ్గరి నుంచి కొని, అమ్మడం చేస్తున్నారు. ఇలా వ్యవసాయాన్నే వ్యాపారంగానూ మలచుకున్నారు కాబట్టే ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలుగుతున్నారు మరి!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని