వేసవి విడిదుల్లో... కొండాకోనల్లో..!

నిన్నమొన్నటివరకూ కరోనాతో స్కూళ్లూ, కాలేజీలే లేవు. ఇక టూర్లకు అవకాశమెక్కడ... ఇప్పుడిప్పుడు మెల్లగా అన్నీ మొదలవడంతో ఇంటికే పరిమితమైన వాళ్లందరికీ కొత్తగా రెక్కలొచ్చినట్లే ఉంది. కాబట్టి హాయిగా ఓ వారం రోజులపాటు పచ్చని ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఏ హిల్‌ స్టేషన్‌కో వెళ్లి రావాలని

Updated : 01 May 2022 06:07 IST

వేసవి విడిదుల్లో... కొండాకోనల్లో..!

నిన్నమొన్నటివరకూ కరోనాతో స్కూళ్లూ, కాలేజీలే లేవు. ఇక టూర్లకు అవకాశమెక్కడ... ఇప్పుడిప్పుడు మెల్లగా అన్నీ మొదలవడంతో ఇంటికే పరిమితమైన వాళ్లందరికీ కొత్తగా రెక్కలొచ్చినట్లే ఉంది. కాబట్టి హాయిగా ఓ వారం రోజులపాటు పచ్చని ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఏ హిల్‌ స్టేషన్‌కో వెళ్లి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఏ డార్జిలింగ్‌కో నైనిటాల్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. వాటిని మరిపించే చల్లని కొండ ప్రదేశాలు దక్షిణాదినా ఉన్నాయి. వాటిల్లో కొన్ని...


ఆంధ్రా కశ్మీర్‌!

తెలుగు రాష్ట్రాల్లో మండు వేసవిలోనూ చల్లని ప్రదేశం అనగానే గుర్తొచ్చేవి లంబసింగి, అరకులోయలే. పచ్చని పట్టుతివాచీ పరిచినట్లున్న లోయలూ పాలకడలిని తలపించే మంచుమేఘాలూ పసిడిరంగులో మెరిసే పచ్చని కొండలూ చిక్కని హరిత అరణ్యాలూ... ఇలా ప్రకృతి అందాలన్నింటినీ ఆస్వాదిస్తూ చల్లచల్లగా గడిపేయాలంటే విశాఖకి వంద కిలోమీటర్ల దూరంలోని లంబసింగికి ప్రయాణం కట్టాల్సిందే. ఆంధ్రా కశ్మీర్‌గా పిలుచుకునే లంబసింగి బస చేసి చుట్టుపక్కల ఉన్న పాడేరు అందాల్నీ వంజంగి కొండల్లో వర్ణరంజితంగా కనిపించే సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాల్నీ చింతపల్లి, కొత్తపల్లి జలపాతాల్నీ ధారకొండ వాటర్‌ఫాల్స్‌నీ కూడా చూడొచ్చు. విశాఖ నుంచి లంబసింగికి ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తూ దారిలోని కాఫీ తోటలూ బోడగుండమ్మ గుడీ దానికి దిగువన ఉన్న జలపాత అందాల్నీ చూసుకుంటూ వెళ్లొచ్చు. రాక్‌ క్లైంబింగ్‌, రాపెల్లింగ్‌, ట్రెక్కింగ్‌... వంటి సాహసక్రీడలూ ఉన్నాయి. తాజంగి రిజర్వాయర్‌ వద్ద తాజాగా బోట్‌ షికారునీ ఏర్పాటుచేసింది పర్యటక శాఖ. రిసార్టుల్నీ నిర్మించడంతో పర్యటకుల పాలిట ఈ కొండగ్రామం స్వర్గధామంగా మారింది. విశాఖపట్టణం, చింతపల్లి, నర్సీపట్టణాల నుంచి లంబసింగికి రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. ఇంకా, అరకులోయ, మదనపల్లె సమీపంలోని హార్స్‌లీ హిల్స్‌, తిరుపతి దగ్గరలోని స్వామిమలై, చిత్తూరు జిల్లాలోని నాగులాపురం, వికారాబాద్‌ దగ్గరున్న అనంతగిరి... అన్నీ చల్లని విడిది కేంద్రాలే.


మూడు నదుల సంగమం... మున్నార్‌! 

గాడ్స్‌ ఓన్‌ కంట్రీగా పేరొందిన కేరళలో కొబ్బరితోటలూ బ్యాక్‌వాటర్స్‌తోపాటు కొండకోనలతో అలరారే మున్నార్‌ని ఒక్కసారయినా చూడకపోతే జీవితం వృథా అనే టూరిస్టులు భావిస్తారు. ఎత్తైన కొండలూ మబ్బుల్లో విహారాలూ పచ్చని తేయాకు తోటలూ తెల్లని జలపాతాలూ ఎటుచూసినా ప్రకృతి అందాలతో అలరారే పశ్చిమకనుమల అందాలను తనివితీరా ఆస్వాదించాలంటే ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌ను సందర్శించాల్సిందే. అప్పట్లో దక్షిణ భారతంలో బ్రిటిషర్ల వేసవి విడిది ఇదేనట. ముతిరపుళా, నల్లతన్ని, కుండల అనే మూడు నదులు సంగమించే ప్రదేశమే మున్నార్‌. సముద్ర మట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం అతిపెద్ద తేయాకు తోటలకు ప్రసిద్ధి. పశ్చిమకనుమల్లోకెల్లా ఎత్తయిన శిఖరమైన అనముడి ఇక్కడే ఉంది. దేశంలోకెల్లా ఎత్తైన ఇడుక్కి ఆర్చ్‌ డ్యామ్‌ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఎత్తయిన కొండల మధ్యలో ఉన్న మట్టుపెట్టి డ్యామ్‌ అందాలూ కొండలమీద పచ్చని తివాచీలు పరిచినట్లున్న తేయాకు తోటలూ వాటి చెంతనే ఆకాశాన్ని ముద్దాడే యూకలిప్టస్‌ వృక్షాలూ కళ్లు తిప్పుకోనీయవు. కొచ్చి, ఎర్నాకుళంల నుంచి రైల్లో లేదా రోడ్డుమార్గానా మున్నార్‌కి చేరుకోవచ్చు.


జలపాతాల విందు!

చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ పచ్చని అందాల్ని కళ్లు విప్పార్చుకుని చూస్తూ విహరించే భూతలస్వర్గమే చిక్‌మగళూరు. చిక్‌మగళూరు అంటే...చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన రుక్మాంగద తన చిన్నకూతురుకు ఆ ఊరిని కట్నంగా ఇవ్వడంవల్ల ఆ పేరు వచ్చిందట. పెద్ద కూతురుకి ఇచ్చిన హిరేమగళూరు కూడా ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. హిరే అంటే పెద్ద అని అర్థం. దేశంలో తొలిసారిగా కాఫీ తోటల్ని వేసిన ప్రదేశం చిక్‌మగళూరే. పశ్చిమకనుమల్లో ఈ ప్రదేశం తుంగ, భద్ర నదులకు పుట్టిల్లు. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ముల్లాయనగిరి పర్వత శ్రేణులూ, కెమ్మనగుండి, కుద్రేముఖ్‌, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలూ, కుద్రేముఖ్‌ జాతీయ వనం, భద్ర అభయారణ్యాలతో నిండిన ఆ కొండ అందాల్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు అంటుంటారు సందర్శకులు. కెమ్మనగుండి ప్రాంతం పూలతోటలతో రమణీయంగా ఉంటుంది. శోలగడ్డి నేలలూ గులాబీతోటలూ కళ్లు తిప్పుకోనీయవు. గుర్రం ముఖం ఆకారంలో ఉన్న కుద్రేముఖ్‌ పర్వతశ్రేణులూ, జాతీయ ఉద్యానవనం ఆకట్టుకుంటాయి. సీతలయనగిరికి వెళ్లే మార్గంలోని శివాలయంలో లింగం నిత్యం నీటిలోనే ఉంటుంది. ఝరి, హెబ్బే, శాంతి, కదంబి, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు, శృంగేరిలోని శారదాపీఠం... ఇలా ఎన్నో ప్రదేశాల్ని చూసి రావచ్చు. బెంగళూరు, మంగళూరు, కాదూరుల నుంచి రోడ్డుమార్గంలో వెళ్లొచ్చు.


కున్నూరులో కుహూ కుహూ!

నీలగిరి పర్వతాల నడుమ సముద్రమట్టానికి సుమారు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న కొండ ప్రాంతమే తమిళనాడులోని కున్నూరు. మెట్టుపాళ్యం నుంచి ఊటీ మధ్యనడిచే టాయ్‌ ట్రైన్‌ కున్నూరు మీదుగా వెళుతుంది. ఆ ప్రయాణం డార్జిలింగ్‌ మినీ రైలుని గుర్తుతెస్తూ మరోలోకంలో విహరింపచేస్తుంది. లోయలూ పర్వతాలూ చీకటి సొరంగాలూ తేయాకు ఎస్టేట్లూ ...ఇలా దారి పొడవునా ఎన్నో అందాలు కనువిందు చేస్తాయి. భిన్న పక్షి, జంతు జాతులూ చెట్లతో టోడా తెగ జాతి ప్రజలకు ఆవాసంగా ఉన్న ఈ ప్రదేశాన్ని గ్రీన్‌ వ్యాలీ అనీ అంటారు. జపనీస్‌ శైలిలో నిర్మించిన ఇక్కడి సిమ్స్‌ బొటానికల్‌ గార్డెన్‌లో వెయ్యికి పైగా మొక్కల జాతులు ఉన్నాయట. ఇక్కడ ఉన్న అందమైన సరస్సుతోపాటు వందల ఏళ్ల నాటి చెట్లూ చల్లగా పలకరిస్తాయి. కున్నూరులో సేదతీరుతూ సమీపంలోని దూర్గ్‌ ఫోర్ట్‌, కటారి ఫాల్స్‌, సెయింట్‌ జార్జ్‌ చర్చి, డాల్ఫిన్స్‌ నోస్‌ వంటివన్నీ చుట్టి రావచ్చు. డ్రూగ్‌ కోటకి పౌరాణిక, చారిత్రక విశిష్టత ఉంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంత రక్షణకోసం టిప్పు సుల్తాన్‌ అవుట్‌పోస్టు మాదిరిగా ఈ కోటను కట్టించాడట. క్యాథరీన్‌ ఫాల్స్‌, అందమైన అమ్మాయి నిద్రపోతున్నట్లున్న స్లీపింగ్‌ లేడీ వ్యూ, రోజ్‌ గార్డెన్‌, దొడ్డబెట్ట శిఖరం, థండర్‌ వరల్డ్‌... ఇలా కున్నూరులో చూడదగ్గ ప్రదేశాలెన్నో. దేశంలో రెండో అతి పెద్ద నివాసిత లోయ అయిన కెట్టి వ్యాలీ ఇక్కడే ఉంది. దీనికే హిడెన్‌ వ్యాలీ అనీ ‘స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ అనీ పేరు. టోడా, బడగా... అనే స్థానిక తెగలు ఇక్కడ ధాన్యం, పండ్లు, కూరగాయలు పండించుకుంటూ జీవిస్తారు. శివాలయానికీ జలపాతాలకీ ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ట్రెక్కింగ్‌కి వెళ్లేవాళ్లకు ఇది అనుకూలమైన ప్రదేశం. కోయంబత్తూరు నుంచి మెట్టుపాళ్యంకు వెళ్లి అక్కడి నుంచి రైలులో కున్నూరుకు వెళ్లవచ్చు.


ఏర్కాడ్‌... అందాలకు మరోపేరు!

తమిళనాడులోని తూర్పుకనుమల్లో ఉన్న సర్వరాయ కొండల్లో సముద్రమట్టానికి సుమారు ఐదువేల అడుగుల ఎత్తులో ఉంటుందీ ఏర్కాడ్‌. దట్టమైన అడవిలో యూ ఆకారంలోని వంపుల్లో ప్రయాణిస్తూ వెళ్లడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కాఫీ, నారింజ, పనస, జామ, యాలకులు, మిరియాల తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో అభయారణ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్న పెద్ద సరస్సులో షికారు చేసేందుకు రకరకాల బోట్లు ఉంటాయి. ట్రెక్కింగ్‌ చేసేవాళ్లకీ ఈ ప్రాంతం అనుకూలమే. మే నెలలో వెళితే పడవల పోటీలూ, పూల ప్రదర్శన, డాగ్‌ షో, ఏర్కాడ్‌ ఉత్సవాలూ ఉంటాయి. ఇక్కడి కొండల్లో రాళ్లతో సహజంగా ఏర్పడిన లేడీస్‌, జెంట్స్‌, చిల్డ్రన్‌, ఆర్థర్‌ సీట్స్‌... వంటి వ్యూ పాయింట్స్‌లో కూర్చుని చుట్టూ కనిపించే పచ్చని అడవుల్నీ ప్రకృతి అందాలనీ చూస్తుంటే సమయమే తెలియదు. మెట్టూరు డ్యామ్‌, కావేరీ నదీ అందాలు, ఇతర ప్రదేశాల్ని దగ్గరగా చూసేందుకు టెలీస్కోపు కూడా ఉంది. ఇక్కడి ఓ గుహలో కావేరీ అమ్మవారి సహిత సర్వరాయని గుడి ఉంది. ఈ ప్రాంతంలోని ఎలుగుబంటి గుహ నుంచి ఉన్న సొరంగం కర్ణాటకలో బయటపడుతుందట. శత్రువుల నుంచి తప్పించుకున్న టిప్పుసుల్తాన్‌ ఈ గుహలోనే తలదాచుకున్నాడనీ అంటారు.అన్నాపార్క్‌, కిలియూర్‌ జలపాతం... ఇలా మరెన్నో ప్రదేశాలు ఆకర్షిస్తుంటాయి. పన్నెండేళ్లకోసారి విరిసే కురింజి పూల అందాలకీ, 30 రకాల అరుదైన ఆర్కిడ్‌ పూలకీ ఈ ప్రదేశం పెట్టింది పేరు. ఎమరాల్డ్‌ లేక్‌లో పడవవిహారం సందర్శకుల్ని మైమరిపించడం ఖాయం. సేలం నుంచి రోడ్డుమార్గంలో ఏర్కాడ్‌కు చేరుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..