Updated : 24 Nov 2022 12:39 IST

ఆటో స్కూటీ బస్సూ  కారూ.. అన్నీ కరెంటుతోనే!

సెకనుకు నాలుగు స్కూటర్లు... రెండు రోజుల్లో 1100 కోట్లు విలువ చేసే అమ్మకాలు... ఎందుకిలా వేలంవెర్రిగా కొనేశారు... చౌకగా ఉన్నాయా అంటే, తక్కువలో తక్కువ ఒక్క స్కూటరే లక్ష పలుకుతోంది. ఇంకో లక్ష పెడితే సెకండ్‌ హ్యాండ్‌ కారే వస్తుంది. అయినా అంత మంది ఈ స్కూటర్లను ఎందుకు కొన్నారూ అంటే అవి ‘ఈ- స్కూటర్లు’ కాబట్టి. అంటే బ్యాటరీతో నడుస్తాయి. ఒక్క స్కూటర్లే కాదు, బైక్‌లూ, ఆటోలూ, కార్లూ.. ఇక భవిష్యత్తంతా విద్యుత్తు వాహనాలదేనట! హఠాత్తుగా వీటికి ఇంత క్రేజ్‌ రావడం వెనుక ఉన్న కథాకమామిషు ఏమిటో చూద్దాం.  

ఓ పదిహేనూ ఇరవయ్యేళ్ల క్రితం హైదరాబాద్‌, బెంగళూరు లాంటి నగరాల్లో నానో కన్నా చిన్న కారు ఒకటి అప్పుడప్పుడు రోడ్లమీద కనిపించేది. ఏమాత్రం శబ్దం లేకుండా బొమ్మలా అది వెళ్తుంటే అందరి దృష్టీ ఒకసారి దాని మీదికి మళ్లేది. ఆ కార్ల యజమానులకు పెట్రోలు బంకులతో పని ఉండేది కాదు. ఇళ్ల దగ్గరే కారు బ్యాటరీ ఛార్జింగ్‌ చేసుకునేవారు. ‘రేవా’ అనే ఆ విద్యుత్తు కారుని తయారుచేసింది బెంగళూరుకు చెందిన చేతన్‌ మైనీ. రేవా ఎలక్ట్రిక్‌ కార్‌ కంపెనీ పెట్టి పదేళ్లలో పాతికకు పైగా దేశాల్లో 4,600 వాహనాలను అమ్మాడు చేతన్‌. ప్రపంచంలోని గొప్ప సృజనాత్మకమైన 50 కంపెనీల్లో ఒకటిగా ఆ కంపెనీ పేరు తెచ్చుకుంది. విద్యార్థిగా ఉన్నప్పుడే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ఆసక్తి పెరిగింది చేతన్‌కి. మిషిగాన్‌లో డిగ్రీ చదువుతూ ‘సోలార్‌ కార్‌’ తయారీ పోటీలో పాల్గొని గెలిచాడు. స్టాన్‌ఫర్డ్‌లో ఉన్నత విద్య ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చి తన పరిశోధన కొనసాగించాడు. అందరికీ అందుబాటు ధరలో విద్యుత్తు కారు తయారు చేయాలన్న తన కలని ‘రేవా’తో నిజం చేసుకున్నాడు. ఎలక్ట్రిక్‌ కార్‌ అనగానే ఇప్పుడు మనకు గుర్తొచ్చే టెస్లా కన్నా ముందే రేవా మార్కెట్లోకి వచ్చినా అది నిలబడలేకపోవడానికి కారణం... అప్పటికి మన మార్కెట్‌కి గానీ ప్రజలకు గానీ విద్యుత్‌ వాహనాల పట్ల అవగాహన లేకపోవడమే. దాంతో ఎలాంటి ప్రోత్సాహమూ లభించక కంపెనీని మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థలో విలీనం చేశాడు చేతన్‌. అయితే భవిష్యత్తు అంతా విద్యుత్తు వాహనాలదేనన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. మహీంద్రా సంస్థకి చెందిన విద్యుత్తు వాహనాల తయారీలో కీలక పాత్ర పోషించాడు చేతన్‌. అలా ఒక్కడి కృషితో శ్రీకారం చుట్టుకున్న భారతీయ విద్యుత్తు వాహనాల రంగం దాదాపు దశాబ్దం తర్వాత ఇప్పుడు మళ్లీ ఫుల్‌ జోష్‌తో రయ్యిన ముందుకు దూసుకుపోతోంది.


అన్నీ లాభాలే!

పెట్రోలు ధర లీటరు వంద దాటింది. అది ఇంకా ఇంకా పెరగడమే కానీ తగ్గే దారి కనబడడం లేదు. అటువంటప్పుడు పెట్రోలుతో పనిలేని వాహనముంటే లాభమేగా! ఒక రకంగా కాదు, విద్యుత్‌ వాహనాల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
* పెట్రోలుతో నడిచే వాహనానికీ విద్యుత్తుతో నడిచే వాహనానికీ వాడే ఇంజిన్లు వేర్వేరుగా ఉంటాయి. పెట్రోలు/డీజిల్‌ ఇంజిన్ల కన్నా విద్యుత్తుతో పనిచేసే ఇంజిన్‌ మేలైనది. విద్యుత్‌ వాహనంలో క్లచ్‌, గేర్‌బాక్స్‌, ఎగ్జాస్ట్‌ పైప్‌... లాంటివేవీ ఉండవు. తక్కువ విడిభాగాలు ఉంటాయి కాబట్టి మరమ్మతులు, నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. వాహనాల ధర కూడా కొత్తలో ఎక్కువున్నా రాను రాను తగ్గుతుంది.
* ప్రస్తుతం ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో సగానికి పైగా మనవే. ఆ కాలుష్యానికి ప్రధాన కారణం పెట్రోలు, డీజిళ్లతో నడిచే వాహనాలే. ద ఎనర్జీ అండ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌(తెరి) అధ్యయనం ప్రకారం చమురుతో నడిచే ఆటోల వల్ల బెంగళూరులో రోజుకు 1224 టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌, 4 టన్నుల నైట్రోజన్‌ ఆక్సైడ్‌ విడుదలవుతున్నాయట. అటువంటప్పుడు కార్లూ బైకులతో సహా అన్నీ విద్యుత్తు వాహనాలు ఉపయోగిస్తే మొత్తంగా వాయు కాలుష్యమే కాదు ధ్వని కాలుష్యమూ తగ్గిపోతుంది.
* భూతాపం పెరగకుండా చూడడానికి ప్రపంచదేశాలన్నీ కలిసి చేసుకున్న పారిస్‌ ఒప్పందంపైన మనదేశమూ సంతకం చేసింది. 2005 నాటికి కర్బనవాయువుల(గ్రీన్‌హౌస్‌ ఎమిషన్స్‌) విడుదల ఏ స్థాయిలో ఉందో దాంట్లో మూడో వంతుని అర్జెంటుగా తగ్గించాలన్నది ఆ ఒప్పందం. అందుకు మన ముందున్న సులువైన పరిష్కారం విద్యుత్తు వాహనాల వాడకమే.
* పెట్రోలు వాడకం తగ్గితే చమురు దిగుమతి భారమూ తగ్గుతుంది. దిగుమతులు సగం తగ్గినా దేశ ఖజానాకి ఏటా 1.2 లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయని అంచనా.
* పెరిగే విద్యుత్తు డిమాండ్‌ని తట్టుకోవడానికి ‘క్లీన్‌ ఎనర్జీ’ తయారీ పెరుగుతుంది. పునరుత్పాదక వనరులైన పవన, సౌర శక్తిని ఉపయోగించుకుని తయారుచేసిన విద్యుత్తును ‘క్లీన్‌ ఎనర్జీ’ అంటారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు.


అండా దండా ప్రభుత్వమే!

పెట్రోలుతో నడిచే వాహనాలను ఎంతో కాలంగా వాడుతున్నాం. విద్యుత్తు వాహనాలతో పోలిస్తే అవి చౌక కూడా. అటువంటప్పుడు హఠాత్తుగా అందరూ విద్యుత్తు వాహనాలే వాడాలీ అంటే ప్రజలకే కాదు, వాహనాలు తయారుచేసే కంపెనీలకీ కష్టమే. అందుకని ప్రభుత్వమే ప్రోత్సాహకాలు ఇస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2019లో పదివేలకోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ప్రకటించినా ఫలితం లేకపోయింది. 5లక్షల ఆటోలు అమ్మాలనుకుంటే 19,064 మాత్రమే అమ్ముడయ్యాయి. పది లక్షల ద్విచక్రవాహనాలు లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 74,634 అమ్ముడయ్యాయి. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో మొత్తంగా మార్కెట్లో జోష్‌ వచ్చింది.

విద్యుత్తు వాహనాలూ, వాటి విడిభాగాల ఉత్పత్తిని పెంచేందుకుగాను తాజాగా 26 వేలకోట్ల రూపాయల్ని తయారీ రంగానికి ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా వాహనాల తయారీదారులు 40 శాతం స్థానికంగా తయారైన విడిభాగాలనే ఉపయోగించాలి. ఈ ప్రోత్సాహకాలతో విద్యుత్‌ వాహనాల తయారీ ఊపందుకుంటే- వాటికి విదేశీ పెట్టుబడులూ పెరుగుతాయి, బ్యాటరీల తయారీ నుంచి ఛార్జింగ్‌స్టేషన్ల వరకూ అనుబంధ పరిశ్రమలెన్నో వస్తాయి కాబట్టి యువతకు ఏడున్నర లక్షల కొత్త ఉద్యోగాలూ లభిస్తాయని అంచనా.

సంస్థలకు సరే, మరి వినియోగదారులకేమిటీ లాభం అంటే- వారికీ ధరలో సబ్సిడీ లభిస్తుంది. మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న మనదేశంలో కార్లకన్నా ద్విచక్రవాహనాల వాడకమే ఎక్కువ. గతేడాది 22 లక్షల కార్లు అమ్ముడుపోతే 2 కోట్ల 16 లక్షల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోయాయి. ఇది దృష్టిలో పెట్టుకుని సబ్సిడీల విషయంలోనూ వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను బట్టి ద్విచక్రవాహనాలకు 5000 నుంచి వాహనం ధరలో 40 శాతం దాకా, ఇతర వాహనాలకు పదివేలనుంచి 1.5లక్షల దాకా ప్రోత్సాహకాలు లభిస్తాయి. దిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్రలాంటి రాష్ట్రాలు ధరలో సబ్సిడీ ఇస్తోంటే తెలంగాణ, ఏపీ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజులను మినహాయిస్తున్నాయి.

ప్రస్తుతానికి పది లక్షల ద్విచక్రవాహనాలకీ, 5 లక్షల ఆటో రిక్షాలకీ, 7 వేల బస్సులకీ సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యక్తిగత కార్లకు కాకుండా ట్యాక్సీలుగా ఉపయోగించే 55 వేల కార్లకు సబ్సిడీ లభిస్తుంది. కొన్ని కంపెనీలు పెట్రోలుతో నడిచే పాత వాహనాలను ఇచ్చి కొత్త విద్యుత్‌ వాహనాలను తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.  


విద్యుత్‌ వాహనాల రాజధాని... దిల్లీ

దిల్లీలో ఆన్‌లైన్‌ స్టోర్‌ బిగ్‌బాస్కెట్‌కి సరుకులు చేరవేసే డెలివరీ వ్యాన్‌ని నడుపుతుంటాడు సౌరభ్‌. ఏమాత్రం శబ్దం లేకుండా నడిచే తన వ్యాన్‌ని కొత్తలో అందరూ పరిశీలనగా చూస్తుంటే గర్వంగా ఉండేదట. మొదట్లో తాను మామూలు ఆటో నడిపేవాడిననీ ఇప్పుడు విద్యుత్తు వాహనాన్ని నడపడంతో రెండిటికీ తేడా తెలిసిందంటాడు. ఈమధ్యే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ కూడా ఇలాంటి వాహనాలే వాడడం మొదలెట్టాయనీ అసలే కాలుష్యంతో సతమతమయ్యే దిల్లీలో ఈ-వాహనాలు పెరగడం సంతోషంగా ఉందనీ చెబుతాడు సౌరభ్‌. అతడిలాంటి వాళ్లు ఇప్పుడు దిల్లీలో కొన్ని వందలమంది ఉన్నారు. అక్కడ మూడేళ్ల క్రితమే 500 ఈ-రిక్షాలను ప్రారంభించారు. గతేడాదే ప్రజారవాణాకు వెయ్యి ఏసీ బస్సుల్ని కేటాయించారు. దిల్లీని విద్యుత్తు వాహనాల రాజధానిని చేసే లక్ష్యంతో ఉంది అక్కడి ప్రభుత్వం. ఐఐటీ కాన్పూర్‌ వారి అధ్యయనం ప్రకారం నగరంలో కాలుష్యానికి రెండో ప్రధాన కారణం వాహనాలు. అందుకని వచ్చే ఐదేళ్లలో రోడ్డుమీద తిరిగే వాహనాల్లో కనీసం ఐదు లక్షలు విద్యుత్తు వాహనాలే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అన్ని వాహనాలు రోడ్డుమీద తిరగడం మొదలుపెడితే వాటి జీవితకాలంలో ఆరువేల కోట్ల రూపాయల చమురు దిగుమతుల్ని తగ్గిస్తాయి. 48 లక్షల టన్నుల కార్బన్‌ డైఆక్సైడ్‌నీ, 159 టన్నుల పీఎం2.5 కాలుష్యాన్నీ(సైలెన్సర్‌ల నుంచి వెలువడుతుంది) అడ్డుకుంటాయి. అందుకే దిల్లీ ప్రభుత్వం వాహనాల సామర్థ్యాన్ని బట్టి వేర్వేరు కేటగిరీల్లో సబ్సిడీలను ప్రకటించింది. విద్యుత్‌ వాహనం కొన్నందుకూ, పెట్రోలు వాహనాన్ని తీసేసినందుకూ కూడా సబ్సిడీ ఇస్తోంది. ప్రతి మూడు కిలోమీటర్లకీ ఒక ఛార్జింగ్‌ స్టేషన్‌ని ఏర్పాటుచేయనుంది. ఇళ్ల దగ్గర పార్కింగ్‌ స్థలాల్లో ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసేలా కొత్తగా భవన నిర్మాణ నియమాల్లోనూ మార్పులు తెచ్చింది.


ఆదర్శం... ఈ చర్యలు!

విద్యుత్‌ వాహనాల వాడకాన్ని పెంచడానికే కాక మరోపక్క క్లీన్‌ ఎనర్జీ తయారీకీ ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. విద్యుత్‌ వాహనాలకు సబ్సిడీ ఇస్తే అది ప్రభుత్వాలకు భారం అవుతుందని కెనడా, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, ఐర్లండ్‌, జపాన్‌, స్విట్జర్లాండ్‌, బ్రిటన్‌ లాంటి దేశాలు పెట్రోలు, డీజిల్‌ వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరచడం ద్వారా ప్రజల్ని విద్యుత్‌ వాహనాలవైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి. పెట్రోలు వాహనాలు వాడుతున్నవారి మీద ‘కార్బన్‌ ట్యాక్స్‌’ విధిస్తున్నాయి.

గతేడాది విద్యుత్‌ వాహనాలు ఎక్కువగా అమ్ముడైంది యూరప్‌లో. ఆ తర్వాత స్థానం చైనా, అమెరికాలది. యూరప్‌లోనూ మూడొంతులు విద్యుత్తు కార్లను అమ్మిన నార్వే మొదటి స్థానంలో ఉంది. 2017 నుంచీ అక్కడ రైళ్లన్నీ పూర్తిగా పవన విద్యుత్తుతోనే నడవడం మరో విశేషం. ఇక, విద్యుత్‌ కార్ల ఇంజిన్లు, బ్యాటరీలను తయారుచేసేందుకు ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీని నిర్మించింది టెస్లా. ఆ ఫ్యాక్టరీ అచ్చంగా సౌరశక్తితోనే నడుస్తోంది. అంటే వాహనాల తయారీ దశ నుంచే జీరో కాలుష్యం సూత్రాన్ని ఆచరణలో పెడుతున్నారు. అమెరికాలో ఇప్పటికే 13 లక్షల విద్యుత్తు వాహనాలు తిరుగుతున్నాయి. ఈ చర్యల వల్ల 7.7 కోట్ల కార్లనుంచి వెలువడే కాలుష్యానికి సమానమైన కర్బనవాయువుల విడుదలను అరికట్టగలిగింది.


సవాళ్లూ... పరిష్కారాలూ

విద్యుత్‌ వాహనం కొనుక్కోగానే సరిపోదు. దానికి అవసరమైన మౌలిక వసతులు కొన్ని కావాలి. గతుకులూ, వానొస్తే చెరువులయ్యే రోడ్ల మీద ఈ-వాహనాలతో ప్రయాణం కష్టమే. ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఛార్జింగ్‌ స్టేషన్లూ చాలినన్ని లేవు. 2017లో బిగ్‌బాస్కెట్‌ విద్యుత్తు వాహనం టెస్ట్‌ రన్‌ చేస్తున్నప్పుడు వర్షాకాలంలో రోడ్లమీద నీళ్లు ఎక్కువగా ఉంటే బ్యాటరీ తడిసిపోయి బండి ఆగిపోయేది. వాహనం పొరపాటున దేన్నైనా ఢీకొంటే బ్యాటరీ కారణంగా మంటలు లేచేవి. అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఛార్జింగ్‌ అయిపోయేది. దాంతో బిగ్‌బాస్కెట్‌ బ్యాటరీల తయారీదారులతో సమస్యలను చర్చించింది. ఫైర్‌ప్రూఫ్‌, వాటర్‌ప్రూఫ్‌ బ్యాటరీలను ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసేలా దిట్టంగా తయారుచేయాల్సిందిగా కోరింది. బ్యాటరీ తయారీ సంస్థలు కూడా సమస్యల్ని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలు ఇప్పుడు ఉండవు. ఇక, వాహనాలను తయారుచేసే సంస్థలు కూడా అత్యుత్తమ సాంకేతికతను వాడుతున్నాయి. దానివల్ల ఛార్జింగ్‌ ఎంతుందో ఎంత దూరం వెళ్లవచ్చో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది.బ్యాటరీ ఛార్జింగ్‌కి ఎక్కువ సమయం పడుతుందన్నది మరికొందరి అభ్యంతరం. ఆ సమస్యకీ పరిష్కారం చెబుతున్నారు నిపుణులు. వంట చేసేటప్పుడు గ్యాస్‌ అయిపోతే వెంటనే సిద్ధంగా ఉన్న రెండో సిలిండర్‌ని ఎలా అమర్చుకుంటామో, వాహనాలకు కూడా ఛార్జింగ్‌ అయిపోయిన బ్యాటరీని తీసేసి ఫుల్‌ ఛార్జింగ్‌ ఉన్న బ్యాటరీ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. అలా మార్చుకోడానికి నిమిషం కూడా పట్టదనీ, ఆ ఏర్పాటు కూడా ఛార్జింగ్‌ స్టేషన్లలో ఉంటుందనీ చెబుతున్నారు. ఇప్పుడు పెట్రోల్‌ బంకులు ఉన్నట్లే భవిష్యత్తులో ఛార్జింగ్‌ స్టేషన్లు ఉంటాయన్నమాట. వాడేసిన బ్యాటరీలను నిర్లక్ష్యంగా వదిలేస్తే పర్యావరణానికి తీవ్రంగా హాని జరుగుతుంది కాబట్టి వాటి రీసైక్లింగ్‌కి కూడా ఇప్పటినుంచే ఏర్పాట్లు మొదలవుతున్నాయి.


పదేళ్ల తర్వాత... అన్నీ అవే!

విద్యుత్తు వాహనాల మార్కెట్లో చైనా తర్వాత స్థానం మన దేశానిదే. అందుకే విదేశీ సంస్థలు కూడా ఇక్కడ తయారీ ప్రారంభిస్తున్నాయి. తక్కువ సంఖ్యలోనే అయినా ఇప్పటికే దాదాపు అన్ని నగరాల్లోనూ ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాదికల్లా కోటి ద్విచక్రవాహనాలను తయారుచేసేందుకు తమిళనాడులో ఓలా శరవేగంగా పనిచేస్తోంది. ఐదేళ్లక్రితమే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ బస్‌ని తెచ్చిన భారీ వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ మరిన్ని వాహనాలు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు నాంది పలికిన అమెరికన్‌ కంపెనీ టెస్లా కర్ణాటకలో అనుబంధ సంస్థను నెలకొల్పుతోంది. జపాన్‌కి చెందిన సుజుకి తన తొలి విద్యుత్తు వాహనాన్ని ఇండియాలో విడుదల చేస్తానని ప్రకటించింది. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను అమ్ముతున్న కంపెనీల్లో ఇప్పటివరకు టాటామోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ముందున్నాయి. టాటామోటార్స్‌ గతేడాది ‘నెక్సాన్‌ ఈవీ’ కారునీ ఈ ఏడాది ‘టిగోర్‌ ఈవీ’ని మార్కెట్లోకి తెచ్చింది. 2025 నాటికి పది మోడల్స్‌లో కార్లను తేవడానికి సన్నద్ధమవుతోంది ఈ సంస్థ. ‘ట్రియో జోర్‌’ ఆటోనీ, ‘వెరిటో’ కార్‌నీ తెచ్చిన మహీంద్రా 2025 నాటికి ఐదులక్షల విద్యుత్‌ వాహనాలను అమ్మాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. గురుగ్రామ్‌కి చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్‌ లాజిస్టిక్‌ టెక్నాలజీస్‌ సంస్థ రెండేళ్ల క్రితమే విద్యుత్తుతో నడిచే భారీ ట్రక్కుని ప్రారంభించింది.

ద్విచక్రవాహనాల విషయానికి వస్తే రివోల్ట్‌ ఆర్‌వీ400, జాయ్‌ హరికేన్‌ లాంటి మోటార్‌ బైక్స్‌, హీరో ఫోటాన్‌, బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌, ఒకినావా ఐప్రెయిజ్‌ లాంటి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం 2022 కల్లా రైళ్లన్నీ పూర్తిగా విద్యుత్తుతో నడిచేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఏడాదికల్లా దాదాపు అన్నిరకాల విద్యుత్‌ వాహనాలూ రోడ్డుమీద కనపడవచ్చు.


అంకురాలు అదుర్స్‌!

సమాజ అవసరాలను కనిపెట్టి అచ్చంగా విద్యుత్‌ వాహనాల తయారీనే లక్ష్యంగా ప్రారంభించిన అంకురాలకూ ఇప్పుడు సమయం కలిసొచ్చింది. మార్కెట్లో రాణిస్తున్న వాటిలో కొన్ని...
* హైదరాబాద్‌కి చెందిన గాయం మోటార్స్‌ ప్రయాణికుల ఆటోలతోపాటు సరకు రవాణా ఆటోలనీ, ఈ-బైక్స్‌నీ తయారుచేస్తోంది. ఇప్పటికే ఈ వాహనాలను పలు నగరాల్లో ఉపయోగిస్తుండగా, కొన్ని ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.
* బెంగళూరుకు చెందిన ‘అథర్‌ ఎనర్జీ’ రూపొందించిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ టచ్‌స్క్రీన్‌ డాష్‌బోర్డుతో యువతరాన్ని ఆకట్టుకుంటోంది. జీపీఎస్‌ సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది. జులై నెలలో బెంగళూరులోని ఒక్క షోరూం నుంచే 800లకు పైగా వాహనాలను అమ్మి రికార్డు సృష్టించింది ఈ సంస్థ.
* కోయంబత్తూరుకు చెందిన ఆంపియర్‌ వెహికిల్స్‌ తయారుచేస్తున్న ఆంపియర్‌ బైక్స్‌ రూ.40 వేలనుంచి అందుబాటులో ఉన్నాయి. గంటకు పాతిక కి.మీ. వేగంతో వెళ్లే వీటిని గ్రామీణ విద్యార్థులూ, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్నారు.
* ‘మెజెంతా పవర్‌’ సంస్థ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేస్తుండగా, ‘బ్యాటరీ స్మార్ట్‌’ సంస్థ ఛార్జిచేసిన బ్యాటరీలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ని నెలకొల్పింది. నొయిడాకి చెందిన ‘లొహుం’ లీథియం అయాన్‌ బ్యాటరీలను తయారుచేయడమే కాక రీసైక్లింగ్‌ కూడా చేస్తోంది.


శరవేగంగా జరిగిపోతున్న ఈ మార్పులన్నీ చూస్తుంటే విద్యుత్తు వాహనాల రంగంలో ఈ ఏడాది చరిత్ర సృష్టించబోతున్నట్లే ఉందంటున్నారు నిపుణులు. అదే నిజమైతే ఇక బులెట్టు బండి కూడా ‘డుగ్గు డుగ్గు’ మనకుండానే దూసుకుపోతుందన్నమాట..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు