Lithium: లిథియం...ఇప్పుడిదే బంగారం!

జమ్ము కశ్మీర్‌లో లిథియం గనులున్నాయట... దక్షిణాన కర్ణాటకలోనూ లిథియం దొరుకుతుందట... ‘అయితే ఏంటీ... అదేమన్నా బంగారమా...’ అంటారా? బంగారం కన్నా ఎక్కువే. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌, కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్‌ కారు, ఇంటి పైకప్పుమీది సోలార్‌ పవర్‌ యూనిట్‌... ఆఖరికి పంటలకు వాడే ఎరువుల వరకూ లిథియం అవసరం లేని రంగం లేదు. దాంతో ఏటా వేలకోట్లు వెచ్చించి విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం.

Updated : 12 Mar 2023 11:39 IST

Lithium: లిథియం...ఇప్పుడిదే బంగారం!

జమ్ము కశ్మీర్‌లో లిథియం గనులున్నాయట... దక్షిణాన కర్ణాటకలోనూ లిథియం దొరుకుతుందట... ‘అయితే ఏంటీ... అదేమన్నా బంగారమా...’ అంటారా? బంగారం కన్నా ఎక్కువే. చేతిలోని స్మార్ట్‌ఫోన్‌, కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్‌ కారు, ఇంటి పైకప్పుమీది సోలార్‌ పవర్‌ యూనిట్‌... ఆఖరికి పంటలకు వాడే ఎరువుల వరకూ లిథియం అవసరం లేని రంగం లేదు. దాంతో ఏటా వేలకోట్లు వెచ్చించి విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం. అలాంటిది మనదేశంలోనే దొరుకుతోందంటే సంతోషమేగా..!

మిక్సీ వేద్దామని పప్పు కడిగిపెట్టుకున్నాక కరెంటు పోతే..? ఏం చేస్తాం... వచ్చేవరకూ ఎదురుచూస్తాం. అది రాకపోతే రోట్లో రుబ్బుకోవడం తప్ప మరో మార్గం లేదు.

అదే సెల్‌ ఫోను అయితే... చార్జింగ్‌ అయి ఉంటుంది కాబట్టి రోజంతా కరెంటుతో సంబంధం లేకుండా వాడుకోవచ్చు. ఫోను ఒక్కటే కాదు; ల్యాప్‌టాపూ, డిజిటల్‌ కెమెరా, ఎమర్జెన్సీ లైటూ, పిల్లల బొమ్మలూ, ఎలక్ట్రిక్‌ స్కూటరూ, రోబో క్లీనరూ... ఈరోజుల్లో వాడే మరెన్నో పోర్టబుల్‌, స్మార్ట్‌ పరికరాలను చార్జింగ్‌ చేస్తూనే ఉంటాం. ఆఖరికి వంటింట్లో వాడే ఆధునిక వస్తువులూ
అలాంటివే వస్తున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న మిక్సీ కరెంటు లేకపోతే పనిచేయదేమో కానీ కాస్త చిన్నవైనా అలాంటి పనులు చేసిపెట్టే విడి పరికరాలు బ్యాటరీతో పనిచేసేవి చాలానే వచ్చేశాయి.

వాహనాలకు పెట్రోలూ డీజిల్‌ లాగే ఏ పరికరం అయినా పనిచేయాలంటే- ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్లూ కరెంటు ఆ అవసరాన్ని తీరుస్తోంది. అయితే ఎప్పుడూ అది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయడం నేర్చుకున్నాడు మనిషి. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాక స్మార్ట్‌ ఫోన్‌ నుంచి విద్యుత్‌ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు రంగాన్ని సిద్ధం చేసింది లిథియం అయాన్‌ బ్యాటరీల ఆవిష్కరణ. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనమూఒక భాగం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలకపాత్ర పోషించనున్నాయి.

ఐదేళ్ల క్రితం రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి అందుకున్న జపాన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అకిరా యోషినో మొట్టమొదటిసారిగా 1980ల్లో లిథియం అయాన్‌ బ్యాటరీలను తయారుచేశారు. అప్పటినుంచి దాన్ని మెరుగుపరుస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. రసాయన శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే గుణం లిథియంకి ఉంది. కొత్తలో పెద్దసైజులో తయారైన మొబైల్‌ ఫోను ఇప్పుడు చేతిలో ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియంతో తయారైన బ్యాటరీల చలవే. కారుకి లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీ వాడితే అది 4000 కిలోల బరువు ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ అయితే 600 కిలోలే. అంత తేడా ఉంది కాబట్టే ఈ లోహానికి ఒక్కసారిగా బోలెడు ప్రాధాన్యం లభించింది. ఇప్పుడదే మొత్తంగా ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది.

అసలేమిటీ లిథియం?

ఇనుమూ బంగారం వెండీ లాగే ఇదీ ఒక లోహం. క్షార మూలకమైన (ఆల్కలైన్‌ ఎలెమెంట్‌) లిథియం ఆవర్తనపట్టిక (పీరియాడిక్‌ టేబుల్‌) మొదటి సముదాయంలో ఉంటుంది. ‘లిథోస్‌’ అంటే గ్రీకు భాషలో ‘రాయి’ అని అర్థం. చూడటానికిది వెండి రాయి లాగా కన్పిస్తుంది కానీ మెత్తగా ఉంటుంది. మండించినప్పుడు ఎర్రని మంట వచ్చే ఈ లోహాన్ని 1790లో బ్రెజిల్‌ దేశస్థుడు కనిపెట్టాడు. ఆ తర్వాత పలువురు రసాయన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా ముడిఖనిజం నుంచి లిథియంని వేరుచేసే విధానాన్ని కనిపెట్టగలిగారు. అయితే దీనికున్న విశేష లక్షణాలే లిథియంని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

ఏమిటవి?

చాలా తేలికగా, మెరుస్తూ ఉంటుంది. సహజంగా వెండి రంగులోనే ఉన్నప్పటికీ ఆక్సీకరణ వల్ల బూడిదరంగులోకి మారుతుంది. మంచి ఉష్ణ, విద్యుత్‌ వాహకం కూడా. చురుగ్గా స్పందిస్తుంది. నీటితో చర్య జరిపే గుణం ఉన్నందున ప్రకృతిలో లిథియం రూపంలో కాకుండా ఇతరపదార్థాలతో కలిసి భూమిమీదా, సముద్రంలోనూ ఇది దొరుకుతుంది. మండే స్వభావం ఉన్నందువల్ల దీన్ని ఏదైనా ఒక హైడ్రో కార్బన్‌ ద్రవంలో కానీ పెట్రోలియం జెల్లీలో కానీ ఉంచి భద్రపరుస్తారు. మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం సులువు. లిథియాన్ని అల్యూమినియం, మెగ్నీషియంలతో కలిపి మిశ్రమ లోహాలను తయారుచేస్తారు. ఇలా తయారైన మిశ్రమధాతువు బరువు తక్కువగా ఉండి బలం ఎక్కువగా ఉంటుంది.

ఎక్కడ దొరుకుతుంది?

లిథియం నిక్షేపాల విషయానికి వస్తే ప్రపంచంలో బొలీవియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అర్జెంటీనా, చిలె, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, పోర్చుగల్‌, జింబాబ్వే, కెనడా, జర్మనీ తదితర దేశాల్లో లిథియం నిల్వలు ఉన్నాయి. తమ దేశంలో ఉన్నదానికి తోడు విదేశాలలోని గనుల్నీ కొనుక్కుని చైనా లిథియం బ్యాటరీలను తయారుచేస్తూ మొదటిస్థానంలో నిలుస్తోంది. ప్రపంచానికి అవసరమైన బ్యాటరీల్లో 77శాతం తయారుచేస్తున్న చైనా గతేడాది 14 లక్షల కోట్ల రూపాయల విలువ గల బ్యాటరీలను ఉత్పత్తి చేసి 130 శాతం వార్షిక పెరుగుదలని నమోదుచేసింది. ఎగుమతుల్లోనూ 87 శాతం వృద్ధి సాధించింది.

సహజంగానే ఆ దేశంలో ఈ బ్యాటరీలను వినియోగించే వాహనాల సంఖ్య(న్యూ ఎనర్జీ వెహికిల్స్‌) కూడా బాగా పెరిగింది. ప్రపంచానికి కావలసిన లిథియంలో పదోవంతుని చైనాలోని ఇచున్‌ సిటీ ప్రాంతమే సరఫరా చేస్తుంది. అయితే పర్యావరణ సమస్యల నేపథ్యంలో అక్కడ గనుల్ని మూసేసినప్పటికీ చైనా ఎగుమతులపై ఎలాంటి ప్రభావం పడలేదు. ప్రపంచంలో లిథియం అయాన్‌ బ్యాటరీలను తయారుచేసే టాప్‌ టెన్‌ కంపెనీల్లో ఆరు చైనాలోనే ఉన్నాయి.

లిథియం బ్యాటరీల తయారీ సంస్థలు మనదేశంలోనూ ఉన్నప్పటికీ అవీ ముడిసరకును విదేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. లిథియం అయాన్‌ బ్యాటరీల దిగుమతిలో అమెరికా తర్వాత మన దేశమే రెండోస్థానంలో ఉంది. లిథియం లోహాన్ని ఆస్ట్రేలియా, అర్జెంటీనా నుంచీ బ్యాటరీల్ని చైనా, హాంకాంగ్‌ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. గతేడాది ఏప్రిల్‌- డిసెంబరు మధ్య 16 వేల మూడువందల కోట్ల రూపాయలు అందుకు వెచ్చించింది ప్రభుత్వం. ఇప్పుడు మనదేశంలోనూ లిథియం నిల్వలు ఉన్నట్లు బయటపడింది కాబట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మనదేశమూ ఈ విషయంలో స్వావలంబన సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఈ నిధులు ఉన్నట్లు ఎలా తెలిసింది?

నిజానికి జమ్ము కశ్మీర్‌లోని రియాసీ జిల్లా సలాల్‌-హైమానా ప్రాంతంలో లిథియం  నిక్షేపాలున్నట్లు దాదాపు పాతికేళ్ల క్రితమే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. శాస్త్రవేత్తలు మాగ్నెసైట్‌ కోసం అన్వేషిస్తుండగా లిథియం నిక్షేపాల ఆనవాళ్లు కనిపించాయి. అయితే అన్ని కోణాల్లో విశ్లేషించి నిర్ధారించుకోవడానికి సమయం పట్టింది. సాధారణంగా ఎలాంటి గనుల్ని గుర్తించినా వాటిని తవ్వి తీయడానికి నాలుగు దశలుంటాయి. మొదటి దశను ‘మ్యాపింగ్‌’ అంటారు. రెండోదైన ‘ప్రిలిమినరీ ఎక్స్‌ప్లొరేషన్‌’ దశలో నిక్షేపాల మోతాదు అంచనా వేయవచ్చు. అక్కడ 5.9 మిలియన్‌ టన్నుల లిథియం ఉండవచ్చని జీఎస్‌ఐ ఇటీవల ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ లిథియం నిక్షేపాల్లో ఆరు శాతం మనదేశంలోనే ఉన్నట్లవుతుంది, లిథియం కలిగి ఉన్న దేశాల్లో భారత్‌కి ఏడో స్థానం లభిస్తుంది. నిక్షేపాల మోతాదుని ఖరారు చేస్తూ గనులను వేలం వేసే దశని మూడో దశ అంటారు. అది మరింత కీలకమైన దశ. గనుల తవ్వకానికి ఉన్న వెసులుబాటు గురించి కూడా ఇందులో అంచనా వేస్తారు. అక్కడక్కడా శాంపిల్‌ తవ్వకాలు చేపడతారు. జమ్ములో లభించిన లిథియం 800 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ నాణ్యత కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 300 దాటితే చాలు, అది అత్యంత నాణ్యమైన వనరు కింద లెక్క. కర్ణాటకలోని మాండ్య జిల్లాలోనూ మరో 1600 టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రకటించింది. ఇంకా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌, బార్మర్‌ జిల్లాల్లోనూ దీని ఆనవాళ్లు కన్పించాయి.

2030కల్లా ద్విచక్ర వాహనాలూ ఆటోల విభాగంలో 80, ప్రైవేటు కార్లలో 30, కమర్షియల్‌ వాహనాల్లో 70 శాతం చొప్పున విద్యుత్‌ వాహనాలు తేవాలని ఆటోమొబైల్‌ పరిశ్రమకి లక్ష్యంగా నిర్దేశించింది ప్రభుత్వం. అన్ని వాహనాలు వస్తే వాటికి బ్యాటరీలూ అవసరమే. సెల్‌ఫోన్‌ దగ్గర్నుంచీ కార్ల వరకూ మనం వాడే రీచార్జబుల్‌ బ్యాటరీలన్నిటికీ లిథియం అవసరం. వీటిని రీచార్జ్‌ చేయడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. మూడేళ్లు అయ్యేసరికి ఫోను బ్యాటరీ త్వరగా చార్జింగ్‌ అయిపోవడం గమనించే ఉంటారు కదా. అంటే బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోయినట్లు. కొత్త బ్యాటరీ వేసుకోవాలి. కాబట్టి ఈ బ్యాటరీల అవసరం నిరంతరం ఉంటుంది. కానీ మనదేశంలో ఇప్పటివరకూ వాటి తయారీకి అవసరమైన లిథియం, నికెల్‌, కోబాల్ట్‌... ఏవీ లేకపోవడంతో అన్నిటినీ దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు లిథియం నిల్వలు బయటపడ్డాయనగానే దేశమంతా సంతోషిస్తోంది. అయితే ఇల్లలకగానే పండుగ వచ్చినట్లు కాదు.

ఎందుకని?

లిథియం నిక్షేపాలు ఉన్నాయని చెప్పగానే సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. దాన్ని బయటకు తీయడం అంత తేలికైన పనేమీ కాదు. వాణిజ్యపరంగా లిథియంని కార్బొనేట్‌ రూపంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అయితే మామూలుగా ఇది గనుల్లో రెండు రకాలుగా దొరుకుతుంది. సోడియం క్లోరైడ్‌తో కలిసి ఉంటే ఆ ద్రవం ఆవిరైపోయి లిథియం మిగిలేవరకూ విశాలమైన మైదానంలో మడులు కట్టి ఆరబెడతారు. సముద్రతీరాల్లో ఎక్కువగా ఈ రూపంలో లభిస్తుంది. మనదేశంలో బాక్సైట్‌తో కలిసి రాళ్ల రూపంలో ఉంది. దాన్ని ఓపెన్‌ మైనింగ్‌ తరహాలో లోతుగా గోతులు తవ్వి వెలికి తీయాలి. అందుకోసం పరిసర ప్రాంతాల్లోని చెట్లన్నీ తొలగించాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో పెట్రోలు లేదా డీజిల్‌ ఉపయోగిస్తారు. నిజానికి ఇప్పటివరకూ మనదేశంలో లిథియంని శుద్ధిచేసే సాంకేతికత లేదు. ఆస్ట్రేలియాలో కూడా రాళ్ల రూపంలోనే లభిస్తోంది కాబట్టి అక్కడి నుంచి సాంకేతికతను అరువు తెచ్చుకోవాల్సి రావచ్చు. ఈ విధంగా ఖర్చులన్నీ లెక్కలేస్తే- ఒక టన్ను లిథియం తయారీకి లక్షా 70 వేల లీటర్ల నీరు అవసరమవుతుందనీ 15 టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ గాలిలోకి విడుదలవుతుందనీ నిపుణుల అంచనా.

మరో కోణంలో చూస్తే- ఈ విధానం అంతా అక్కడి పరిసరాల మీద చెడు ప్రభావం చూపుతుందనీ, భూగర్భ జలాలు కలుషితమైపోతాయనీ, మంచుకొండలతో భూలోక స్వర్గంగా పేరొందిన కశ్మీర్‌ అందాలు మసకబారిపోతాయనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణవేత్తలు. ఈ పరిస్థితులు వ్యవసాయాన్నీ పర్యటకాన్నీ కూడా దెబ్బతీయవచ్చన్నది వారి అభిప్రాయం. లిథియం నిక్షేపాలు ఉన్నది చీనాబ్‌ నది, దాని ఉపనదుల పరివాహక గ్రామీణ, వ్యవసాయ ప్రాంతం. అక్కడ గనులు తవ్వడం మొదలెడితే జీవవైవిధ్యానికి నష్టం కలుగవచ్చు. ప్రకృతిసిద్ధంగా తలెత్తుతున్న మరో సమస్య- వయసు రీత్యా హిమాలయ పర్వతాలు చాలా చిన్నవి కాబట్టి గనుల తవ్వకాన్ని అవి తట్టుకోలేక భూమి కుంగిపోయే ప్రమాదమూ లేకపోలేదన్నది. నిజానికి ఈ ప్రాంతాన్ని పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. దాంతో గనుల తవ్వకం ప్రమాదకరం కావచ్చన్నదీ కొందరి అభిప్రాయం.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సాంకేతికంగా, సామాజికంగా, వాణిజ్యపరంగా, పర్యావరణపరంగా, అన్నిటినీ మించి ఆర్థికంగా... పరిస్థితులను విశ్లేషించి ఈ గనులను తవ్వడం లాభదాయకం అనుకున్నప్పుడే లిథియం వెలికితీతకు రంగం సిద్ధం అవుతుంది. ఆ పనులన్నీ ఆయా శాఖలు ఇప్పటికే మొదలుపెట్టాయి కాబట్టి త్వరలోనే గనుల వేలం జరుగుతుందనీ, బ్యాటరీల తయారీ రంగంలో ఆత్మనిర్భర భారతాన్ని ఆవిష్కరించుకోవడం సాధ్యమేననీ వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

ఈరోజుల్లో అత్యంత కీలకమైన రవాణా రంగాన్ని పర్యావరణ హితం చేయడంతోపాటు వ్యవసాయం నుంచి ఔషధాల వరకూ ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతుంది కాబట్టే లిథియంని ‘కొత్త బంగారం...’ అంటోంది ప్రపంచం!


ప్రయోజనాలెన్నో..!

ఔషధాల నుంచి ఎరువుల వరకూ లిథియం లోహాన్ని ఎన్నో రకాలుగా వాడుతున్నారు.  

* అల్యూమినియం, రాగి లాంటి వాటి సామర్థ్యాన్ని పెంచడానికి లిథియం లోహాన్ని ఉపయోగిస్తారు.

* వివిధ పరికరాల్లో ఒకదానినొకటి రాసుకుంటూ కదిలే భాగాల మధ్య రాపిడిని తగ్గించే శక్తి లిథియంకి ఉండడంతో గ్రీజు లాంటి కందెనల తయారీలో వాడతారు.

* పింగాణీ, గాజు లాంటి వాటి మెల్టింగ్‌ పాయింట్‌ని తగ్గించే సామర్థ్యం లిథియంకి ఉంది. వాటి నాణ్యతనీ సామర్థ్యాన్నీ పెంచగలదు కూడా. అందుకే దీన్ని ఆయా వస్తువుల తయారీ పరిశ్రమల్లో, శీతలీకరణ యంత్రాల్లో ఎక్కువగా వాడతారు.

* లిథియంని ఇతర లోహాలతో కలిపినప్పుడు తయారయ్యే మిశ్రధాతువులు చాలా తేలిగ్గానూ దృఢంగానూ ఉంటాయి. విమానాలూ అంతరిక్షనౌకలకు సంబంధించిన విడిభాగాల తయారీలో ఈ మిశ్రధాతు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. రక్షణ సంబంధ పరికరాల్లోనూ, సైకిల్‌ ఫ్రేములూ, వేగంగా ప్రయాణించే రైళ్ల తయారీలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

* తలనొప్పి, మూర్ఛ, మధుమేహం, కాలేయ, మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన ఔషధాల్లోనే కాక బైపోలార్‌ డిజార్డర్‌, కుంగుబాటు, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతలకు వాడే పలు మందుల్లోనూ లిథియం ఉంటుంది.

* రీచార్జబుల్‌ కాని, వాడి పారేసే మామూలు బ్యాటరీల్లో(టీవీ, ఏసీ రిమోట్‌లలో వాడేలాంటివి) కూడా లిథియం ఉంటుంది.

* పరిశ్రమల్లో గాలిలో తేమని తగ్గించి పొడి వాతావరణాన్ని కల్పించడానికీ లిథియంని వినియోగిస్తారు.

* ఎరువుల తయారీలో సూక్ష్మపోషకంగా దీన్ని వాడతారు.

* స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, విద్యుత్‌ వాహనాలు... లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వాడే రీచార్జబుల్‌ బ్యాటరీస్‌ మాత్రమే కాదు, పవన, సౌర విద్యుత్తు తయారీకి వాడే టర్బైన్స్‌, ప్యానెల్స్‌లోనూ లిథియం అయాన్‌ బ్యాటరీలను వాడతారు.

* న్యూక్లియర్‌ రియాక్టర్లలో కూలంట్‌(చల్లబరిచేందుకు) గానూ న్యూట్రాన్‌ అబ్జార్బర్‌గానూ లిథియం ముఖ్యపాత్ర పోషిస్తోంది.


కాలుష్యరహిత ఆర్థిక వ్యవస్థకి పునాది

భూతాపం పెరిగిపోవడం వల్ల చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు మొత్తంగా ప్రపంచ దేశాల వ్యవస్థల్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి అడ్డుకట్ట వేయడానికి గానూ దేశాలన్నీ కర్బనవాయువుల నియంత్రణకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పెట్రోలు వాడకాన్ని తగ్గించి విద్యుత్‌ వాహనాలను వాడటమూ ఆ చర్యల్లో భాగమే. విద్యుత్తు తయారీకీ పునరుత్పాదక ఇంధన వనరుల్నే వాడాలి. ఈ క్రమంలోనే కాలుష్యరహిత ఆర్థికవ్యవస్థకి పునాది వేయగల శక్తి ఉన్న లిథియం తదితర లోహాల అవసరం పెరుగుతోంది. 2050 నాటికి లిథియం, కొబాల్ట్‌ లాంటి లోహాల డిమాండ్‌ 500 శాతం పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. మరో ఏడేళ్లకల్లా ప్రపంచ విద్యుత్‌ వాహనాల మార్కెట్‌ 67 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందట. ప్రపంచంలో అది 18శాతం చొప్పున వార్షిక వృద్ధి సాధిస్తోంటే మనదేశంలో ఏటా 24 శాతం చొప్పున పెరుగుతోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్ష మెట్రిక్‌ టన్నుల లిథియం లోహాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండు మాత్రం దానికి మూడు రెట్లు ఉంటోంది. 2070నాటికి నెట్‌జీరో ఎమిషన్స్‌ లక్ష్యాన్ని సాధించాలంటే లిథియం ఉత్పత్తిని నలభై రెట్లు పెంచాలని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. చాలాదేశాల్లో లిథియం గనులు ఉన్నప్పటికీ వాటిని తవ్వకుండా ఇప్పటివరకూ దిగుమతుల మీదే ఆధారపడుతున్నాయి. జమ్ము కశ్మీర్‌లో ఉన్నట్లు భావిస్తున్న 5.9 మిలియన్‌ టన్నుల లిథియం నిక్షేపాలను పూర్తిగా తీసి బ్యాటరీ గ్రేడ్‌ లిథియంలోకి మారిస్తే దాంతో 6 టెరావాట్‌ అవర్స్‌ (ఒక టెరావాట్‌ అంటే ట్రిలియన్‌ వాట్స్‌) పనిచేసే బ్యాటరీలను తయారుచేయొచ్చట. అంటే దేశ భవిష్యత్‌ అవసరాలన్నీ సులభంగా తీర్చుకోవచ్చన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..