వేప... చెట్టంత ఔషధం!

ఒకప్పుడు... తెల్లారుతూనే దంతధావనానికి వేపపుల్ల... మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చడానికి పెరట్లో వేపచెట్టు నీడ... పిల్లలకు ఏ అమ్మవారో సోకితే వేపాకు పడక... ఇల్లు కట్టుకోడానికి వేప కలప... చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి వేపచెట్టుకింది రచ్చబండ... దినచర్య అంతా వేపచెట్టుతో పెనవేసుకుని సాగిపోయేది.

Published : 18 Mar 2023 23:58 IST

వేప... చెట్టంత ఔషధం!

ఒకప్పుడు... తెల్లారుతూనే దంతధావనానికి వేపపుల్ల... మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చడానికి పెరట్లో వేపచెట్టు నీడ... పిల్లలకు ఏ అమ్మవారో సోకితే వేపాకు పడక... ఇల్లు కట్టుకోడానికి వేప కలప... చీకటి పడ్డాక పెద్దలంతా కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి వేపచెట్టుకింది రచ్చబండ... దినచర్య అంతా వేపచెట్టుతో పెనవేసుకుని సాగిపోయేది. మరిప్పుడు... ‘ఏదో సంప్రదాయంగా ఉగాది పచ్చడిలో కాస్త వేపపువ్వు’ అనుకుంటున్నాం కానీ నిజానికి బహురూపాల్లో వేప మనకు తెలియకుండానే మన జీవితాల్లో భాగమైపోయింది. దాంతో ఇప్పుడున్న చెట్లకు రెట్టింపు ఉంటే కానీ మన అవసరాలు తీరవు- అంటున్నారు నిపుణులు.

రోజుల్లో తలనొప్పికి ఓ మాత్ర, కడుపు నొప్పికి మరో మాత్ర... అలా మందుల దుకాణానికి వెళ్లి కొనుక్కుని వేసేసుకుంటున్నాం కానీ ఓ వందేళ్ల క్రితం వరకూ ఇప్పటిలా మందుల దుకాణాలూ లేవు. అలోపతి విధానానికి ప్రాచుర్యమూ లేదు. ఊరూరా డాక్టర్లూ లేరు.

మరేం చేసేవారూ అంటే... వేపచెట్టుని ఆశ్రయించేవారు. అందుకే దానికి ‘పల్లెటూరి వైద్యశాల’ అని పేరుపెట్టారు విదేశీయులు. కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజారోగ్యానికి పెద్ద దిక్కుగా ఉన్నది వేప చెట్టే.

ఆయుర్వేదంలో వేపని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. పగటిపూట వేపచెట్టు నీడలో విశ్రమించేవారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారని చరక సంహిత చెబుతోంది. సిద్ధవైద్యం లోనూ వేప చెట్టు ప్రస్తావన ఉంది. చెన్నైలోని సెంటర్‌ ఫర్‌ ట్రెడిషినల్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌ లైబ్రరీలో భద్రపరిచిన దాదాపు నాలుగు శతాబ్దాల నాటి తాళపత్ర గ్రంథంలో వేప ఔషధ గుణాల గురించి రాసి ఉంది. నకుల సహదేవులు తమ గుర్రాలూ ఏనుగుల గాయాలు మాన్పడానికి వేపగింజల నూనెనీ వేపాకు రసాన్నీ వాడేవారని మహాభారతం పేర్కొంటోంది. ‘ఉపవన వినోద’ అనే సంస్కృత గ్రంథం నేలకీ, పంటలకీ, పశువులకీ వేప ఎంత మేలు చేస్తుందో చెబుతుంది. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ, వరాహమిహిరుడి ‘బృహత్‌ సంహిత’లోనూ వేప ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చర్చించారట. యునానీ వైద్యులు దీన్ని ‘బ్లెస్డ్‌ ట్రీ’ అంటారు.

అంతేకాదు, ఐదువేల ఏళ్లనాటి సింధూ నాగరికత అవశేషాల్లోనూ వేప గింజల్ని మందుగా వాడిన ఆనవాళ్లు బయట పడ్డాయని వరల్డ్‌ నీమ్‌ ఆర్గనైజేషన్‌ చెబుతోంది. ఇప్పుడంటే కొబ్బరిచెట్టుని కలియుగ కల్పవృక్షం అంటున్నారు కానీ ఒకప్పుడు కల్పవృక్షం అంటే వేప చెట్టే నంటున్నాయి కొన్ని గ్రంథాలు. అది పచ్చదనంతో పరిసరాలను ఆహ్లాదంగా కనిపించేలా చేయడమే కాక, నీడనిస్తూ, సేదదీరుస్తూ, ఆరోగ్యాన్నిస్తూ చివరికి ఎండి రాలిపోయిన ఆకులూ పండ్లతో నేలను సైతం పోషకభరితం చేస్తూ అణువణువూ పరోపకారానికే ఉపయోగపడుతుందనీ అసలైన కల్పవృక్షం వేపేననీ అంటారు.

అన్ని సమస్యలకీ...

ఎలాంటి నేలలోనైనా పెరగడమే కాక కరవు పరిస్థితుల్ని కూడా తట్టుకుని నిలిచే వేప ప్రధానంగా ఆసియాలోనే కన్పిస్తుంది. మన దేశమూ పొరుగు దేశాల్లోనూ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రాధాన్యం తెలిశాక అన్ని దేశాలూ పెంచుతున్నాయి. నాటిన తర్వాత చాలా త్వరగా పెరిగే వేప శాస్త్రీయనామం- అజాడిరక్టా ఇండికా. మహాగని కుటుంబమైన ‘మెలియేసీ’కి చెందిన దీన్ని ‘ఇండియన్‌ లిలాక్‌’ అని కూడా అంటారు. సంస్కృతంలో ‘నింబ’ అంటారు. ఆఫ్రికా భాషలో దీనిపేరు ‘మ్వారోబైని’. ఆ పదానికి ‘నలభై చెట్టు’ అని అర్థం. నలభై వ్యాధుల్ని నయం చేస్తుందని దీనిని అలా పిలుచుకుంటారట. చాలా దేశాలు దీని ఔషధ విలువల్ని గుర్తించినప్పటికీ దీన్ని ఇంకా కలుపు మొక్కగానే భావించే దేశాలూ లేకపోలేదు. 1992లో వాషింగ్టన్‌లోని నేషనల్‌ ఎకాడెమీస్‌ ప్రెస్‌ ప్రచురించిన ‘నీమ్‌- ఎ ట్రీ ఫర్‌ సాల్వింగ్‌ గ్లోబల్‌ ప్రాబ్లమ్స్‌’ లాంటి పుస్తకాలూ వరల్డ్‌ నీమ్‌ ఆర్గనైజేషన్‌, నీమ్‌ ఫౌండేషన్‌ లాంటి సంస్థలూ ఈ చెట్టు ప్రాధాన్యం గురించి ఆధునిక తరాలకు తెలిసేలా చేశాయి. మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి వేప రూపంలో సహజసిద్ధమైన పరిష్కారాలు ఉన్నాయనీ వాటిని వదిలేసి రసాయనాల వెంట వెళ్లడం దండగనీ చెబుతున్నాయి ఈ సంస్థలు.

మనదేశంలో వేప మొదటినుంచీ జీవనవిధానంలో భాగమైంది. పల్లెటూళ్లలో పెరట్లో కాస్త ఖాళీ స్థలం ఉంటే తప్పనిసరిగా వేప మొక్క పెట్టేవారు.

అది అతి తక్కువ సమయంలోనే ఇంతింతై అన్నట్లుగా పెరిగి పెరటి వాకిలిని ఆక్రమించేది. టూత్‌బ్రష్‌లూ పేస్టుల వాడకం ఈ మధ్య వచ్చింది కానీ అంతకు ముందు పళ్లు తోముకోవడానికి వేప పుల్లల్నే వినియోగించేవారు. ఇప్పటికీ మన దేశంలో బ్రష్‌తో పళ్లు తోముకునే ప్రజలు 60శాతం లోపేననీ, టూత్‌పేస్టులు వాడేది 49 శాతమేననీ సర్వేలు చెబుతున్నాయి. పల్లె ప్రజలు ఎలాగూ వేప పుల్లల్నే వాడుతున్నా ఇప్పుడు పట్టణాల వారినీ ఆకట్టుకుంటున్నాయి ‘నీమ్‌ చ్యూ స్టిక్స్‌’.

వేప చెట్టు పెరట్లో ఉంటే చల్లని స్వచ్ఛమైన గాలి వీస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మండుటెండల్లోనూ చల్లని ఈ చెట్టునీడ దొరికితే చాలు, హాయిగా కునుకు తీస్తారు శ్రామికులు. ఇక ఇల్లు కట్టుకుంటే కావలసిన కలప అంతా వేప చెట్టునుంచే వచ్చేది. ద్వారాలూ, కిటికీలూ, బీరువాలూ, మంచాలూ తదితరాలకు చౌకగా అందుబాటులో ఉండే వేపకట్టెనే వాడేవారు. 

సరిరారు వేపకెవ్వరూ...

చాలా రకాల మొక్కలకు ఔషధ గుణాలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ తలమానికం లాంటిది వేప. ఆ గుణాల వల్లే ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా గొప్ప విలువైన చెట్టుగా మారి పోయింది. ఆయుర్వేద, యునాని, హోమియోపతి మందుల్లో వేప సంబంధిత పదార్థాలు ఎక్కువగా వాడతారు. వేప చెట్టులోని వివిధ భాగాలనుంచి 140కి పైగా రకాల రసాయన సంయోగాలను తీయగలిగారు. ఆకులు, పువ్వులు, పండ్లు, విత్తనాలు, కాండం, వేళ్లు... ఇలా వేపచెట్టులోని అన్ని భాగాలూ వేర్వేరు ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌, ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, చర్మ వ్యాధులు, దంతవ్యాధులు... అన్నింటికీ వేప మంచి మందుగా పనికొస్తుంది. వాయు, నీటి కాలుష్యాలనూ వేడినీ తట్టుకుని నిలిచే ఈ చెట్టు నేల సారాన్నీ కాపాడుతుంది.

* వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి హైపర్‌ గ్లైసెమిక్‌, యాంటి అల్సర్‌, యాంటి మలేరియల్‌, యాంటి ఫంగల్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి వైరల్‌, యాంటి ఆక్సిడెంట్‌, యాంటి మ్యుటాజెనిక్‌, యాంటి కార్సినోజెనిక్‌... లక్షణాలు ఉంటాయట. అందుకే పిల్లలకు చికెన్‌పాక్స్‌, మీజిల్స్‌ లాంటి జ్వరాలు సోకినప్పుడు పక్కమీద వేపాకు పరుస్తారు. బియ్యం పురుగుపట్టకుండా నిల్వ చేసే డబ్బాలో వేపాకులు వేస్తారు. వేపాకు పసరుని పాములూ కీటకాల కాటుకి మందుగా వాడేవారు. వేపాకు, పువ్వుల పచ్చడిని ఊరగాయలాగా చేసుకోవడం చాలా ప్రాంతాల్లో ఉంది. గులాబీ పువ్వులతో చేసినట్లు వేపపువ్వుతోనూ గుల్కంద్‌ తయారుచేస్తారు. వేపాకు ఎండబెట్టి చేసే టీ తాగితే గొంతునొప్పి, జలుబు, అజీర్తి లాంటి సమస్యలు రావని నమ్ముతారు ఆఫ్రికన్లు.

* వేప రెమ్మల్లో ఆల్కలాయిడ్స్‌, రెసిన్స్‌, గమ్‌, ఫ్లోరైడ్‌, సల్ఫర్‌, టానిన్స్‌, ఆయిల్స్‌, సపొనిన్స్‌, ఫ్లేవనాయిడ్స్‌, స్టెరాల్స్‌, కాల్షియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. మేకలకే కాకుండా మామూలు పాడి జంతువులకు కూడా వేపాకు మంచి పౌష్టికాహారం. 

* ఇక గింజలైతే ఫ్యాటీ ఆసిడ్స్‌, ప్రొటీన్లకు మంచి వనరు. వేప గింజల నుంచి తీసిన నూనె చేదుగా ఒకలాంటి గాఢమైన వాసనతో ఉంటుంది. దీన్నే మార్గోసా నూనె అనీ అంటారు. సహజమైన క్రిమిసంహారిణిగా పనిచేసే దీనిని ఒకప్పుడు పంటలమీదే వాడేవారు. 350 రకాల క్రిమికీటకాలూ, మరెన్నో జాతుల ఫంగస్‌లూ వేప వాసన తట్టు కోలేవని తేలింది. కేవలం నూనె రూపం లోనే కాక దీన్ని పొడిగానూ, గ్రాన్యూల్స్‌ గానూ కూడా తయారు చేస్తున్నారు. వేప నూనె నేరుగా క్రిములను సంహరించదు, రిపెలెంట్‌గా పనిచేస్తుంది. క్రిముల హార్మోన్ల మీద ప్రభావం చూపి వాటి గుడ్లు పెట్టే శక్తినీ, ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యాన్నీ హరిస్తుంది. దాంతో సహజం గానే అవి నశిస్తాయి. వాటివల్ల పంటలకు నష్టం కలగదు. అంతేకాదు, వేపనూనె వల్ల క్యాన్సర్‌ కణాలు చచ్చిపోతాయని ఎలుకల మీద చేసిన ప్రయోగంలో రుజువైంది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదల తగ్గి పోతుందని మరో పరిశోధనలో తెలిసింది.

* వేప కాండం మంచి ప్లైవుడ్‌ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

* వేప చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చర్మవ్యాధులు నయమవుతాయి. బెరడు, ఆకులను కొబ్బరినూనెలో వేసి నీటిని కలిపి మరిగించి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తాగితే నులిపురుగులను నివారించవచ్చట. మామూలు పుండ్లూ మచ్చలే కాక కుష్టువ్యాధిలో వచ్చే పుండ్లకూ ఇది చక్కటి ఔషధం. అతిమూత్రవ్యాధి, మధుమేహం... ఇలా అన్నిటికీ వేపతో చికిత్సలున్నాయి. వేపకి సంబంధించిన ఉత్పత్తులన్నీ లోపలికి తీసుకోవచ్చు, పై పూతగానూ వాడొచ్చు. అందుకే దీనిని దివ్యౌషధం అంటుంది ఆయుర్వేదం.

వేప తేనె... మౌత్‌వాష్‌... 

ఎన్ని మంచి గుణాలున్నా ఈరోజుల్లో ఈ కషాయాలూ నూనెలూ ఎక్కడ చేసుకుంటాం... అయినా ఆ చేదు రుచీ ఘాటు వాసనా భరించడం మన వల్లకాదు అనుకునేవారూ వేప ప్రయోజనాలకు దూరంగా ఉండనక్కర లేదు. అద్భుతమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి మరి. నిత్యం వాడుకోవడానికి పనికొచ్చే వేప ఉత్పత్తులు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సబ్బులు, ఫేస్‌వాష్‌లు, ముఖానికి వేసుకునే ప్యాక్‌లు, వేపాకు పొడి, వేపాకు రసం, వేప పువ్వుల నీరు, వేపగింజల నూనె, పందుం పుల్లలూ, టంగ్‌ క్లీనర్లూ, వేప టూత్‌ పేస్టు, మౌత్‌ వాష్‌, వేప బెరడుపొడి, వేప బెరడుతో చేసిన దువ్వెనలు, టూత్‌ బ్రష్‌లు, ఇంటిని శుభ్రం చేసుకునే క్లీనర్లూ, పెంపుడు జంతువులకు వాడే షాంపూలూ... ఇలా ఎన్నో ఉత్పత్తులు ఇప్పుడు రెడీమేడ్‌గా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఘాటైన వాసన లేకుండానే వేప ప్రయోజనాలను ఇవి అందిస్తాయి. రక్తాన్ని శుద్ధిచేసేందుకు నీమ్‌ క్యాప్సూల్స్‌ కూడా దొరుకుతున్నాయి.

వేప తేనె గురించి విన్నారా... కిలో మూడు వేల పైనే ధర పలికే ఈ తేనెను తేనెటీగలు అచ్చంగా వేపపువ్వుల మకరందం తాగి తయారు చేస్తాయి. చిక్కటి రంగులో ఎక్కువ యాంటి ఆక్సిడెంట్‌ గుణాలతో ఉండే ఈ తేనెని ఆయుర్వేదంలో వినియోగిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడమే కాక బీపీ, షుగరూ, ఎలర్జీలూ, అల్సర్లూ, గొంతు ఇన్ఫెక్షన్లూ, అజీర్తీ, చర్మ సమస్యలతో బాధపడేవారికి ఔషధంగా పనిచేస్తుంది.

కోట్ల రూపాయల మార్కెట్‌

మనుషుల ఆరోగ్యానికే కాదు, పంటల ఆరోగ్యంలోనూ వేప కీలకపాత్ర పోషిస్తోంది. ఎరువులూ క్రిమిసంహారకాల పరిశ్రమల్లో దీనికి డిమాండ్‌ ఎక్కువ. వేప ఉత్పత్తుల్ని జీవ ఎరువుగా, జీవ పురుగుమందులుగా వాడుతున్నారు. దాదాపు వంద రకాల పెస్టిసైడ్స్‌లో దీన్ని చేరుస్తున్నారు. వేపాకులు, గింజలు, బెరడు, పువ్వుల నుంచి తయారుచేసే ఉత్పత్తుల్ని ‘నీమ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌’ అంటున్నారు. ప్రపంచంలో ఇప్పుడు నీమ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ మార్కెట్‌ విలువ దాదాపు 20వేల కోట్లు ఉంటుందట. మనదేశంలో ఏటా 35 లక్షల టన్నుల వేప విత్తనాలు తయారవుతాయని అంచనా. ఒక్కో వేపచెట్టు నుంచి 40-50 కిలోల గింజల దిగుబడి వస్తుంది. వాటినుంచి ఏడు లక్షల టన్నుల వేప నూనె ఉత్పత్తి అవుతుంది. అయితే వేపగింజల కొరత తీవ్రంగా ఉందనీ వేప చెట్ల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలనీ కేంద్రప్రభుత్వం సూచిస్తోంది. ఈ గింజల్ని ఎరువుల కంపెనీలు కొంటున్నాయి. యూరియాకు వేపనూనె కలిపి(నీమ్‌ కోటెడ్‌ యూరియా) విక్రయించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. శానిటైజర్‌ తయారీలోనూ దీన్ని వాడుతున్నారు. దాంతో వేపనూనె దొరక్క దిగుబడి చేసుకునే పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు కోట్ల వేప చెట్లు మాత్రమే ఉన్నాయనీ మరో
3 కోట్లు పెంచితేనే కానీ దేశానికి కావలసిన వేపనూనె డిమాండు తీరదనీ నిపుణులు అంటున్నారు.

తినగ తినగ వేము తీయన అని వేమన అన్నాడు కానీ అంతగా అలవాటు పడనక్కర లేకుండానే తీయగా ఉండే వేప కూడా ఉందంటోంది వరల్డ్‌ నీమ్‌ ఆర్గనైజేషన్‌. పశ్చిమ్‌బంగలోని హౌరా జిల్లాలోనూ కర్ణాటకలోని బెల్గామ్‌లోనూ ఈ తీపి వేపరకం చెట్లు ఉన్నాయట. ఈ చెట్ల ఆకులూ పండ్లూ తీయగా ఉన్నా ఔషధ గుణాలకేమీ లోటు ఉండదట. అలాగే ఊదా రంగు పువ్వులు పూసే వేప రకం కూడా ఉంది. కొత్త కొత్త రకాల మొక్కలకు పేరొందిన కడియం నర్సరీకి వెళ్తే నల్ల వేప, ఆకులమీద తెల్లని మచ్చలతో క్రోటన్‌లా కన్పించే వేప రకాలు కూడా కన్పిస్తాయి. కాబట్టి ఔషధ గుణాల గని అయిన వేపని పెరటి తోటలోనూ బాల్కనీ కుండీల్లోనూ కూడా పెంచేసుకోవచ్చు. కమ్మని ఆ వాసనను నిత్యం ఆఘ్రాణించవచ్చు..!


వేపకీ ఓ రోజుంది!

వేపకి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి ఓ రోజుని కూడా కేటాయించారు. చైత్రమాసంలో తొలిరోజు అంటే ఉగాది నాడే ‘వరల్డ్‌ నీమ్‌ డే’ జరుపుతున్నారు. వేప పువ్వుతో ఉగాది పచ్చడి చేసుకోవడం తెలుగువారికి ఆనవాయితీ అయినట్లే అదే రోజున గుడి పడ్వా పండుగ చేసుకునే మహారాష్ట్ర, కొంకణి ప్రాంతవాసులకు వేపాకు నమిలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయితీ. లేత వేప రెమ్మలతో గుమ్మాలకు తోరణాలు కట్టి కుటుంబ సభ్యులంతా ·వేపాకుల్ని తింటారు. మన సంస్కృతిలో భాగమైన వేపకి ఉన్న అద్భుత శక్తుల గురించి అందరికీ తెలియజేయాలనీ, వేపచెట్లను పెంచడం ద్వారా దేశ సౌభాగ్యానికి పాటుపడాలనీ భావించిన కొందరు పెద్దలు ‘నీమ్‌ ఫౌండేషన్‌’ పేరుతో 1993లో లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశారు. ప్రభుత్వాలూ ఈ దిశగా కృషిచేసేలా చూడడం దీని ఆశయం. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే మొట్టమొదటి ‘ప్రపంచ వేప సదస్సు’ జరిగింది. వేప గురించి పరిశోధన చేసే, వేప ప్రయోజనాలపై ప్రచారం చేసే వ్యక్తులూ సంస్థలకు తోడ్పాటు నందిస్తూ నాలుగు ప్రపంచస్థాయి సదస్సులను నీమ్‌ ఫౌండేషన్‌ నిర్వహించింది. పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపగల శక్తి ఒక్క వేపకే ఉందంటోంది ఈ సంస్థ.


మందుకే జబ్బు చేస్తే..!

సర్వరోగనివారిణి అయిన వేప సైతం తెగులు బారినపడడం మొత్తంగా దేశాన్నే కలవరపరిచింది. మొదట 2021లో ఈ తెగులు సోకిన చెట్లు నిలువునా కాలినట్లుగా ఎండిపోయాయి. పోమోప్సిస్‌ శిలీంధ్రంతో పాటు టీ మస్కిటో బగ్‌ అనే కీటకాలు సోకి ఆకులు, కొమ్మలు ఎర్రగా మారి క్రమంగా చెట్టుని ఎండిపోయేలా చేస్తున్న ఈ తెగులు ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ అడవుల్లో ప్రారంభమై దేశమంతా వ్యాపించినట్లు మైసూర్‌, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది. మొదటి సారి తెగులుకి కారణమైన శిలీంధ్రాలు చెట్లమీద వదిలిన బీజాల(స్పోర్స్‌) వల్ల గతేడాది రెండోసారి తెగులు వ్యాపించింది. నీళ్లు పెట్టి, సేంద్రియ ఎరువులు వేసి, క్రిమిసంహారకాలు వాడి మొత్తానికి వేపచెట్లను కోలుకునేలా చేశారు. రసాయన క్రిమిసంహారకాల కన్నా గోరింటాకు నూనె, యూకలిప్టస్‌ ఆయిల్‌, మిరియాల నూనె లాంటివి పిచికారి చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మళ్లీ మళ్లీ ఈ తెగులు సోకకుండా చూడడానికి వారు ఇంకా పరిశోధన చేస్తున్నారు.


రాయ్‌పూర్‌ ‘గ్రీన్‌ ఆర్మీ’

ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని వేలమంది మహిళలు వేప గింజలతో ఉపాధి పొందుతున్నారు. వేసవిలో చెట్లమీద పండిపోయిన కాయలన్నీ రాలి కిందపడిపోతాయి. వాటిని మహిళలకు జీవనాధారంగా మార్చాలనుకున్నారు జిల్లా అధికారులు. వేప గింజల్లో ఉన్న ఔషధ విలువల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో 16 వేల వేపచెట్లను గుర్తించి వాటి బాధ్యతను గ్రామాల్లోని మహిళలకు అప్పగించారు. ‘గ్రీన్‌ ఆర్మీ’ పేరుతో ఈ మహిళలంతా రాలిన వేప పండ్లను సేకరించి ఎండబెడతారు. మరి కొన్ని బృందాలు ఎండిన ఆ పండ్లనుంచి గింజలను వేరుచేసి నూనె తీసే బాధ్యత చేపడతాయి. లీటరు నూనెను రూ.250 చొప్పున వాళ్లే అమ్ముతున్నారు. నూనె తీయగా వచ్చిన వ్యర్థాల్ని కూడా పిడకలుగా మార్చి ఎరువుగా అమ్ముతారు. ఇన్నాళ్లూ వేపాకు, పూత మాత్రమే పనికి వస్తుందనుకున్నామనీ పండ్లు ఎందుకూ పనికిరావని చెత్తలో పారేసేవాళ్లమనీ ఇప్పుడవే తమకు ఉపాధి కల్పిస్తున్నాయనీ చెబుతున్నారు గ్రీన్‌ ఆర్మీ మహిళలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..