కేరళ పర్యటకం... ఓ స్ఫూర్తి పాఠం!
ఇదో రాష్ట్రం కథ... ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖకి సంబంధించిన ‘స్ఫూర్తి’ కథ. స్ఫూర్తి అనగానే... అత్యున్నత స్థాయికి ఎదిగిన మనుషుల ఇతివృత్తంగానే ఉండాలనేముంది? ఓ జీవన గమనంలో ఉండేంతటి ఆశయాలూ, సవాళ్లూ, అన్నింటికన్నా మానవీయ కోణాలూ... వేలాది మంది సమష్టి కృషితో సాధించుకున్న ఓ శాఖకి ఎందుకు ఉండకూడదు? కేరళ పర్యటక విభాగానికి అది పుష్కలంగా ఉంది!
కేరళ పర్యటకం... ఓ స్ఫూర్తి పాఠం!
ఇదో రాష్ట్రం కథ... ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖకి సంబంధించిన ‘స్ఫూర్తి’ కథ. స్ఫూర్తి అనగానే... అత్యున్నత స్థాయికి ఎదిగిన మనుషుల ఇతివృత్తంగానే ఉండాలనేముంది? ఓ జీవన గమనంలో ఉండేంతటి ఆశయాలూ, సవాళ్లూ, అన్నింటికన్నా మానవీయ కోణాలూ... వేలాది మంది సమష్టి కృషితో సాధించుకున్న ఓ శాఖకి ఎందుకు ఉండకూడదు? కేరళ పర్యటక విభాగానికి అది పుష్కలంగా ఉంది! ఫలితమే... ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రకటించిన 2023లో చూడాల్సిన 52 ప్రదేశాల జాబితాలో మనదేశం నుంచి ఏకైక ప్రాంతంగా ఎంపికైంది... కేరళ!
‘ఇదో పిచ్చివాళ్ళ కేంద్రం’ అన్నారట స్వామి వివేకానంద 1892 నాటి కేరళని చూసి. ఆ కోపానికి కారణం లేకపోలేదు. నాటి భారతదేశం అంతటా అంటరానితనం ఉన్నా... కేరళలో ఆ దురాచారం మరీ ఎక్కువ. ఒక కులంవాళ్ళు మరో కులంవాళ్ళతో మాట్లాడాలన్నా ఎనిమిది అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాలి. పేదలు తమని తాము భూస్వాములకి అమ్ముకునేవారు. ఆ నేపథ్యంలోనే నారాయణగురు అన్న ఆధ్యాత్మికవేత్త ఎన్నో సంఘసంస్కరణల్ని తెచ్చాడు. అందరికీ చదువు చెప్పే విద్యా సంస్థల్ని నెలకొల్పాడు. ఆయన ప్రభావంతో చైతన్యం పొందిన ఎందరో నేతలు అరవై ఏళ్ళలో అటు రాజకీయంగానూ, ఇటు సాంస్కృతికంగానూ కేరళ పునర్వికాసానికి కారణమయ్యారు. వాళ్ళే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్టు పార్టీల్లో చేరారు. పాలన ఎవరిదైనా సరే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. వివేకానంద వచ్చివెళ్ళిన 80 ఏళ్ళలో... మానవాభివృద్ధి సూచీల పరంగా ఆ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారు. అందరికీ సమాన విద్యావకాశాలతో 1980 నాటికే 91 శాతం అక్షరాస్యతని సాధించారు. ఇవన్నీ బాగానే ఉన్నా... ఆర్థికాభివృద్ధిలో మాత్రం ఆ రాష్ట్రానిది వెనకంజే. నాటి భారతదేశ తలసరి ఆదాయంలో కేరళది సగం మాత్రమే ఉండేది! ఓ వైపు - ఎత్తైన కొండలూ దట్టమైన అడవులూ, మరోవైపు- సముద్రమూ మంచినీటి కాలువలూ వీటి మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ కాబట్టి... కేరళలో భారీ పరిశ్రమల నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. సుగంధద్రవ్యాల ఎగుమతి, చేపలు పట్టడం, ఆ పరిశ్రమకి కావాల్సిన తాళ్ళు పేనడం... ప్రజల ఉపాధికి ఇవే శరణ్యమయ్యాయి. చదువుకున్న యువతీయువకులు ఇతర దేశాలకు వలస వెళ్ళడం విపరీతంగా పెరిగింది. 1980 నాటి కేరళ పరిస్థితి ఇది. దాన్ని మార్చి... ఆర్థిక అభివృద్ధిని సాధించాలనుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు వాళ్ళకి కనిపించిన ఏకైక అవకాశం... పర్యటకం!
ఆరంభం బావున్నా...
ఒకప్పుడు విదేశీ పర్యటకులకి భారతదేశం అంటే దిల్లీ మాత్రమే. దేశరాజధానిని కేంద్రంగా చేసుకుని తాజ్‌మహల్, జైపుర్‌లని చూసి వెళ్ళేవాళ్ళు. దక్షిణాదికంటూ వస్తే తమిళనాడులోని గుళ్ళూగోపురాలూ చూసి తిరుగుముఖం పట్టేవారు. ఓ మూలన విసిరేసినట్టున్న కేరళదాకా ఎవరూ వచ్చేవారు కాదు. ఆ పరిస్థితిని మార్చాలనుకున్నాడు కల్నల్ గోదావర్మ(జీవీ రాజా). 1930లలో ఆ తిరువాన్కూరు మహారాజు చెల్లెలు, యువరాణి లక్ష్మీబాయికి భర్తగా తిరువనంతపురం వచ్చాడాయన. కొబ్బరిచెట్ల నీడలు జీరాడే కోవలం బీచ్‌ని చూసి ముగ్ధుడైపోయాడు. దాన్నో పర్యటక కేంద్రంగా మార్చాలనుకున్నాడు. ఆ బీచ్‌ని అప్పటిదాకా పితృదేవతలకు పిండం పెట్టడానికే ఉపయోగించేవారట ప్రజలు! అలాంటిదాన్ని ఎంతో శుభ్రంగా తీర్చిదిద్దాడు. పర్యటకాభివృద్ధి కోసం ‘గెస్ట్ డిపార్ట్‌మెంట్’ అనే ప్రత్యేక శాఖని ఏర్పాటుచేసి... మనదేశంలోని బ్రిటిష్‌వాళ్ళనీ సంస్థానాధీశుల్నీ కోవలం బీచ్‌కి ఆహ్వానించడం మొదలుపెట్టాడు. ఈలోపు తిరువాన్కూరు రాజ్యం భారతదేశంలో అంతర్భాగమైపోయింది. దానికి మలయాళం మాట్లాడే చుట్టుపక్కల రాజ్యాలన్నీ కలిసి కేరళ అన్న కొత్త రాష్ట్రం ఏర్పడింది. జీవీ రాజా తాను నిర్వహిస్తూ వచ్చిన గెస్ట్ డిపార్ట్‌మెంట్‌ని ‘కేరళ ట్రావెల్స్’ పేరుతో ప్రయివేటు కంపెనీగా మార్చాడు. అది చూసి రాష్ట్రప్రభుత్వమూ పర్యటకం వైపు నడిచింది. నాటి పాలకులు కమ్యూనిస్టులైనా సరే... అలనాటి సంప్రదాయాలని పునరుద్ధరించాలనుకున్నారు. ఒకప్పుడు కొన్ని కుటుంబాలకే పరిమితమైన ఓనమ్ పండుగని రాష్ట్రవ్యాప్తంగా అందరూ చేసుకునేలా ప్రోత్సహించారు. జీవీ రాజా ఓ అడుగు ముందుకేసి ప్రపంచ ప్రఖ్యాత పర్యటక సంస్థ ‘థామస్ కుక్’తో ఒప్పందం చేసుకుని లండన్ నుంచి విదేశీయుల్ని రప్పించసాగాడు. ఆయన వ్యాపారం మూడుపువ్వులూ ఆరు కాయలుగా సాగడం చూసిన ప్రభుత్వం... కేరళ ట్రావెల్స్ సంస్థని జాతీయం చేయాలని పట్టుబట్టింది. విషయం కోర్టుకెక్కింది. అది ఎంతకీ తెగకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తమకంటూ ఓ సొంత పర్యటక సంస్థని ఏర్పాటుచేసుకోవాలనుకుంది. దేశంలోనే తొలిసారి పర్యటకాభివృద్ధి సంస్థ(కేటీడీసీ)ని ఏర్పాటుచేసుకుంది. నాటి నుంచి అటు కేటీడీసీ, ఇటు కేరళ ట్రావెల్స్... రెండూ విదేశీయుల్ని ఆకర్షించడంలో పోటీపడ్డాయి. ఆ పోటీ ఓ అనుకోని విపరిణామానికి దారితీసి పర్యటకంగా కేరళ పేరు మసకబారింది!
‘హిప్పీ’ల హల్‌చల్...
1970ల్లో ప్రపంచాన్ని ముంచెత్తిన హిప్పీ సంస్కృతి... కేరళనీ వదల్లేదు. పర్యటకుల ముసుగులో వచ్చిన హిప్పీలు... కోవలం బీచ్‌ని తమ అడ్డాగా మార్చుకున్నారు. విచ్చలవిడితనానికి తెరలేపారు. మద్యం, మాదకద్రవ్యాలు, లైసెన్స్‌లేని తుపాకులతో హల్‌చల్ చేసేవారు. ఈ పరిణామాలపైన సినిమాలూ వచ్చాయి! తన పర్యటక ప్రయత్నాలు ఇలా బెడిసికొట్టాయని బాధపడ్డ జీవీ రాజా కేరళ ప్రభుత్వంతో కలిసి నడుస్తానని హామీ ఇచ్చాడు. కానీ, కొన్నాళ్ళకే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కేరళ పోలీసులు ఉక్కుపాదం మోపి హిప్పీలని తిప్పి పంపినా... అప్పటికే నష్టం జరిగిపోయింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకుంటుందనుకున్న పర్యటకం చతికిలపడింది. పదేళ్ళపాటు ఏ వృద్ధీ లేదు! ఈ నేపథ్యంలోనే 1985లో మళ్ళీ కదలిక మొదలైంది. పాత అనుభవాన్ని ఓ పాఠంగా మార్చుకుని... ఆ చెడుముద్రని చెరిపేయడమే పెద్ద సవాలుగా తీసుకుని కేరళ ముందడుగేసింది...
తొలి విజయాలు!
కేరళ అనగానే బ్యాక్‌వాటర్స్‌పైన పడవ ప్రయాణం, ఆయుర్వేద చికిత్సలు, మున్నార్ వేసవి విడిది, కథకళి, ఏనుగులు... ఇవన్నీ కళ్ళముందు కదలాడుతుంటాయి. కానీ, కేరళలాగే అందమైన బ్యాక్‌వాటర్స్ ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిదిరాష్ట్రాల్లో ఉన్నాయి. గొప్ప ఆయుర్వేద కేంద్రాలెన్నో ఉత్తరాఖండ్‌లో కనిపిస్తాయి. తమిళనాడులోని ఊటీ కొడైకెనాల్‌లు మున్నార్‌ని మించిపోతాయి! కథకళిలాంటి సంప్రదాయ కళలు- దాదాపు అన్ని రాష్ట్రాలకూ ఉన్నాయి. ఏనుగులూ... ఒక్క కేరళకే పరిమితం కాదు. మరి ఆ రాష్ట్రాల వద్దకు పెద్దగా రాని పర్యటకులు ఇక్కడికే ఎలా వస్తున్నారు? ఇందుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి... అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహం! రెండు... ఆ వ్యూహాన్ని రచించిన అధికారుల అమేయ అంకితభావం! పర్యటకం తప్ప రాష్ట్రాన్ని ఇంకేదీ కాపాడలేదన్న కృతనిశ్చయంతో... ఏరికోరి ప్రతిభావంతులైన ఐఏఎస్ అధికారుల్ని ఈ శాఖ కార్యదర్శులుగా నియమించసాగింది అక్కడి ప్రభుత్వం. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. టి.బాలకృష్ణన్ అలాంటి అధికారుల్లో మొదటివాడు. మన దేశంలో ఆర్థిక సంస్కరణలన్నవి లేని రోజుల్లోనే పర్యటక రంగంలో ప్రయివేటు సంస్థల్ని ఆహ్వానించాడాయన. ఒక్క కోవలం బీచ్, దానికి దగ్గర రెండు స్టార్ హోటళ్లు... మాత్రమే ఉన్న కేరళ పర్యటక జాబితాలో మున్నార్, ఆలప్పుళ... వంటి ఎన్నో ప్రదేశాలు చేరడానికీ మరెన్నో హోటళ్ళూ రావడానికీ కారణమయ్యాడు. 1986 తర్వాత వీటిని మరింత ముందుకు దూకించారు కె.జయకుమార్ అనే మరో ఐఏఎస్! ‘కేరళ - గాడ్స్ ఓన్ కంట్రీ’ అన్న నినాదం తెచ్చింది ఆయనే!
వాళ్ళు... బ్యాక్ బెంచర్స్!
‘80ల చివర్లో నాటి కేంద్ర పర్యటక శాఖ మీటింగులకి మేం వెళుతుండేవాళ్ళం. ఆనాటి మీటింగ్ హాల్లో రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలకే అగ్రతాంబూలం దక్కేది. మాకు చివరి బెంచ్‌లే కేటాయించేవారు. మమ్మల్నందరూ ‘బ్యాక్ బెంచర్స్’ అని వేళాకోళమాడేవారు...’ అంటారు జయకుమార్! పర్యటక కేంద్రాలకి సంబంధించి ఆకర్షణీయమైన కరపత్రాలని తయారుచేయడానికి శ్రీకారం చుట్టింది ఆయనే. మరే రాష్ట్రమూ చేయని విధంగా కేరళకి సంబంధించి తొలిసారి ఆంగ్లపత్రికలూ, ఇతర రాష్ట్రాల పత్రికల్లోనూ ప్రకటనలిచ్చారు. తొలిసారి దేశవిదేశీ ప్రయివేటు టూర్ ఆపరేటర్‌లని ప్రోత్సహించారు. అలా యూరప్ నుంచి 200 మంది పర్యటకులతో చార్టర్డ్ ఫ్లైట్ 1990లో కేరళ వచ్చింది! అలాంటి ఫ్లైట్‌ని రప్పించుకున్న మొదటి రాష్ట్రం కేరళనే! అంతేకాదు, అప్పటికే అంతరించే దశలో ఉన్న కథకళిని పర్యటనకి ముడిపెట్టి... ప్రత్యేక షోలతో వాటికి కొత్త ఊపిరినిచ్చారు. ‘నాలుగు రోజులు ఆడాల్సిన నృత్యరూపకాన్ని... విదేశీయుల కోసం 20 నిమిషాలకి కుదిస్తారా?’ అని విమర్శకులు తీవ్రంగా ధ్వజమెత్తారట అప్పట్లో. ‘ఆ మాత్రం చేయకపోతే... కళాకారులు పస్తులుండాల్సి వచ్చేది’ అన్నది జయకుమార్ ఇచ్చిన జవాబు. అదే నిజమైంది... కేవలం పర్యటకం వల్లే ఆ కళ బతికింది! ఈ ప్రయత్నాలతో విదేశీ పర్యటకుల సంఖ్య పెరిగి... కేంద్రానికి విదేశీ మారకద్రవ్యమూ పెద్ద ఎత్తున అందసాగింది. ఒకప్పుడు ఇక్కడి అధికారులకి చివరి కుర్చీలు చూపించే కేంద్ర ప్రభుత్వం... ముందువరసలు కేటాయించింది! పర్యటకరంగానికి అవసరమైన సిబ్బందిని తయారుచేసే ‘కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ స్టడీస్(కిట్స్)’ స్థాపనకు నిధులిచ్చారు. పర్యటకానికి సంబంధించి మనదేశంలో తొలి శిక్షణా సంస్థ అదే!
పర్యటకం పరిశ్రమగా!
‘లక్షమంది విదేశీ యాత్రికులు వస్తే చాలు!’ అన్న లక్ష్యంతో ఈ ప్రయత్నాలన్నీ ప్రారంభిస్తే... వాళ్ళ సంఖ్య రెండేళ్ళకి రెండు లక్షలకు చేరింది. 1991 నుంచి ఇక్కడికి డైరెక్ట్ విదేశీ విమానాల రాక మొదలైంది. 1995లో కమ్యూనిస్టుల స్థానంలో కాంగ్రెస్‌వాళ్ళు పాలనపగ్గాలు తీసుకున్నారు. అయితేనేం, మిగతా రాష్ట్రాల్లా పాత ప్రభుత్వాల పథకాలని మూలనపడేయలేదు.
వాటిని మరింతగా ముందుకు దూకించారు. దేశంలోనే తొలిసారి పర్యటకాన్ని పరిశ్రమగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. పర్యటనల కోసం స్పెషల్ టూరిజం జోన్(ఎస్‌టీజడ్)లని ఏర్పాటుచేశారు. ఈ దశలోనే ఇక్కడి పర్యటక శాఖకి కొత్త కార్యదర్శిగా వచ్చారు అమితాబ్ కాంత్ ఐఏఎస్. కేరళ ఆయుర్వేద చికిత్సని కూడా ఓ పర్యటక ప్యాకేజీగా మార్చింది ఈయనే! టూరిజం ప్రమోషన్‌ని కేవలం కరపత్రాలకే పరిమితం చేయకుండా ప్రముఖ దర్శకుడూ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్‌తో వీడియోలు తీయించి విదేశీ ఛానల్‌లో ప్రచారం చేశారు. వాటికి మంచి ఆదరణ లభించింది. 1999 నుంచి వరసగా మూడేళ్ళపాటు ఉత్తమ పర్యటక రాష్ట్ర అవార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని భూలోక స్వర్గాల్లో ఇదీ ఒకటని ఆకాశానికెత్తేసింది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్! 2000 ఏడాదిలో ‘సార్స్’ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యటకుల సంఖ్య 11.14 శాతం పడిపోతే కేరళలో మాత్రం 11 శాతం వృద్ధి నమోదైంది. అప్పటికి ఇరవైయేళ్ళపాటు సాగిన ప్రయత్నాలకి... ఇంతకన్నా విజయ సూచిక ఏముంటుంది? అలా ఏడేళ్ళు గడిచాయి. పర్యటకం నుంచి ఓ రాష్ట్రం ఏం కోరుకుంటుందో అవన్నీ కేరళకి సమకూరాయి. కానీ ఇక్కడే ఆ రాష్ట్రం తన విధానాల విషయంలో ఓ కొత్త మలుపు తీసుకుంది...
పర్యటక రంగం... పేదల కోసం!
ఆయన పేరు చంద్రన్... కొయ్య బొమ్మలు చేసే కళాకారుడు. పడవ ప్రయాణానికి ప్రసిద్ధిచెందిన కుమరకోమ్‌లో ఆయనకి రెండెకరాల పొలం ఉండేది. పర్యటక అభివృద్ధి పథకంలో భాగంగా ఆ భూమి హోటల్ నిర్మాణానికి ఇవ్వాల్సి వచ్చింది. వచ్చిన డబ్బు ఏడాదిలోనే ఆవిరైపోయింది. పొలం తీసుకున్న హోటల్‌వాళ్ళు చంద్రన్‌ని కూలీగా కూడా లోపలికి రానివ్వలేదు! ఈ నేపథ్యంలోనే చంద్రన్ కుటుంబంతోపాటూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు! ... స్పెషల్ టూరిజం జోన్‌ల కింద ఒక్క నేల మాత్రమే కాదు... కాలువలూ, సరస్సులూ ప్రయివేటు కంపెనీల పరం అయిపోయాయి. హోటల్ యాజమాన్యాలు స్థానికుల్ని కాకుండా తక్కువ జీతానికి వస్తారని ఇతర రాష్ట్రాలవాళ్ళని రప్పించుకోసాగాయి. అంటే, పర్యటకంతో లభించిన అభివృద్ధి ఫలాలు... ప్రభుత్వానికి అందాయికానీ ప్రజలకు చేరలేదు! దాంతో కడుపులు కాలినవాళ్ళు నిరసనలకు దిగారు. ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ప్రజాసంఘాలని పిలిచి మేధోమథనం జరిపారు. ఆ మథనం నుంచి పుట్టిందే ‘రెస్పాన్సిబుల్ టూరిజం’(ఆర్టీ)! అంటే... అటు ప్రజల్నీ ఇటు పర్యావరణాన్నీ కాపాడే బాధ్యతాయుత పర్యటకం అన్నమాట. డాక్టర్ ఆర్.వేణు అనే పర్యటక కార్యదర్శి ఈ సరికొత్త విధివిధానాలను రూపొందించారు. పర్యటకంలో అన్ని అంచెల్లోనూ ప్రజల్ని మమేకం చేసే విధానం ఇది. ఉదాహరణకి... కుమరకోమ్‌లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చంద్రన్ కుటుంబాన్ని చేరదీసింది పర్యటక శాఖ. ఆయన ఉత్పత్తుల్ని కుమరకోమ్‌లోని స్టార్ హోటళ్ళలో డిస్‌ప్లేకి ఉంచింది. దాంతో చంద్రన్ బొమ్మలకి డిమాండు పెరిగింది. పర్యటకులు కొందరు ఆయన దగ్గరే శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చంద్రన్ రోజుకి మూడువేల రూపాయలు సంపాదిస్తున్నాడు. కుమ్మర్లు, జాలర్లూ, వడ్రంగులు... ఇలా వృత్తినిపుణులందరినీ పర్యటకంతో ముడిపెట్టింది పర్యటక శాఖ. అంతేకాదు...
స్త్రీలే ముందు నిలిచారు...
పర్యటక కేంద్రాల్లో ఉన్న స్టార్ హోటళ్ళన్నీ తమకి కావాల్సిన బియ్యం కాయగూరలన్నిటినీ స్థానిక రైతుల దగ్గరే తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం. ఇందుకోసం ‘కుటుంబశ్రీ’ వ్యవస్థని రంగంలోకి దించింది. కుటుంబశ్రీ... జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్న మహిళా స్వయం ఉపాధి సంఘాల సమాఖ్య. ఈ సమాఖ్య ద్వారా రైతు సమితుల్ని ఏర్పాటుచేసి వాళ్ళ ద్వారానే హోటళ్ళకి వ్యవసాయ ఉత్పత్తులు అందేలా చేసింది. అటు రైతులకీ, ఇటు హోటళ్ళ వాళ్ళకి ఇది లాభదాయకంగా మారింది. ఇలా ప్రజలే ముందుండి పర్యటకాన్ని నడిపేలా పర్యటక రంగాన్ని తీర్చిదిద్దింది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఫార్మ్ టూరిజం, విలేజ్ లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, ఎకో టూరిజం వంటి వినూత్న పద్ధతులన్నీ రెస్పాన్సిబుల్ టూరిజం కింద ఆ రాష్ట్రం రూపొందించినవే! ఆ ప్రజల ఆత్మీయ పలకరింపులూ ఆదరణ కారణంగానే ‘ప్రపంచంలోని వంద గొప్ప ఎకో టూరిజం కేంద్రాల్లో ఒకటి’గా గతేడాది కేరళని గుర్తించింది ‘టైమ్స్’ పత్రిక! అమెరికాకి చెందిన న్యూయార్క్ టైమ్స్ ‘2023లో చూడాల్సిన గొప్ప పర్యటక కేంద్రాల్లో’ ఒకటిగా ఈ రాష్ట్రాన్ని నిలిపింది.
కేరళ రాష్ట్ర జీడీపీలో పర్యటక శాఖ వాటా 10 శాతం. రూపాయల్లో చెప్పాలంటే... సుమారు 40 వేల కోట్లు. ఒకప్పుడు మనదేశంలో అతితక్కువ తలసరి ఆదాయం ఉన్న ఈ రాష్ట్రమే... 2.57 లక్షలతో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ఆరో రాష్ట్రంగా నిలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 25 శాతం ప్రజల ఉపాధికి పర్యటక రంగమే దోహదపడుతుంది. అంటే, కేరళలో నలుగురిలో ఒకరు పర్యటక శాఖ ద్వారా లబ్ధిపొందుతున్నారన్నమాట! ఇంకోరకంగా చెప్పాలంటే- ఇంటికొకరికి దీనివల్ల జీవనాధారం లభించింది! ఇది కదా... అభివృద్ధి అంటే!!
మనవాళ్ళు సైతం!
కేరళ పర్యటక వృద్ధికి కృషిచేసినవారిలో తెలుగువారైన కృష్ణతేజ మైలవరపు కూడా ఒకరు. కరోనా నేపథ్యంలోనే ఆయన 2021లో కేరళ పర్యటక శాఖకి సంచాలకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. కొవిడ్ భయం కారణంగా ప్రత్యేకంగా ప్రయాణాలు చేయాలనుకునేవాళ్ళ కోసం వినూత్నంగా ‘క్యారవాన్ టూరిజం’ తెచ్చి తనదైన ముద్రవేశారు. ‘కేరళ పర్యటక శాఖ ఐఏఎస్‌లని వివిధ దశలవారీగా తీర్చిదిద్దుతుంది. నా విషయాన్నే తీసుకోండి... ముందుగా కేటీడీసీ డైరెక్టర్‌గా అనుభవం గడించేలా చేశారు. అక్కడ అవగాహన వచ్చాకే... కీలకమైన పర్యటకశాఖకి డైరెక్టర్‌గా నియమించారు. ఎందరో గొప్ప అధికారులు సారథ్యం వహించిన శాఖలో పనిచేయడాన్ని గర్వంగా ఫీలవుతాను’ అంటారు కృష్ణ తేజ. గత ఏడాది ఇదేశాఖకి ప్రిన్సిపల్ కార్యదర్శిగా వచ్చిన కె.శ్రీనివాస్ కూడా తెలుగువారే.
అందుకే... దేెవభూమి!
1739లో నాటి తిరువాన్కూరు సంస్థానం పాలకుడు మార్తాండవర్మ తన రాజ్యాన్ని అనంతపద్మనాభస్వామికి అంకితం చేస్తున్నానని ప్రకటించాడు. దాని ప్రకారం, ఇక్కడి పాలకులు కేవలం సేవకులు మాత్రమే. ఈ రాజ్యానికి విష్ణువే అధిపతి! అందుకే స్థానికులు దీన్ని దేవభూమి అంటారు. 1989లో ప్రకటనల కోసం ఓ ఆకర్షణీయమైన స్లోగన్ తయారుచేసే పనిని ప్రముఖ యాడ్ సంస్థ ముద్రా కమ్యూనికేషన్‌కి ఇచ్చారు. నాటి పర్యటక శాఖ కార్యదర్శి జయకుమార్, ముద్రా కమ్యూనికేషన్ చీఫ్ క్రియేటివ్ డైరెక్టర్ వాల్టర్ మెండిస్ 20 రోజులపాటు ఇందుకోసం కసరత్తు చేశారట. చివరికి కేరళ చరిత్రని గుర్తుకుతెచ్చినట్టు ఉంటుందని ‘గాడ్స్ కంట్రీ’ అన్న పదాలని చెప్పారట మెండిస్. ‘ఆ రెండు పదాల మధ్య ‘ఓన్’ అన్నదాన్ని చేర్చి... ‘కేరళ- గాడ్స్ ఓన్ కంట్రీ’ నినాదాన్ని ఖాయం చేశాను’ అంటారు జయకుమార్! ఈ నినాదం ఇప్పుడు పలు విశ్వవిద్యాలయాల్లోని మార్కెటింగ్ విద్యార్థులకు పాఠం అయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అజింక్య రహానె స్వేచ్ఛగా ఆడేస్తాడు..: సంజయ్ మంజ్రేకర్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Delhi liquor case: మాగుంట రాఘవ్‌కు బెయిల్.. సుప్రీంకు ఈడీ
-
India News
Mansoon: చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్..
-
Sports News
WTC Final: అప్పటికే భారత ఆటగాళ్లలో అలసట కనిపించింది: సునీల్ గావస్కర్
-
Movies News
Sirf Ek Bandaa Kaafi Hai Review: రివ్యూ: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై