సేవకు... లక్షన్నర కోట్లు!

సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయి... అన్నది కవి వాక్కే కాదు, మన సమాజ ధర్మం కూడా. దాన్ని వ్యాపారసంస్థలన్నీ తప్పకుండా పాటించాలని భావించి తెచ్చిందే ‘కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’ విధానం.

Updated : 24 Sep 2023 15:42 IST

సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయి... అన్నది కవి వాక్కే కాదు, మన సమాజ ధర్మం కూడా. దాన్ని వ్యాపారసంస్థలన్నీ తప్పకుండా పాటించాలని భావించి తెచ్చిందే ‘కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’ విధానం. సరిగ్గా పదేళ్ల క్రితం మనదేశంలో చట్టంగా మారిన సీఎస్‌ఆర్‌ కింద ఇప్పటికి దాదాపు లక్షన్నర కోట్లను వ్యాపారసంస్థలు సమాజం కోసం ఖర్చుపెట్టడం విశేషం. దీనికింద విద్య, వైద్య రంగాలు ఎంతగానో లబ్ధి పొందుతున్నాయి.

బాటసారులకు నీడనిచ్చేందుకు అశోకుడు రోడ్ల పక్కన చెట్లను నాటించాడనీ కాకతీయులు నీటికోసం చెరువులు తవ్వించారనీ చిన్నప్పుడు చదువుకున్నాం. దాదాపు పద్దెనిమిదో శతాబ్దం వరకూ ప్రజాసంక్షేమానికి పాటుపడడం పాలకుల బాధ్యతే. ఆ తర్వాత ఊళ్లలో జమీందార్లూ సంపన్నులూ తమ పేర్ల మీద స్కూళ్లూ ఆస్పత్రులూ లాంటివి కట్టించారు. దానధర్మాల కింద ఇప్పటికీ కొందరు అలాంటివి చేయడం చూస్తూనే ఉంటాం. అసలు ప్రపంచమంతటా ఇప్పుడున్నది ప్రజాప్రభుత్వాలే. అటువంటప్పుడు ప్రజా సంక్షేమానికి పాటుపడాల్సిన బాధ్యత ప్రభుత్వాలే వహించవచ్చు కదా... వ్యాపార సంస్థలకు ఎందుకూ అంటే- దానికి బలమైన కారణమే ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాల ముందు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల పేరుతో 17 లక్ష్యాలను పెట్టింది. ప్రభుత్వాల బడ్జెట్లకీ లక్ష్యాలసాధనకి అవసరమైన బడ్జెట్‌కీ మధ్య దాదాపు రెండువందల లక్షల కోట్లకు పైగా వ్యత్యాసం ఉందట. వ్యాపార సంస్థలు పూనుకుంటేనే ఆ అంతరాన్ని పూడ్చవచ్చనీ ప్రైవేటు సంస్థలన్నీ తమ సామాజిక బాధ్యతను తలకెత్తుకుంటే 2030 నాటికి ఆ లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమేననీ ఇప్పుడు ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. అందుకే సామాజిక బాధ్యత అన్నది కీలక విషయంగా మారింది.

అసలేమిటీ సామాజిక బాధ్యత?

అది తెలియాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాలి. పారిశ్రామిక విప్లవం తర్వాత చాలాకాలంపాటు శ్రమదోపిడీ కొనసాగింది. కార్మిక సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చాకిరీ చేయించుకునేవారు. అలాంటి సమయంలో 1893లో ‘పుల్‌మన్‌ పాలస్‌’ అనే కార్ల కంపెనీ మొదటిసారి కార్మికుల కోసం ఒక మోడల్‌టౌన్‌ని నిర్మించి వ్యాపార ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఆ తర్వాత చాకొలెట్ ఫ్యాక్టరీ యజమాని మిల్టన్‌ హెర్షీ కూడా కార్మికుల కోసం రిక్రియేషన్‌ పార్కుల్నీ అనాథ పిల్లలకు స్కూలునీ ఏర్పాటుచేశాడు.  ఆండ్రూ కార్నెగీ, జాన్‌ డి.రాక్‌ఫెల్లర్‌ లాంటివాళ్లు విద్యా, పరిశోధనా సంస్థల ద్వారా సమాజానికి సేవచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తే ఆటోమేటిగ్గా ఉత్పాదకత పెరుగుతుందన్న ఆలోచననీ, సమాజానికి మంచి చేస్తే వ్యాపారానికీ మంచి పేరు వస్తుందన్న గుర్తింపునీ కలిగించాయి ఈ పరిణామాలు. అదే సమయంలో వచ్చిన ప్రపంచయుద్ధాలు వ్యాపార సంస్థలు సామాజిక బాధ్యత గురించి ఆలోచించక తప్పని పరిస్థితులు తెచ్చాయి. పలు సంస్థలు సైనికులకు ఆహారాన్ని సరఫరా చేశాయి. సొంతపనులు మానుకుని ప్రభుత్వానికి అవసరమైనవి తయారుచేసిచ్చాయి. వ్యాపార సంస్థలు పౌరసమాజానికీ సేవలు అందించవచ్చన్న ఆలోచనకు బీజం పడింది అప్పుడే. ఈ నేపథ్యంలోనే 1953లో ‘సోషల్‌ రెస్పాన్సిబిలిటీస్‌ ఆఫ్‌ ద బిజినెస్‌మ్యాన్‌’ అన్న పుస్తకం రాసి హార్వర్డ్‌ బొవెన్‌- ‘ఫాదర్‌ ఆఫ్‌ సీఎస్‌ఆర్‌’ అనిపించుకున్నారు. ఈ పుస్తకం వ్యాపారరంగంలో నైతికత గురించీ, వ్యాపారవర్గాల సామాజిక బాధ్యత గురించీ విపులంగా చర్చిస్తుంది. అలా క్రమంగా సంస్థలే స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతలను తలకెత్తుకోవడం సంప్రదాయంగా మారింది. చట్టమేమీ లేకున్నా ఫార్చూన్‌ గ్లోబల్‌-500 కంపెనీలు ఏటా లక్షా 65 వేల కోట్ల రూపాయల్ని సీఎస్‌ఆర్‌ కింద ఖర్చుపెడుతున్నాయి.

మనదేశంలో ఎలా మొదలైంది?

దక్షిణాఫ్రికా నుంచి వచ్చి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడం మొదలెట్టిన గాంధీజీ సమాజంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. సంపద కొంతమంది దగ్గరే పోగుపడి ఉండడం సమాజానికి మంచిది కాదని భావించిన ఆయన ధర్మకర్తృత్వ విధానాన్ని(ట్రస్టీషిప్‌) ప్రతిపాదించారు. సమాజం స్వావలంబన సాధించాలంటే సంపన్నులు తలో చేయీ వేసి సంక్షేమ కార్యక్రమాలపై పెట్టుబడి పెట్టాలని పిలుపునిచ్చారు. అది మంచి ఫలితాన్నిచ్చింది. టాటా, బజాజ్‌ లాంటి సంస్థలు కొన్ని ట్రస్టుల్ని ఏర్పాటుచేసి, వాటి ఆధ్వర్యంలో పాఠశాలల్నీ పరిశోధనా సంస్థల్నీ నెలకొల్పాయి. స్వాతంత్య్రం వచ్చాక బిర్లా, గోద్రెజ్‌ లాంటివీ వాటి సరసన చేరాయి. ఎనభయ్యో దశకం తర్వాత ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఎగుమతి, దిగుమతి వ్యవహారాలు పెరగడంతో మనదేశంలోని పెద్ద వ్యాపారసంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవడం మొదలెట్టాయి. ఆ క్రమంలో పలు సంస్థలు సీఎస్‌ఆర్‌ని అమలుచేయడాన్ని అవి గుర్తించాయి. అయితే సీఎస్‌ఆర్‌ అన్ని దేశాల్లోనూ ఉన్నా చట్టంగా తెచ్చింది మాత్రం మనదేశం ఒక్కటే.

ఎందుకలా?

నిజానికి స్వచ్ఛందంగా సీఎస్‌ఆర్‌ను చేపట్టమని ప్రోత్సహిస్తూ 2009లోనే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. తర్వాతమూడేళ్లకు టాప్‌ 100 లిస్టెడ్‌ కంపెనీలూ ఆ గైడ్‌లైన్స్‌  కింద ఏం చేసిందీ నివేదిక ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొంది సెబి. అలా అంచెలంచెలుగా చేపట్టిన ప్రయత్నాల్లో తెలిసిందేమిటంటే- కొందరు నిజాయతీగా ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా కొందరు ఏమీ చేయకుండానే తప్పుడు లెక్కలు చూపేవారు. దాంతో చట్టం చేయడం తప్పనిసరైంది. వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా సంపదను సృష్టిస్తాయి. ఆ సంపద నుంచి రెండుశాతం సమాజం కోసం ఖర్చుచేయడం మంచిదని భావించిన ప్రభుత్వం 2013 ఆగస్టులో ఈ చట్టాన్ని తేగా 2014 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం- వెయ్యికోట్లు అంతకన్నా ఎక్కువ టర్నోవరు, లేదా 500 కోట్ల నికర విలువ, లేదా ఐదు కోట్లు అంతకన్నా ఎక్కువ నికర లాభం (పన్నులకన్నా ముందు) ఆర్జిస్తున్న కంపెనీలు తప్పనిసరిగా తమ ఆదాయంలో రెండు శాతాన్ని సామాజిక అంశాలపై ఖర్చు చేయాలి. ప్రతి కంపెనీలోనూ సీఎస్‌ఆర్‌ కమిటీని ఏర్పాటుచేయాలి. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ చటర్జీ ఈ చట్టానికి సంబంధించిన నియమనిబంధనల్ని రూపొందించారు. అందుకే ఆయన్ని ‘ఫాదర్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ఇన్‌ ఇండియా’ అంటారు.

ఖర్చు చేయకపోతే..?

అది జరిమానా లేదా జైలుశిక్ష విధించదగ్గ నేరం. ఇప్పటివరకూ సంస్థలకైతే కోటిరూపాయలూ, అధికారులకైతే రెండు లక్షలూ చొప్పున జరిమానా విధిస్తున్నారు. అలాగని కొంత మొత్తం విరాళంగా ఇచ్చో దానధర్మాలు చేసో చేతులు దులుపుకోవడమూ తప్పే.

ఎందుకని?

దాతృత్వానికీ సీఎస్‌ఆర్‌కీ తేడా ఉంది. దాతృత్వం వల్ల సమాజంలో మార్పు తేవచ్చు. దారిద్య్రాన్ని తరిమేయొచ్చు. కానీ సీఎస్‌ఆర్‌ పరిధి ఇంకా విస్తృతం. దాతృత్వం తిరిగి ఏమీ కోరదు. సీఎస్‌ఆర్‌ వల్ల వారి వ్యాపారానికి కూడా ప్రయోజనం ఉంటుంది. దాతృత్వం విషయంలో నైతికత, విలువల ప్రస్తావన ఉండదు. సీఎస్‌ఆర్‌లో వ్యాపార సంస్థలకు విలువలూ నైతిక ప్రమాణాలూ ముఖ్యం. ఒక కంపెనీ ఆర్థిక ప్రగతి దాని భాగస్వాములకూ, సిబ్బందికీ, వినియోగదారులకూ... లాభం కలిగించాలి, అదే సమయలో సమాజానికీ తిరిగివ్వాలి. అందుకే సీఎస్‌ఆర్‌ని నాలుగు రకాల బాధ్యతగా పేర్కొంటారు.
పర్యావరణ బాధ్యత: ఉత్పత్తి ప్రక్రియలో పర్యావరణానికి హాని కలుగకుండా, వనరులను పొదుపుగా వినియోగించాలి. కాలుష్యాన్ని తగ్గించాలి, రీసైక్లింగ్‌కి ప్రాధాన్యమివ్వాలి.

నైతిక బాధ్యత: నిజాయతీనీ, పారదర్శకతనీ అనుసరిస్తూ అన్నిరకాల సమానత్వాన్నీ పాటించాలి. మానవహక్కులకు భంగం కలిగించకూడదు.
దాతృత్వ బాధ్యత: సమాజాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి సంస్థ తన నిధుల నుంచి ఎంత మొత్తం వినియోగిస్తోందనేది ఈ విభాగం చెబుతుంది.
ఆర్థిక బాధ్యత: ఆ నిధుల్ని బాధ్యతాయుతంగా ఖర్చుపెట్టడమూ ముఖ్యం. చట్టప్రకారం తప్పదు కనుక మొక్కుబడిగా కాక సమాజం మీద ఎంత ప్రభావం చూపుతుందన్నది గుర్తించి ఖర్చుపెట్టాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం వల్లనే చాలా సంస్థలు విద్య, వైద్యం, ఉపాధి కార్యక్రమాలపై ఎక్కువగా ఖర్చుపెడుతున్నాయి. ఉదాహరణకి... ఝార్ఖండ్‌లోని ఒక జిల్లాలో తల్లుల్లో పోషకాహారలోపం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుట్టి పురిట్లోనే చనిపోయేవారు. జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాల్లో అధికశాతం ఇలాంటివేనని తేలడంతో రంగంలోకి దిగిన టాటాస్టీల్‌ లిమిటెడ్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ కింద ఒక పథకాన్ని చేపట్టింది. 200 మంది యువతులకు శిక్షణ ఇచ్చి వారిచేత 169 గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లి కాబోయేమహిళల వివరాలు నమోదుచేయించింది. వాళ్లందరి ఆరోగ్యాన్నీ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన మందులూ పోషకాహారమూ ఇస్తూ కాన్పు  అయ్యేవరకూ కనిపెట్టుకుని ఉండడం వల్ల మూడేళ్లలో అక్కడ శిశుమరణాలు పూర్తిగా తగ్గిపోయాయి.

దీనివల్ల కంపెనీకి లాభమేంటీ?

సమాజంకోసం చేసే ఈ పనుల వల్ల వ్యాపారసంస్థలూ లబ్ధిపొందుతాయి. కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవడం వల్ల వాటి బ్రాండ్‌ విలువ పెరుగుతుంది. ప్రత్యేకించి సామాజిక బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించే కంపెనీలను ఉద్యోగులు ఇష్టపడతారనీ అలాంటి కంపెనీలను వదిలి వెళ్లిపోరనీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పెట్టుబడిదారులకు కూడా అలాంటి సంస్థల మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

ఎలాంటి పనులు చేయొచ్చు?

సామాజిక బాధ్యత కింద నిర్మాణాత్మక కార్యక్రమం ఏదైనా చేపట్టవచ్చు. అవగాహనా కార్యక్రమాలతో మొదలెట్టి ఆర్థిక సహాయం, నైపుణ్యాల్లో శిక్షణ, మహిళాసాధికారత, విద్య, వైద్యం, గ్రామీణ పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, ఉపాధికల్పన, మురికివాడల అభివృద్ధి... ఇలా ఎన్నో పనులు చేపట్టవచ్చు. అందుకు స్థానిక ఎన్జీఓల సహకారమూ తీసుకోవచ్చు.

ఎవరెవరు ఏం చేస్తున్నారు?

స్వాతంత్య్రానికి పూర్వంనుంచీ సేవలందిస్తున్న టాటా ట్రస్టుల్లాంటివే కాకుండా ఆ తర్వాత కాలంలోనూ కొన్ని సంస్థలు ఈ దిశగా కృషిచేస్తున్నాయి. మహీంద్ర అండ్‌ మహీంద్ర సంస్థ 1954లోనే కేసీ మహీంద్ర ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, 1969లో మహీంద్రా ఫౌండేషన్లను పెట్టి పలు ఎన్జీవోలతో కలిసి వేర్వేరు రంగాల్లో సేవలందిస్తోంది. తమ లాభాల్లో ఒక్క శాతం వీటికి ఖర్చుచేయాలని 2005లోనే నిర్ణయించింది. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ 1996 నుంచీ, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ 2001 నుంచీ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ 2010 నుంచీ, హెచ్‌టీ పరేఖ్‌ ఫౌండేషన్‌ 2012 నుంచీ పనిచేస్తున్నాయి. ఇలా సీఎస్‌ఆర్‌ రాకముందే పనులు ప్రారంభించిన ఈ సంస్థలు, అది వచ్చాక మరిన్ని కొత్త విభాగాలను ఏర్పాటుచేసి కార్యక్రమాలను విస్తృతం చేశాయి. సీఎస్‌ఆర్‌ జర్నల్‌ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవరెంత ఖర్చుపెట్టారంటే...

రిలయన్స్‌: లెక్కప్రకారం ఖర్చుపెట్టాల్సినదానికన్నా(1112కోట్లు) ఎక్కువే(1186కోట్లు) సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదటిస్థానంలో నిలిచింది. 2023లో ఆ వ్యయం 1271 కోట్లకు చేరింది. ఇప్పటివరకూ దాదాపు 5.75 కోట్ల మంది జీవితాలను స్పృశించిన ఈ సంస్థ గ్రామీణాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యమిస్తోంది. ఆ తర్వాత విద్య, వైద్యం, యువతకు క్రీడల్లో ప్రోత్సాహం లాంటివి ఉన్నాయి.  
టీసీఎస్‌: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కూడా పెట్టాల్సినదానికన్నా కాస్త ఎక్కువే(రూ.727 కోట్లు) ఖర్చుపెట్టి రెండోస్థానంలో ఉంది. ఈ ఏడాది మరో 783 కోట్లు ఖర్చుపెట్టింది. చదువుతో పాటు యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంపై టీసీఎస్‌ దృష్టిపెడుతోంది. సంస్థకు చెందిన దాదాపు 60వేల మంది ఉద్యోగులు ఏడులక్షల గంటలు స్వచ్ఛంద సేవలో పాల్గొనడం విశేషం.

హెచ్‌డీఎఫ్‌సీ: ప్రైవేటు బ్యాంకుల్లో పెద్దదైన ఈ బ్యాంకు 736 కోట్లు ఖర్చుపెట్టింది. ఇటీవల ఈ బ్యాంకులో విలీనమైన హెచ్‌డీఎఫ్‌సీ కార్పొరేషన్‌ మరో 190 కోట్లు ఖర్చుపెట్టింది. తమ సీఎస్‌ఆర్‌ విభాగానికి ‘పరివర్తన్‌’ అనిపేరు పెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ అందుకు తగ్గట్లే చదువూ వైద్యమూ పర్యావరణమూ లాంటి భిన్నరంగాల్లో మార్పునకు కృషిచేస్తోంది.
టాటాస్టీల్‌: 266 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ సంస్థ 406 కోట్లు ఖర్చుపెట్టి విద్య, వైద్య, నీటి సదుపాయాల కల్పనకు కృషిచేసింది.
ఐసీఐసీఐ: ప్రత్యేకించి గ్రామీణ పేద రైతులకు తోడ్పడేలా ఐసీఐసీఐ ఫౌండేషన్‌ 267 కోట్లు ఖర్చుపెట్టింది.
ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌: 345 కోట్లు ఖర్చుపెట్టిన ఈ సంస్థ లాభాలను బట్టి చూస్తే 397 కోట్లు ఖర్చుపెట్టాల్సి వుంది. ఇతర కార్యక్రమాలెన్నున్నా పర్యావరణానికి పెద్దపీట వేస్తున్న ఈ సంస్థ 2020 లోనే కార్బన్‌ న్యూట్రల్‌ అయ్యి మూడేళ్లుగా అలాగే కొనసాగగలగడం విశేషం.
ఐటీసీ లిమిటెడ్‌: రూ.351 కోట్లు ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో అగ్రిబిజినెస్‌ రంగంలో మంచి సేవలందించిన ఈ సంస్థ సీఎస్‌ఆర్‌ కింద బెస్ట్‌ ఇండస్ట్రీగా కేంద్ర
జలశక్తి మంత్రిత్వ శాఖనుంచి అవార్డు అందుకుంది.
హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌: నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న ఈ సంస్థ 157 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు: ఖర్చు పెట్టాల్సినదానికన్నా ఎక్కువే ఖర్చు పెట్టిన వాటిలో పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. వైవిధ్యభరితమైన ప్రాజెక్టులతో దాదాపు 500 కోట్లు ఖర్చుపెట్టిన కోల్‌ ఇండియా ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇరవై జిల్లాలను ఎంచుకుని వాటి సమగ్ర అభివృద్ధికి కృషిచేస్తున్న ఓఎన్‌జీసీ 472 కోట్లు, 400 పాఠశాలలకు సేవలందించిన ఎన్టీపీసీ 356 కోట్లు ఖర్చుపెట్టగా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ 271 కోట్లు, గెయిల్‌ 204 కోట్లు, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 204 కోట్లు... ఖర్చుపెట్టాయి. ప్రైవేటు రంగంలో విప్రో 221 కోట్లు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 216, ఎల్‌అండ్‌టీ 135, జిందాల్‌ స్టీల్‌ 125, యాక్సిస్‌ బ్యాంక్‌ 113, మారుతి సుజుకి 100 కోట్లు... చొప్పున ఖర్చుపెట్టాయి.
నిజాయతీ, పారదర్శకత నియమాలను అనుసరించి ఈ సంస్థలన్నీ తమ ఫౌండేషన్ల పేరుతో వెబ్‌సైట్లను నిర్వహిస్తూ చేపడుతున్న కార్యక్రమాల వివరాలన్నిటినీ అందులో పొందుపరుస్తున్నాయి. వ్యక్తిగతంగా కానీ ఒక బృందంగా కానీ వీటి ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ఆయా సంస్థల్ని సంప్రదించవచ్చు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం సీఎస్‌ఆర్‌ని సమర్థంగా అమలుచేస్తున్న సంస్థల్ని ప్రోత్సహించేందుకుగాను ఏటా మూడు కేటగిరీల్లో అవార్డులు ఇస్తోంది. దాంతో ఏటికేడాదీ సీఎస్‌ఆర్‌ని అమలుచేస్తున్న సంస్థల సంఖ్య పెరుగుతోంది. పెడుతున్న ఖర్చూ పెరుగుతోంది. పెట్టాల్సినదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన కంపెనీల సంఖ్య కూడా అలాగే పెరగడమూ చెప్పుకోదగ్గ విశేషమే. ఇది ఇలాగే పెరుగుతూ ఏడాదికి లక్ష కోట్లకు చేరే సమయం ఎంతో దూరం లేదు!

ఉద్యోగులూ చేయొచ్చు!

సామాజిక బాధ్యత కంపెనీలకే కాదు, ఉద్యోగులకూ ఉంది. కాకపోతే ఆ విషయంలో మన దేశం కాస్త వెనకబడే ఉంది. స్వచ్ఛంద సేవాకార్యక్రమాలు చేపట్టడానికి ఉద్యోగులకు సమయం ఇస్తున్న కంపెనీలు అమెరికాలో 66 శాతం కాగా మనదేశంలో 22 శాతమే. ఆ పనులకు సమానంగా మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తున్నది ఏడుశాతం కంపెనీలే. అమెరికాలో అది నలభై శాతం. ఈ విషయమై ఇటీవల ఇండియా వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం వంద పెద్ద కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటేనే 7500 కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయట. దేశంలో కోటిన్నర మంది వైట్‌ కాలర్‌ ఎంప్లాయీస్‌ ఉన్నారనీ వారంతా కలిసి ఏడాదికి 15 కోట్ల గంటలకు పైగా సమయాన్ని సమాజ సేవకు వెచ్చించవచ్చనీ దాని విలువ 7500 కోట్లు ఉంటుందనీ ఆ సంస్థ లెక్కవేసింది. ఇది కనుక ఆచరణలో పెడితే కంపెనీలకు అవి పెట్టిన పెట్టుబడి మీద ఐదు రెట్లు లాభం ఉంటుందని కూడా ఈ నివేదిక చెబుతోంది. పైగా స్వచ్ఛంద సేవ చేసిన ఉద్యోగుల్లో వారికి ఎంతో అవసరమైన సాఫ్ట్‌ స్కిల్స్‌ (సహానుభూతి- 94, గౌరవం- 91, సృజన- 85, బృందస్ఫూర్తి- 85, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌-77, నాయకత్వ నైపుణ్యాలు- 77శాతం చొప్పున) పెరిగినట్లు 2019లో జరిగిన ఒక అధ్యయనం చెబుతోంది. అంతేకాదు, ఆ పనులు ఇచ్చే తృప్తి వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి భౌతిక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. దాంతో సంస్థ ఉత్పాదకత పెరుగుతుంది. వాలంటీర్‌ వర్క్‌ని ప్రోత్సహించే కంపెనీల్లో పని వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందట. అందుకే సంస్థలు ‘వాలంటీరిజం’ని ప్రోత్సహించాలని చెబుతున్నాయి అధ్యయనాలు.

లక్షా పాతికవేల కోట్లు!

ఒక్కో చుక్కా కలిసి సముద్రం అయినట్లు కంపెనీలు ఏటా సీఎస్‌ఆర్‌ కింద ఖర్చు చేసే వందా రెండొందల కోట్లే అన్నీ కలిపితే గత ఏడేళ్లలో (2014-15 నుంచి 2020-21 వరకూ) లక్షా 27 వేల కోట్లు అయ్యాయి. ఈ డబ్బుని 29 రకాల పనులకు ఖర్చుపెట్టారు. ఒక్కో ఏడాది చొప్పున చూస్తే మొట్టమొదటి ఏడాది పదివేల కోట్లు మాత్రమే కాగా 2020-21నాటికి అది 25వేల కోట్లకు చేరింది. సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఎక్కువగా లబ్ధిపొందుతున్నది విద్యారంగం. మొత్తం నిధుల్లో అరవై శాతం విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి- ఈ మూడురంగాలకే ఖర్చుపెడుతుండగా అందులో దాదాపు సగం విద్యకే అవుతోంది. సీఎస్‌ఆర్‌ కింద మూడోవంతు నిధులను ఐదు రాష్ట్రాల్లోనే ఖర్చుచేశారు. రూ.18,608 కోట్లతో మహారాష్ట్ర ప్రథమస్థానంలో ఉండగా ఆ తర్వాత కర్ణాటక, గుజరాత్‌ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..