సిసింద్రీ

సిసింద్రీ

Published : 05 Feb 2023 00:54 IST

సిసింద్రీ

బైకే డ్రోనూ..!

నేస్తాలూ! మీకు బైకు బొమ్మంటే ఇష్టం కదూ! అలాగే డ్రోన్‌ అన్నా ఇష్టమే కదా! ఈ రెండు బొమ్మలూ ఒకే బొమ్మలా ఉంటే... భలే ఉంటుంది. ‘ఇలా కార్టూన్లలో మాత్రమే జరుగుతుంది... ఇలాంటి బొమ్మలు బయట ఉండవులే!’ అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఈ టూ ఇన్‌ వన్‌ బొమ్మ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. రిమోట్‌ సాయంతో నడిచే బైక్‌ బొమ్మను డ్రోన్‌లా కూడా ఎగిరేలా చేయొచ్చు. మళ్లీ బైక్‌లా నడిచేలానూ చేయొచ్చు. అంటే మన ఇష్టానికి అనుగుణంగా బైక్‌లానూ డ్రోన్‌లానూ ఆడుకోవచ్చు. ప్రస్తుతానికి నీలి, ఎరుపు రంగుల్లో ఈ బొమ్మ అందుబాటులో ఉంది.


గడ్డి సాయం!

కాలువ ఒడ్డున ఉన్న చెట్టు మీద ఓ పిచ్చుక జీవిస్తుండేది. దానికి చాలా గర్వం. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఆటపట్టిస్తూ ఉండేది. సూటిపోటి మాటలతో వెక్కిరిస్తూ కాలక్షేపం చేసేది. తోటి స్నేహితులు ఎంత చెప్పినా తన ప్రవర్తనను మార్చుకునేది కాదు.  ఒక రోజు అది చెట్టు కొమ్మ మీద సేదతీరుతూ ఉంది. అప్పుడు చెట్టుకింద దట్టంగా పరుచుకుని గడ్డి కనిపించింది. పిచ్చుక దాన్ని అవమానించాలని నిర్ణయించుకుంది. ‘ఓ గడ్డీ... నీకు ఎందుకంత పొగరు. రెపరెపలాడుతూ నన్ను వెక్కిరిస్తున్నావు కదూ’ అని దబాయించింది. ‘అయ్యో కాదు.. పిచ్చుక నేస్తమా... గాలికి ఊగడం నా నైజం. అంతే కానీ నేను నిన్ను ఎందుకు వెక్కిరిస్తాను. అసలు నీకూ నాకూ శత్రుత్వం ఏముంది?’ అని మర్యాదగా చెప్పింది. ‘ఏంటీ... నీకు నాతో శత్రుత్వం కూడానా... అతి చిన్న పక్షినైన నేను సైతం నీ మీద వాలలేను. ఇక నీ జన్మ ఎందుకు వృథా!’ అని అంది పిచ్చుక. గడ్డిపోచకు చాలా బాధేసింది. మూర్ఖులతో వాదన వ్యర్థమని మౌనంగా ఉండిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో ఉన్నట్లుండి పెద్ద గాలివాన వచ్చింది. దీంతో చెట్టు మీద ఉన్న పిచ్చుక గూడు చెల్లాచెదురైంది. అందులో ఇంకా రెక్కలు రాని పిల్లపిచ్చుకలు నాలుగున్నాయి. అవన్నీ కిందపడిపోయాయి. గడ్డిలో పడిన రెండు పిచ్చుకలు మాత్రం బతికాయి. కింద పడిన మరో రెండు తమ ప్రాణాలు కోల్పోయాయి. గాలివానలో చిక్కుకుని గూటికి చేరుకోలేకపోయిన తల్లిపిచ్చుక మరుసటి రోజు తన నివాసానికి వచ్చింది. అది వచ్చేంత వరకు గడ్డి ఆ రెండు పిల్లపిచ్చుకలకు ఆశ్రయం ఇచ్చింది. శత్రువుల కంటపడకుండా వాటిని కాపాడింది. తల్లి పిచ్చుక రాగానే వాటిని అప్పగించింది. తన రెండు పిల్లలు చనిపోయినందుకు పిచ్చుక చాలా బాధపడింది. ఆ గడ్డి కాపాడటంతో మిగతా రెండు పిల్లలైనా బతికాయని ఊరట చెందింది. తను అంతగా అవమానించినా, అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పిల్లల ప్రాణాలు కాపాడినందుకు పిచ్చుక, గడ్డికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంది. అప్పటి నుంచి తన ప్రవర్తననూ మార్చుకుంది. ఇకపై ఇంకెవరినీ అవహేళన చేయకూడదు, వారి మనసు నొప్పించకూడదు అని నిర్ణయించుకుంది.










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..