సిసింద్రీ

పిల్లలూ... మనల్ని ఆటలు ఆడుకోమంటే ఎగిరి గంతేస్తాం... కానీ, చదువుకోమంటే మాత్రం అబ్బా అనేస్తాం... అందులోనూ గణితం అంటే ఇంకాస్త కష్టం.

Published : 26 Mar 2023 02:38 IST

సిసింద్రీ

భలే భలే... లెక్కల బొమ్మ!

పిల్లలూ... మనల్ని ఆటలు ఆడుకోమంటే ఎగిరి గంతేస్తాం... కానీ, చదువుకోమంటే మాత్రం అబ్బా అనేస్తాం... అందులోనూ గణితం అంటే ఇంకాస్త కష్టం. అయితే, ఇప్పుడు లెక్కలనే ఆడుతూ పాడుతూ నేర్చేసుకోవచ్చు. ఎలాగంటారా... మనదగ్గర ఈ ఎడ్యుకేషనల్‌ ఆట బొమ్మ ఉంటే సరి. దీని సహాయంతో కూడికలూ, తీసివేతలూ, గుణకారాలను సులభంగా నేర్చుకోవచ్చు. ఈ టేబుల్‌లో అడ్డంగా, నిలువుగా తొమ్మిది వరసల్లో బటన్స్‌ ఉంటాయి. ఆ బటన్స్‌పైన కొన్ని అంకెలూ... మళ్లీ ఆ అంకెల మధ్యలో అడిషన్‌, సబ్‌ట్రాక్షన్‌, మల్టిప్లికేషన్‌, డివిజన్‌కు సంబంధించిన గుర్తులుంటాయి. ఆ బటన్స్‌ను మనం నొక్కగానే... అది పైకి వచ్చి, దాని మీదున్న గణిత ప్రశ్నకు జవాబును చూపిస్తుంది. అలా మనకు కావాల్సిన బటన్‌ నొక్కుతూ... సమాధానాలు తెలుసుకోవచ్చన్నమాట. ఇద్దరు ముగ్గురు కలిసి... ఈ బొమ్మ సహాయంతో సరదాగా పోటీలు కూడా పెట్టుకోవచ్చు. ఎవరు ఎక్కువ జవాబులు చెబితే వారే గెలిచినట్లు లెక్క. ‘బాబోయ్‌ లెక్కలా..!’ అని భయపడిపోకుండా, ఇంట్లో వాళ్ల సాయం లేకుండా ఈ సరికొత్త బొమ్మతో మనమే సొంతంగా నేర్చేసుకోవచ్చు.


ఉంగరం దొరికింది!

తన పుట్టినరోజు సందర్భంగా పరివారానికి విందు ఏర్పాటు చేశాడు అక్బర్‌. అందులో భాగంగా భటులూ, సిబ్బందికి కొన్ని ఆటలపోటీలూ నిర్వహించారు. ఆ సమయంలో కోటంతా సందడిగా మారింది. కాసేపటి తరవాత చూస్తే... మహారాజు చేతికున్న తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఉంగరం కనిపించలేదు. అప్పుడు వెంటనే అక్బర్‌, బీర్బల్‌ని పిలిచి...
‘నా ఉంగరం కనిపించడం లేదు. ఇక్కడున్న వారిలోనే ఎవరో దొంగిలించారని నాకు అనుమానంగా ఉంది. ముందు ఎవరినీ బయటకు వెళ్లనివ్వకుండా కోట తలుపులన్నీ మూసివేయించండి. ఎలాగైనా ఆ ఉంగరాన్ని తీసుకురండి’ అన్నాడు. బీర్బల్‌ ఒక్క నిమిషం ఆలోచించి... ‘చిత్తం మహాప్రభూ..! మీ ఉంగరాన్ని కచ్చితంగా కనిపెట్టగలను’ అని సమాధానమిచ్చాడు. బీర్బల్‌ వెంటనే అక్కడున్న వారందరినీ వచ్చి వరసలో నిలబడమన్నాడు. తర్వాత అక్బర్‌ వైపు చూస్తూ... ‘రాజా... నేను చూసినంతవరకూ దొంగతనం చేసిన వ్యక్తికి చెవులు లేవు. మాటలు కూడా రానట్లు అనిపించింది. అతడి తలలో కొన్ని బియ్యం గింజలు కూడా కనిపించాయి’ అన్నాడు. బీర్బల్‌ అలా అనగానే ఆ వరసలో నిల్చున్న ఓ వ్యక్తి తన తలలో చెయ్యి పెట్టి బియ్యం గింజలున్నాయేమోనని వెతికాడు. చెవులను కూడా తడుముకుంటూ, ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేయసాగాడు. వెంటనే బీర్బల్‌ ఆ వ్యక్తిని గమనించి... ‘మహారాజా... మీ ఉంగరం దొంగిలించిన వ్యక్తి ఇతడే..’ అని అక్బర్‌కు చూపించాడు. సదరు వ్యక్తిని నిలదీయడంతో దొంగతనాన్ని అంగీకరించి... చేతి రుమాలులో దాచిన ఉంగరాన్ని బయటకు తీశాడు. ‘ఆ ఉంగరం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందోనని అనుకున్నా. కానీ, దాని జాడను చిటికెలో ఎలా కనిపెట్టగలిగావు?’ అని ఆసక్తిగా మంత్రిని అడిగాడు అక్బర్‌. అప్పుడు ‘మహారాజా... తప్పు చేసిన విషయం మనస్సాక్షికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. నేను ఉంగరం తీసిన వ్యక్తిని చూడకపోయినా, చూసినట్లు కొన్ని గుర్తులు చెప్పాను. అవి నిజమేననుకొని దొంగ కంగారుపడ్డాడు... మనకు దొరికిపోయాడు’ అని జవాబిచ్చాడు బీర్బల్‌. మంత్రి సమయస్ఫూర్తిని మెచ్చుకున్న అక్బర్‌... బహుమతులతో అభినందించాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు