సిసింద్రీ

మన చేతికి స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ చిక్కితే ఎంచక్కా గేమ్స్‌ ఆడుకుంటాం. లేకపోతే మనకు సంబంధించిన వీడియోలు చూస్తాం. కానీ బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల రిషి శివ ప్రసన్న మాత్రం ఏకంగా మూడు ‘ఆప్‌’లను రూపొందించాడు.

Published : 16 Sep 2023 23:41 IST

ఈ బుడత... టెక్నాలజీలో చిరుత!

మన చేతికి స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ చిక్కితే ఎంచక్కా గేమ్స్‌ ఆడుకుంటాం. లేకపోతే మనకు సంబంధించిన వీడియోలు చూస్తాం. కానీ బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల రిషి శివ ప్రసన్న మాత్రం ఏకంగా మూడు ‘ఆప్‌’లను రూపొందించాడు. అతి చిన్నవయసులోనే మొబైల్‌ అప్లికేషన్‌ డిజైనర్‌గా గుర్తింపు సాధించాడు. మరో విషయం ఏంటంటే ఈ బుడతడికి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ కంటే కూడా ఎక్కువగా 180 ఐక్యూ ఉందట! ఈ చిన్నారి ఇప్పటికే రెండు పుస్తకాలు కూడా రాశాడు. మరో పుస్తకం రాసే పనిలో ఉన్నాడు. మూడేళ్ల వయసులో నర్సరీలో ఉన్నప్పుడే ఈ చిన్నారిలోని ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించారు. ఇతర పిల్లలు వర్ణమాల, అంకెలు నేర్చుకుంటుంటే రిషి మాత్రం ఏకంగా గ్రహాలు, సౌరవ్యవస్థ, విశ్వం గురించి మాట్లాడాడట. ఇంజినీరింగ్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ అయిన తండ్రి ప్రసన్నకుమార్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన తల్లి రేచేశ్వరి ప్రోత్సాహంతో టెక్నాలజీపైనా ఈ బుడతడు ఆసక్తి పెంచుకున్నాడు. అయిదేళ్ల వయసు నుంచే కోడింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ చిన్నారికి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. అందులో సైన్స్‌కు సంబంధించిన అనేక విషయాలను వీక్షకులతో పంచుకుంటాడు.


రాజు గీసిన చిత్రం!

అనగనగా ఓ రాజ్యం. దాన్ని విక్రమవర్మ పాలిస్తూ ఉండేవాడు. ఆయన పోరాట వీరుడే కాకుండా, చక్కని చిత్రకారుడు కూడా. ఓ సారి అడవిలో ఒంటరిగా వేటకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రకృతిని చూసి ముగ్ధుడయ్యాడు. చక్కని చిత్రం గీయాలనుకున్నాడు. గుర్రానికి వేలాడుతున్న సంచీ నుంచి చిత్రలేఖనానికి కావాల్సిన సామాన్లంటినీ తెచ్చుకుని ఆ ప్రకృతిని చిత్రించాడు. ఆ చిత్రం చాలా అందంగా వచ్చింది. దాన్ని చూస్తూ చూస్తూ వెనక్కి వెళుతున్నాడు. ఇంతలో పశువుల్ని మేపే ఓ పిల్లవాడు ఈ దృశ్యాన్ని చూశాడు. చిత్రాన్ని వేలాడదీసిన కొయ్య దగ్గరకు గబగబా వెళ్లి దాన్ని చించివేశాడు. రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. పరుగులాంటి నడకతో ముందుకు వచ్చి చెంప ఛెళ్లుమనిపించాడు. ‘తర్వాత ఎందుకిలా చేశావు?’ అని ఆ పిల్లాడిని అడిగాడు. ‘అయ్యా... మీరు కొండ కొనమీద నిలబడి ఉన్నారు. మరో అడుగు వెనక్కువేస్తే మీరు లోయలో పడిపోవడం ఖాయం. ఒక వేళ కేకవేసి మిమ్మల్ని రక్షించాలని చూసినా, మీరు కంగారులో తూలి లోయలో పడిపోతారనిపించింది. అందుకే మీరెంతో ఇష్టంగా గీసిన ఈ చిత్రాన్ని చింపాను’ అని చెప్పాడు. విక్రమవర్మ ఒకసారి వెనక్కు చూసి.. ‘నిజమే’ అని అసలు విషయం తెలుసుకున్నాడు. అంత విషమ పరిస్థితుల్లోనూ తెలివిగా ఆలోచించిన పిల్లవాడిని మెచ్చుకున్నాడు. తాను ఎవరో చెప్పి, అతడి తల్లిదండ్రులను ఒప్పించి తనతోపాటు రాజధానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ ఆ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పించాడు. తర్వాత అతడే పెరిగి పెద్దై మంత్రి బాధ్యతలు స్వీకరించాడు.










Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..