విశ్రాంత జీవులకో నగరం!

ఉద్యోగిగా ఉరుకులు పరుగులు ఎలాగూ తప్పవు... కనీసం విశ్రాంత జీవితమైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు చాలామంది.

Updated : 21 May 2023 04:53 IST

ఉద్యోగిగా ఉరుకులు పరుగులు ఎలాగూ తప్పవు... కనీసం విశ్రాంత జీవితమైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు చాలామంది. అమెరికాకు చెందిన స్థిరాస్తి వ్యాపారి డెల్‌ ఇ.వెబ్‌ మాత్రం రిటైర్డ్‌ వ్యక్తుల జీవితాల్లో ఉల్లాసం, ఉత్సాహం ఉండాలని సకల వసతులతో వారికోసమే ఓ నగరాన్ని నిర్మించాడు. అదే ఈ సన్‌ సిటీ. అమెరికా దక్షిణ తీరాన ఆరిజోనా రాష్ట్రంలోని ఫినిక్స్‌కి దగ్గర్లో ఉంటుందీ టౌన్‌షిప్‌. ఇక్కడ ఏడాదిలో 300 రోజులూ వెచ్చగా ఉండటంతో ఈ ప్రాంతానికి ‘సన్‌ బెల్ట్‌’ అని పేరు. వెచ్చదనం కారణంగా విశ్రాంత జీవితాన్ని ఈ ప్రాంతంలో గడపాలనుకుంటారు చాలామంది. వారి కోసం 1960ల్లోనే ఎంతో ప్రణాళికాబద్ధంగా అద్భుతమనిపించే ఈ నగరాన్ని నిర్మించారు డెల్‌. 55 ఏళ్లు నిండినవారికే దీన్లో ఇల్లు కొనే వీలుంటుంది. ఎక్కడికక్కడ సరస్సులూ, గోల్ఫ్‌ కోర్సులూ, బేస్‌బాల్‌ కోర్టులూ, ఈత కొలనులూ... ఇవి కాక వంద వరకూ హాబీ క్లబ్‌లూ ఉంటాయిక్కడ. ఇక్కడ లేకపోయినా 55 ఏళ్లు దాటిన బయటవాళ్లూ కొంత మొత్తం చెల్లించి ఈ క్లబ్‌లకు రావొచ్చు. సన్‌ సిటీలో ప్రస్తుతం దాదాపు లక్ష మంది దాకా ఉంటున్నారు. దీనికి మంచి స్పందన రావడంతో దగ్గర్లో సన్‌ సిటీ వెస్ట్‌, సన్‌ సిటీ గ్రాండ్‌లనీ నిర్మించింది డెల్‌కు చెందిన సంస్థ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..