ఊరంతా సోయాసాసే!

పొద్దుపొద్దున్నే ఏ ఊరి వీధుల్లోనైనా నడుచుకుంటూ వెళ్లామంటే ఒకరి ఇంట్లోంచి పప్పు తాలింపు ఘుమఘుమలొస్తే, ఇంకొకరి వంటగది నుంచి బిర్యానీ వాసన రావచ్చు.

Updated : 07 Jul 2024 05:29 IST

పొద్దుపొద్దున్నే ఏ ఊరి వీధుల్లోనైనా నడుచుకుంటూ వెళ్లామంటే ఒకరి ఇంట్లోంచి పప్పు తాలింపు ఘుమఘుమలొస్తే, ఇంకొకరి వంటగది నుంచి బిర్యానీ వాసన రావచ్చు. కానీ వియత్నాంలోని బాన్‌ యెన్‌ ఎన్హాన్‌ విలేజ్‌కి వెళ్లామంటే- ఊరు ఊరంతా సోయాసాస్‌ వాసనలే వెదజల్లుతాయి. ఎందుకంటే అది సోయాసాస్‌ తయారీకి పెట్టింది పేరు. కొన్నివందల ఏళ్లుగా పురాతన పద్ధతుల్లోనే ఇక్కడ సోయాసాస్‌ను తయారుచేస్తారు. ప్రతి ఇంట్లో వందలాది కూజాల్లో చేసే ఈ సాస్‌ తయారీ- వినడానికే కాదు, చూడ్డానికీ కాస్త చిత్రంగానే ఉంటుంది. బియ్యాన్ని నానబెట్టి ఉడికించి... రెండు రోజులపాటు పులియబెడతారు. దాంతో ఆ అన్నంపైన పసుపురంగులో ఫంగస్‌లాంటిది పేరుకుంటుంది. అలా తయారైన అన్నాన్నీ, వేరేగా పులియబెట్టిన సోయాబీన్స్‌నీ కలిపి పెద్ద పెద్ద కుండల్లో నింపుతారు. ఉప్పూ, నీళ్లూ పోసి ఆ కుండల్ని రెండుమూడు నెలల పాటు ఎండ తగిలేలా ఆరుబయట ఉంచుతారు. రోజూ పొద్దున్నే ఒకసారి కలియబెడుతూ సోయాసాస్‌ రంగూ రుచీ సరిగా వచ్చేవరకూ ఆ ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ సంప్రదాయ సాస్‌తయారీని నేరుగా తెలుసుకుంటూ, వందలాది మట్టికూజాల వరసల్ని ఫొటోల్లో బంధించుకుంటూ పర్యటకులు సోయా ఘుమఘుమల్ని ఆస్వాదిస్తుంటారిక్కడ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..