ఊరించే... ఊతప్పం!

ఇడ్లీ లేదా దోశపిండి మిగిలినప్పుడు... అందులో రకరకాల కూరగాయ ముక్కలు కలిపి ఊతప్పంలా వేసి వడ్డిస్తే... ఇందులో ప్రత్యేకత ఏముందీ అనేస్తుంటారు ఇంట్లోవాళ్లు. అందుకే ఈసారి ఊతప్పాన్ని ఈ రుచుల్లో చేసిపెట్టండి.

Published : 04 Feb 2023 23:14 IST

ఊరించే... ఊతప్పం!

ఇడ్లీ లేదా దోశపిండి మిగిలినప్పుడు... అందులో రకరకాల కూరగాయ ముక్కలు కలిపి ఊతప్పంలా వేసి వడ్డిస్తే... ఇందులో ప్రత్యేకత ఏముందీ అనేస్తుంటారు ఇంట్లోవాళ్లు. అందుకే ఈసారి ఊతప్పాన్ని ఈ రుచుల్లో చేసిపెట్టండి. మళ్లీమళ్లీ కావాలంటూ అడగకపోతే చూడండి!


పిజా ఊతప్పం

కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, బియ్యప్పిండి: అరకప్పు, నీళ్లు: ముప్పావుకప్పు, ఉప్పు: తగినంత, టొమాటో: ఒకటి, క్యాప్సికం: ఒకటి, ఉల్లిపాయలు: రెండు, చీజ్‌ తురుము: కప్పు, ఒరెగానో: చెంచా, ఎండుమిర్చి గింజలు: చెంచా, నూనె: అరకప్పు.
తయారీ విధానం: ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, బియ్యప్పిండి, సరిపడా ఉప్పు వేసుకుని నీళ్లు పోస్తూ దోసె పిండిలా చేసుకోవాలి. పావుగంటయ్యాక స్టౌమీద పాన్‌ని పెట్టి ఈ పిండిని మందంగావేసి చుట్టూ నూనె వేయాలి. ఊతప్పం అంచులు కొద్దిగా కాలుతున్నప్పుడు దానిపైన సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ తరుగు, టొమాటో ముక్కలు, చీజ్‌ తురుము, ఒరెగానో, ఎండుమిర్చి గింజలు... వంటివన్నీ కొద్దికొద్దిగా వేయాలి. చీజ్‌ పూర్తిగా కరిగాక తీసేయాలి.


మరమరాలతో...

కావలసినవి: మరమరాలు: రెండుకప్పులు, బొంబాయిరవ్వ: అరకప్పు, పెరుగు: పావుకప్పు, అల్లం పేస్టు: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిపాయ తరుగు: అరకప్పు, టొమాటో తరుగు: పావుకప్పు, క్యారెట్‌ తురుము: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, వంటసోడా: పావుచెంచా, నూనె: అరకప్పు.

తయారీ విధానం: మరమరాలు మునిగేలా నీళ్లు పోసి పెట్టుకోవాలి. పావుగంటయ్యాక  నీటిని పూర్తిగా పిండి మరమరాల్ని మిక్సీలో వేసుకోవాలి. ఇందులో బొంబాయిరవ్వ, పెరుగు, కాసినినీళ్లు పోసి... దోసె పిండిలా గ్రైండ్‌ చేసుకుని తీసుకోవాలి. ఈ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలు, మరో పావు కప్పు నీళ్లు కలిపి మూత పెట్టాలి. పది నిమిషాలయ్యాక వేడిపెనం మీద కొద్దిగా పిండిని ఊతప్పంలా వేసుకుని నూనెతో రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.  


ఓట్స్‌తో...

కావలసినవి: ఓట్స్‌పొడి: రెండు కప్పులు, పెరుగు: కప్పు, ఉప్పు: తగినంత, బియ్యప్పిండి: కప్పు, అల్లం తరుగు: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి తరుగు: చెంచా, మిరియాలపొడి: చెంచా, నూనె: అరకప్పు, క్యారెట్‌ తురుము: పావుకప్పు,ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: ఓట్స్‌పొడిలో పెరుగు కలపాలి. అరగంటయ్యాక బియ్యప్పిండి కూడా కలిపి ఇందులో పచ్చిమిర్చి, అల్లంతరుగు, మిరియాలపొడి, తగినంత ఉప్పు, మరికాసిని నీళ్లు పోసి దోసె పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద పెనంపెట్టి ఈ పిండిని మందంగా వేసి నూనె వేయాలి. దీనిపైన కొద్దిగా క్యారెట్‌ తురుము, ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కాలాక తీసేయాలి.


బియ్యప్పిండితో...

కావలసినవి: బియ్యప్పిండి: కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద: ముప్పావుకప్పు, నీళ్లు: రెండు కప్పులు, ఉప్పు: తగినంత, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, టొమాటో తరుగు: పావుకప్పు, క్యాప్సికం తరుగు: పావుకప్పు, క్యారెట్‌ తురుము: అరకప్పు, పచ్చిమిర్చి తరుగు: రెండు చెంచాలు, అల్లం తరుగు: చెంచా, వంటసోడా: పావుచెంచా, నూనె: అరకప్పు.

తయారీ విధానం: బియ్యప్పిండి, బంగాళాదుంప ముద్దను మిక్సీలో తీసుకుని నీళ్లు పోసి దోసె పిండిలా చేసుకుని ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను కలపాలి. ఈ పిండిని పెనంమీద మందంగా వేసి నూనె కాస్త ఎక్కువగా వేస్తూ... ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..