చిత్రంగా... నోరూరిస్తోంది!

ఆడవాళ్లలో చాలామందికి పాకశాస్త్రంలో చక్కని నైపుణ్యం ఉండొచ్చు, కానీ అదే చేతికి కాస్త చిత్రకళల్లోనూ ప్రావీణ్యం ఉంటే... ఆ వంటకాలు నోరూరిస్తూనే, కనువిందు చేసేయవూ.

Published : 19 Mar 2023 00:55 IST

చిత్రంగా... నోరూరిస్తోంది!

డవాళ్లలో చాలామందికి పాకశాస్త్రంలో చక్కని నైపుణ్యం ఉండొచ్చు, కానీ అదే చేతికి కాస్త చిత్రకళల్లోనూ ప్రావీణ్యం ఉంటే... ఆ వంటకాలు నోరూరిస్తూనే, కనువిందు చేసేయవూ. ఇదిగో ఇక్కడున్న పదార్థాలన్నీ అలా తయారైనవే. కాన్వాస్‌ లేదా వస్త్రాలపైన రకరకాల సంప్రదాయ పెయింటింగ్‌లు వేయడం అనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా ఆహారపదార్థాల మీద కూరగాయ ముక్కలూ, కరివేపాకూ, కొత్తిమీర వంటివాటిని అలంకరించడమూ ఎప్పటినుంచో ఉన్నదే. అయితే ఈ రెండింటినీ జతచేసిన షైఫాలీతాంబే అనే కళాకారిణి... తాను చేసే వంటకాలనే కాన్వాస్‌లుగా మార్చి... అందమైన కళారూపాల్ని ఆవిష్కరించేస్తోంది. ముఖ్యంగా పనీర్‌ బటర్‌ మసాలా, దహీవడా, పాలక్‌ పనీర్‌... లాంటి వాటిమీద పనీర్‌, క్రీమ్‌, ఫుడ్‌కలర్స్‌, చిక్కని చింతపండు సాస్‌... ఇలా ఎన్నెన్నో పదార్థాల్ని వాడుతూ వర్లీ, మధుబనీ, గోంద్‌ శైలి చిత్రాలను ఎంతో అందంగా వేస్తోంది. నోటికి అందే రుచిలోనే కాదూ, కంటికి కనిపించే లుక్కులోనూ వెరైటీని కోరుకునేవారికి- ఇవి నచ్చకుండా ఉంటాయా... అందుకే సోషల్‌ మీడియాలో బోలెడన్ని ప్రశంసలూ అందుకుంటోందీ కళాకారిణి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..