సీతారాములకు... భక్తితో!
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణాన్ని జరిపించిన తరువాత... పానకంతోపాటు రకరకాల పదార్థాలను నివేదించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తాం. వాటిల్లో ఇలాంటివి ఉంటే ఎలా ఉంటుందంటారూ...
సీతారాములకు... భక్తితో!
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణాన్ని జరిపించిన తరువాత... పానకంతోపాటు రకరకాల పదార్థాలను నివేదించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తాం. వాటిల్లో ఇలాంటివి ఉంటే ఎలా ఉంటుందంటారూ...
పండ్ల కేసరి
కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, చక్కెర: కప్పు, నెయ్యి: పావుకప్పు, యాలకుల పొడి: అరచెంచా, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, కిస్‌మిస్ పలుకులు: పావుకప్పు, అరటిపండు: ఒకటి, దానిమ్మగింజలు: పావుకప్పు, పైనాపిల్ ముక్కలు: అరకప్పు, ఆపిల్ తరుగు: పావుకప్పు.
తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేయాలి. అది వేడెక్కాక రవ్వ వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి ఓసారి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక చక్కెర, యాలకులపొడి వేసి బాగా కలపాలి. చక్కెర కరిగాక పండ్లముక్కలు, మిగిలిన నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ పలుకుల్ని వేసి అన్నింటినీ కలిపి... కేసరి దగ్గరకు అయ్యాక దింపేయాలి.
సగ్గుబియ్యం దద్ధ్యోదనం
కావలసినవి: సగ్గుబియ్యం: రెండు కప్పులు, పెరుగు: నాలుగు కప్పులు, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, మినప్పప్పు: చెంచా, ఎండుమిర్చి: ఒకటి, మిరియాలు: అరచెంచా, నూనె: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: ఒకటి, అల్లం: చిన్నముక్క, జీడిపప్పు పలుకులు: పావుకప్పు.
తయారీ విధానం:సగ్గుబియ్యాన్ని గంట ముందు నానబెట్టుకుని తరువాత ఆ నీటితో సహా స్టౌమీద పెట్టి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం ఉడికి.. నీళ్లన్నీ ఆవిరైపోతున్నప్పుడు దింపేయాలి. ఇందులో అల్లం-పచ్చిమిర్చి ముద్ద, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేసి... ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకును వేయించుకుని సగ్గుబియ్యంపైన వేయాలి. చివరగా గిలకొట్టిన పెరుగు కూడా వేసి అన్నింటినీ కలపాలి.
అప్పమ్
కావలసినవి: బొంబాయిరవ్వ: కప్పు, మైదాపిండి: కప్పు, చక్కెర: కప్పు, జీడిపప్పు పలుకులు: పావు కప్పు, యాలకులపొడి: అరచెంచా, వంటసోడా: చిటికెడు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: ఓ గిన్నెలో రవ్వ, కప్పు నీళ్లు తీసుకుని రెండింటినీ కలిపి మూత పెట్టాలి. పావుగంటయ్యాక అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి మళ్లీ కలపాలి. ఇందులో మరికాసిని నీళ్లు పోస్తూ దోశపిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి... వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడెక్కాక గరిటెతో కొద్దిగా పిండిని తీసుకుని నూనెలో వేసి రెండువైపులా జాగ్రత్తగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండినీ చేసుకోవాలి.
అటుకుల పంచామృతం
కావలసినవి: అరటిపండ్లు: నాలుగు, ఖర్జూరాలు: ఆరు, కిస్‌మిస్: పావుకప్పు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, తేనె: టేబుల్‌స్పూను, బెల్లం తరుగు: పావుకప్పు, మందంగా ఉండే అటుకులు: పావుకప్పు, పచ్చకర్పూరం: చిటికెడు, యాలకుల పొడి: అరచెంచా, నెయ్యి: అరచెంచా.
తయారీ విధానం: ముందుగా అటుకుల్ని ఓ గిన్నెలో తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోయాలి. రెండు నిమిషాలయ్యాక అటుకుల్ని గట్టిగా పిండి.. ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో చక్రాల్లా తరిగిన అరటిపండు, ఖర్జూర ముక్కలతోపాటు మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ బాగా కలిపితే సరిపోతుంది.
కార్న్ కోసంబరి
కావలసినవి: ఉడికించిన స్వీట్‌కార్న్ గింజలు: కప్పు, పెసరపప్పు: పావుకప్పు, క్యారెట్: ఒకటి, దానిమ్మగింజలు: పావుకప్పు, కీరా: ఒకటి, తాజా కొబ్బరి తురుము: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, మామిడికాయ తురుము: టేబుల్‌స్పూను, నూనె: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: రెండు, ఆవాలు: చెంచా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు చెంచాలు.
తయారీ విధానం: పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకుని ఆ తరువాత పప్పును మాత్రం విడిగా ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో స్వీట్‌కార్న్ గింజలు, క్యారెట్ తురుము, దానిమ్మగింజలు, సన్నగా తరిగిన కీరా, తాజా కొబ్బరితురుము, కొత్తిమీర తరుగు, మామిడికాయ తురుము, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడక్కాక ఆవాలు వేయించి ఆ తాలింపును స్వీట్‌కార్న్ మిశ్రమంలో వేసి నిమ్మరసాన్ని కలిపితే చాలు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ
-
Crime News
Hyderabad: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. క్షుద్రపూజల వల్లేనంటున్న తల్లిదండ్రులు
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM