మామిడితో... మజా మజాగా!

ఈ కాలంలో వచ్చే మామిడికాయలతో పప్పూ, ముక్కల పచ్చడి లాంటివి చేసుకోవడంలో కొత్తదనం ఏముంటుంది. అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి వంటకాలనూ వండితే... కాస్త మార్పుగా అనిపిస్తుంది.. ఆలస్యమెందుకు ప్రయత్నించండి మరి...

Published : 01 Apr 2023 23:50 IST

మామిడితో... మజా మజాగా!

ఈ కాలంలో వచ్చే మామిడికాయలతో పప్పూ, ముక్కల పచ్చడి లాంటివి చేసుకోవడంలో కొత్తదనం ఏముంటుంది. అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి వంటకాలనూ వండితే... కాస్త మార్పుగా అనిపిస్తుంది.. ఆలస్యమెందుకు ప్రయత్నించండి మరి...


తీపి పచ్చడి

కావలసినవి: మామిడికాయలు: రెండు, నూనె: పావుకప్పు, ఆవాలు: చెంచా, వేయించిన మెంతిపొడి: పావుచెంచా, ఆవపిండి:
టేబుల్‌స్పూను, బెల్లం తరుగు: అరకప్పు, ఎండుమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా, కారం: పావుకప్పు.

తయారీ విధానం: మామిడికాయల్ని ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి... అది వేడెక్కాక ఆవాలు, ఎండుమిర్చి, వేయించుకుని మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కారం, బెల్లం తరుగు వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. బెల్లం కరిగి, ముక్కలు మెత్తగా అవుతున్నప్పుడు ఆవపిండి, మెంతిపొడి వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. ఈ పచ్చడి దోశ, చపాతీల్లోకి బాగుంటుంది.


గుజ్జు

కావలసినవి: పెద్ద మామిడికాయ: ఒకటి, సాంబారు ఉల్లిపాయలు: ఆరు, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, పచ్చిమిర్చి: ఎనిమిది, అల్లం: చిన్నముక్క, కరివేపాకు రెబ్బలు: రెండు, దనియాలపొడి: చెంచా, కారం: టేబుల్‌స్పూను, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, చిక్కని కొబ్బరిపాలు: అరకప్పు, పల్చని కొబ్బరిపాలు: కప్పు, ఎండుమిర్చి: రెండు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా.  

తయారీ విధానం:  మామిడికాయ చెక్కు తీసి ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకుని ఉల్లిపాయముక్కలు, సాంబారు ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం- పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక దనియాలపొడి, కారం, పసుపు, తగినంత ఉప్పు, పల్చని కొబ్బరిపాలు పోయాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక చిక్కని కొబ్బరిపాలు పోసి... బాగా ఉడకనిచ్చి దింపేయాలి.  


కూర

కావలసినవి: మామిడికాయ ముక్కలు: ఒకటిన్నర కప్పు, బెల్లం తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుచెంచా, చింతపండు నీళ్లు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: రెండు చెంచాలు, ఇంగువ: చిటికెడు, ఆవాలు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు.
మసాలా కోసం: తాజా కొబ్బరి తురుము: కప్పు, మినప్పప్పు: రెండు చెంచాలు, సెనగపప్పు: చెంచా, మెంతులు: పావుచెంచా, జీలకర్ర: అరచెంచా, నువ్వులు: రెండు చెంచాలు, ఎండుమిర్చి: నాలుగు.

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి... కొబ్బరి తురుము తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను విడివిడిగా వేయించుకోవాలి. తరువాత కొబ్బరి తురుముతోపాటు అన్నింటినీ కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో మామిడికాయ ముక్కలు, చింతపండు నీళ్లు, బెల్లం తరుగు, పసుపు, తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒక కూత వచ్చాక దింపేయాలి. స్టౌమీద మళ్లీ కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేయించుని అందులో ఉడికించిన మామిడికాయ మిశ్రమం వేయాలి. తరువాత చేసిపెట్టుకున్న కొబ్బరిమిశ్రమాన్ని కూడా వేసి, అరకప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఇది దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.  


రసం

కావలసినవి: మామిడికాయ: ఒకటి, ఉడికించిన కందిపప్పు ముద్ద: పావుకప్పు, దనియాలపొడి: చెంచా, రసంపొడి: ఒకటిన్నర చెంచా, బెల్లం తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా, పచ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: రెండు చెంచాలు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: రెండు.

తయారీ విధానం: మామిడికాయను కడిగి, తుడిచి నిప్పులమీద కాల్చి... నీళ్లల్లో వేసుకోవాలి. వేడి చల్లారాక చెక్కును తీసి గుజ్జును మాత్రం ఓ గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తరువాత ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టి... రసం మరుగుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకుని... చారులో వేసి కలిపితే చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..