గణపయ్యకు... భక్తితో!

చవితి నాడు... స్వామికి చేసే పూజతోపాటు నివేదించే పదార్థాలూ కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాం కదూ... మరి ఈసారిఎలాంటివి చేయాలనుకుంటున్నారూ...

Published : 16 Sep 2023 23:51 IST

చవితి నాడు... స్వామికి చేసే పూజతోపాటు నివేదించే పదార్థాలూ కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాం కదూ... మరి ఈసారి ఎలాంటివి చేయాలనుకుంటున్నారూ...


రవ్వ గారెలు

కావలసినవి: బొంబాయిరవ్వ: ఒకటిన్నర కప్పు, పెరుగు: కప్పు, తాజా కొబ్బరి తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: చెంచా, పచ్చిమిర్చి తరుగు: ఒకటిన్నర చెంచా, అల్లం తరుగు: చెంచా, కరివేపాకు తరుగు: టేబుల్‌స్పూను, వంటసోడా: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు వేసుకుని కలుపుకోవాలి. తరువాత నూనె, వంటసోడా తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి మరోసారి కలిపి మూత పెట్టాలి. పావుగంట తరవాత వంటసోడా కూడా వేసి అవసరం అనుకుంటే చాలా కొద్దిగా నీళ్లు కలిపి.. గారెల పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


పిండి పులిహోర

కావలసినవి: బియ్యపురవ్వ: కప్పు, నీళ్లు: రెండు కప్పులు, పసుపు: అరచెంచా, చింతపండు: నిమ్మకాయంత, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: మూడు, ఎండుమిర్చి: రెండు, పల్లీలు: పావుకప్పు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: పెద్ద చెంచా, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: పావుకప్పు, మిరియాలపొడి: అరచెంచా, మెంతిపిండి: చిటికెడు.
తయారీ విధానం: స్టవ్‌మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి పసుపు, చెంచా నూనె వేయాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యపురవ్వ వేసి కలిపి రవ్వ ఉడికాక దింపేయాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడెక్కాక ఇంగువ, ఎండుమిర్చి, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు నిలువుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. నిమిషమయ్యాక చిక్కని చింతపండు రసం, తగినంత ఉప్పు, మిరియాలపొడి, మెంతిపిండి వేసి కలపాలి. చింతపండు రసం ఉడికాక దింపేసి.. ఈ మిశ్రమాన్ని రవ్వపైన వేసి అన్నింటినీ కలిపితే చాలు.  


మోదక్‌

కావలసినవి: కొబ్బరిపొడి: అరకప్పు, బెల్లంపొడి: అరకప్పు, యాలకులపొడి: చెంచా, పాలపొడి: మూడు టేబుల్‌స్పూన్లు, పిస్తా పలుకులు: చెంచా, పాలు: రెండు కప్పులు, చక్కెర: ముప్పావుకప్పు, బొంబాయిరవ్వ: కప్పు, నెయ్యి: పావుకప్పు.  
తయారీ విధానం: ముందుగా స్టఫింగ్‌ను చేసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి రెండు చెంచాల నెయ్యి వేయాలి. అది వేడెక్కాక కొబ్బరిపొడిని వేయించుకుని బెల్లంపొడి, అరచెంచా యాలకులపొడి, పిస్తా పలుకులు వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక దింపేసి పాలపొడి, రెండుమూడు చెంచాల పాలు పోసి బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పాలు పోసి స్టవ్‌మీద పెట్టాలి. అవి కాస్త వేడెక్కాక చక్కెర కలపాలి. చక్కెర కరిగి పాలు మరుగుతున్నప్పుడు మిగిలిన యాలకులపొడి వేసి దింపేయాలి. మరో కడాయిని స్టవ్‌మీద పెట్టి మిగిలిన నెయ్యి వేసి బొంబాయిరవ్వను దోరగా వేయించుకోవాలి. తరవాత ఇందులో పాలు పోసి కలుపుతూ ఉండి... హల్వాలా తయారయ్యాక దింపేయాలి. ఇప్పుడు మోదక్‌ మౌల్డ్‌ను తీసుకుని రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, స్టఫింగ్‌గా కొబ్బరి ఉండను కూరి.. అంచుల్ని మూసేస్తే  రవ్వ మోదక్‌ సిద్ధమైనట్లే. ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా చేసుకోవాలి.


గోధుమరవ్వ ఉండ్రాళ్లు

కావలసినవి: గోధుమరవ్వ: అరకప్పు, నీళ్లు: ఒకటిన్నర కప్పు, బెల్లంపొడి: అరకప్పు, కొబ్బరితురుము: పావుకప్పు, పెసరపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు (పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి), యాలకులపొడి: అరచెంచా, నెయ్యి: టేబుల్‌స్పూను.
తయారీవిధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. ఇందులో నీళ్లు, బెల్లంపొడి వేసి కలపాలి. బెల్లం కరిగిందనుకున్నాక గోధుమరవ్వ, కొబ్బరితురుము, యాలకులపొడి వేసి కలిపి.. దగ్గరకు అయ్యాక దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టుకుని ఆవిరిమీద పది నిమిషాలు ఉడికించుకుని తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..