Updated : 05 Feb 2023 02:34 IST

సమీక్ష

ధైర్యంగా... స్థైర్యంగా

వరోధాలను దాటి గౌరవప్రదంగా బతకటానికి మనుషులు తమ పరిధిలో చేసే ప్రయత్నాలకు ఈ సంపుటి అద్దం పడుతుంది. బోనాలనాడు పోల్‌ పైకెక్కి బ్యానర్లు కట్టే యువకుడు అతి ఎత్తయిన బుర్జ్‌ ఖలీఫా అద్దాలను శుభ్రం చేసే ప్రాణాంతకమైన పనిని చేపడతాడు..‘ఇజ్జత్‌’ కోసం! ‘మనకాడ పైసల్‌ ఉండాలంటే లక్షలు, కోట్లు కాదు. మనం బతకనీకి ఆడా ఈడా దేవులాడకుండా ఉండాలె’ అనే అమ్మాయి మనసును గెలుస్తాడు. ఎడారి పూలతో తంగేడు పూలు జత కట్టగా మెరిసిన ఈ ప్రేమ కథ ‘ఇసుక అద్దం’. బలవన్మరణాలతో నీటి పాలయ్యే శవాలను వెలికితీసే వ్యక్తి ప్రస్థానం ‘శివ అంటే ఈడే’. నర్సు అవ్వాలనే కల నెరవేర్చుకున్న అమ్మాయి ‘చుక్క పొడిచింది’లో, అమ్మమ్మను అపార్థం చేసుకుని, చివరకు ఆమె మనసు గ్రహించిన మనవరాలు ‘వడ్డాణం’లో కనపడతారు. హైజీన్‌ విషయంలో ఉద్యోగినులు తరచూ ఎదుర్కొనే సమస్యను ‘వాష్‌’ బలంగా ప్రతిఫలించింది. నిత్యజీవితంలో తారసపడే సామాన్య అంశాలను కూడా భిన్న కోణంలో కథలుగా మలచారు రచయిత్రి. తెలంగాణ మాండలికం చాలా కథల సంభాషణల్లో పలకరిస్తుంది.

సీహెచ్‌. వేణు

ఇసుక అద్దం యితర కథలు;

రచన: శ్రీ ఊహ

పేజీలు: 147;

వెల: రూ. 245/-

ప్రతులకు: అన్వీక్షికి, నవోదయ పుస్తకకేంద్రాలు


కొత్త కథలు

కొత్త కలాలని ప్రోత్సహిస్తూ, పాత రచయితల తోడుగా చేసిన ప్రయోగమే ఈ కథల సంకలనం. చిన్న కథలే అయినా ప్రతి కథా మధ్య, దిగువ మధ్య తరగతి జీవితాలకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ‘గులాబీలు గొప్పోళ్ల ఇళ్లలోనే పూస్తాయా? గుడిసెల్లో పూయవా?’ అన్న పేదపిల్ల రాజీకి తండ్రి చెప్పిన సమాధానం ‘ఏదీ మనది కాదే, పుట్టిన ఊరు మనది కానేదు, మన రెక్కల కష్టం మనది కాదు, మన బతుకులు మనవి కావు’ లాంటి ముగింపులు దాదాపు ప్రతికథలోనూ కనిపిస్తాయి. మలిసంధ్యలో భార్య జ్ఞాపకాలతో బతికేయాలనుకున్న పెద్దాయన కాశీలో వదిలేసిన జ్ఞాపకం ఏంటో ‘నెమలీక’ చెబుతుంది. ఇరుకు గది సంసారం ఇబ్బందులు తెలిపే కథ ‘సీకటడతన్నాది’తోపాటు కలిసి ఉంటే, అమ్మ మనసు, అగ్నిసంస్కారం... అన్నీ చదివించే కథలే.

నందన

మంచి కథ (కథల సంకలనం);

సంపాదకుడు: పోతుబరి వెంకట రమణ

పేజీలు: 261;

వెల: రూ. 240/-

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఉత్తమ కథలు

టా ప్రచురించే ఉత్తమ కథల సంకలనాల్లో భాగంగా 15 కథలతో వచ్చింది ‘కథ-2021’. ఈ సంకలనానికి ఎంపికైన కథలన్నీ భిన్న వస్తువులతో, వైవిధ్యమైన కథన శైలులతో నేటి కథా ప్రపంచానికి సమగ్ర స్వరూపంలా ఉన్నాయి. లక్షల ఆస్తిని దేవుడికి రాసి రోజుకు వందరూపాయలతో సత్రంలో బతికే ‘వితండం మామ’, కొడుక్కి నచ్చని తన ప్రేమకథని కాలానికే వదిలిన తల్లి (బహుముఖాలు) లాంటి పాత్రలు ఆలోచింపజేస్తాయి. అవినీతీ అక్రమాలూ చేసేవారికి వారి ముఖం అద్దంలో కన్పించకపోతే..? మనిషి తన లోపలి మనిషికైనా జవాబుదారీగా ఉండాలని చెప్పే కథ ‘చెల్లని మొహం’. ఆధిపత్యం ప్రదర్శించేవారికి చెంపపెట్టు లాంటి కథ ‘ఉన్నట్టుండి’. రావి శాస్త్రి శతజయంతిని పురస్కరించుకుని ఆయన ‘పిపీలికం’ కథని ఈ సంకలనంలో చేర్చారు.

 శ్రీ

కథ 2021;

సంపాదకులు: వాసిరెడ్డి నవీన్‌ పాపినేని శివశంకర్‌

పేజీలు: 218;

వెల: రూ. 140/-

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం యోధులు

సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సుబేదార్‌ షేక్‌ అహ్మద్‌ది గుంటూరు జిల్లా సత్తెనపల్లి. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఇలాంటి ముస్లిం యోధులు ఎందరో పాల్గొన్నారు. వారందరినీ వెలుగులోకి తెచ్చేందుకు ఏళ్లతరబడి పరిశోధన చేసిన రచయిత 2014లో మొదటిభాగాన్ని ప్రచురించారు. ఇది రెండోభాగం. 155 మంది యోధుల వివరాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో ఇచ్చారు. హిందువులతో సమానంగా ముస్లింలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారనడానికి నిదర్శనం ఈ పుస్తకం. ఉద్యమంలో ముస్లింల భాగస్వామ్యమే లేదనడం, వారివల్లనే దేశ విభజన జరిగిందనడం... లాంటి ఎన్నో అపోహల్ని ఈ గ్రంథం తొలగిస్తుంది.

పద్మ

చరితార్థులు-2;

రచన: సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌;

పేజీలు: 366;

వెల: రూ. 1000/-

ప్రతులకు: ఆజాద్‌ హౌస్‌ ఫోన్‌- 9440241727



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..