కొత్త కొత్తగా వచ్చేస్తున్నాయ్!
లాస్‌వేగాస్... కేసినోలకీ క్లబ్బులకే కాదు... ఏటా వచ్చే అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తుల ప్రదర్శనకీ అతిపెద్ద వేదిక కూడా. అక్కడి వించెస్టర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏటా జనవరిలో నాలుగురోజులపాటు జరిగే ‘కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో’లో ఎప్పటిలానే ఈసారి కూడా 170 దేశాలకు చెందిన 4,500కి పైగా కంపెనీలు దాదాపు ఇరవై వేలకి పైగా కొత్త ఉత్పత్తుల్ని తీసుకొచ్చాయి. వాటిల్లో అన్ని వర్గాల్నీ ఆకర్షించిన వస్తువుల్లో కొన్నింటిని చూస్తే...
రంగులు మారే ఫ్రిజ్!
ఫ్రిజ్ కొనేటప్పుడు కిచెన్‌కి నప్పే కలర్‌నో లేదా ఇష్టమైన రంగుదో ఎంచుకుంటాం. అయితే ఇంటికి పెయింట్స్ వేయించిప్పుడల్లా లేదా వాల్ పేపర్ మార్చినప్పుడల్లా ఫ్రిజ్‌ను కూడా మార్చలేం కదా. అందుకే ఎల్‌జీ కంపెనీ మన మూడ్‌ని బట్టి కోరిన రంగులోకి మారేలా ‘మూడ్ అప్ ఫ్రిజ్’ను డిజైన్ చేసింది. దీనికి అమర్చిన ఎల్‌ఈడీ డోర్ ప్యానెల్స్‌ను ఎల్‌జీ థింక్‌ఆప్‌లోకి వెళ్లి కోరిన రంగులోకి మార్చుకోవచ్చట. అంతేకాదు, లోపల కూడా ఎక్కువ స్థలం ఉండేలానూ అన్ని అరల్లోకీ చక్కగా లైటు వచ్చేలానూ మరింత త్వరగా ఐస్ గడ్డకట్టేలానూ కూడా దీన్ని తయారుచేశారట. మీరు డోర్ ఎక్కువసేపు తీసి ఉంచితే, దాన్నుంచి ఫ్లాష్‌లైటు వచ్చి తలుపు వేయాలని హెచ్చరిస్తుంది. పైగా ఇందులో అమర్చిన బ్లూ టూత్ స్పీకర్ల ద్వారా దీన్నుంచి ఎంచక్కా పాటలూ వినొచ్చు. ఇదిలా ఉంటే, శామ్‌సంగ్ కంపెనీ బిస్పోక్ హోమ్ టెక్నాలజీతో ఫోర్- డోర్ ఫ్లెక్స్ విత్ ఫ్యామిలీ హబ్ ప్లస్ ఫ్రిజ్‌నీ తీసుకొచ్చింది. దీనిమీద అమర్చిన 32అంగుళాల హెచ్‌డీస్క్రీన్‌ను గూగుల్ ఫొటోస్ ఆప్ ద్వారా వాడుకోవచ్చు. ఫొటోలతోపాటు వంటకాల తయారీ గురించీ తెలుసుకోవచ్చట.
స్మార్ట్ ఇయర్‌బడ్స్!
ఎన్ని రకాల ఇయర్‌పాడ్స్, బడ్స్ వస్తున్నా వాటన్నింటికీ ఎప్పుడోసారి ఛార్జింగ్ పెట్టక తప్పదు. అందుకే జెబిఎల్ కంపెనీ టూ ప్రో 2 పేరుతో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను తయారుచేసింది. ఛార్జింగ్ కేస్‌తో సహా వస్తున్నాయివి. ఈ కేస్‌కు ఎల్‌ఈడీ టచ్ డిస్‌ప్లే సదుపాయం కూడా ఉంది. దీని ద్వారానే సౌండ్‌ని పెంచుకోవచ్చూ తగ్గించుకోవచ్చు. ఫోన్ మెసేజ్‌లూ నోటిఫికేషన్‌లతోపాటు కాల్స్‌నీ రిసీవ్ చేసుకోవచ్చు. అంటే, ఇది దగ్గర ఉంటే మళ్లీ ఫోన్ దగ్గరకు వెళ్లకుండానే పాటలు వింటూనే పనులన్నీ చేసుకోవచ్చన్నమాట. ఏకబిగిన నలభై గంటలపాటు ఇవి పనిచేస్తాయి కాబట్టి బయటకు వెళ్లినప్పుడు- తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన పని ఉండదు. ఒకవేళ మొత్తం ఛార్జింగ్ అయిపోయినా పది నిమిషాలు పెడితే ఐదు గంటలపాటు వినేంత ఛార్జ్ అవుతుందట.
మిక్సీ... మాట వింటుంది!
రోటిపచ్చడి కోసం మిక్సీ స్విచాన్ చేస్తాం... ఓ నిమిషం అటూఇటూ అయితే చాలు... అది మెత్తగా అయిపోతుంది. అలాగే కొన్ని పొడులు కాస్త గరుకుగానూ మరికొన్ని మరీ మెత్తగానూ ఉంటేనే బాగుంటాయి. అలా మనకు కావాల్సినట్లుగా చేసే మిక్సీ గ్రైండర్‌ని జిఇ ప్రొఫైల్ కంపెనీ రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌లో టచ్ స్క్రీన్‌మీద సున్నితంగా ట్యాప్ చేసినట్లే మిక్సీ మీద ఉన్న నంబర్లమీద ట్యాప్ చేసి వేగాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒకవేళ మన చేతికి జిగురూ అదీ ఉంటే, ఫోన్ ఆప్‌లోని వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆన్, ఆఫ్ చేయడంతోపాటు ఏ మోతాదులో మెత్తగా కావాలో కూడా చెప్పొచ్చు. ఇందులోని ఆటో సెన్స్ టెక్నాలజీ ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను బట్టి మనకి కావాల్సినట్లుగా చేసేస్తుంది కాబట్టి నలిగిందా లేదా అని మాటిమాటికీ చూసుకోనక్కర్లేదు.
డస్ట్‌బిన్‌లో కంపోస్ట్ తయారీ!
బయట తినడమో లేదా ఫంక్షన్లకో పార్టీలకో వెళ్లడం వల్లో వండినవీ లేదా కొన్నవీ... ఇలా చాలావరకూ చెత్త డబ్బాల్లో పారేస్తాం. అలా వేయకుండా వృథాగా పారేస్తోన్న దాన్ని కంపోస్ట్‌గా మార్చుకోవాలంటే కొంత సమయం కేటాయించాలి. అంత తీరిక లేక చాలామంది చెత్తడబ్బాలో పడేస్తారు. అయితే ఆ చెత్తడబ్బానే మనం పారేసిన ఆహారాన్ని కంపోస్ట్‌గా మార్చేస్తే ఎంత బాగుంటుందో కదూ.... సరిగ్గా ఆ ఆలోచనతోనే డస్ట్‌బిన్‌ను రూపొందించింది రీంకల్ ప్రైమ్ కంపెనీ. పండ్లూ కూరగాయలూ పాల ఉత్పత్తులూ పిజ్జాలూ... ఇలా వదిలేసినవన్నీ వేయొచ్చట. అందులోని త్రీ లేయర్ కార్బన్ ఫిల్టర్ కారణంగా ఎలాంటి చెడు వాసనా రాదు సరికదా, శబ్దం లేకుండా దాని పని అది చేసుకుంటుంది. కాబట్టి మనం ఇంట్లోని చెత్తనే మాంఛి ఎరువుగా మార్చుకుని మొక్కలకు వాడుకోవచ్చు. చేయి పెట్టే పని లేకుండా కాలుతోనే మూత తెరవొచ్చు.
ఇ-బైక్ టేబుల్!
గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల జరిగే నష్టం గురించి తెలిసి ఆఫీసుల్లో వాడుకునేందుకు నిలబడీ కూర్చునీ చేసుకోగలిగే డెస్క్‌లెన్నో ఇప్పటికే వచ్చాయి. అయితే వాటితో పోలిస్తే కూర్చునే కాళ్లను కదిలించే లేదా సైకిల్ మాదిరిగా తొక్కగలిగే డెస్కు ఈ ఏడాది రానుంది. అదే ఏసర్ కంపెనీ తీసుకొచ్చిన ఇ-కైనెక్ట్ బిడి3.
దీనిమీద కూర్చుని హాయిగా రోజంతా పనిచేసుకుంటూనే వ్యాయామం చేసుకోవచ్చు. దాంతో క్యాలరీలు ఖర్చవడమే కాదు, అవన్నీ మళ్లీ తిరిగి విద్యుచ్ఛక్తిగా మారి, మనం వాడుకునే ల్యాప్‌ట్యాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌కి ఛార్జింగ్ చేసుకునేలానూ దీన్ని డిజైన్ చేశారు. అందుకనుగుణంగా డెస్కుకే యూఎస్‌బీ పోర్టుల్నీ డిజైన్ చేశారు. మనం తొక్కే వేగాన్ని బట్టి విద్యుచ్ఛక్తి ఉత్పత్తి ఆధారపడి ఉంటుందట.
యూ స్కాన్!
స్మార్ట్ టాయ్‌లెట్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అయితే ఈ ఏడాది సీఈఎస్ షోలో వచ్చిన విథింగ్స్ యూ-స్కాన్ అనే పరికరం మాత్రం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే టాయ్‌లెట్‌లో యూరిన్ డ్రాప్ పడగానే దానికి అటాచ్ చేసి ఉన్న ఈ స్కాన్, దాన్ని పూర్తిగా విశ్లేషించి సదరు వ్యక్తి ఆరోగ్యం గురించిన సమగ్ర సమాచారాన్ని ఆప్‌కి అందిస్తుంది. అంతేకాదు, అందులో ఉన్న ఆప్టికల్ సెన్సర్, లోపలున్న కలర్ చేంజింగ్ స్ట్రిప్స్ ఆధారంగా పీరియడ్స్ వచ్చే సమయాన్నీ చెబుతుందట. ల్యాబ్‌కు పంపాల్సిన అవసరం లేకుండానే అది మూత్రంలోని పదార్థాల్ని విశ్లేషించి ఎంత నీరు తాగుతున్నాం... ఏయే పోషకాల్ని తీసుకుంటున్నాం... వంటి వాటినీ అంచనా వేసి, మూత్రపిండాలు, జీర్ణాశయ వ్యవస్థ గురించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.
స్మార్ట్ కిచెన్!
వంట చేయాలంటే వంటింట్లో స్టవ్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా. మిక్సీ, గ్రైండర్, ఎలక్ట్రిక్ కుక్కర్, శాండ్‌విచ్ టోస్టర్, ఓవెన్, కెటిల్, కాఫీ మేకర్, ఎగ్ బాయిలర్... ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులూ అవసరమే. మళ్లీ వాటికి ప్లగ్ పాయింట్లూ వాటికున్న వైర్లతో కౌంటర్ టాప్ చిందరవందరగా కనిపిస్తుంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. దాన్ని అధిగమించేందుకే అమెరికాకి చెందిన వైర్‌లెస్ పవర్ కన్సార్టియం అనే కంపెనీ ‘కి’(కెఐ) పేరుతో కార్డ్‌లెస్ కిచెన్‌ను రూపొందించింది. కిచెన్ కౌంటర్ టాప్ లోపలే ట్రాన్స్‌మిటర్లను అమర్చి, ఎలక్ట్రిక్ పాయింట్లను గట్టుమీద మార్క్ చేస్తారన్నమాట. ఇండక్షన్ స్టవ్‌లో మాదిరిగానే సర్కిల్ లేదా మార్క్ ఉన్నచోట మిక్సీ లేదా కెటిల్... పెట్టుకుని స్విచ్ ఆన్ చేస్తే చాలు. పనైపోగానే వాటిని పక్కకు తీస్తే, అవి ఆటోమేటిగ్గా ఆగిపోతాయి. దాన్ని తీయగానే అక్కడ చేయిపెడితే కౌంటర్ చల్లగానే ఉంటుంది. కాబట్టి కాలుతుందన్న భయం అక్కర్లేదు. ఒకవేళ మిక్సీ లేదా కెటిల్ స్విచ్ ముందే ఆన్ అయి ఉంటే, దాన్నుంచి బ్లింకింగ్ వస్తుందే కానీ వెంటనే పనిచేయదు. కాబట్టి కెటిల్‌ను తీసుకెళ్లి పొరబాటున ఇండక్షన్ పాయింట్ దగ్గర పెట్టినా ఇబ్బంది ఉండదన్నమాట. కాబట్టి ఇక, ఈ కిచెన్ కన్సార్టియంకు అనుగుణంగానే అన్ని కంపెనీలూ తమ ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ వైరుల్లేకుండానే పనిచేసేలా డిజైన్ చేస్తారన్నమాట.
వైర్లు కనిపించవిక...
స్మార్ట్‌ఫోనుల్లో కొత్త ఫీచర్లు వస్తున్నట్లే ఏటా టీవీల్లోనూ కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయి. ఎల్‌సీడీ ఎల్‌ఈడీని దాటి ఓఎల్‌ఈడీలూ వచ్చాయి. అయినప్పటికీ కేబుల్ వైర్లూ సెటాప్ బాక్సులూ ఉంటూనే ఉన్నాయి. అందుకే ఎల్‌జీ కంపెనీ తొలిసారిగా వైర్‌లెస్ సిగ్నేచర్ ఓఎల్‌ఈడీ ఎమ్3 వెర్షన్‌ను తీసుకొచ్చింది. 97 అంగుళాల ఈ ఓఎల్‌ఈడీ టీవీని హాల్లోని గోడకు పెట్టి, వైఫై సెటాప్ బాక్సును దానికి 30 అడుగుల దూరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. టీవీకీ బాక్సుకీ మధ్యలో మనిషి నడిచివెళ్లినా సిగ్నల్స్ రావన్న భయం అక్కర్లేదు. తద్వారా ఆడియో వీడియో క్వాలిటీలోనూ ఏమాత్రం తేడా ఉండదు. సో, హాల్లో టీవీ అమర్చాలంటే కేవలం పవర్ ప్లగ్ ఒక్కటి ఉంటే చాలన్నమాట. ప్రస్తుతం ఈ వైర్‌లెస్ టెక్నాలజీ అల్ట్రా ప్రీమియం టీవీకే పరిమితమైనా మున్ముందు మిగిలిన మోడల్స్‌లోనూ తీసుకురానుంది ఎల్‌జీ కంపెనీ.
డ్రెస్సుకి తగ్గట్లుగా కారు రంగు!
తెలుపు రంగు ఎంత ఇష్టమున్నా కొన్నిసార్లయినా రంగురంగుల కార్లలో డ్రైవ్ చేయడం కొందరికి ఇష్టం ఉంటుంది. అలాగని తరచూ కారు రంగుని మార్చుకోలేం కదా. అందుకే బీఎండబ్ల్యూ కంపెనీ గతేడాది ఎలక్ట్రానిక్ ఇంక్ ప్యానల్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆప్ ద్వారా రంగులు మారే ఐఎక్స్ ఫ్లో కాన్సెప్ట్ కారును తీసుకొచ్చింది. ఈ ఏడాది అందులోనే ‘ఐ విజన్ డీ’ అనే మరో కొత్త ఆలోచనతో ఆటోమొబైల్ ప్రియుల మనసు దోచుకుంది. డీ అంటే డిజిటల్ ఎమోషనల్ ఎక్స్‌పీరియెన్స్ అని అర్థం. ఫోన్‌లోకెళ్లి ఆప్ చూసే పని లేకుండానే కారు నడిపే వాళ్ల డ్రెస్సూ మూడ్‌కి తగినట్లుగా వాయిస్ అండ్ ఏఐ టెక్నాలజీ ద్వారా రంగుని మార్చుకోవచ్చట. డ్యాష్‌బోర్డుమీద వేలుతో టచ్ చేస్తే చాలు... అక్కడ ఉండే ఆప్షన్లన్నీ అద్దమ్మీదే కనిపిస్తాయట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Latestnews News
Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
Education News
MBBS results: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు