అందంగా... ఆహ్లాదంగా... కోరా..!
‘ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు... ఒకటైతే మిగిలేది తెలుపేనండి...’ అన్నాడో సినీకవి. నిజమే మరి...వర్ణపటకంలో రంగులెన్ని ఉన్నా అన్నీ కలిసిపోయాక కనిపించేది తెలుపే మరి. రంగుల్లో చల్లదనాన్ని పంచే తెలుపుని మించినది లేనే లేదు. అయితే అన్ని రంగుల్లో లేతా ముదురూ ఛాయలున్నట్లే తెలుపుకి మాత్రం ఎందుకుండొద్దూ అని నాటి చేనేత కళాకారులకీ అనిపించినట్లుంది. అందుకే నూలుపోగులకి ఏ రంగూ అద్దకుండానే బట్టను నేసేశారు. అలా సహజంగా పుట్టుకొచ్చిందే కోరా ఉరఫ్ ఆఫ్-వైట్ కలర్. అందాన్నీ ఆహ్లాదాన్నీ పంచే ఆ రంగుకి నాటి నుంచి నేటి వరకూ అంతా ఫిదానే. తెలుగింటి ఉగాది పండక్కైనా మలయాళీల ఓనమ్‌కైనా సంప్రదాయ పెళ్లి వేడుకల్లోనైనా ఆధునిక పార్టీల్లోనైనా కోరా రంగు అందంగా వెలిగిపోతుంటుంది.
తెలుపూ గోధుమా కలగలిసినట్లుండే కోరా లేదా ఆఫ్-వైట్ రంగు కళ్లకు హాయిగా అనిపిస్తుంది. అలాగని ఇది ప్రకృతిలో లేదనుకునేరు... విరిసిన శ్వేతగులాబీలూ మెరిసే ముత్యాలదీ ఈ రంగే మరి. దుస్తులకొస్తే కోరా సహజత్వానికి ప్రతీక. పత్తిని ఏకి
దారం చేసే ప్రక్రియలో అది రంగుమారుతుంది. దాంతో నూలు లేదా కాటన్ దారాలన్నీ ఎక్కువగా కోరా రంగులోనే కనిపిస్తాయి. అందుకే రసాయనాలతో బ్లీచ్ చేయని సహజమైన బట్టనే కోరా క్లాత్ అంటారు. ఈ కోరా దారాన్నే బ్లీచ్ చేసి తెల్లగా మారుస్తారు. ఆపై దానికి రంగులూ అద్దుతారు. అందుకే పూర్వకాలంలో రంగులతో పనిలేని కోరా బట్టనే ఎక్కువగా ధరించేవారు. ఒకప్పుడు మనదగ్గర ఈ రంగు ఖద్దరునే మల్లు కాటన్ అనీ పిలిచేవారు. కృత్రిమ రంగుల రాకతో దీని ప్రభ తగ్గినా సేంద్రియ మంత్రం పఠిస్తోన్న ఆధునికుల కోసం ఫ్యాషన్ డిజైనర్లు మరోసారి గతంలోకి తొంగిచూస్తున్నారు. అయితే ఈసారి కేవలం ఆ క్లాత్ అని కాకుండా ప్రాసెస్డ్ కాటన్, లినెన్, పట్టు... వంటి సహజ ఫ్యాబ్రిక్కులతోపాటు రేయాన్, నైలాన్, జార్జెట్, నెట్... వంటి సహజ ఫ్యాబ్రిక్కులతో డిజైన్ చేసే చీరలూ గాగ్రాలూ లాంగ్ ఫ్రాకులూ అన్నింటికీ ఆ కోరా రంగుని అద్దేస్తున్నారన్నమాట.
పండుగలూ పెళ్లిళ్లూ..!
తెలుగువారి తొలి పండుగ అయిన చైత్రశుద్ధపాడ్యమే ఉగాది. పూజాసమయంలో తెలుపూ లేదా కోరా రంగు దుస్తుల్ని ధరిస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆ కారణంతోనే పూజావేడుకల్లోనూ ధ్యానం చేసేటప్పుడూ ఎక్కువమంది ఈ రంగు దుస్తుల్నే వేసుకుంటారు. పోతే, ఎండ ప్రతాపం పెరుగుతుందన్నదాన్ని సూచిస్తూ ఈ పండుగకి తెలుపూ లేదా కోరా దుస్తుల్నే ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ఇవి వేడిని గ్రహించవు కాబట్టి చల్లదనాన్ని అందిస్తూ వడదెబ్బనుంచి రక్షిస్తాయి. పిల్లలకు రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉగాదికి ఈ రంగు నేత బట్టతోనే దుస్తుల్ని కుట్టిస్తారు. అప్పటినుంచీ వేసవి అయ్యేవరకూ లేలేత రంగుల్నే ఎక్కువగా వేస్తుంటారు. పోతే పురుషులు సైతం ఆ రంగుల్లోనే కాటన్ లేదా ఖద్దరు షర్టుల్నీ ప్యాంటుల్నీ కుట్టించుకోవడం లేదా పంచెలు కట్టుకోవడం చేస్తుంటారు. ఇక, పెళ్లి వేడుకల్లో పూర్వకాలం నుంచీ ఈ రంగుదే ప్రాధాన్యత. పెళ్లికి ముందూ తరవాతా ఏ రంగు కట్టినా పెళ్లి చీరగా మాత్రం అనేక ప్రాంతాల్లో తెలుపూ లేదా ఆఫ్ వైట్ ఛాయల్లోని దుస్తుల్ని ధరించడం సంప్రదాయంగా వస్తోంది.
ఒకప్పుడు వేడి వాతావరణం వల్ల దక్షిణాదిన మాత్రమే ఈ రంగు వాడకం ఎక్కువగా ఉండేది. కానీఇటీవల బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం క్రీమ్ కలర్ షేడ్స్‌నే పెళ్లిళ్లకు ధరిస్తున్నారు. మొత్తమ్మీద ఆఫ్-వైట్ హవా కొనసాగుతోంది.
తెలుపురంగులానే!
స్వచ్ఛతకీ ప్రశాంతతకీ ఆధ్యాత్మికతకీ పవిత్రతకీ సంకేతమైన తెలుపు రంగు మంచితనానికీ ప్రతీకగా భావిస్తారు. ఈ లక్షణాలన్నీ దీనికీ వర్తిస్తాయి అంటారు కలర్ థెరపిస్టులు. అయితే తెలుపు అన్ని సందర్భాల్లోనూ అందరికీ నప్పదు. కానీ ఆఫ్‌వైట్‌తో ఆ ఇబ్బంది లేదు సరికదా రిచ్‌గానూ కనిపిస్తుంది. అందుకే ఇంటీరియర్స్‌లోనూ వాహనాల్లోనూ తెలుపుకన్నా ఆఫ్‌వైట్‌నే ఎక్కువమంది ఇష్టపడతారు. దీన్ని ఎరుపూ గులాబీ నీలం... ఇలా ఏ రంగుతోనైనా చక్కగా జత చేయొచ్చు. ఏ రంగుతోనూ కలపకపోయినా దానికదే అందంగా ఉంటుంది. బంగారురంగు జరీ ఆఫ్‌వైట్‌మీద అందంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే కేరళీయుల కసావు చీరలన్నీ ఈ రెండు రంగుల మేళవింపుతోనే వస్తుంటాయి. ఈ రంగుని ఎక్కువగా ధరించేవారు ప్రశాంతంగా ఆలోచిస్తారు. స్థిరచిత్తులై, ఆశావాదులై ఉంటారు. నిరాడంబరతనీ ప్రతిఫలిస్తుందీ రంగు. కొత్తదనానికీ ఇది సంకేతమే. కొత్తగా ఆలోచించేవాళ్లంతా ఈ రంగు పట్లే మక్కువ చూపిస్తారట.
అదే ఎందుకు?
మలయాళీలు ఓనం లేదా విషు పండుగనాడు తప్పనిసరిగా దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉన్న కసావు చీర లేదా ముండు(పంచె)నే ధరిస్తారు. ఇది లేకుండా అక్కడ ఏ సంప్రదాయ వేడుకా పూర్తికాదని చెప్పవచ్చు. కసావు అంటే మలయాళంలో బంగారు రంగు జరీ అని అర్థం. అందుకే ఈ జరీని వాడి చేసిన లుంగీని కసావు ముండు అనీ, చీరను కసావు చీర అనీ అంటారు. తిరువాన్కూరు మహారాజు బలరామవర్మ తమిళనాడు నుంచి కొందరు నేతగాళ్లను రప్పించి ఈ చీరల్ని నేయించడం ప్రారంభించాడట. వాళ్లు దారాలు మందంగా మారేందుకు బియ్యం, కర్రపెండలం మిశ్రమంలో ముంచి తీసేవారట. దాంతో అవి చిక్కని క్రీమ్ కలర్‌నీ సంతరించుకునేవి. అప్పటినుంచీ తిరువనంతపురం దగ్గరున్న బలరామపురం ఈ నేతకు ఎంతో ప్రాచుర్యం చెందింది. దీంతోపాటు చేందమంగళం, కుత్తాంపుళ్లీ... ప్రాంతాలు కూడా కసావు చీరలకు ప్రాచుర్యం పొందడంతో ఈ మూడు ప్రాంతాలూ జిఐ ట్యాగునీ సొంతం చేసుకున్నాయి. సంప్రదాయ కసావు చీరలో కచ్చితంగా 4,500 దారప్పోగులు ఉండేలా నేస్తారు. బలరామపురంలో నేసే చీరల్లో మాత్రం నేటికీ జరీ అంచు పైనాకిందా ఒకేలా ఉంటుంది. మిగిలినచోట్ల జరీపోగులతోపాటు రంగు దారాల బోర్డరుతోనూ నేస్తున్నారు. ఆప్లిక్, థ్రెడ్ ఎంబ్రాయిడరీల్ని చొప్పిస్తున్నారు. బ్లౌజుల్ని సైతం చీరలోని క్లాత్‌తో కాకుండా ప్రత్యేకంగానూ డిజైన్ చేస్తున్నారు. ఈ క్లాత్‌తోనే కుర్తీలూ స్కర్టులూ పలాజోలూ లాంగ్‌ఫ్రాక్‌లూ కూడా కుట్టించుకోవడం తాజా ఫ్యాషన్‌గానూ మారింది. దాంతో ఆ బట్టతోపాటు ఆ రంగుకీ క్రేజ్ పెరిగినట్లుంది. అన్ని రకాల ఫ్యాబ్రిక్కుల్లోనూ యాక్సెసరీల్లోనూ కోరా కలర్ కూల్ కూల్ సమ్మర్ కలర్‌గా ర్యాంప్‌ల నుంచి గల్లీల వరకూ హల్‌చల్ చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!
-
Politics News
Rahul Gandhi: స్పీకర్‌జీ..వివరణ ఇచ్చేందుకు అనుమతివ్వండి: రాహుల్
-
Movies News
Suriya42: ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ రేంజ్లో సూర్య మూవీ ఉంటుందట!
-
India News
Nitish Kumar: ‘హిందీని చంపేస్తారా’.. మండలి ఛైర్మన్‌పై నీతీశ్ ఆగ్రహం!