కొత్తా గింజలండీ..!

ఎండు పండ్లూ గింజలూ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బాదం, పిస్తా, జీడిపప్పు, అంజీర్‌, కిస్‌మిస్‌లే. కానీ ఈమధ్య డ్రైఫ్రూట్స్‌ అండ్‌ నట్స్‌ డబ్బాల్లో కొత్తరకం గింజలు కూడా చాలానే కనిపిస్తున్నాయి.

Updated : 26 Mar 2023 06:55 IST

కొత్తా గింజలండీ..!

ఎండు పండ్లూ గింజలూ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి బాదం, పిస్తా, జీడిపప్పు, అంజీర్‌, కిస్‌మిస్‌లే. కానీ ఈమధ్య డ్రైఫ్రూట్స్‌ అండ్‌ నట్స్‌ డబ్బాల్లో కొత్తరకం గింజలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అయితే అసలవి బాగుంటాయో లేదో తింటే ఏమవుతుందో అన్న సందేహంతో చాలామంది వాటి జోలికే పోరు. కానీ కూరగాయలైనా పండ్లైనా ఎన్ని రకాలు తింటే అంత మంచిదన్నట్లే గింజల్లోనూ ఎన్ని ఎక్కువ రకాల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అంటున్నారు నిపుణులు. అందుకే కొత్తగా వస్తోన్న ఆ నట్స్‌ ఏంటో ఓ లుక్కేద్దామా మరి..!


యాంటీఆక్సిడెంట్లకు పీకాన్లు!

మెరికాలో ఎక్కువగా పండే పీకాన్‌ చూడ్డానికి సగం కోసిన వాల్‌నట్‌ని తలపిస్తుంది. కానీ పల్లీల మాదిరిగా తినేకొద్దీ తినాలనిపించే రుచి వీటిది. అందుకే వీటిని కుకీలూ కేకులూ ఐస్‌క్రీముల్లో వాడుతుంటారు. క్యాండీలూ డెజర్ట్‌ల తయారీలోనూ వేస్తుంటారు. పీనట్‌ బటర్‌లానే పీకాన్‌ బటర్‌నీ బ్రెడ్డుతోపాటు తింటారు. దీన్నుంచి తీసిన నూనెను సైతం వంటల్లోనూ ఔషధాల తయారీలోనూ వాడతారు. అన్నిరకాల నట్స్‌లోకన్నా ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంది. మోనోఅన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులతోపాటు ఫినాలిక్‌ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో హృద్రోగాలు రాకుండా కాపాడతాయివి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌నీ పెంచుతాయి. పీచు ఎక్కువగా ఉండే పీకాన్లు పేగు ఆరోగ్యానికీ మంచిదే. జీవక్రియను పెంచి ఆకలిని తగ్గించే ఈ నట్స్‌వల్ల బరువూ తగ్గొచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండానూ అడ్డుకుంటాయి. వీటిల్లోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలవల్ల ఆర్ద్రయిటిస్‌, ఆల్జీమర్స్‌, హృద్రోగాలు, చర్మసమస్యలు... వంటివన్నీ తగ్గుతాయి. ఇందులోని ఎల్‌-అర్జినైన్‌ అనే అమైనో ఆమ్లం జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుందట.


తీయని హేజల్‌ నట్స్‌

వీటినే కాబ్‌ నట్స్‌ అనీ పిలుస్తారు. కొబ్బరి పిందెల్ని పోలినట్లుగా ఉండే కాయల్లోని పప్పుల్ని చాకొలెట్‌ ఉత్పత్తుల్లో వాడతారు. నాటిన నాలుగైదేళ్ల నుంచీ కాయలు వస్తాయి. బాదం జీడిపప్పులానే ఇవీ కొంచెం తీపి కలిసిన రుచితో ఉంటాయి. హేజల్‌ నట్స్‌ నుంచి తీసిన బటర్‌నే నటెల్లా... వంటి బ్రెడ్‌ స్ప్రెడ్స్‌ తయారీలో వాడతారు. టర్కీ, ఇటలీలో ఎక్కువగా పండే ఈ నట్స్‌లో రోజువారీ అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. ఓలియాక్‌, లినొలియాక్‌ ఆమ్లాలతో కూడిన అన్‌శాచ్యురేటెడ్‌ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒకటీరెండూ హేజల్‌ నట్స్‌ తిన్నా చాలు, ఇన్సులిన్‌ తయారీ పెరగడంతోపాటు గుండె ఆరోగ్యమూ మెరుగవుతుంది. మిగిలిన నట్స్‌తో పోలిస్తే వీటిల్లో క్యాన్సర్‌ను నిరోధించే ప్రొయాంతోసైనిడిన్స్‌ ఎక్కువ. ఇందులోని ఇ-విటమిన్‌ క్యాన్సర్‌కు కారణమైన కణాలను తగ్గిస్తుంది. ఈ నూనెను చర్మానికి పట్టిస్తే మృదువుగా చేయడంతోపాటు యూవీకాంతి నుంచీ రక్షిస్తుంది. మహిళల్లో సంతానోత్పత్తికీ తోడ్పడతాయివి. అరుదుగా లభించే ట్రిప్టోఫాన్‌ ఇందులో కొద్దిగా లభ్యమవుతుంది. ఇది కేంద్రనాడీవ్యవస్థ పనితీరుని పెంచుతుంది. గర్భిణీలు తొలి మూడునెలల్లో వీటిని తింటే పిల్లల్లో మెదడు పెరుగుదల బాగుంటుంది.


మెదడుకు బ్రెజిల్‌ నట్స్‌!

వీటి కాయలు మనదగ్గర పెరిగే నాగలింగం చెట్టుకి కాసే గుండ్రని చెక్క బంతుల్ని తలపిస్తాయి. పువ్వులు సైతం ఆ పుష్పాల్లానే ఉంటాయి. మందపాటి చెక్కలా ఉన్న ఈ కాయ లోపల గట్టి పెంకుతో కూడిన 18 నుంచి 24 గింజలు ఉంటాయి. అమెజాన్‌ అడవుల్లో ఎక్కువగా పెరిగే బ్రెజిల్‌ నట్స్‌ పురుషుల్లో సంతాన సాఫల్యతనీ లైంగికశక్తినీ పెంచుతాయట. ఎలాజిక్‌ ఆమ్లం మెదడు ఆరోగ్యానికీ బరువు తగ్గడానికీ జుట్టు పెరుగుదలకీ తోడ్పడుతుంది. ఇందులోని ఎల్‌-అర్జినిన్‌ పురుషుల్లో బట్టతలనీ రానివ్వదు. ఆహారంలో అరుదుగా లభించే సెలీనియంకి ఇవి మంచి వనరు. ఒక్కగింజ నుంచి 96 మై.గ్రా. సెలీనియం లభిస్తుంది. ఇందులోని సెలెనొ ప్రొటీన్లు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇవి థైరాయిడ్‌ పనితీరుకీ తోడ్పడతాయి. ఆందోళన, ఒత్తిడితో ఉండేవాళ్లు ఓ నాలుగు నట్స్‌ తింటే మెదడులో సెరటోనిన్‌ పెరిగి మంచి నిద్ర పడుతుంది. అలాగని అంతకన్నా ఎక్కువ తింటే సెలీనియం ఎక్కువై టాక్సిన్‌గానూ పరిణమించవచ్చు.


గుండెకు అండ... నల్ల అక్రోటు!

గోధుమ లేదా ఎరుపు రంగులో ఉన్న అక్రోట్లే చాలామందికి తెలుసుగానీ నల్లని వాల్‌నట్సూ ఉన్నాయి. ఈ రకం చెట్లు ఉత్తర అమెరికాలో ఎక్కువగా పెరుగుతాయి. లోపలున్న గింజలు గోధుమ రంగు వాల్‌నట్స్‌లానే ఉన్నప్పటికీ వీటి కాయలు మాత్రం గుండ్రంగా నల్లగానూ ఉంటాయి. ఎండిన కాయల్ని పగులగొట్టి పప్పుల్ని తీయడం చాలా కష్టం. అయితే మామూలు అక్రోట్లతో పోలిస్తే నల్ల వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లూ పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఆమ్లాల శాతం ఎక్కువ. శరీరంలోని అన్ని అవయవాల పనితీరుకీ తోడ్పడతాయివి. చెడు కొలెస్ట్రాల్‌నీ ఇన్‌ఫ్లమేషన్‌నీ తగ్గిస్తాయి. వీటిని ఎక్కువగా తినే స్త్రీలలో మధుమేహం, బీపీ, క్యాన్సర్లూ హృద్రోగాలూ వచ్చే శాతం తక్కువని పరిశోధనల్లోనూ తేలింది. ఇవి పొట్టలో మంచి బ్యాక్టీరియా పెంచుతాయి. తద్వారా డిప్రెషన్‌ను అడ్డుకుంటాయి. పేగు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్నీ తగ్గిస్తాయి. ఈ పప్పుల్ని కేకులూ కుకీల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు. అలాగే సంప్రదాయ వైద్యంలోనూ వీటి వాడకం ఎక్కువే. ముఖ్యంగా వీటిల్లోని ఎలాజిక్‌ ఆమ్లం గుండెను కాపాడుతుంది.


మధుమేహ నియంత్రణకి మకడేమియా

స్ట్రేలియా వీటి స్వస్థలం. అక్కడి స్థానిక తెగలు తినే ప్రధాన ఆహారంలో ఇవీ ఒకటి. బాదం, అక్రోట్లతో పోలిస్తే ఆరోగ్యకరమైన కొవ్వులు మకడేమియా నట్స్‌లోనే ఎక్కువట. ఇంకా పీచూ ప్రొటీన్లూ ఇతరత్రా పోషకాలూ అన్నీ కలిసి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పైగా వీటి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిని తినడంవల్ల ఎట్రియల్‌ ఫైబ్రిలేషన్‌, ఆకస్మిక గుండెపోటు... వంటివి తగ్గినట్లు స్వీడన్‌ ప్రజల్లో చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహం, పక్షవాతం... వంటి వాటికి దారితీసే జీవక్రియాలోపాలూ ఈ నట్స్‌ తింటే తగ్గాయట. గ్లైసెమిక్‌ నియంత్రణను పెంచే ఈ గింజలు మధుమేహులకీ మేలే. అలాగే వీటిల్లోని టొకొట్రైనాల్స్‌కి యాంటీక్యాన్సర్‌ లక్షణాలున్నాయట. ఇందులోని ఒమేగా-7 బరువు తగ్గడానికి తోడ్పడిందనేది మరో పరిశీలన.


కమ్మని రుచి... పైన్‌ నట్స్‌

సియా, ఐరోపా, అమెరికా ఖండాలంతటా ఉన్న పైన్‌ వృక్షాల్లో రకాలు చాలానే ఉన్నాయి. తీపీ వెన్న కలగలిసినట్లున్న కమ్మని రుచి వీటి సొంతం. పైన్‌ చెట్లకు వేసే ఆడ కంకుల్లో మాత్రమే ఈ గింజలు ఉంటాయి. అన్ని రకాల పోషకాలూ పుష్కలంగా ఉన్న ఈ గింజల్లోని ఒలియాక్‌ మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లం రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే ఇందులోని పినొలెనిక్‌ ఆమ్లం ఆకలిని తగ్గించే ఎంజైమ్‌ల విడుదలకు తోడ్పడటం ద్వారా బరువును నియంత్రిస్తుంది. ముఖ్యంగా ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మూత్రపిండాలు, కాలేయ పనితీరును పెంచినట్లు పరిశోధనలూ చెబుతున్నాయి. మధుమేహం, బీపీ రోగులకు ఇవెంతో మేలు. బాదంలో మాదిరిగానే వీటిల్లోనూ విటమిన్‌-ఇ శాతం ఎక్కువ. ఫలదీకరణ తరవాత రూపొందిన కంకులు పక్వ దశకు రావడానికి కనీసం రెండుమూడేళ్లు పడుతుంది. లోపల పప్పులు క్రీమ్‌ కలర్‌లోనూ పైనుండే తొక్క గోధుమరంగులోనూ ఉంటుంది. పశ్చిమ హిమాలయాల్లోని అడవుల్లో పెరిగే చిల్గోజా పైన్‌ నట్స్‌ అయితే సన్నగా పొడవుగా ఉంటాయి. ఆరోగ్యకరమైన మెడిటెర్రేనియన్‌ ఆహారంలో ఇవి తప్పక ఉంటాయి. తియ్యని వాసనతో ఉండే పైన్‌నట్‌ ఆయిల్‌ అయిన బోర్నియాల్‌ చర్మాన్ని పొడిబార కుండానూ చేస్తుంది. దీన్ని సంపద్రాయ వైద్యంలోనూ బ్యూటీ ఉత్పత్తుల్లోనూ వాడుతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..