చికుబుకు చికుబుకు రైలే... అదిరెను దీని రూటే!

వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలూ పెద్దలూ ఏయే ప్రాంతాలకు వెళ్లాలి... ఏమేం చూడాలి... అన్నది ఈ పాటికి లిస్టు చేసుకునే ఉంటారు. అలనాటి చరిత్రనీ నాటి రాజుల్నీ గుర్తుతెచ్చే చారిత్రక కట్టడాల్ని ఇష్టపడే వాళ్లు కొందరయితే, పచ్చనికొండల్లో విరిసిన నీలి మబ్బుల్ని చూస్తూ పరవశించిపోవాలని కోరుకుంటారు మరికొందరు.

Updated : 07 May 2023 04:14 IST

చికుబుకు చికుబుకు రైలే... అదిరెను దీని రూటే!

వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలూ పెద్దలూ ఏయే ప్రాంతాలకు వెళ్లాలి... ఏమేం చూడాలి... అన్నది ఈ పాటికి లిస్టు చేసుకునే ఉంటారు. అలనాటి చరిత్రనీ నాటి రాజుల్నీ గుర్తుతెచ్చే చారిత్రక కట్టడాల్ని ఇష్టపడే వాళ్లు కొందరయితే, పచ్చనికొండల్లో విరిసిన నీలి మబ్బుల్ని చూస్తూ పరవశించిపోవాలని కోరుకుంటారు మరికొందరు. ఆయా ప్రదేశాలతోపాటు ప్రయాణించే దారి సైతం మనోహరంగా ఉండాలని కోరుకుంటారు ఇంకొందరు... అలాంటివాళ్లకోసమే ఈ రైలు మార్గాలు... కనికట్టు చేస్తూ కదిలిపోయే కొండల్నీ అడవుల్నీ జలపాతాల్నీ ఊళ్లనీ చూస్తూ కాలాన్నే మరిపించే అందమైన ప్రయాణాలు..!


గిరికన్య సిగలో..!

(విశాఖపట్నం- అరకు)

వులిస్తున్న లోయలూ ఉరికే జలపాతాలూ ఎటు చూడాలో వేటిని చూడాలో తేలని ఓ సౌందర్య సమస్యతో మీరు సతమత మవ్వాలంటే కిరందుల్‌ రైలు ఎక్కాల్సిందే. అవునుమరి, అరకు చూడాలనుకునేవాళ్లకి ఏపీ టూరిజం సంస్థ రైలు కమ్‌ రోడ్డు ప్యాకేజీని చాలాకాలం నుంచే అందిస్తోంది. గతంలో కిరందుల్‌ ప్యాసింజర్‌ రైలు మాత్రమే ఉండేది. ఇప్పుడు విస్టాడోమ్‌ కోచ్‌ కూడా అందుబాటులో ఉంది. దేశంలోనే మొదటి అద్దాల రైలును ఈ మార్గంలోనే ఏర్పాటుచేయడం విశేషం. కొండకోనల మధ్యలో పెద్ద పెద్ద సొరంగాల మధ్యలోంచి సాగే ఈ రైలు ప్రయాణంలో- అరవిరిసిన పూలను సిగలో తురుముకున్న గిరికన్యలాగా కనిపిస్తుంది అరకులోయ. ముఖ్యంగా చలికాలంలో మంచుతెరల్ని చీల్చుకుంటూ జలపాతాలను చూసుకుంటూ గుహల మధ్య సాగే ఈ ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదభరితంగా ఉంటుంది. తూర్పు కనుమల్లోని కాఫీతోటలూ గిరిపుత్రికల థింసా నృత్యాలూ విరిసిన వలిసెపూల అందాలకు నెలవైన అరకులోయను చుట్టుకున్న అందమైన ఆభరణంలా అనిపిస్తుందీ కిరందుల్‌ రైలు మార్గం!


ఆకుపచ్చని లోకంలో..!

(మెట్టుపాళ్యం-ఊటీ)

కొండమలుపుల్నీ సొరంగాల్నీ దాటుకుంటూ తేయాకు పరిమళాన్ని నింపుకున్న పచ్చని కొండల్నీ వాటిమీద విహరించే నీలిమబ్బుల్ని చూసి పరవశించిపోవాలంటే నీలగిరి ప్యాసెంజర్‌లో ప్రయాణించాల్సిందే. ఊటీకే మణిమకుటంలాంటిదీ మార్గం. ఆసియా ఖండంలోనే అత్యంత నిటారుగా సాగే రైలు ప్రయాణమిది. సముద్రమట్టానికి 330 మీటర్ల ఎత్తున ఉన్న మెట్టుపాళ్యం నుంచి 2,200 మీటర్ల ఎత్తున ఉన్న ఉదకమండలానికి రైలు వెళుతుందంటే అది ఎంత నిట్టనిలువుగా ప్రయాణిస్తుందో తెలుస్తుంది. దేశంలోకెల్లా నెమ్మదిగా సాగే రైలు ప్రయాణం కూడా ఇదే. కేవలం 46 కి.మీ. దూరానికి ఐదుగంటల సమయం పడుతుంది. ఊటీ ఓ అందమైన పర్యటక ప్రాంతంగా మారడానికి కారణం ఈ రైలు పర్యటనే అని చెప్పొచ్చు. కీకారణ్యాల్నీ లోయల్నీ పర్వతాల్నీ కలుపుతూ వేసిన ఈ రైలుదారిలో వెళుతుంటే నాటి సాంకేతిక నిపుణుల కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. మెట్టుపాళ్యం నుంచి కెల్లార్‌ వరకూ వరిపొలాలూ ఆ తరవాత కొండలూ కనువిందు చేస్తాయి. కూనూర్‌లో తేయాకు తోటల పరిమళాల్ని ఆఘ్రాణించాక, ఫెర్న్‌హిల్‌కి వెళ్లే మార్గం మొత్తం నిటారుగానే ఉంటుంది. ఆ సమయంలో రైలు వెనక్కి పడిపోతుందేమో అన్న భయమూ కలగకపోదు. అలా పడకుండా ఉండేందుకే రాక్‌ అండ్‌ పినియన్‌ విధానాన్ని పట్టాలమధ్య ఏర్పాటుచేశారు దీని రూపకర్త అయిన రిగ్గిన్‌బెక్‌. ఊటీకి చేరేసరికి రైలు మైదానంలోకి వస్తుంది. మొత్తంగా 250 వంతెనల్నీ 208 పాము మెలికల మలుపుల్నీ 16 సొరంగాల్నీ దాటుకుంటూ పర్వతాల్లో ఒదిగిన ఇళ్లనీ ఆకాశాన్ని తాకే యూకలిప్టస్‌ చెట్లనీ రంగులపూలనీ చూస్తూ సాగే నీలగిరి రైలు ప్రయాణం చెరగని చిత్రంలా మనసులో ముద్రితమైపోవడం ఖాయం. ‘దిల్‌సే’లోని ‘ఛైయ్యా ఛైయ్యా...’ పాట మొత్తం కదిలే ఈ రైలుమీదే చిత్రీకరించడం మరో విశేషం.


మేఘమాలికల్లో..!

(న్యూజల్‌పాయ్‌గుడీ-డార్జిలింగ్‌)

మార్గంలో ప్రయాణించాలంటే ముందుగా పశ్చిమ్‌ బంగలోని న్యూజల్‌పాయ్‌గుడీ రైల్వే జంక్షన్‌కి చేరుకోవాలి. అక్కడి నుంచి డార్జిలింగ్‌ 88 కి.మీ.  టాక్సీలో అయితే మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. కానీ ఈ రైలెక్కితే మాత్రం సుమారు ఏడు గంటలు పడుతుంది. అయినప్పటికీ ఈ టాయ్‌ రైల్‌ జాయ్‌ రైడ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పనిగట్టుకుని మరీ వస్తుంటారు. ఎందుకంటే- ఆసియాలోకెల్లా ఎత్తైన స్టేషన్‌ అయిన ఘూమ్‌, మంచుకొండల్లోని అందమైన పర్వత శిఖరాల్లో ఒకటైన కాంచనజంగ... ఈ మార్గంలోనే వస్తాయి. 20వ శతాబ్దం తొలినాళ్లలో మొదలైన ఈ మార్గంలో ఒకప్పుడు స్టీమ్‌ ఇంజిన్‌తోనే రైలు నడిచేది. అప్పుడైతే ప్రయాణం పది గంటలకు పైనే పట్టేదట. కానీ ఇప్పుడు డీజిల్‌ ఇంజిన్‌ ఏడుగంటల్లోనే అక్కడికి చేరుస్తుంది. స్టీమ్‌ ఇంజిన్‌తో నడిచే రైడ్‌లూ ఉన్నాయి కానీ ధర కాస్త ఎక్కువ. హిమగిరి పల్లెల్నీ అక్కడి జీవన విధానాన్నీ గమనిస్తుంటే సమయమే తెలీదంటారు ప్రయాణికులు. ముడి పిన్ను ఆకారంలో ఉన్న బటాసియా లూప్‌ దగ్గర కాసేపు రైలుని ఆపి మరీ అక్కడి అందాల్ని చూపిస్తారు హిమాలయన్‌ రైల్వే నిర్వాహకులు.


పాలవెల్లువలో..!

(వాస్కొడగామా-లోండా)

పాలవెల్లువని తలపించే దూధ్‌సాగర్‌ జలపాతాల్లో తడిసిముద్దవుతూ పశ్చిమ కనుమల అందాల్ని వీక్షించాలనుకుంటే- వాస్కొడగామా నుంచి బయలుదేరి కర్ణాటకకు వెళ్లే గోవా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సిందే. ఈ మార్గంలో కర్ణాటకలోని లోండా పట్టణానికి సమీపంలో వచ్చే దూధ్‌సాగర్‌ను చూడటం మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. దాన్నుంచి వచ్చే చిరుజల్లులు ఒంటిని తాకుతూ ప్రయాణికుల్ని పరవశింపజేస్తాయి. ఆ జలపాత హోరు కళ్లూ చెవులూ మాత్రమే పనిచేసేలా చేస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీనికి చేరువలో ఉన్న కాజిల్‌ రాక్‌ అనే స్టేషన్‌లో ఫొటోలు తీసుకునేందుకు వీలుగా అక్కడ కాసేపు రైలు ఆగుతుందట కూడా.


గాల్లో తేలినట్లుందే...!

(కాల్కా-శిమ్లా)

రైలుమార్గం అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది హిమాలయ రాణిగా పిలిచే కల్కా- సిమ్లా రైలు మార్గమే. ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లుగా పేరొందిన సిమ్లాకు కల్కా స్టేషన్‌ ప్రవేశద్వారం. ఇక్కడి నుంచి 96 కి.మీ. దూరంలో ఉన్న సిమ్లాకు నేరోగేజ్‌ పట్టాలమీద ఐదారు బోగీలు మాత్రమే ఉన్న టాయ్‌ రైల్లో ప్రయాణం ఓ మధురస్వప్నం. ఎత్తైన హిమాలయ శ్రేణి మీద 850 వంతెనలూ 102 సొరంగాల్ని దాటుకుంటూ సాగే ఈ మార్గంలో పైన్‌, ఓక్‌ చెట్లమీదుగా వీచే చల్లని గాలులు ముఖాన్ని తాకుతూ హాయిగొల్పుతాయి. చేతికి అందేంత ఎత్తులో పరుగులు తీసే తెల్లని మేఘాలూ గాల్లో తేలుతున్న అనుభూతిని కలిగిస్తూ స్వాగతిస్తుంటాయి. ఓ పక్క ప్రకృతి అందాలు గిలిగింతలు పెడుతుంటే మరోపక్క అగాధాలూ లోయలూ కాస్త భయపెడుతుంటాయి. అయినప్పటికీ ఈ రైలు ప్రయాణం ఎంతో సురక్షితం కూడా అంటారు ప్రయాణికులు. అందుకే సిమ్లాకు వెళ్లేవాళ్లు ఎవరైనా ఒక్కసారైనా ఈ రైలెక్కాలి అనుకుంటారు.


ప్రకృతి గీసిన చిత్రాల్లో...

(ముంబై-గోవా)

జాలువారే జలపాతాల్నీ వంపుతిరిగిన కొండల్నీ వాటి మధ్యలో పరవళ్లు తొక్కే నదుల్నీ వాటిమీద కట్టిన వంతెనల్నీ సరస్సుల్నీ చూస్తూ పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి శ్రేణుల అందాల్ని ఆసాంతం చూడాలనుకునేవాళ్లు ముంబయి నుంచి గోవాకి రైల్లో ప్రయాణించాల్సిందే. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాలగుండా 738 కిలోమీటర్ల మేర సాగే కొంకణ్‌ రైల్వే మార్గం దేశంలోకెల్లా అందమైనదని చెప్పవచ్చు. కొబ్బరిచెట్లూ వాటిమధ్యలో వరిచేలూ పారే నీటి ప్రవాహాలూ కనురెప్ప వేయనివ్వవు. వర్షాకాలంలో కిటికీలోంచి చేయిచాస్తే మేఘాలు చేతికందుతున్నట్లే ఉంటాయట. ముఖ్యంగా ముంబయి నుంచి గోవాకి వెళ్లే మాండవి ఎక్స్‌ప్రెస్‌ 92 సొరంగాల్ని దాటి రెండు వేల వంతెనలమీదుగా ప్రయాణిస్తుంది. ఈ దారిలో రత్నగిరి స్టేషన్‌కి ఏడు కి.మీ.దూరంలో ఆసియాలోకెల్లా ఎత్తైన పన్వల్‌నాడి వయాడక్ట్‌ మీదుగా ప్రయాణిస్తుంటే ఆకాశంలో వెళుతున్నట్లే ఉంటుంది. ఇవేకాదు, పఠాన్‌కోట్‌ నుంచి జోగిందర్‌నగర్‌కు వెళ్లే కాంగ్రా లోయ రైలుమార్గంలోని ధౌలాధార్‌ పర్వతశ్రేణి కళ్లను కట్టిపడేస్తుంది. జైసల్మేర్‌ నుంచి జోధ్‌పుర్‌కు ‘ద డెజర్ట్‌ క్వీన్‌’ మార్గంలో ప్రయాణిస్తే- థార్‌ ఎడారిలో ఇసుక తిన్నెలూ ఎడారి అందాలూ అక్కడి తెగల్నీ వన్యప్రాణుల్నీ చూడొచ్చు. చెన్నై నుంచి రామేశ్వరం వరకూ సేతు సూపర్‌ఫాస్ట్‌ ఎక్కి, పంబన్‌ వంతెనమీద ప్రయాణిస్తుంటే కనిపించే అరేబియా సముద్రం ఆనందంతో కూడిన గగుర్పాటు కలిగిస్తుంది. సుందర కశ్మీరాన్ని చూపే జమ్ము-బారాముల్లా; కేరళ అందాల్ని చూపించే కన్యాకుమారి-త్రివేండ్రం; మాథెరాన్‌ కొండల్లోని నిశ్శబ్దాన్ని వినిపించే మాథెరాన్‌-నెరల్‌... ఇలా భారతావనిలోని ప్రకృతి అందాల్లో సేదతీర్చే రైలుమార్గాలెన్నో...మరెన్నో..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు