ఒకేసారి అయిదుపాత్రల్లో...

సినిమాల్లో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభియనమే కాదు అంతకంటే ఎక్కువ పాత్రల్లోనూ నటించి మెప్పించిన తొలి హీరో ఎన్టీఆర్‌. ఆయన మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రాముడు-భీముడు.’

Updated : 28 May 2023 10:08 IST

సినిమాల్లో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభియనమే కాదు అంతకంటే ఎక్కువ పాత్రల్లోనూ నటించి మెప్పించిన తొలి హీరో ఎన్టీఆర్‌. ఆయన మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రాముడు-భీముడు.’ ఆ తరువాత సుమారు ఇరవై పైచిలుకు సినిమాల్లో ద్విపాత్రాభినయంతో మెప్పించారు. ‘శ్రీకృష్ణసత్య’లో రాముడు, కృష్ణుడు, రావణాసురుడు పాత్రల్లోనూ ‘దానవీరశూరకర్ణ’లో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడిగానూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ‘కుల గౌరవం’ కోసం తాత, తండ్రి, కుమారుడిగానూ మూడు తరాల పాత్రల్ని ఒకే సినిమాలో పోషించిన ప్రత్యేకత కూడా ఎన్టీఆర్‌కే చెల్లుతుంది. ఇక, ‘శ్రీమద్విరాటపర్వము’, ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ల్లో అయిదు పాత్రల్లో కనిపించారు.


హారతులు పట్టారు

న్టీఆర్‌ నటించిన సినిమాల్లో చెప్పుకోదగిన మరో అద్భుత కళాఖండం ‘లవకుశ.’ పురాణ పాత్రల్లో ఎన్టీఆర్‌ ప్రతిభను మరోసారి చాటిన లవకుశ సుమారు 75 వారాలు నిర్విరామంగా ప్రదర్శితమవడమే కాకుండా ఏడాదిలో కోటిరూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. నాటి ఇరవైఅయిదు పైసలు, రూపాయల టిక్కెట్టుపై అంత వసూళ్లు సాధించడం అనేది నిజంగానే అద్భుతమే మరి. ఈ సినిమా విడుదలైనప్పుడు మారుమూల ప్రాంతాల జనం బళ్లు కట్టుకుని చద్దన్నం మూటలతో థియేటర్లకు తరలి వచ్చేవారట. తెరమీద ఎన్టీఆర్‌ కనిపించగానే... నిజంగా శ్రీరాముడే కళ్లెదుట ఉన్నట్లుగా భావించి హారతులు పట్టి జేజేలు పలికేవారట. సినిమా చూశాక అందులోని పద్యాలూ, పాటలూ పాడుకుంటూ ఉత్సాహంగా ఇళ్లకు వెళ్లిపోయేవారట.


బాధలు చెప్పుకునేవారు

‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రం విడుదలైన తరువాత... ఎంతోమంది భక్తులు తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అటునుంచి మద్రాసులోని ఎన్టీఆర్‌ ఇంటికి చేరుకునేవారట. అక్కడ ఎన్టీఆర్‌ను చూసి... స్వయంగా వేంకటేశ్వరస్వామే తమ ఎదురుగా ఉన్నట్లుగా భావించేవారట. ఆ కొద్ది సమయంలోనే తమ బాధలన్నీ ఎన్టీఆర్‌కు చెప్పుకునేవారట. ఎన్టీఆర్‌ కూడా అభిమానుల సమస్యల్ని అంతే ఓపిగ్గా వినేవారట. అప్పట్లో తిరుపతికి నడిచే బస్సు సర్వీసులు సైతం తిరుపతి దర్శనంతోపాటు ఎన్టీఆర్‌ ఇంటికి కూడా బస్సులు వెళ్తాయని పేర్కొనడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో కోటిమంది ప్రేక్షకులు చూసిన తొలి చిత్రంగా శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం గుర్తింపు సాధించింది.


శివుడి పాత్రలకు...నో

న్టీఆర్‌ తన సొంత నిర్మాణ సంస్థ నాట్‌ (నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌)ను తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి ప్రారంభించారు. ఆ బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా పిచ్చిపుల్లయ్య. తన కొడుకు రామకృష్ణ చనిపోవడంతో ఆ సంస్థను ‘రామకృష్ణ-నాట్‌ కంబైన్స్‌’గా మార్చారు. ఆ తరువాత కొడుకు జ్ఞాపకార్థం రామకృష్ణ సినీ స్టూడియోస్‌, రామకృష్ణ హార్టీకల్చర్‌ సినీ స్టూడియోలను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ తనయుడు చనిపోయిన సంవత్సరమే దక్షయజ్ఞం సినిమా విడుదలయ్యింది. అందులో శివుడిగా మెప్పించిన ఎన్టీఆర్‌... కుమారుడి మరణం తరువాత ఆ పాత్ర తనకు అచ్చిరాలేదని సెంటిమెంట్‌గా భావించాడట. అందుకే ఆ తరువాత నుంచి శివుడి పాత్రను చేయడానికి నిరాకరించారట.


40 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకుని

ది 1963... విజయదశమి కానుకగా వచ్చిన నర్తనశాల ప్రేక్షకులకు ఆనందాల పండుగే అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చేసిన అర్జునుడు, బృహన్నల పాత్రలు ఆయనకు సవాళ్లుగా నిలిచాయి. దర్శకుడు ఆ పాత్రల గురించి వివరిస్తూ సినిమాలో ఉత్తరగా నటించిన ప్రముఖ నృత్యకారిణి ఎల్‌.విజయలక్ష్మికి నాట్యం నేర్పించాలని చెప్పడంతో ఎన్టీఆర్‌ పగలబడి నవ్వి కొంత సమయం కావాలని అడిగారట. ఆ పాత్రను సవాలుగా తీసుకున్న ఎన్టీఆర్‌ నలభై ఏళ్ల వయసులో ఈ చిత్ర నృత్య దర్శకుడు వెంపటి పెద సత్యం దగ్గర కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారట. ఎన్టీఆర్‌ ఎంతో ఉత్సాహంగా ఏకాగ్రతతో నాట్యాన్ని నేర్చుకున్న తీరు చూసి ఆ నృత్యదర్శకుడు ఆశ్చర్యపోయాడట. ఇందులో బృహన్నలగా ఎన్టీఆర్‌ ఆహార్యం, చూపిన వయ్యారం, పలికిన ప్రతి పలుకు ప్రేక్షకుల చేత జేజేలు పలికించాయి. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం సైతం వచ్చింది.


కథానాయికలు

సుమారు మూడువందలకు పైగా సినిమాల్లో నటించిన ఎన్టీఆర్‌ పక్కన అంజలీదేవి, సావిత్రి, జమున. కె.ఆర్‌.విజయ, దేవిక, కృష్ణకుమారి, వాణిశ్రీ, కాంచన, జయప్రద, జయసుధ, శ్రీదేవి.. ఇలా సుమారు నలభై మందికి పైగా హీరోయిన్లుగా చేశారు. వాళ్లల్లో సావిత్రి (38), కృష్ణకుమారి (25), జమున (25), అంజలీదేవి (18), శ్రీదేవి (12), జయప్రద (10), జయసుధ (8)  సినిమాలు చేయడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..