కొత్తగా ఆలోచించారు!
వ్యవసాయంలో మూస పద్ధతుల్ని పక్కన పెట్టి... ఇతరులకంటే భిన్నంగా ఆలోచించారు ఈ రైతులు. సృజనాత్మక విధానాలను అనుసరించి లాభాలను ఆర్జిస్తున్న ఈ అన్నదాతలు తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
రోజుకు లక్ష గుడ్లు
పౌల్ట్రీ రంగంలో అత్యాధునిక విధానాలను అనుసరిస్తూ రోజుకు సుమారు లక్షా ఇరవై వేల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాడో రైతు. సాధారణంగా 30వేల కోళ్లను పెంచే స్థలంలో- లక్షన్నర కోళ్లతో పౌల్ట్రీ నిర్వహిస్తున్నాడు మహారాష్ట్రలోని అంజన్‌గావ్ బరికి చెందిన రవీంద్ర మేట్కర్. వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఎన్నో ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొన్న రవీంద్ర రెండేళ్ల క్రితం వంద కోళ్లతో పౌల్ట్రీని ఏర్పాటు చేశాడు. తక్కువ స్థలంలోనే అరలను ఏర్పాటు చేయడం ద్వారా లక్ష కోళ్లను పెంచే స్థాయికొచ్చాడు. కోడి గుడ్డు పెట్టిన వెంటనే కంటైనర్‌లోకి వచ్చేలా ఆటోమేటిక్ యంత్రాలను అమర్చాడు. వ్యర్థాలు కూడా ఎరువుగా మారే చోటికి ఎప్పటికప్పుడు చేరేలా ఏర్పాట్లు చేశాడు. కోళ్లకు దాణా కూడా-ఆటోమేటిక్‌గానే ఎప్పటికపుడు వచ్చి చేరుతుంది. ఏసీ షెడ్డులో ఉష్ణోగ్రతల స్థాయులను నియంత్రిస్తూ, పౌల్ట్రీని పరిశుభ్రంగా నిర్వహిస్తున్నాడు రవీంద్ర. సోషల్ మీడియాలో ఆయన గురించి తెలుసుకుని ఎందరో వెతుక్కుంటూ వస్తున్నారు. ఆటోమేటెడ్ వ్యవస్థతో కూడిన పౌల్ట్రీని అలా వాళ్లూ ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందుతున్నారు. తాను ఎంచుకొన్న రంగంలో సృజనాత్మక విధానాలతో విజయం సాధించిన రవీంద్రకు ఈ మధ్యనే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ గుర్తింపు సైతం లభించింది. బాబూ జగ్జీవన్ రామ్ ఇన్నొవేషన్ ఫార్మర్ అవార్డు కూడా వరించింది.
కంచెలు పెంచి...
పంట పొలాలను కోతులు, అడవి పందులు, ఇతర జంతువులూ నాశనం చేయడం మనకు తెలిసిందే. వాటిని తరిమి కొట్టడానికి రాత్రింబగళ్లూ కాపలాకాస్తూ బాణసంచా, ఎయిర్‌గన్స్ వంటివి పేల్చుతుంటారు రైతులు. అయినా ఆ జంతువులను అడ్డుకోవడం పూర్తిగా సాధ్యపడదు. మహారాష్ట్రలోని అకోలా జిల్లా ఖపర్‌వాడి బుద్రుక్ వాసి జగన్ ప్రహ్లాద్ బగాడే కూడా అలాగే చాలా కాలం ఇబ్బందుల్ని అనుభవించాడు. కంచె వేద్దామంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకే అక్కడి వాళ్లలో కొందరైతే జంతువులతో పోరాడలేక వ్యవసాయానికి దూరమయ్యారు. జగన్ మాత్రం తనకు జీవనాధారమైన వ్యవసాయాన్ని వదులుకోకుండా సమస్యకు పరిష్కార మార్గాన్ని కనిపెట్టాడు. 16 అడుగులకు పైనే పెరిగే ముళ్లజాతి మొక్క కాక్టస్‌ను పొలం సరిహద్దుల్లో నాటాడు. ఎదిగే క్రమంలో దాన్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ... కంచె మాదిరిగా తయారుచేశాడు. ఈ బయో ఫెన్సింగ్ వల్ల అడవి జంతువుల దాడికి అడ్డుకట్ట పడింది. పైగా కాక్టస్ ఆకులు రాలిపడటం వల్ల భూమి తేమను కోల్పోకుండా ఉంటుంది. అంతేకాదు, బయోఫెన్సింగ్‌కు కాయగూరల తీగలు పాకించాడు జగన్. సొర, బీర, కాకర వంటివి పండిస్తున్నాడు. మూడురెట్లు ఎక్కువ ఆదాయం పొందుతున్నాడు. అప్పులు తీర్చి, ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆధునిక సాగు పద్ధతులతో ముందడుగు వేస్తున్నాడు. మొదట్లో బయోఫెన్సింగ్ ఏర్పాటు చేసేటప్పుడు ఊరిలో జనాలంతా జగన్‌ను ఆటపట్టించారు. ఇప్పుడు వాళ్లందరికీ అతనే మార్గదర్శకుడు అయ్యాడు. అందరితో కాక్టస్ నాటిస్తున్నాడు. ప్రభుత్వ అధికారులైతే ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు జగన్‌ను తీసుకెళ్లి స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు.
అద్దెకి విద్యుత్తు
కరెంటు పోతే ఇన్వర్టర్లూ, జనరేటర్లూ వాడటం మామూలే. కొందరైతే సోలార్ ఎనర్జీతో ఆ సమస్యకు చెక్ పెడుతున్నారు. అదే వ్యవసాయానికి వస్తే నీటి వసతి ఉన్నా- విద్యుత్ సమస్య కారణంగా పొలానికి నీళ్లు చేరడం కష్టమవుతోంది. దాంతో ఖర్చు కాస్త ఎక్కువైనా డీజిల్ పంపులు వాడుతున్నారు కొందరు. హరియాణాలోని పెట్వార్‌కు చెందిన ప్రదీప్ కుమార్ సోలార్ ప్యానెళ్ల సాయంతో మోటార్లు నడిపించి పొలాన్ని తడిపేవాడు. కానీ ఆ ప్యానెళ్లను పశువులు పాడు చేయడంతో ఓసారి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ట్రాక్టర్ చక్రాలతో ఓ బండిని తయారు చేసి దానిపైన ప్యానెళ్లను ఏర్పాటు చేశాడు. వాటి ద్వారా తన పొలానికి నీళ్లు పెట్టుకోవడంతోపాటు, చుట్టుపక్కల వారికీ అద్దెకి ఇస్తూ ఆదాయం పొందుతున్నాడు. ట్రాక్టర్, ఎద్దులబండి సాయంతో ఎక్కడికంటే అక్కడకి ప్యానెళ్లని తరలిస్తున్నాడు ప్రదీప్. అలానే ఓ స్టార్టప్‌ను ప్రారంభించి 2 హెచ్‌పీ, 10 హెచ్‌పీ సామర్థ్యమున్న ప్యానెళ్లను ట్రాలీపైన అమర్చి అమ్ముతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు రెండున్నర వేల మందికి వాటిని విక్రయించిన ప్రదీప్.. ఏడాదిపాటు ఉచితంగానూ సర్వీసును అందిస్తున్నాడు. అటు వ్యవసాయం ఇటు సోలార్ వ్యాపారంతో రెండు చేతులా సంపాదిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నాడు ప్రదీప్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
World News
Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!