ఇంటిముందే అంత్యక్రియలు

ఎవరి కుటుంబ సభ్యులైనా చనిపోతే అంత్యక్రియల కోసం ఇంటికి దూరంగానో, గ్రామానికి చివరనో ఉన్న శ్మశానానికి వెళతారు.

Updated : 29 Jan 2023 04:02 IST

ఇంటిముందే అంత్యక్రియలు

ఎవరి కుటుంబ సభ్యులైనా చనిపోతే అంత్యక్రియల కోసం ఇంటికి దూరంగానో, గ్రామానికి చివరనో ఉన్న శ్మశానానికి వెళతారు. అక్కడే ఆచారం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేస్తారు. అయితే, కర్ణాటకలోని కుందాపుర దగ్గర్లో ఉన్న ముదూర్‌ గ్రామస్థులు మాత్రం ఎవరిళ్లలో వారు దహన సంస్కారాలు నిర్వహిస్తుంటారు. అయ్యో... అదెలా కుదురుతుంది? ఇళ్ల మధ్యలో చేస్తే పొగా, వాసనా రావా అనే కదా సందేహం. శ్మశాన వాటిక లేక నలభై కిలోమీటర్ల దూరం వెళ్లి అంత్యక్రియలు జరుపుతున్న ముదూర్‌ వాసులకు ఈ మధ్య స్థానిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు- గ్యాస్‌తో నడిచే దహన యంత్రాన్ని అందించి సమస్యను పరిష్కరించారు. స్టీల్‌ బాక్సులా కనిపించే ఈ దహన యంత్రంపై మృతదేహాన్ని ఉంచి ఆచారాల ప్రకారం క్రతువులను నిర్వహించిన తర్వాత దాన్ని మూసి వేస్తారు. పొగా, వాసనా బయటకు రాకుండా రెండు గంటల్లో మృతదేహం పూర్తిగా దహనమవుతుంది. స్ట్రెచర్‌ మాదిరి ఎక్కడి కంటే అక్కడికి తేలిగ్గా తీసుకెళ్లగలిగే ఈ దహన వాటిక ఇప్పుడు ఆరువందల ఇళ్లున్న ముదూర్‌ ప్రజల సమస్యను తీర్చింది. శ్మశానాలకు స్థలం లేని చోట ఇది చక్కటి పరిష్కారం కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..