సబ్బు... నీళ్లు... జ్యూసు... అన్నీ పూసలే!

పూసలు అనగానే మెడలో వేసుకునే దండలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఎన్నెన్నో పదార్థాలు పూసల రూపంలోకి వచ్చేస్తున్నాయి. గుప్పెడన్ని పూసలే... దుస్తుల్నీ, ఇంటినీ సువాసనతో నింపేస్తున్నాయి. రంగుల ముత్యాలే...

Updated : 16 Oct 2022 03:28 IST

సబ్బు... నీళ్లు... జ్యూసు... అన్నీ పూసలే!

పూసలు అనగానే మెడలో వేసుకునే దండలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఎన్నెన్నో పదార్థాలు పూసల రూపంలోకి వచ్చేస్తున్నాయి. గుప్పెడన్ని పూసలే... దుస్తుల్నీ, ఇంటినీ సువాసనతో నింపేస్తున్నాయి. రంగుల ముత్యాలే... చల్లటి ఐస్‌క్రీముల్లా, కమ్మటి పండ్లరసాల్లా నోరూరిస్తున్నాయి. ఇవేకాదు... ఇంకా ఇలా పూసల్లా వచ్చినవి చాలానే ఉన్నాయి.

ఆన్‌లైన్లో ఇంటికి అవసరమైన వస్తువుల్ని కొనడానికి ఓ షాపింగ్‌ వెబ్‌సైట్‌ తెరిచింది గీత. ఓ వస్తువును చూసి ఒక్క క్షణం ఆగిపోయింది. ‘అదేంటీ ఎయిర్‌ ప్యూరిఫయర్‌’ కావాలని వెతికితే ఇక్కడేవో ముత్యాలతో నింపిన సీసాలు కనిపిస్తున్నాయేంటీ’ అనుకుంది ఆశ్చర్యంగా. కాస్త నిదానంగా అక్కడున్న వివరాల్ని చదివితే అర్థమైంది అవో కొత్తరకం ‘ఫ్రెష్‌నర్లు’ అని. వెరైటీని ఎంతో ఇష్టపడే గీత వెంటనే ‘ఇలా మరేమైనా ఉన్నాయా’ అంటూ వెతికితే... కొన్ని ఇంట్లో వాడేవీ, ఇంకొన్ని తినేవీ- మెరిసే పూసల్లా కనిపించాయి. ‘ఇవేవో బాగున్నాయే’ అనుకుని కావాల్సినవి కొనుక్కుంది. అవేంటో చూద్దామా...

ఎన్ని రకాలో...

ఇక్కడున్నవన్నీ కాస్త అటూ ఇటూగా ఒకే రకమైన పూసల్లానే అనిపించినా... నిజానికి వీటిల్లో వేరు వేరు పదార్థాలు ఉంటాయి. సబ్బు నుంచి మొక్కల కుండీల్లోని మట్టి దాకా... తాగే నీళ్ల దగ్గర్నుంచి పండ్ల రసాలూ, ఐస్‌క్రీముల వరకూ.... ఇలా ఇంటికీ, ఒంటికీ అవసరమయ్యేవెన్నో ఈ పూసల మాదిరి వస్తున్నాయి. మాసిన దుస్తుల పరిమళం కోసం వాడే ‘లాండ్రీ బీడ్స్‌’ చూడ్డానికి రంగురంగుల్లో ఉండటమే కాదు, గులాబీ, లిల్లీ... అంటూ ఒక్కోదాని సువాసన ఒక్కోలా ఉంటుంది. ఇంకా సబ్బులూ, నూనెలూ, మేకప్‌ పౌడర్ల స్థానంలో ‘బాత్‌ పెరల్స్‌’, ‘బాత్‌ ఆయిల్‌ బీడ్స్‌’, ‘పౌడర్‌ పెరల్స్‌’ దొరుకుతున్నాయి. చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి వాడే వీటిని ఎన్నో రకాల విటమిన్లతో, నిగారింపును తెచ్చే పదార్థాలతో ముత్యాల్లా తయారుచేస్తున్నారు. అంతేనా... కుండీల్లో పచ్చని మొక్కలు పెంచడానికి ‘వాటర్‌ బీడ్స్‌’, ‘హైడ్రోపోనిక్స్‌ క్లే పెబల్స్‌’ లాంటివీ ఉన్నాయి. పట్టుకుంటే జారిపోయేట్టు ఉండే నీటి పూసలు నీళ్లతో, పెబల్స్‌ మట్టితో పోషకాలు కలగలుపుకొని వస్తాయి. ఈ మెరుపుల పూసలన్నింటినీ చూస్తేనే కనువిందు. మరి తింటే... మరింత గమ్మత్తుగా అనిపించదూ. ఆ అనుభూతిని తేవడానికే- తినడానికీ పసందుగా... ఆపిల్, దానిమ్మ, మామిడి... ఇలా అదీ ఇదీ కాదు అన్ని పండ్లనూ ‘ఫ్రూట్‌ పెరల్స్‌’ పేరుతో అమ్ముతున్నారు. పండ్ల గుజ్జును వేడిచేసి ప్రత్యేక పద్ధతిలో వీటిని తయారుచేస్తున్నారు. ఐస్‌క్రీమ్‌ కూడా ‘మినీమెల్ట్స్‌’ పేరుతో అన్ని ఫ్లేవర్లలో చిట్టి బీడ్స్‌లా వచ్చింది. ఇలా ఆహారంలోనూ, ఇంట్లోనూ హరివిల్లు రంగుల్ని చూపించడానికి పూసల పదార్థాలు పోటీపడుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..