మీరెక్కడున్నా... మేం కొని పంపిస్తాం!

కొత్త రుచులున్నా... అమ్మచేతి ఆవకాయ తినాలనిపించకుండా ఉంటుందా... ఎన్ని మోడ్రన్‌ డ్రెస్సులు దొరికినా... పండుగకైనా సంప్రదాయ దుస్తులు వేసుకోవాలనిపించదా...

Updated : 19 Mar 2023 04:24 IST

మీరెక్కడున్నా... మేం కొని పంపిస్తాం!

కొత్త రుచులున్నా... అమ్మచేతి ఆవకాయ తినాలనిపించకుండా ఉంటుందా... ఎన్ని మోడ్రన్‌ డ్రెస్సులు దొరికినా... పండుగకైనా సంప్రదాయ దుస్తులు వేసుకోవాలనిపించదా... అందుకే ప్రపంచంలో ఏ మూలకు వెళ్లి స్థిరపడినా- భారతీయులు మన సంప్రదాయ వాసనల్నే కోరుకుంటారు... అవన్నీ కొరియర్‌ చేసి పంపడానికి ఇక్కడ ఇంట్లోవాళ్లూ, స్నేహితులూ నానా ఇబ్బందులు పడుతుంటారు... కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎందుకంటే...

మెరికాలో చదువుకుంటున్న శ్రీజ... తనకు కావాల్సిన వస్తువుల జాబితాను పార్సిల్‌ చేయమని ఎప్పటిలాగే అమ్మను అడిగింది. కానీ ఆరోగ్యం బాగోకపోవడమూ, ఇంకా ఆఫీసులో సెలవు దొరక్కపోవడంతో ఆ షాపింగ్‌ అంతా పూర్తి చేసి పంపేసరికి కాస్త ఆలస్యమైంది. దాంతో ఈసారి ఇలా కాదుగానీ అటు అమ్మకూ ఏ ఇబ్బంది లేకుండా, ఇటు పనీ త్వరగా అయిపోతే బాగుండు అనుకుంటూ పరిష్కారం కోసం వెతికింది శ్రీజ. అప్పుడే మనదేశంలో మనకోసం షాపింగ్‌ చేసి విదేశాల్లో చిరునామాకు పంపేందుకు యువర్‌దేశీకార్ట్‌, ఫార్వర్డ్‌ పార్సెల్‌, షాప్‌ప్రీ లాంటి వెబ్‌సైట్లు ఉన్నాయని తెలుసుకుంది.

వివిధ దేశాలకు కొరియర్‌ చేయడానికి చాలానే సంస్థలున్నాయి కదా... ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటీ అంటే? మామూలుగా అయితే ఇంట్లో ఎవరో ఒకరు షాపింగ్‌ చేస్తూ మనవాళ్లకు కావాల్సిన వస్తువుల్నీ, దుస్తుల్నీ కొంటుంటారు. అది మనదగ్గరుండే ఈ-కామర్స్‌ షాపింగ్‌ వెబ్‌సైట్ల నుంచైనా, లేదంటే స్వయంగా మనమే దుకాణాలకు వెళ్లైనా సరే. దాని కోసం సమయమూ, ఓపికా కావాల్సిందే. పైగా బయట షాపింగ్‌కి తిరిగి రావడానికి ప్రయాణ ఖర్చులూ అవుతాయి. అన్నింటి కన్నా ముందు కచ్చితంగా అందుకోసం మనకు వీలూ కుదరాలి మరి. ఇలా అన్నీ కొన్నాక వాటిని ప్యాక్‌ చేయించి కొరియర్‌ సంస్థల ద్వారా విదేశాలకు పంపాల్సి ఉంటుంది. పైగా ఇదంతా మనకోసం ఎవరైనా చేసిపెట్టేవాళ్లు ఉన్నప్పుడు సంగతి. అదే ఇంట్లో పెద్దవాళ్లు మాత్రమే ఉన్నా, మనకోసం తిరిగి షాపింగ్‌ చేసేవాళ్లు అందుబాటులో లేకపోయినా ఎలా... అలాంటప్పుడు ఈ వెబ్‌సైట్లను ప్రయత్నించి చూడొచ్చు.

ఎలా పనిచేస్తాయి?

ఈ వెబ్‌సైట్లలో లాగిన్‌ అయి వీళ్లు అందించిన లాకర్‌ అడ్రస్‌కు ఆన్‌లైన్‌ సైట్ల ద్వారా మనం షాపింగ్‌ చేసిన వాటిని నేరుగా వీళ్లకు పంపొచ్చు. లేదంటే ‘పర్సనల్‌ షాపర్‌ సర్వీస్‌’ను ఎంచుకుని మనకు అవసరమైన వస్తువుల్ని చెబితే వాళ్లే కొనిపెడతారు. పంపడానికి వీలున్న ఏ వస్తువు అయినా సరే మనకోసం షాపింగ్‌ చేసి పెడతారు. పట్టుపరికిణీలూ, డ్రెస్సుల్లాంటివి కుట్టించడం దగ్గర్నుంచి సున్నుండలూ, చకినాలూ, పచ్చళ్ల వరకూ ఏది కావాలన్నా అమర్చుతారు. అవసరమైతే మనవాళ్లెవరైనా పంపాలనుకున్నవీ వీళ్లకు అందించొచ్చు. పంపడానికి ముందే ప్రతి వస్తువునూ ఫొటో తీసి పంపుతారు. అవి సరిగా లేకపోతే వెనక్కి పంపేయొచ్చు. అన్నీ కలిపి ప్రత్యేకంగా ఒక దగ్గర సరిగా ప్యాక్‌ చేసి విదేశాల్లో ఉన్న మన ఇంటి చిరునామాకు పంపిస్తారన్నమాట. అంతేకాదు, భారత్‌లో ఉండే వాళ్ల కోసం విదేశాల్లో ఉన్న వాళ్లూ వీటి ద్వారా షాపింగ్‌ చేసి పంపొచ్చు. ఇక్కడే ఉన్న వాళ్లకీ సర్‌ప్రైజింగ్‌గా కొరియర్‌ చేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మన ఇంట్లో వాళ్లు చేయగలిగే పనులన్నీ చేసిపెడతారు. వెబ్‌సైట్లో ముందుగానే వీటన్నింటి వివరాలతో పాటు ఒక్కో సర్వీస్‌కి ఇంత ధర అని ఉంటుంది. యాప్‌తో పాటూ ఇతర సోషల్‌ మీడియాల్లోనూ ఈ సంస్థల వేదికలు అందుబాటులో ఉన్నాయి. మన అవసరమూ, వీలునూ బట్టి వీటి సేవలు ఉపయోగించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..