ఫుడ్‌ ట్రెండ్‌

పండిన మామిడి తాండ్ర తినుంటారు, మరి పచ్చిమామిడి తాండ్ర?  ఎన్నో పండ్ల రసాలు తాగుంటారు, కానీ తాటిముంజెల రసం రుచి చూశారా? పప్పు అప్పడాలు చేసుంటారు, అలాగే కూరగాయలవి? ఇలా తెలిసిన పదార్థాలతో తెలియని కొత్తరుచులెన్నో... ఆ సంగతులే ఇవి!

Updated : 26 Mar 2023 01:27 IST

ఫుడ్‌ ట్రెండ్‌

పండిన మామిడి తాండ్ర తినుంటారు, మరి పచ్చిమామిడి తాండ్ర?  ఎన్నో పండ్ల రసాలు తాగుంటారు, కానీ తాటిముంజెల రసం రుచి చూశారా? పప్పు అప్పడాలు చేసుంటారు, అలాగే కూరగాయలవి? ఇలా తెలిసిన పదార్థాలతో తెలియని కొత్తరుచులెన్నో... ఆ సంగతులే ఇవి!


ఏడాదంతా ముంజెలు!

రీరాన్ని చల్లబరిచే తాటి ముంజెల వల్ల మనకెన్నో లాభాలున్నాయి. అది తెలిసే జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేలా ఉండే ఈ ముంజెలు ఎప్పుడొస్తాయా అని చాలామంది ఎదురు చూస్తుంటారు. ఇవి దొరికే ఎండాకాలంలో వదలకుండా వాటిని తినేస్తుంటారు. అయితే ఇంకాస్త వీలుగా ముంజెల రుచులు అందివ్వడానికి ఇప్పుడు రకరకాల ఉత్పత్తులూ మార్కెట్లోకి వచ్చాయి. మిగతా కూల్‌డ్రింక్స్‌లాగే తాటి ముంజెల జ్యూసూ, మిఠాయిలూ, ఇంకా ఏడాదిలో ఎప్పుడైనా తినేలా ఫ్రోజెన్‌ తాటి ముంజెల్లాంటివెన్నో వీటిల్లో ఉన్నాయి. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న వీటిని నచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఎండాకాలంలో దొరికే తాటికాయల కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేకుండా ఎంచక్కా ఎప్పుడైనా ముంజెలు తినే ముచ్చట తీర్చుకోవచ్చన్నమాట!


తాండ్రలో ఎన్ని వెరైటీలో!

వేసవిలో మాత్రమే తీయని మామిడి పండ్లు దొరుకుతాయి. కానీ ఏడాదంతా ఆ పండ్ల రుచి కావాలంటే ఎలా... అది అందివ్వడానికే మామిడి పండ్ల కాలంలోనే వాటి రసాల్ని పొరలు పొరలుగా ఎన్నో దశల్లో ఎండబెట్టి తాండ్ర తయారుచేస్తుంటారు. ఆమ్‌ పాపడ్‌, అమావత్‌... ఇలా ఒక్కో దగ్గర ఒక్కోలా పిలిచే ఈ తాండ్ర దుకాణాల్లో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. అది సరే, మరి మామిడి పండుతో పాటు ఇతర పండ్లనీ అలా ఆస్వాదించాలనుకునేవారూ ఉంటారు కదా. ఇదిగో అలాంటివాళ్ల కోసమే ఇప్పుడు పచ్చి మామిడీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌, సపోటా, చింతకాయా, ఉసిరీ, లిచీ... ఇలా ఎన్నో రకాల తియ్యతియ్యని, పుల్లపుల్లని పండ్లతో ఈ తాండ్రలు చేస్తున్నారు. ఫ్రూట్‌ పాపడ్‌ ఫ్రూట్‌ కట్లీ పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయివి. ఆయా పండ్ల రసాల్ని ఎండబెట్టి అచ్చంగా మామిడి తాండ్ర తయారీ పద్ధతిలోనే వీటినీ చేస్తున్నారు. పండును బట్టి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు... ఇలారకరకాల రంగుల్లో కనిపిస్తూ నోరూరించేస్తాయీ
వెరైటీ తాండ్రలు!


ఈ అప్పడాల్నీ ప్రయత్నించండి!

మామూలుగా అయితే బియ్యం, సగ్గుబియ్యం లాంటివాటితో అప్పడాలూ... పప్పుచార్లో నంచుకోవడానికి మజ్జిగ మిరపకాయలూ, రకరకాల వడియాలూ చేసుకుంటాం. తినేపదార్థాల్లో ఎన్నెన్నో రుచులు సృష్టిస్తున్నవారికి వీటిల్లోనూ కొత్త రుచిని తేవడం అంత కష్టమైన పనేం కాదుగా. అందుకే ఎప్పుడూ ఒకేరకమైన అప్పడాల్లాంటివి కాకుండా బీట్‌రూట్‌, క్యారట్‌, అల్లంవెల్లుల్లీ, పాలకూరా... ఇలా కూరగాయలూ ఆకుకూరలతోనూ అప్పడాలూ, వడియాలూ చేస్తున్నారు. కొన్ని అప్పడాలను కూరగాయల గుజ్జుల్ని తీసి ఇతర పదార్థాలు కూడా కలిపి తయారుచేస్తున్నారు. చిక్కుడుకాయల్లాంటివాటిని ఉడికించి ఉప్పు, మజ్జిగలో వేసి నానబెట్టి, ఆ తర్వాత కొన్నిరోజులపాటు ఆరబెట్టి చల్ల మిరపకాయల్లా మారుస్తున్నారు. మార్కెట్లో మనకు కావాల్సిన వాటిని కొనుక్కోవచ్చు. లేదంటే మనమే ఇంట్లోనే ఇలా భిన్నంగా తయారుచేసుకోవచ్చు కూడా. అతిథులు వచ్చినప్పుడు రుచికరమైన వంటలతోపాటూ ఈ సరికొత్త అప్పడాల్ని కూడా నూనెలో వేయించి పెట్టామంటే... వాటి లుక్కుతో పాటూ కొత్త రుచినీ ఆస్వాదిస్తూ మనమిచ్చిన విందుభోజనాన్ని మెచ్చుకోరా మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..