ఈ పాఠశాల... నాయకుల కార్ఖానా!

ఐఐటీలకు వెళ్తే కాబోయే ఇంజినీర్లనీ, బిజినెస్‌ స్కూళ్లకు వెళ్తే భవిష్యత్తు మేనేజర్లనీ చూడొచ్చు... అదే హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కి వెళ్తే ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, రాజకీయం, సివిల్‌ సర్వీసెస్‌, కళలు

Updated : 12 Mar 2023 00:21 IST

ఈ పాఠశాల... నాయకుల కార్ఖానా!

ఐఐటీలకు వెళ్తే కాబోయే ఇంజినీర్లనీ, బిజినెస్‌ స్కూళ్లకు వెళ్తే భవిష్యత్తు మేనేజర్లనీ చూడొచ్చు... అదే హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కి వెళ్తే ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, రాజకీయం, సివిల్‌ సర్వీసెస్‌, కళలు... ఇలా విభిన్న రంగాల్లో రాణించేందుకు సిద్ధమవుతోన్న బాలబాలికలు కనిపిస్తారు. శత వసంతోత్సవాల్ని చేసుకుంటోన్న ఈ పాఠశాలకు ఎన్నో ప్రథమాలూ, మరెన్నో ప్రత్యేకతలూ ఉన్నాయ్‌..!

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, క్రికెట్‌ వ్యాఖ్యాత హర్ష భోగ్లే, సినీ నటుడు నాగార్జున, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌... వీళ్లంతా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు. వీళ్లే కాదు బ్రిటన్‌ ఎంపీ కరణ్‌ బిల్లీమోరియో, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, అడోబీ సిస్టమ్స్‌ సీఈఓ శంతను నారాయణ్‌, మాజీ ప్రపంచ సుందరి డయానా హేడెన్‌, నటుడు వెంకటేష్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. లాంటి ప్రముఖులెందరో ఈ చదువులమ్మ ఒడిలో పాఠాలు నేర్చినవాళ్లే. ఎంచుకున్న రంగంలో శిఖరాన నిలవడం హెచ్‌పీఎస్‌ విద్యార్థుల విశిష్టత.

పాలకుల కోసం మొదలై...

నిజాం దగ్గర రెవెన్యూ అధికారిగా పనిచేసేవాడు జనరల్‌ వేక్‌ ఫీల్డ్స్‌. ఆయనోసారి ఒక జాగీర్దార్‌ కొడుకును పలకరించినప్పుడు ఆ అబ్బాయి పేరు కూడా చెప్పలేకపోయాడు. భవిష్యత్తు పాలకులైన ఈ పిల్లలు బిడియపడుతుండటం మంచిది కాదని భావించాడు వేక్‌ ఫీల్డ్స్‌. వాళ్లని నాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక పాఠశాల ఉండాలనుకుని తన ఆలోచనను నిజాంతో పంచుకుంటే ఆయన సమ్మతించారు. బేగంపేటలో 89 ఎకరాల భూమిని ఇందుకు దానమిచ్చారు లేడీ వికార్‌ ఉల్‌ ఉమ్రా. ఆమెతోపాటు ఇంకొందరు జాగీర్దారులూ భూములు ఇచ్చారు. మొత్తం 155 ఎకరాలు సమకూరాయి. పన్ను మినహాయింపు ఇవ్వడంతో పాఠశాల నిర్మాణానికీ వాళ్లే నిధులు కేటాయించారు. ఈ స్కూల్‌ భవనానికి విన్సెంట్‌ జె.హెచ్‌. ఆర్కిటెక్ట్‌. భవన నిర్మాణం 1919లో ప్రారంభమై 1923కి పూర్తవగా.. అయిదుగురు విద్యార్థులూ, ఆరుగురు ఉపాధ్యాయులతో ‘జాగీర్దార్స్‌ కాలేజ్‌’ మొదలైంది. 1930 నాటికే 150 మంది చదివేవారక్కడ. స్వతంత్రం అనంతరం... 1951లో హైదరాబాద్‌ ప్రభుత్వం స్కూల్‌ పేరును ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌’గా మార్చి అన్ని వర్గాల పిల్లలూ చదువుకునే వెసులుబాటు ఇచ్చింది. అప్పట్నుంచీ సొసైటీ ఆధ్వర్యంలో లాభాపేక్ష లేని సంస్థగా నడుస్తోంది.
ప్రీప్రైమరీ నుంచి 12వ తరగతి వరకూ ఉన్న ఈ స్కూల్లో... ఐ.సి.ఎస్‌.ఇ, ఐ.ఎస్‌.సి, ఐ.జి.సి.ఎస్‌.ఇ. సిలబస్‌లను అనుసరిస్తారు. బుడిబుడి నడకల బుజ్జాయిల్ని తమ బంగారు భవిష్యత్తులోకి ధైర్యంగా నడిచేలా తీర్చిదిద్దుతారు ఉన్నత విద్యావంతులూ, నిపుణులూ అయిన ఉపాధ్యాయులు. చదువుతోపాటు అభిరుచి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తారు. ముందడుగు వేసే ధీరత్వం, తమ వాణిని వినిపించే వాక్పటిమ, ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడే మేధస్సు... ఈ లక్షణాల్ని విద్యార్థుల్లో పెంపొందిస్తారు. పాఠశాలలోని వైవిధ్య వాతావరణం... ఓ విశ్వవిద్యాలయ స్థాయిని తలపిస్తుంది.  

మూడు శాఖలు..

తల్లిదండ్రుల నుంచి వస్తోన్న స్పందన రీత్యా... 1972లో రామంతాపూర్‌లో, తర్వాత కాలంలో కడప, వరంగల్‌లలోనూ ఈ స్కూల్‌ శాఖల్ని తెరిచారు. బాలబాలికలకు రెసిడెన్షియల్‌ సదుపాయమూ ఉంది. గత వందేళ్లలో విద్యారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా ఈ పాఠశాలలోనూ విద్యాబోధన మారుతూ వచ్చింది. కంప్యూటర్‌ విద్యతోపాటు క్రీడలు, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, యోగా, థియేటర్‌ ఆర్ట్స్‌... ఇలా అనేక విభాగాల్లోనూ ప్రత్యేక శిక్షణ, ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకి. 44 రకాల క్రీడలకు అవసరమైన మైదానాలు ఉండటం హెచ్‌పీఎస్‌ ప్రత్యేకత. నిశితమైన చూపు, అత్యంత ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉన్న డేగ... ఈ పాఠశాల చిహ్నం. తమ విద్యార్థుల్లోనూ ఈ లక్షణాల్ని పెంపొందించాలనేది హెచ్‌పీఎస్‌ లక్ష్యం. సీఈఓలుగా, వ్యాపారులుగా, రాజకీయ నాయకులుగా, ప్రభుత్వ అధికారులుగా... తమ విద్యాసంస్థ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తిచేస్తున్నారు హెచ్‌పీఎస్‌ పూర్వ
విద్యార్థులు. ఆ చరిత్రని  పునరావృతం చేయడానికి అలుపెరగకుండా శ్రమిస్తుంటారు అక్కడి ఉపాధ్యాయులు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..